Monday, November 28, 2011

జగిత్యాల నుంచి లాల్‌గఢ్ దాకా - బి.ఎస్.రాములు


చాలా మంది కలలు కంటారు. కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. ఆ కలలు విప్లవ కలలు కావచ్చు. జీవితంలో విజయం సాధించడం కావచ్చు. మరో ప్రపంచాన్ని సృష్టించడం కావచ్చు. దేనికైనా నిరంతర సాధన, లక్ష్యం పట్ల గురి, ఓటమిలోనూ గురితప్పని విశ్వాసం. దీర్ఘకాలిక ఉదాత్త లక్ష్యం ఉన్నప్పుడు తామనుకున్న ఏ రంగంలోనైనా విజయాలు సాధిస్తారు. అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు. మల్లోజుల కోటేశ్వరరావు తన సుదూర లక్ష్యం కోసం సుదీర్ఘ ప్రయాణం నూనుగు మీసాల తొలి యవ్వనంలోనే ప్రారంభించారు. సాహిత్యానికి జీవితానికి సంబంధం ఉందని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఉద్యమాలే అవసరమని సాహిత్య రంగం నుండి నేను సామాజిక ఉద్యమకారుడిగా మారే క్రమంలో మా ఇద్దరి లక్ష్యాలు ఒక్కటయ్యాయి. 

అలా విప్లవోద్యమంలో కలిసి పనిచేయడం జరిగింది. అయితే మల్లోజుల మౌలికంగా విప్లవకారుడుకాగా నేను మౌలికంగా సాహిత్య, సామాజిక ఉద్యమకారుడిగా మా ఇద్దరి జీవిత పరిణామాలు ప్రత్యేకంగా కనపడుతుంటాయి. ఒకే లక్ష్యం అయినకీటికీ అభిరుచులు, సామర్థ్యాలు, ప్రాముఖ్యతలు వేరైనపుడు భిన్నరంగాల్లో ఉంటూ పనిచేయడం సహజమైన విషయం. కాగా తాను సాహిత్యకారుడిగా ఎంతగా రాయాలని ఉన్నప్పటికీ విప్లవ కర్తవ్యానికే ప్రాధాన్యత ఇచ్చి మల్లోజుల కిషన్‌జీగా ఎదిగారు.

కిషన్‌జీ, ప్రహ్లాద్, కోటి, గోదావరి వంటి మారు పేర్లు కేవలం మారుపేర్లు మాత్రమే కాదు. కిషన్‌జీ అంటే కలిగే భావం వేరు. ప్రహ్లాద్ అన్నప్పుడు కలిగే భావం వేరు. ఇలా ఒకే జీవితంలో అనేక జీవితాలను జీవించిన వ్యక్తులు అరుదుగా వుంటారు. ఏ దశ వ్యక్తిత్వం ఆ దశకు ప్రత్యేకంగా ఎదిగిన క్రమం ఆయా మారుపేర్లలో నిక్షిప్తమై వున్నది. ఒక్కొక్క కలం పేరు ఒక్కొక్క ఉద్యమ దశను, దిశను, స్థల కాలాలను మనిషి సాధనను, బాధ్యతలను గుర్తుచేసే మైలురాయి.

అలా 'కోటి' ఒకనాటి యువ విద్యార్థి, క్లాస్‌మేట్స్‌కు, స్నేహితులకు బాల్య స్నేహితుడు. 'మల్లోజుల కోటేశ్వరరావు' ఉద్యమంలో ఉరుకులు, పరుగుల దశలో ఉద్యమించిన ఉదయించే సూర్యుడు. 'ప్రహ్లాద్' రాష్ట్ర విప్లవ ఉద్యమ క్రమంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నెరవేరుస్తూ ఉత్తేజం కలిగించిన నాయకుడు.

'కిషన్‌జీ' ఉత్తర భారతం, బీహార్, బెంగాల్, ఒరిస్సా, అస్సాం, నేపాల్ తదితర ప్రాంతాల్లోకి విస్తరించిన జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు. భారత విప్లవోద్యమాన్ని ముందుకు నడిపే కేంద్ర కమిటీ సభ్యుల్లో ఒకరు. ఇలా కోటేశ్వరరావు కలం పేర్లు చరిత్ర పరిణామాలను వివరించే మారుపేర్లు. ఆ పేర్ల వెనుక ఆయా కాలాల విప్లవోద్యమ చరిత్ర ఆనవాళ్లు దాగి వున్నాయి.

