Friday, November 11, 2011

హైదరాబాద్ పెట్టుబడి - నైతికత By - కంచ ఐలయ్య


హైదరాబాదు పెట్టుబడిదారుల అన్యాయపు విలువల వల్ల బీద ప్రజల కోసం స్కూళ్ళు, హాస్పిటల్స్, హాస్టల్స్ నిర్మించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏ ప్రాంతమైనా వెనుకబడి ఉండడానికి దాని విద్యా వెనుకబాటుతనం ముఖ్య కారణం. ఒక ప్రాంతాన్ని మారుస్తామని ముందుకొచ్చి, ఉద్యమాలు నడిపే క్రమంలోనే కొల్లగొట్టే విలువలని పెంచి పోషిస్తే ఏ సమాజమైనా ఎలా బాగుపడుతుంది? సిబిఐ వంటి సంస్థలు, కోర్టులు కాంట్రాక్టు పద్ధతులు, జమ, ఖర్చు విషయంలో కూడా పరిశోధనలు జరపాల్సిన అవసరముంది. 


ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు తాత్విక పునాదులు వేసిన ఆడమ్ స్మిత్ అనే ఆర్థిక, సామాజిక తత్వవేత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చివేసిన 'వెల్త్ ఆఫ్ నేషన్స్' పుస్తకం రాయకముందే 'ది థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్స్' (1759) అని ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. ఆయన చాలాకాలం మోరల్ ఫిలాసఫీ బోధించే ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 



ఈ రాష్ట్రంలో ప్రాంతీయ సెంటిమెంట్ తప్ప, మోరల్ సెంటిమెంట్ ఎవరికీ ఉండకూడదని మనుషుల్ని నిలదీస్తున్న తరుణంలో పెట్టుబడికి ఒక మోరల్ సెంటిమెంట్ ఉండాలని చెప్పడం మూర్ఖత్వమే అయినప్పటికీ ఆడమ్ స్మిత్‌ని ఆదర్శంగా చర్చించుకోకపోతే మావోనే పోలవరం కాంట్రాక్టు తీసుకుంటాడు. ఇదొక దయనీయమైన దశ. ఆడమ్ స్మిత్ పెట్టుబడికి నీతి నేర్పాడు. మార్క్స్ పెట్టుబడికి 'స్వయంగా అంతంకావలసిన' ఆదర్శాన్ని నేర్పాడు. ఆడమ్ స్మిత్ మోరల్ ఫిలాసఫీలో ప్రపంచ నీతి నియమాల రక్షణ భగవంతుడు చూసుకుంటాడు. మనిషి తన రక్షణ, తన కుటుంబం రక్షణ, తన చుట్టూ సమాజం రక్షణ, తన దేశంలోని విలువల రక్షణతో ముడేసి చూసుకోవాలని ఆయన అన్నాడు. మానవునికి తన రక్షణ ఇతరుల రక్షణతో నిరంతరం ముడివడి ఉండాలని, సింపతీ(దయ)ని ఆయన పెట్టుబడి అభివృద్ధికి కేంద్ర బిందువు చేశాడు. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అయిన, అవుతున్న పెట్టుబడిదారులకు 'స్వయం ప్రేమ' తప్ప ఇతరులను ప్రేమించే లక్షణం ఎక్కడ వెతికినా కనబడడం లేదు. ఈ నగరంలోని ఆధునిక పెట్టుబడి సరుకులను ఉత్పత్తిచేసి, అమ్మటంతో కాకుండా ఇమ్మోరల్ కాంట్రాక్టులతో మొదలైంది. నాగార్జునసాగర్‌తో ఇది ప్రారంభమై, ఇప్పుడు కొత్త కొత్త రూపాలు తీసుకుంటుంది. 



