Monday, November 28, 2011

పోల'వరం' దియా, తెలంగాణ లియా - కంచ ఐలయ్యఇంగ్లీషులో ఒక సామెత- "one battle settles many battles' అనీ. మూడో దశ తెలంగాణ పోరాటాలు, త్యాగాలు ఒక్క దెబ్బతో సెటిల్ అయ్యాయి! 2009 నవంబర్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పై స్థాయిలో గాంధేయ పోరాటాలు, కింద గ్రామస్థాయిలో త్యాగధనుల ఆరాటాలు మొదలయ్యాయి. దేని కోసం? పై నుంచి ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తలు చెప్పినట్లు ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని సకల జనులు నమ్మారు. 

పై రాజకీయ నాయకత్వం, దాని సామాజిక సృష్టిగా ముందుకొచ్చిన ఉద్యమం జేఏసీ, విచిత్రమైన గాంధేయ ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి. అందులో సింబాలిక్ ఆత్మహత్యల ఉద్యమాలు పై రాజకీయ శక్తులు చేస్తుంటాయి. కింద యువకులు, ప్రజలు నిజమైన ఆత్మహత్యలే చేసుకోవాలి. తెలంగాణ రాకముందే పై శక్తులు వనరులు సమకూర్చుకోవాలి. ప్రజలు మాత్రం రాష్ట్రం వచ్చే వరకు త్యాగాలు చేస్తూనే ఉండాలి. గాంధీ తన త్యాగ సిద్ధాంతాన్ని లియో టాల్‌స్టాయ్ అనే రష్యన్ రచయిత, తత్వవేత్త నుంచి నేర్చుకున్నారు. 

దనవంతులు, బీదల కోసం తమకున్నవన్నీ వదులుకోవాలని, సహాయనిరాకరణోద్యమాలు సైతం చేయాలని టాల్‌స్టాయ్ చెప్పారు. ఆయన ఎన్నో రచనలు చేశారు. తన ఆస్తినంతా త్యాగం చేశారు. ఆఖరికి బీదవాడిగా చావాలని ఇంటినుంచి వెళ్లిపోయి రైల్వేస్టేషన్‌లో చనిపోయాడు. గాంధీ ధనిక జీవితాన్ని వదులుకొని ఆశ్రమాల్లో జీవించాడు. ఉద్యమాల ద్వారా సొంత ఆస్తులు సంపాదించుకోలేదు.తెలంగాణ 'ఉద్యమం'లో గాంధేయవాదం విచిత్రంగా పని చేసింది. ఉద్యమానికి ఏకైక నినాదముండాలన్నారు. అది తెలంగాణ రాష్ట్ర సాధన. రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాం తంలో రకరకాల ఉద్యమాల్లో కొన్ని విలువలు ఉనికిలోకి వచ్చాయి. 

కమ్యూనిస్టు ఉద్యమాలు, మావోయిస్టు ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు ఎన్నో త్యాగాలు చేశాయి. కొన్ని ఫలితాలు సాధించాయి. ముఖ్యంగా పౌరహక్కుల ఉద్యమం కొన్ని సామాజిక, తాత్విక విలువల్ని సమాజం ముందు ఉంచింది. ఈ ఉద్యమంలో పనిచేసి, బతికి ఉన్న వ్యక్తినీ ఆఖరివరకు పరీక్షించవలసి ఉండగా, చనిపోయిన కన్నబీరన్, బాలగోపాల్ ఆ ఉద్యమాల్ని ఆస్తుల సంపాదనకెట్లా ఉపయోగించకూడదో నిరూపించారు. పోతే ఆ ఉద్యమంలో కొన్ని భూస్వామ్య శక్తులు చేరాయి. అవి ఆస్తుల రక్షణకు ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకున్నాయి. దాని చుట్టూ పదవుల పైరవీశక్తులు కూడా ఉండేవి. అవి పౌరహక్కల ఉద్యమ పలుకుబడిని ఉపయోగించుకునేవి. 

ఈ రెండో తరం శక్తులు ఇప్పుడున్న కాంట్రాక్ట్ గాంధేయవాద తెలంగాణ ఉద్యమం చుట్టూ చేరాయి. తెలంగాణలో ఒక కాంగ్రెస్, బింద్రన్‌వాలే లాంటి రాజకీయ ఉద్యమ అగ్రకుల శక్తుల్ని సృష్టించింది. ఏ రాజకీయ ఉద్యమ వాతావరణాన్నైనా మూడు రకాలుగా వాడుకోవొచ్చు. (1): ప్రజల సమస్యలు తీర్చడానికి వారిని అభివృద్ధి పరచడానికి. ఈ రకం పని అగ్రకుల దోపిడీ కుటుంబాల నుంచి వచ్చినవారు చాలా తక్కువ మంది చేశారు. (2) తమ కుటుంబ, కుల అభివృద్ధి కోసం అన్ని రకాల సామాజిక రంగాలను ఉపయోగించుకోవడం. అందులో మంచి చెడులను జోడించడానికి ఆస్కారాన్ని కల్పించడం. ఇక్కడ పైకొక రూపం కనబడుతుంది. లోపల స్వప్రయోజనాల ప్రక్రియ సాగుతుంది. 

