Saturday, November 19, 2011

ఇంకా ఎన్నాళ్లీ బానిసత్వం? By -కల్లూరి కళావతిప్రధాని మన్మోహన్ సింగ్ తెలంగాణ ఇప్పుడే ఇవ్వలేమని చెప్పేశాడు. తెలంగాణ రాజకీయ ఆత్మ గౌరవానికి అదొక మరువలేని గాయం. తెలంగాణ తన స్వీయ రాజకీయ అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో మాత్రమే సాధించు కోగలుగుతుందని మరోసారి రుజువైంది. తెలంగాణ స్వీయ రాజకీయబలంతో తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ తనకు తాను గా ఇవ్వదని ఇప్పటికైనా మనకు ప్రధాని గుర్తు చేసినందుకు సంతోషిద్దాం!
మలిదశ తెలంగాణ పోరాటం ఈతరానికి చారివూతిక నేపథ్యాన్ని తెలిపింది. సుసంపన్న తెలంగాణ, తదుపరి మోసపూరిత విలీనం, జరిగిన దోపిడీ గురించి తెలంగాణలో ఇవాళ తెలియని వారు ఉండరు. ఇన్నాళ్ళు అవమానాలు భరించిన భాష కూడా ఆత్మ గౌరవా న్ని సాధించుకుంది. తెలంగాణ మాండలికానికి ఇవాళ ఎనలేని గౌరవం వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ మాండలికంలో మాట్లాడటానికి తెలంగాణ వాడే ఇష్టపడే వాడు కాదు. వచ్చీరానీ ఆంధ్రా మాండలికంలోనే మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. దాన్నే ఒక సామాజిక గౌరవంగా భావించేవాడు. ఇవాళ తెలం గాణ మాండలికంలో మాట్లాడకపోతే తనను తానే ద్రోహం చేసుకుంటున్న వాడిగా భావిస్తున్నాడు. తన భాషలో మాట్లాడటమే తన ఆత్మ గౌరవంగా ప్రతి తెలంగాణ వాసి భావిస్తున్నాడు. ఇవాళ బతుకమ్మ పండగ కావచ్చు, బోనాల పండగ కావచ్చు కొంత కాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్న తెలంగాణ పండుగలు తిరిగి వైభవోపేతాన్ని సంతరించుకున్నాయి. ఇలాంటి అనేక తనవైన సాం స్కృతిక ప్రతీకలను ప్రతి తెలంగాణ వాసి తిరిగి స్పర్శిస్తున్నాడు. ఇలా భాష, చరిత్ర, సాంస్కృతిక అంశాల్లో తెలంగాణ తన ఆత్మ గౌరవాన్ని సాధించుకుంది. ఇవాళ రాజకీయ ఆత్మ గౌరవం కోసం అత్యంత కీలకమైన రాజకీయ పోరాటం చేస్తున్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వ ఆత్మ గౌరవంతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని నమ్ముతున్నారు.

ఈ దేశంలో విలీనమై, ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడిన తెలంగాణ దోపిడీ, అవమానాలకు గురవుతున్నది. నాడు తనకున్న ప్రపంచస్థా యి సంపదను ఈ దేశానికి ధారపోసిన తెలంగాణ, ఇపుడు ఆత్మహత్యలకు, నిరుద్యోగులకు నిలయమైంది. ఈ దేశ రాజ్యాంగం పట్ల తన విశ్వాసనీయతను చాటుకున్న తెలంగాణ, రాజ్యాంగ హామీల ఉల్లంఘనలకు బలైంది. తెలంగాణ రాజకీ య పార్టీలపై విశ్వాసం ఉంచింది, కానీ రాజకీయ పార్టీలు మాత్రం తెలంగాణ పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడుతూ వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు రాజకీయ పార్టీలకు నిర్బంధ బందీలై తమ రాజకీయ స్వేచ్ఛను కోల్పోతూ వచ్చారు. తెలంగాణకు ఇచ్చిన రాజ్యాంగ రక్షణలు ఉల్లంఘించబడుతుంటే, తెలంగాణలో బతుకుతున్న ఒక్కపార్టీ అయినా గొంతెత్తి అడ్డుకున్న దాఖలా ఉంటే, ఇవాళ ఇంత పెద్ద ఉద్యమం వచ్చి ఉండేదేనా? ఇంకేముందని తెలంగాణేతర (బయటి) పార్టీలను తెలంగాణలో బతకనివ్వాలే? వచ్చిన తెలంగాణను అడ్డుకున్న పార్టీలను ఈ ప్రాంతంలో బతక నిచ్చేందుకు ఒక్క తెలం గాణవాసి మనసైనా ఒప్పుకుంటదా? అలాంటి పార్టీలను బతకనిస్తే రాష్ట్రం వస్తదా? కాబ ఇవాళ రాజకీయ పార్టీలపై తెలంగాణ విశ్వాసాన్ని కోల్పోయింది. స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని, రాజకీయ ఆత్మ గౌరవాన్ని సాధించుకోగలిగితే తప్ప ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోలేమని గుర్తించింది.