1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సీపీఐ(ఎం) ఏర్పడింది. అందులో యువ నాయకత్వం కొత్తపార్టీ విప్లవోద్యమానికి ప్రతీక అవుతుందని భావించారు. తమ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఉద్యమించారు. అలా బెంగాల్‌లో చారు మజుందార్, సరోజ్ దత్తా, కానుసన్యాల్, నాగభూషణ్ పట్నాయక్, సత్యనారాయణ సింగ్, చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావ్, కాశ్మీర్‌లో షరీఫ్, బీహార్‌లో కిషన్ ప్రసాద్, కేరళలో వేణు, ఆంధ్రప్రదేశ్‌లో దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆదిభట్ల కైలాసం, పాణిగ్రాహి, సత్యం, తేజేశ్వరరావు వంటి వారు ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించారు. ప్రజల సమస్యలపై ఉద్యమించారు. అలా ఉద్యమించిన క్రమంలో బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్‌బరీలో అదే సంవత్సరం (1967) బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన సీపీఎం ప్రభుత్వం కాల్పులు జరిపి అణచివేసింది. అలా సిపిఎం తన పార్టీ యువనాయకత్వాన్ని తానే సంహరించింది.

రాష్ట్రంలో నక్సల్‌బరీ, శ్రీకాకుళం ఉద్యమాల ప్రేరణతో తెలంగాణలో ఉద్యమం ప్రారంభించాలని కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి భావించారు. 1940-50 మధ్య సాగిన తెలంగాణ రైతాంగ పోరాట ప్రాంతాల్లో కాకుండా ఆ పోరాటాలు తక్కువస్థాయిలో సాగిన ప్రాంతాల్లో కొత్తగా ఉద్యమం ప్రారంభించాలని సర్వేకు బయల్దేరారు. అలా కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకాలోని రంగపేట గ్రామ సమీపంలోని గోదావరి నదిలో 1969లో పోలీసులు వారిని చూసి అరెస్ట్ చేసి జగిత్యాల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి మరుసటి రోజు వదిలేశారు. అప్పటికి ఉద్యమం పరిసరాల పరిశీలనకే పరిమితమైంది.

1967 నుండి మార్క్సిస్టు లెనినిస్టులు, నక్సలైట్లు, ఎం.సి.సి. తదితర గ్రూపులు దేశవ్యాప్తంగా వర్గ శతృ నిర్మూలన అనే పోరాట రూపంతో ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించే భూస్వాములను, వర్తకులను ఖతం చేసే కార్యక్రమం తీసుకున్నారు. 1972 నుండి వర్గ శత్రు నిర్మూలనా పోరాట రూపంపై చర్చలు మొదలయ్యాయి. ప్రజలను వారి సమస్యల పట్ల కదిలించాలని ప్రజాసంఘాలను నిర్మించడం ద్వారా పార్టీ విస్తరించాలని ప్రజాసంఘాల్లో పనిచేసే కార్యకర్తలు విప్లవకారులుగా ఎదుగుతారని భావించి ప్రజాసంఘాల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 1974 నాటికి ఈ నిర్ణయం జరిగిన తర్వాత విద్యార్థి సంఘాలను నిర్మాణం చేయడం జరుగుతూ వచ్చింది. అంతలో ఎమర్జెన్సీ రావడంతో నిర్బంధాలు పెరిగాయి. చాలామంది జైళ్లపాలయ్యారు. వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధుల నుండి ఎదిగిన సూరపనేని జనార్ధన్ వంటి యువకులను మెదక్ జిల్లా గిరాయిపల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ పేరిట కాల్చి చంపారు. ఎమర్జెన్సీలోనే భూమయ్య, కిష్టా గౌడ్‌లను ఉరితీశారు.