నాగార్జునసాగర్‌ని కాంట్రాక్టర్లు స్వయం అభివృద్ధికి దండుకొని, వందల కోట్లు గడించి ఇప్పుడెలా జీవిస్తున్నారో మనం చూస్తున్నాం. వీరిని పాపభీతి వెంటాడుతుంటే ఒంటినిండా రుద్రాక్ష మాలలేసుకొని, కనిపించే ప్రతి రాయికి మొక్కే ధనవంతుల్ని మనం ప్రతి నిత్యం చూస్తుంటాం. హైదరాబాద్, ఫ్యూడలిజం నుంచి పెట్టుబడిలోకి పారిశ్రామిక పెట్టుబడితో మారి ఉంటే, ఇక్కడి పరిస్థితి భిన్నంగా ఉండేది. కాంట్రాక్ట్ క్యాపిటల్ సగానికి సగం దండుకొని తన చుట్టూ ఉన్న మానవుల్ని మేపుతుందిగాని అది ప్రజాజీవితాన్ని మార్చే ప్రక్రియలో కృషి చేసిన ఉదాహరణలు తక్కువ. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని అయ్యాక ఇటువంటి కాంట్రాక్ట్ క్యాపిటల్‌తో పాటు కొంత బిజినెస్ క్యాపిటల్ ఒనకూడింది. 



ఈ క్రమంలో ఉత్పత్తి క్యాపిటల్ కూడా కొద్దో, గొప్పో అభివృద్ధి కాకపోలేదు. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తరలించడంతో హైదరాబాదులో సినిమా క్యాపిటల్ కీలకమైన పాత్ర పోషించడం మొదలైంది. సినిమా ఇండస్ట్రీ నీతిని నేర్పే ఇండస్ట్రీగా ఎదగకుండా ప్రేమ, ఫైటింగ్, డ్యాన్సు సంస్కృతిని యువతి ముందుపెట్టి బీద కుటుంబాల వారినే ఎక్కువ దండుకునే ఇండస్ట్రీగా మారింది. దురదృష్టవశాత్తు సినిమాల్లో పుట్టిన 'కలెక్షన్ క్యాపిటల్' ఉత్పత్తి ఇండస్ట్రీ వైపు ఎక్కువ పోకుండా 'రియల్ ఎస్టేట్' క్యాపిటల్‌గా మారి అవినీతిని ఆకాశానికి పెంచింది. 



ఆడమ్ స్మిత్ ఆనాడే చెప్పినట్టు పెట్టుబడిలో మోరల్స్‌ని కాపాడగలిగేది ఒక దేవుడు మాత్రమే. యూరో- అమెరికన్ సమాజంలో దైవభీతి బలంగా ఉండడం వల్ల మానవుల కుండాల్సిన 'దయ' నిరంతరం బతుకుతూ వచ్చింది. దైవభీతి మోరాలిటీ పట్టును ఆడమ్‌స్మిత్, ఇమ్మానువల్ కాంట్ వంటి ఆర్థిక-సామాజిక నైతిక తత్వవేత్తలు పెట్టుబడి సమీకరణకు దయా-దాక్షిణ్యాల పంపిణికీ నిజాయితీ గల దేవుడు నిరంతరం పనిచేస్తుండాలని చెప్పారు. దేవుడొక్కడే కరప్ట్ చెయ్యబడలేని శక్తి అని నమ్మే విలువలు ఆ దేశాల్లో ఉన్నాయి. దేవునంత బలమైన మోరల్ విలువల రక్షకుడు వేరే ఎవరూ లేనందువల్ల ఆ దేవుని ఆధీనానికి బయట పనిచెయ్యాలని ప్రయత్నం చేసిన కమ్యూనిస్టు వ్యవస్థలు కుప్పకూలాయి. 