2009 డిసెంబర్ 7న అధికార పక్షంతో పాటూ, అన్ని ప్రతి పక్షాలు తెలంగాణ ఇవ్వటానికి ఒప్పుకున్నాయి. డిసెంబర్ 9న అవే పార్టీలు కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా తిరగబడ్డాయి. డిసెంబర్ 23న రెండో ప్రకటనతో తెలంగా రాజకీయ ఆత్మ గౌరవం అవమానించబడింది. దీంతో తెలంగాణ గుండె రగిలిపోయింది.
కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమంలో ఉండవచ్చు. కానీ తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్‌ఎస్ తప్ప, మిగిలిన పార్టీలకు బయటి హైకమాండ్లు ఉన్నాయి. కాబట్టి అవి జై తెలంగాణ అంటున్న పార్టీలైనా, అనని పార్టీలైనా తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకలు కాలేవు. ఒక్క సిపిఎం తప్ప ప్రతి రాజకీయ పార్టీ జై తెలంగాణ అంటున్నాయి. మరి వచ్చిన తెలంగాణ ఆగిపోయిందెందుకు? బయటి పార్టీలు తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకలు కావని చెప్పటానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కరలేదు. తెలంగాణలో బతుకుతున్న రాజకీయ పార్టీలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తమ అధిష్ఠానాల దగ్గర, అధినేతల దగ్గర తాకట్టు పెట్టాయి. ఈ పార్టీలు తెలంగాణ లో బతికున్నంత కాలం రాష్ట్ర ఏర్పాటుకు అవరోధాలు తప్పవు. కొందరు ఢిల్లీలో సోనియమ్మ దగ్గర, మరికొందరు ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు దగ్గర, మిగిలిన వారు, వారి వారి బయటి అధినేతల దగ్గర తెలంగాణ రాజకీయ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. దీనితోనే ప్రధాని అంత ధైర్యంగా తెలంగాణ ఇవ్వలేమని చెప్పగలుగుతున్నాడు. ‘టెన్ జనపథ్’లో అమ్మ దగ్గర ఒక మాట, మీడియా కెమెరాల ముందు మరోమాట. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాబు దగ్గర ఒక మాట, టివి కెమెరాల ముందు మరోమాట. సుష్మా స్వరాజ్ ది(జై తెలంగాణ) ఒక మాట, వెంకయ్య నాయుడిది మరొక మాట. ఆ మధ్య ఓ టీవీ ఛానల్లో, మీది తెలంగాణ వాద మా లేక సమైక్యవాదమా? అని అడిగితే, అతడు తనది సమైక్యభారత్ అని జవాబిచ్చా డు) నారాయణది ఇక్కడ జై తెలంగాణ మాట.

అక్కడ చంద్రబాబుతో కలిసి ప్రజా ఉద్యమాల బాట. ఇక ఏ భారత రాజకీయపార్టీ మనసార తెలంగాణ తేవాలని కోరుకుంటున్నాయో తెలిసిపోతోంది. ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజావూపతినిధులెవరైనా సరే, వారికి నిజంగానే రాష్ట్రం రావాలని ఉంటే, వెంటనే వారి వారి రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి బయటికి రావాలే. అప్పటిదాకా వారిని తెలంగాణ ప్రజలు ఇంటి దొంగలుగానే భావిస్తారు. నిజాయితీ ఉంటే తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్న పార్టీలో చేరాలె. లేదా మరొక పార్టీ పెట్టుకోవాలె. అంతేకానీ ఢిల్లీ అధిష్ఠానాలు, ఆంధ్రా అధిష్ఠానలున్న పార్టీలలో కొనసాగితే ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించలేరు. ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర మెజారిటీ ప్రాంతం, తెలంగాణ మైనారిటీ ప్రాంతం. ప్రతి రాజకీయపార్టీ మనసు మెజారిటీ ప్రాంతానికి, మాట మైనారిటీ ప్రాంతానికి పారేసి రాజకీయంగా బతక నేర్చాయి. కాబట్టి ప్రస్తుత రాష్ట్రంలో మైనారిటీ ప్రాంతమైన తెలంగాణ పట్ల ఏ రాజకీయ పార్టీ అయినా కపట ప్రేమను ప్రదర్శిస్తాయి తప్ప నిజమైన ప్రేమను కలిగి ఉండవు. చట్టసభల సీట్ల సంఖ్యకు లొంగిపోయే రాజకీయ పార్టీలు అన్యాయాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాయని నమ్ముకుంటే అది వెర్రితనమే అవుతుంది.

