Tuesday, November 15, 2011

మార్పిడులు ఆగాలంటే... - డా. ఎం.ఎఫ్ గోపీనాథ్మాది అయ్యోరిగూడెం అనే ఊరు. మా ఊళ్లో హిందూ దేవాలయం ఉంది. ఆ దేవాలయం మెట్లు కూడా మమ్మల్ని ఇప్పటికీ ఎక్కనివ్వరు. అక్కడ పూజారులు లేరు. భూస్వాములు లేరు. వేదాలని, పురాణాల్ని చదివినవాళ్లు అంతకన్నా లేరు. అక్కడ కమ్యూనిస్టు పార్టీ కూడా ఉంది. శూద్రకులాలే ఆ ఆంజనేయుడి బాగోగులు చూస్తుంటారు. మా కులపోళ్లకి 100 సంవత్సరాలకు ముందే అక్కడ ఒక చర్చి ఉంది. 19వ శతాబ్దం వరకు మా కులపోళ్లు రామానుజ మతంలో 'కులం' లేదని అందులో ఉండేవారు. తర్వాత క్రిస్టియానిటీలోకి మారారు. 


క్రిస్టియానిటీలోకి మారిన మావాళ్లు భారత ప్రభుత్వ యంత్రాంగాన్ని ధిక్కరించిన దాఖలాలుగానీ, మతఘర్షణలు చేసిన సంఘటనలుగానీ మా ఊరి చరిత్రలో లేదు. ఈ దేశంలో అంటరానివాళ్లుగా ఉన్న మాకు మా చిన్నప్పుడు 'మీరంతా పరలోకంలో దేవునికి దగ్గరలో కూర్చుంటారు!' అని చెప్పారు. జంతువుల కన్నా హీనంగా చూడబడుతున్న మాకు జీవితం మీద కొంతైనా, ఆశ కల్పించిన క్రిస్టియానిటీ పట్ల ఏ విధమైన అభిప్రాయం ఉంటుంది? హిందూ దేవాలయాల మెట్లు కూడా ఎక్కనివ్వని హిందూ మతం మీద మాకెలాంటి అభిప్రాయం ఉండాలనుకుంటుందీ హిందూ సమాజం? మానవుని భయమే భగవంతుడన్నాడు ఐన్‌స్టీన్. 'మతం అనేది బడుగు జీవి నిట్టూర్పు. హృదయరహిత ప్రపంచంలో హృదయం. ఆత్మరహిత లోకంలో ఆత్మ. ప్రజలకు నల్లమందు. ఈ నల్లమందు కష్టజీవులను ఆధ్యాత్మికంగా బానిసలను చేసే స్వభావాన్ని కలిగి ఉంది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది'' అంటారు కార్ల్‌మార్క్స్. బలమైన (ధనవంతులు) వర్గాల ప్రయోజనాల కొరకు తెలివైన మానవుల సృష్టే భగవంతుడూ, మతమూ అనేది వాస్తవం. అందుకే వాటికన్ సిటీ, అనంత పద్మనాభ, తిరుమల తిరుపతి దేవాలయాలు, పుట్టిపర్తి సాయిబాబా ఆశ్రమం... ఇట్లా ప్రతి దేవాలయం దగ్గర లక్షల కోట్ల ధనరాశులు పోగుపడటం. పుట్టపర్తి, కంచికామకోటి, కేరళ సిరియన్ చర్చిల్లో, ఆలయ ప్రాంగణాల్లో జరిగే అక్రమాలు బయటపడ్తాయేమోనని అనుమానంతో మర్డర్లు జరిగిన సంఘటనలు చరిత్రలో రికార్డులుగా ఉన్నాయి. ఎవరీ హత్యలు చేశారు? ఎవరి కనుసన్నల్లో ఈ హత్యలు, ఎవరిని కాపాడటానికి జరిగాయనే విషయం కోర్టులో తేలకపోయినా, ప్రజాకోర్టుల్లో ప్రజలు తేల్చేశారు. క్రిమినల్స్ ఈ సాధువులే, మతగురువులే. ఆర్థిక నేరాలకు, మోసాలకు నిలువెత్తు సాక్ష్యాలు ఈ చర్చీలు, దేవాలయాలే. ఇండియాలో బ్రాహ్మణీయ హిందూమతం, రోమ్‌లో కేథలిక మతం, పాకిస్తాన్‌లో ఇస్లామ్, ఇజ్రాయేల్‌లో యూదుమతం అన్నీ ఒకటే. బౌద్ధమతాన్ని సర్వనాశనం చేయటానికి బౌద్ధ భిక్షవుల తలలకు, ఇప్పుడు నక్సలైట్స్ తలలకు వెలకట్టినట్లు వెలకట్టిన అప్పటి బ్రాహ్మణ మతానికి తేడా లేదు. రోమన్ సామ్రాజ్యాన్ని, జంతుబలుల్ని వ్యతిరేకించిన జీసస్‌ను శిలువ వేసినట్లు, క్రీస్తు శకం 10వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు జరిగిన క్రూసెడ్స్... ఇవన్నీ మతం మాటున జరిగిన ఆర్థిక, రాజకీయ పలుకుబడికేనన్నది చరిత్ర నిరూపిస్తుంది. విజ్ఞానశాస్త్రాన్ని అభివృద్ధినీ కాకుండా బ్రూనోని నిట్టనిలువునా మంటల్లో వేసి కాల్చి చంపింది క్రిస్టియన్ మతం. గెలిలియాను, కోపర్నికస్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. ఇండియన్ హేతువాద ధోరణుల్ని భూస్థాపితం చేసింది హిందూ మతం. ఏ దేశంలోనైనా మతాల చరిత్ర మానవాభివృద్ధిని కుంటుపర్చడమే, మంటగలపడమే. 1921లో కేరళలోని సామాజిక - ఆధ్యాత్మిక గురువు ఒకే మతం ఒకే దేవుడని బోధించిన నారాయణ గురుతో, మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ వాదన చూడండి. గాంధీ ఏమన్నాడంటే బ్రిటీష్ పాలనలో మతమార్పిళ్లు జరుగుతున్నాయి. దీన్ని ఆపకపోతే హిందూ మతానికి మనుగడ లేదంటాడు. నారాయణగురు 'ఎవరి నమ్మకం ప్రకారం వాళ్లు వాళ్ల మతాన్ని అవలంభిస్తారు. దాన్లో తప్పేమిటి? అన్నాడు. అలాకాదు. నమ్మకాల మీద కాకుండా, అంటరాని కులాలు క్రిస్టియానిటీలోకి మారడానికి క్రిస్టియన్ సంస్థలు ఇచ్చే చిన్న చిన్న తాయిలాలవల్లనే హరిజనులు మతం మారుతున్నారంటాడు'' గాంధీ. అయితే ఆ చిన్న తాయిలాలు మీరే ఇచ్చి మతం మారటం ఆపొచ్చుగదా అంటారు నారాయణగురు. ఈ దేశ జాతిపితగా మనువాదులతో కొనియాడబడుతున్న మహాత్మా (?) గాంధీ మార్పిడిపట్ల నారాయణగురుతో చేసిన ఈ వాదనలోని 'పస' ఎంత? హిందువుల ఆరాధ్య దైవమే మతమార్పిళ్లపట్ల వెలిబుచ్చిన అభిప్రాయాలను చూస్తే గాంధీ అభిప్రాయాల విలువ ఎంతో అర్థమౌతుంది. 'మతం', 'దేవుడు' అనేవి మానవ సమాజం మొఖం మీద మాయని మచ్చలు. ప్రతి మతమూ ప్రతి దేవుడి వెనుక ఉన్నది రాజ్యం, సంపద. భారతదేశంలో మాత్రం ప్రతి మతంలో 'కులం' ఉంది. ఈ కులవ్యవస్థలో దోపిడీ చేసే కులాలు, దోపిడీకి గురయ్యే కులాలున్నాయి. శ్రామిక కులాల నోళ్లు కొట్టి వాళ్లు తిరగబడకుండా ఉండేందుకు హిందూ దేవుళ్లు, క్రిస్టియన్ దేవుళ్లు, సత్యసాయిబాబాలు, అమృతమయి అమ్మలు ఉన్నారు. చచ్చిన దేవుళ్లకు, బతికున్న దేవుళ్లు బాబాలకు, అమ్మలకు 'రాజ్యం' అండగా ఉంటుంది. ఇదీ మతానికి, దేవుడికి, రాజ్యానికి ఉన్న 'రక్త' సంబంధం. ప్రజలు ఎంత మూర్ఖంగా, అమాయకంగా ఉంటే రాజ్యాధిపతులు అంత సుభిక్షంగా ఉంటారు. అంతేకాదు, భారత హేతువాదులు, కమ్యూనిస్టులు, క్రిస్టియన్స్ ఏనాడూ హేతువాదులుగా, కమ్యూనిస్టులుగా, క్రిస్టియన్స్‌గా