జగిత్యాల జైత్రయాత్ర ఇందుకు భిన్నమైనది. జగిత్యాల జైత్రయాత్ర విప్లవద్యోమంలో ఒక మలుపు. ప్రజలను కదలించడం ద్వారా ఉద్యమించడం అనేదానికి జగిత్యాల జైత్రయాత్ర ఒక కొండగుర్తు. ఎమర్జెన్సీ తర్వాత 1977 నుండి రాడికల్ విద్యార్థులు, పిడిఎస్‌యూ విద్యార్థులు గ్రామాలకు తరలండి కార్యక్రమంతో పల్లెల్లో ప్రచారం చేశారు. జననాట్య మండలి పాటలు నూతన ప్రజాస్వామిక విప్లవపు ఆవశ్యకత, ప్రజల సమస్యలు, అందుకు మూలకారణం. ఇది అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థ కావడం అని అర్థం చేయిస్తూ వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూస్వాముల ఆధిపత్యానికి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. శిక్షణ పొందిన విద్యార్థులు, గ్రామాలకు తరలి రైతు కూలీ సంఘాలు, రాడికల్ యువజన సంఘాలు స్థాపించుకోవడానికి ప్రేరణ ఇచ్చారు. భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు.

భూస్వాములను దారికి తీసుకురావడానికి సాంఘిక బహిష్కరణ విధించారు. ఈ ఊర్లో ఎవరూ కూడా ఆ భూస్వాముల పొలాలు దున్నేది లేదు. ఇంటి పని చేసేది లేదు. బట్టలు ఉతికేది లేదు. గడ్డం తీసేది లేదు. ఇలా అన్నీ బంద్ పెట్టారు. దాంతో భూస్వాములు ఊళ్ళల్లోంచి పారిపోయారు. ఆ తరువాత పోలీసులను పంపారు. దొరల స్థానంలో పోలీసు క్యాంపులు వచ్చాయి. ప్రజలను పశువుల్లాగా మందపెట్టి కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. ఆ క్రమంలో దౌర్జన్యాలకు పాల్పడుతున్న భూస్వాములను ఖతం కార్యక్రమంలో హతం చేశారు. ఈ నిర్బంధాల నుండి తట్టుకుంటూ ఉద్యమాన్ని విస్తరించాలని 1970-80 మధ్య కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఎమర్జెన్సీ తర్వాత సాగిన ఉద్యమాలలో నేను సాహిత్యకారుడిగా, పౌరహక్కుల కార్యకర్తగా, ఉద్యోగ సంఘాల నిర్మాతగా పనిచేస్తున్న క్రమంలో విప్లవోద్యమంలో ఎందరో విప్లవకారులతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. అలా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా మల్లోజుల, రాడికల్ యువజన సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నేను... ఉద్యమంలో కలిసి ముందుకు సాగాము. నాది బహిరంగ ప్రజాసంస్థల ఉద్యమమయితే మల్లోజుల అన్ని ప్రజా ఉద్యమాల సమీకరణ కార్యకర్తల నిర్మాణం, పార్టీ నిర్మాణం తన కర్తవ్యంగా ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య వంటి పెద్దల సూచనలతో నిర్మిస్తూ ముందుకు సాగారు.

గతంలో సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో పైస్థాయి నాయకత్వమంతా ఆంధ్రప్రాంతానిది, పోరాట నాయకత్వమంతా తెలంగాణది. దానివల్ల పోరాటాలతో సంబంధం లేని నాయకత్వం పోరాటాలపై ఆధిపత్యం చెలాయించడం జరిగింది. దానివల్ల ఎన్నో తప్పులు జరిగాయి. ఆ పొరపాట్లు జరగనీయకూడదు. ఎక్కడి నుండి ఉద్యమం వ్యాపిస్తున్నదో అక్కడి నుంచే నాయకత్వాన్ని రూపొందించాలి, ఎదిగించాలి అనుకున్నారు. అలా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శిగా మల్లోజుల కోటేశ్వరరావు 1980లో ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కార్యదర్శే, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

అలా మల్లోజుల కోటేశ్వరరావు కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన వెంటనే రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా మారిపోయారు. ఆ తర్వాత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు కరీంనగర్ జిల్లా కార్యదర్శి అయ్యారు. అలా వరంగల్ రీజనల్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమం ఉవ్వెత్తున ముందుకు సాగినప్పటికీ అనుభవరాహిత్యం వల్ల, అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాట్లకు బాధ్యత వహించి కోటేశ్వరరావు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హోదా నుండి పార్టీ నిర్ణయానుసారం 1985-86లో సీవోగా కిందిస్థాయి కార్యకర్తగా పనిచేశారు.