కాబట్టి, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం తో మాత్రమే సాధించుకోబడుతుంది, తప్ప మరొకరి దయాదాక్షిణ్యాలతో సాధించబడదని అందరూ గమనించాలి. ఆంధ్ర పార్టీలను, ఢిల్లీ పార్టీలను తరిమేసి తెలంగాణ తన స్వీయ రాజకీయ ఆత్మ గౌరవాన్ని చట్టసభల్లో చాటుకుంటే తప్ప రాష్ట్రం ఏర్పడదు. అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో తెలంగాణ స్వీయ రాజకీయ బలం భారత రాజకీయ పార్టీలకు అవసరాన్ని, అనివార్యతను సృష్టించగలుగుతుంది. దాని తో రాజకీయ పార్టీలు దిగివచ్చి తెలంగాణ ఇవ్వక తప్పదు. రాష్ట్ర ఏర్పాటుకు ఎప్పటికైనా ఇంతకు మించిన మార్గం మరొకటి లేదు.బలమైన, వ్యూహాత్మక నేతృత్వ లేమి కారణంగానే తెలంగాణ 45 ఏళ్ళు నష్ట పోయింది. అలాంటి నష్టానికి తావివ్వని నేతృత్వాన్ని ఇవాళ కలిగి ఉంది కాబట్టే, తెలంగాణ సెగ ఢిల్లీ దాకా వెళ్ల గలిగింది. ఢిల్లీ పాలకులు ఇవ్వకపోయినా, తెచ్చే సమర్థత, వ్యూహాత్మకత కలిగిన నాయకత్వంతో చివరకు 2014 తర్వాతనైనా తెలంగాణ ఏర్పడక తప్పదు. అప్పుడు తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవటం చంద్రబాబుకో, సోనియాకో సాధ్యమయ్యే పనికాదు. అప్పుడు ఎర్రబెల్లిలు, రేవంతులు, దానంలు, ముఖేష్ లను... సోనియా, చంద్రబాబులు రక్షించలేరు. ఎందుకంటే, 2014 తర్వాత చట్టసభల్లో ఏర్పడే తెలంగాణ స్వీయ అస్తిత్వ రాజకీయ బలం చంద్రబాబు, సోనియాల ఆటకట్టిస్తుంది. వారికి అవసరాన్ని, అనివార్యతను సృష్టించి, వారి మెడలు వంచి తెలంగాణ తన రాష్ట్రాన్ని తానే తెచ్చుకుంటుంది. ఆ లోపల ఇస్తారా, చస్తారా తేల్చుకోవలసింది సోనియా, చంద్రబాబులే తప్ప తెలంగాణ ప్రజలు కాదు. ముఖ్యంగా వారి పంచన బతుకుతున్న ఈ ప్రజాప్రతినిధులు వారి పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజకీయ ఆత్మ గౌరవాన్ని కాపాడుతారా! లేదా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ గల్లీల్లో, నారావారి పల్లెలో తాకట్టు పెట్టి బతుకుతారా తెల్చుకోవాలె. ఇప్పటికే ప్రధాని మాటలు తెలంగాణ ఆత్మను అవమానించాయి. అయినా బుద్ధి మారక సోనియా లేదా చంద్రబాబు దగ్గరే తలదాచుకుంటామంటే ఈ ప్రాంత నేతలను ప్రజలు క్షమించరు.
Namasete Telangana News Paper Dated 20/11/2011 

No comments:

Post a Comment