ఇందులో అవినీతి అవసరాన్ని బట్టి పెరుగుతుంది. (3) అరాచక బృందాలను ఆర్గనైజ్ చేసి, ప్రాంతాలనూ, రాష్ట్రాన్ని, దేశాన్ని దండుకోవడం. ఇక్కడ నీతి కవచం కూడా అక్కరలేదు. దండుకోవడం రాచబాటగా సాగుతుంది. మన రాష్ట్రంలో అధికారంలో ఉండి వై.ఎస్.ఆర్. కుటుంబం ఆ పని చేసింది. తెలంగాణ రాష్ట్రం సాధింపు పేరుతో కె.సి.ఆర్. కుటుంబం ఆ పని చాలా వరకు జంకుగొంకు లేకుండా చేస్తున్నది. ఈ రెండు కుటుంబాల చుట్టూ శేర్‌దార్లు ఉన్నారు. ఎవరికైనా ఉంటారు. వీరికి, వారి సంబంధాలు, లాయల్టీలను బట్టి వాటాలుంటాయి. విచిత్రమేమిటంటే ఈ రెండు కుటుంబాల్ని కాంగ్రెసే పెంచి పెద్ద చేసింది. ఈ విధంగా సంపాదించడానికి తెగబడ్డవారు చాలా ధైర్యశాలుల్లా, ప్రజాప్రయోజకుల్లా నీతులు బోధిస్తూనే సంపాదన పోగు చేస్తారు. 

కె.సి.ఆర్, లక్ష్మీరాజం రూ.5,700 కోట్ల పోలవరం కాంట్రాక్ట్‌ను సంపాదించింది ఈ డేర్ డెవిల్ రాజకీయ ప్రక్రియతోనే. పోలవరం కాంట్రాక్ట్‌లో పొలిటికల్ జేఏసీ పేరుతో పనిచేసే ప్రధానశక్తులకు వాటా లేదంటే పిచ్చివాళ్లు మాత్రమే నమ్మాలి. సకల జనుల సమ్మెతో కేంద్రం మెడలు వంచి, ఈ కాంట్రాక్ట్‌ను సంపాదించారు. ఇది తెలంగాణ జలయజ్ఞం. ఇందులో తెలంగాణ ప్రజలకు దక్కింది ఉద్యమ కష్టాలు, కూలీదినాలు కోల్పోవడం, పంటలు ఎండిపోవడం, యువకుల చావులు, వేలాది కుటుంబాలు కుప్పకూలడం, తెలంగాణలో బీద పిల్లల చదువులు సంపూర్ణంగా నాశనం చెయ్యడం, చిన్న ఉద్యోగ కుటుంబాలను రోడ్లమీద పడెయ్యడం. ఇవన్నీ కూడా అక్రమ సంపాదనకు, పేరు ప్రతిష్ఠలతో సహా పూనుకున్నవానికి సమస్యలనిపించవు. 

కాంగ్రెస్ జగన్ వంటి వ్యక్తి చేతిలో కూలిపోయే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణలో ఒక దోపిడీ వ్యవస్థను పోషిస్తూ ఉంది. వీరి ఆదాయాల మీద ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ నుంచి కాపాడినందుకు ఇక్కడి ప్రభుత్వం వీరికి రుణపడింది. ఆ రుణం తీర్పులో భాగమే పోలవరం, మెట్రోలైన్‌లో ఈ గుంపు బంధువులకు సబ్ కాంట్రాక్ట్‌లు, కొంత మందికి ఉచిత కొత్త కార్ల బహుమతులు దక్కాయి. 

అదే సందర్భంలో బీసీ, ఎస్సీల మీద ఎనలేని దాడులు, చెరుకు సుధాకర్ లాగా జైలు జీవితాలు తమ వృత్తి జీవితాలు చిన్నాభిన్నం మామూలయ్యాయి. పోతే వీరి చుట్టూ ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా వారినే నమ్ముతున్నారు. కనుక ఎన్ని బాధలనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. రాయలసీమలో దొరల రక్షణ పోరాటంలో ఉన్నవారికి జైలులో ఉన్న చెరుకు సుధాకర్‌కు తేడా లేదు. ఇప్పుడున్న ప్రక్రియలో ఎవరు తెలంగాణ ఇస్తున్నారు? ఎవరు తెస్తున్నారని నమ్మాడాయన. 