లేరు. వాళ్లు హిందూ కమ్యూనిస్టులుగా, హిందూ హేతువాదులుగా, హిందూ క్రిస్టియన్స్‌గానే ఉన్నారు. అందుకే ఈ దేశంలో పవిత్ర దేవాలయాల కుడ్యాలపై బూతుబొమ్మలు దర్శనమిస్తాయి. కులంలేని క్రిస్టియన్ మతంలో 'కులం' తిష్టవేసింది. కమ్యూనిస్టు నాయకులమనుకునేవాళ్లు ఊళ్లో దగ్గరుండి మరీ బొడ్డురాయి, ధ్వజస్తంభాలు వేయిస్తున్నారు. హేతువాదులనుకున్న వాళ్లు తమ ఇళ్లల్లో సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు. కమ్యూనిస్టులమనుకున్నవాళ్లు దండల్లో తాళిబొట్టులుంచి పెళ్లికూతురు మెళ్లో వేస్తున్నారు. నక్సలైట్ నాయకుడి శవాన్ని తులసి చెట్టు చుట్టూ తిప్పి, విప్లవ బ్రాహ్మణోత్తములతో దహన సంస్కారాలు చేయిస్తున్నారు. కామ్రేడ్స్ చనిపోతే వారి భార్యల గాజులు పగలగొడ్తున్నారు. శాస్త్రోక్తంగా ముండమోయిస్తున్నారు. మొగుడనేవాడు చచ్చినా బతికినా, గాజులకు, బొట్టుకు, మొగుడికి సంబంధం లేదనే కనీస జ్ఞానం ఈ మేధావులకు లేదు. 1608లో ఇండియాకు వచ్చిన జెస్యూట్ ఫాదర్ రాబర్ట్ డినోబిలి, మధురైలో జంధ్యం వేసుకుని పల్లకీలో ఊరేగుతూ మధురై రాజైన పెరుమాల్ నాయక్‌ను ప్రసన్నం చేసుకుని బ్రాహ్మణుల ఇంట్లో బసచేసి, బ్రాహ్మణాచారాలను పాటిస్తూ, మిషనరీని తయారుచేసి అందులో బ్రాహ్మణులకే స్థానం కల్పించటం తాను 'రోమన్ బ్రాహ్మణున్నని చెప్పి' క్రీస్తుమతాన్ని బ్రాహ్మణిజానికి తాకట్టు పెట్టాడు. క్లుప్తంగా క్రిస్టియానిటీ ఈ దేశంలో హిందూ క్రిస్టియానిటీగా మారటానికున్న నేపథ్యం ఇది. అయినా కూడా ఈ దేశం అంటరానివాళ్లు, అణచివేయబడుతున్న శ్రామిక కులాలు వాళ్లు ఎందుకు కులతత్వ హిందూ మతాన్ని వదిలి, క్రిస్టియన్స్‌గా, ముస్లిములుగా, బౌద్ధులుగా మారదల్చారు? బాబా సాహెబ్ అంబేద్కర్ ఎందుకు అక్టోబర్ 14, 1995న లక్షలాదిమందితో బౌద్ధమతాన్ని స్వీకరించారు? 'మీరు సంపూర్ణ మానవులుగా మారాలంటే హిందూయిజాన్ని వదిలేయండన్నారు?'' 50 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరిస్తానని కాన్షీరాం ఎందుకు నిర్ణయించుకున్నారు? ఒక వోల్టేర్‌లాగా ఆలోచించడం ఎప్పుడైతే హిందూ మేధావులు, పత్రికలు ఆలోచిస్తాయో అప్పుడే రుగ్వేదంలోని పురుష సూక్తాన్ని ఒక స్వామి అగ్నివేశ్‌లాంటి వాళ్లు తగలబెట్టడానికి సిద్ధమౌతారు. మనుధర్మాన్ని ఓ గడ్కరీనో, ఓ నరేంద్రమోడీనో, లేక అద్వానీనో తగలబెడతారు. అపుడే మతమార్పిళ్లు ఆగుతాయి. మా ఊళ్లో ఆంజనేయునిగర్భగుడిలోకి మా ఊరి మాలమాదిగలు వెళ్లగలిగిన రోజు మతమార్పిళ్లు ఆగుతాయి. - డా. ఎం.ఎఫ్ గోపీనాథ్
ఎం.డి, డి.ఎం, కార్డియాలజీ   Andhra Jyothi News Paper Dated 16/11/2011

No comments:

Post a Comment