ఆ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా నల్లా ఆదిరెడ్డి ఎన్నికయ్యారు. నల్లా ఆదిరెడ్డి అరెస్ట్ కావడం వల్ల ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు 1986లో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాలక్రమంలో దండకారణ్యం ఉద్యమ నిర్మాణంలో మల్లోజుల కీలక పాత్ర నిర్వహించారు. అలా మళ్లీ రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో సమర్థవంతమైన నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఇలా తెలంగాణ నాయకత్వం ఎదగడానికి కారకులైన కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి, ఐ.వి.సాంబశివరావు వంటి సీనియర్ నాయకత్వం ముందుచూపుకు జేజేలు చెప్పక తప్పదు.

ఎక్కడికక్కడ పనిచేస్తున్న విప్లవకారుల మధ్య ఐక్యత, ఐక్యసంఘటన గురించి 1980 నుండి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎందుకోగానీ అవి దశాబ్దాల తరబడి కొనసాగుతూ వచ్చాయి. 1985లో నేను దేశవ్యాప్తంగా పర్యటించినప్పుడు అనేక విప్లవ పార్టీల నాయకులతో చర్చించినప్పుడు భిన్నాభిప్రాయాలు, విబేధాలు సులువుగా పరిష్కరించుకోవచ్చు అని అనిపించింది. కానీ పూర్తిస్థాయిలో ఏకం కావడానికి మరో ఇరవై సంవత్సరాలు తీసుకుంది. మొత్తానికి ఉత్తర, దక్షిణ భారత ప్రజానీకాన్ని ఒకే పార్టీ నేతృత్వంలో నడిపే ఉద్యమంగా మావోయిస్టుపార్టీ ఎదిగింది. ఇందుకు పరస్పర అవగాహన వివిధ ప్రాంతాల మధ్య ఒక సమీకృత శక్తిగా శక్తివంతమయ్యాయి.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విస్తరిస్తున్న క్రమంలో అడవులను, ఈదేశ వనరులను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కైవసం చేసుకోవాలని డాలర్ల పంట పండించుకోవాలని అనేక పరిశ్రమల పేరిట ముందుకు వచ్చారు. అభివృద్ధి పేరిట ప్రజలను నిర్వాసితులను చేస్తూ తమ లాభాలను, పెట్టుబడులను పెంచుకోవాలనుకున్నారు. మావోయిస్టు పార్టీ దేశ్యాప్తంగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆదివాసులకు అండగా నిలిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాయకులు, పారిశ్రామికవేత్తలు బహుళజాతి సంస్థలు దీన్ని సహించలేకపోయాయి.

ఆపరేషన్ గ్రీన్‌హంట్, వగైరా పేర్లతో సి.ఆర్.పి.ఎఫ్, మిలటరీ బలగాలను ప్రజలకు వ్యతిరేకంగా తమ స్వార్థలక్ష్యాలకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారి చేతుల్లో ప్రజల పక్షాన మహానేత కిషన్‌జీ నేలకొరిగారు. అలా జగిత్యాల జైత్రయాత్ర బెంగాల్‌లోని లాల్‌గఢ్ పోరాటాల దాకా ఒక జిల్లా నుండి ఎదిగి 14 రాష్ట్రాలదాకా విస్తరించిన ప్రజా ఉద్యమ నాయకత్వానికి కిషన్‌జీ ఒక ప్రతీక, ప్రతినిధి. కిషన్‌జీ ఒక వ్యక్తికాదు, ఒక సామాజిక శక్తి. దోపిడీ, పీడనలేని, స్వేచ్ఛ సమానత్వం ఆత్మగౌరవం పరిఢవిల్లే మరో ప్రపంచాన్ని సృష్టించాలనే కలలు కనే యువతరానికి ప్రతినిధి. పీడిత వర్గాల ఆశాజ్యోతి.

- బి.ఎస్.రాములు
సామాజిక తత్వవేత్త
ఆంధ్ర జ్యోతి తెలుగు న్యూస్ పేపర్ తేది 29 / 11 /2011 

No comments:

Post a Comment