బీసీ, ఎస్సీ ప్రొఫెషనల్స్ తమ చుట్టూ నాలుగు పైసలు కనబడగానే రాజకీయ నాయకులు కావాలని ఏ పార్టీ చుట్టూ అంటే ఆ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. ఏ నాయకుని బడితే ఆ నాయకున్ని నమ్ముతున్నారు. అంబేద్కర్, పూలేల పోరాట ప్రక్రియలో భాగంగా గ్రామీణ విద్యావిధానాన్ని అభివృద్ధి చేసేందుకు భాగస్వాములు కారు. రిజర్వేషన్ పోరాటంలో అంతగా పాల్గొనరు. అగ్రకుల సంపాదకులను నమ్మినట్లు కింద కుల మేధావి, రాజకీయ శక్తులను నమ్మరు. 

పోలవరం కాంట్రాక్ట్ టీఆర్ఎస్ శక్తులకు ఇవ్వకుండా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 'తెలంగాణ ఇవ్వలేము' అని ప్రకటన చెయ్యగలిగేవారు కాదు. ప్రజల ప్రాణాలు తోడుతూ కాంట్రాక్ట్, అక్రమసంపాదన చేసిన వారు దేవాలయాల చుట్టూ తిరిగే మొక్కుబడులు చెల్లించాల్సిందే. అదే చేస్తున్నారు.

1969లో ఉద్యమాన్ని ఆనాటి నాయకుడు పదవులకు అమ్మితే, ఇప్పుడొక నాయకముఠా ఆస్తుల సంపాదన కోసం అమ్ముతున్నది. దేశంలో అవినీతిపై జరుగుతున్న చర్చ వీరికి కాలిగోటితే సమానం. ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఇప్పుడు రోజువారీ కార్యక్రమమైంది. ప్రతిరోజు పెద్ద గుంపు అబద్ధాలు చెబుతూంటే, మీడియా వారి పైసల పలుకుబడికి లొంగి ఆ అబద్దాలను ప్రచారం చేస్తుంటే ప్రజలు నమ్ముతారు. అదీ ఉద్యమం పేరుతో చెప్పే అబద్ధాలు బాగా అతుక్కుంటాయి. తెలంగాణ అమ్మకానికున్న ఓ ఆడబిడ్డ అయింది. 

ఇప్పుడు పోలవరం కాంట్రాక్టు ఉంటుందా ఉండదా అన్నది సమస్యకాదు. ప్రాంతమంతా మోసపోయిందనేది సమస్య. ఈ కరప్ట్ శక్తులకు కాంగ్రెస్ ఎందుకు అండగా ఉంటుంది? రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని కాపాడిందే ఈ శక్తులు కనుక. ఇప్పుడు మాయావతి ఎత్తుగడలో భాగంగా తెలంగాణ వస్తే (రెండో ఎస్సార్సీలోనైనా) పైసలు, పలుకుబడి, రాజకీయ అధికారం దక్కుతుందని చూస్తున్నాయి. కానీ అది గమనించిన ఆంధ్ర శక్తులు పోలవరమిచ్చాకా తెలంగాణ'వరం' అసలు ఏ దశలోనూ ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చాయి. అందుకే రెండో ఎస్సార్సీ వేసినా తెలంగాణ అందులో ఉండదు అంటున్నారు. అవును మరి వంద కోట్ల చందాలు, వేల కోట్ల పోలవరం ఇచ్చాకా తెలంగాణ ఎందుకిస్తారు? 

ఈ స్థితిలో తెలంగాణ ప్రజలు ఈ శక్తులకు 2014లో ఓటేసి ఎన్ని సీట్లు గెలిపిస్తే అన్ని వందలకోట్లకు వాటినమ్ముతారు. ఏ పార్టీ ధర ఎక్కువ పెడితే, ఆ పార్టీకి (కాంగ్రెస్ లేదా బి.జె.పి) అమ్ముతారు. శిబూసోరేన్ ఇలాగే అమ్ముకొని జైలుకు పోయిన సంగతి మనకు తెలుసు. ఇక్కడ రాష్ట్రం రాకముందే మధుకోడాలు, శిబూసోరే న్‌లు పుట్టి, పెరిగి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ బడుగు జీవులారా, బలహీనవర్గాల మేధావుల్లారా తస్మాత్ జాగ్రత్త. పెనం మీది తెలంగాణ వీరి చేతిలో పెట్టి పొయ్యిలో పడేయకండి. ఈ తెలంగాణలోనే ఏదో ఒక తల్లికడుపులో మంచి నాయకుడు పుడతాడు. అంతవరకు ఆగండి. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi Telugu News Paper Dated 29/11/2011

No comments:

Post a Comment