మనదేశంలో ఎదిగిన కాంట్రాక్ట్, సినిమా, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు దేవున్నే కరప్ట్ చేశాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో జమైన పైవర్గాల పెట్టుబడులు ఎన్నివేల, వందల కోట్లు అవినీతితో సంపాదించినా అందులో కొంత తిరుపతి వెంకన్నకు ముట్టజెప్పుతే పాప పరిహారం జరుగుతుందని నమ్ముతున్నారు. యూరో-అమెరికన్ దేశాల్లో డబ్బు, బంగారం, వెంట్రుకలతో దైవ దయను కొనొచ్చు అనే ఆలోచన ఉండదు. అందుకు భిన్నంగా అటువంటి వనరులు లేని మానవుల కోసం తమ ఆదాయంలోని కొంత భాగాన్ని ఖర్చు చేస్తే దేవుడు క్షమిస్తాడని బలమైన నమ్మకాన్ని అక్కడి మోరల్ ఫిలాసఫర్స్ కలిగించారు. అందులో మొదటివాడు జీసస్. ఆ సాంప్రదాయం నుంచి ఆడమ్ స్మిత్ లాంటి వాళ్ళు వచ్చారు. 



ఆ కోవకు చెందినవారుగా మనదేశంలో బుద్ధుడు, మహాత్మా ఫూలే, అంబేద్కర్‌లను చెప్పుకోవచ్చు. వీరిపైన మన పెట్టుబడిదారులెవరికీ నమ్మకం లేదు. ఎందుకు? బుద్ధుడు తానే ఒక బలమైన మోరల్ దేవుడయ్యాడు, ఫూలే, అంబేద్కర్లు ఆయన అనుచరులయ్యారు. ఇక్కడ క్యాపిటల్ ఇమ్మోరల్‌గా రూపొందడానికి మరో మూలం కులం. హైదరాబాద్‌లోని కాంట్రాక్ట్ క్యాపిటల్ ఒక కులం చేతిలో ఉంటే, సినిమా క్యాపిటల్ మరో కులం చేతిలో ఉంటుంది. కుల వ్యవస్థ ముందు తనను తాను వ్యక్తిగా చూసుకోమంటుంది. ఆ తరువాత తన కుటుంబం, ఆ తరువాత కులం. ఇక్కడ డబ్బు, బంగారం తీసుకునే దేవునికి కులముంది. అక్రమ ఆదాయాలు కూడా పై కులాల్లో పంచబడుతాయి. కాని కింది కులాల్లోకి రావు. మన పెట్టుబడిదారులు తమ కుటుంబం తరతరాలు ఆస్తితో బతకాలనుకుంటారు. అందులో ఎంతో కొంత పంచాలనుకుంటే తన కులానికి మాత్రమే పంచుతారు. అట్టడుగు ప్రజలు శ్రమ ఎక్కువ చెయ్యాలి తక్కువ తినాలనుకుంటారు. 



ఇటువంటి దైవ భీతిలేని సంపాదనలో ప్రాంతీయ తగువులొచ్చినప్పుడు 'మహాభారత యుద్ధం' చేయించి ప్రజలందర్నీ చావుకు గురిచేసైనా పైకులాల మధ్య అక్రమ ఆస్తుల, వనరుల పంపిణీ తమ మధ్యే చేసుకోవాలి. ఆ విధమైన పంపిణీ ఏర్పాటే ఈ పోలవరం టెండర్. ఆంధ్ర పెట్టుబడిదారులు అవినీతిపరులు, వారికి భిన్నమైన మోరల్ విలువలు గలిగిన పెట్టుబడిదారులు తెలంగాణలో పుట్టాలా వద్దా అన్నది కాదు చర్చ. మీ తరహా పెట్టుబడుల్లో మా వాటా ఎంత అన్నది చర్చ. ఇక్కడ పైసలకు ప్రాంతాన్నే అమ్మే పార్టీ పుట్టినట్లు, దేవునికి ప్రాజెక్టునమ్మే పెట్టుబడిదారులు పుడితే ఎంత ప్రమాదం? తెలంగాణ నుంచి లక్ష్మీరాజం పెద్ద కాంట్రాక్టర్ అకస్మాత్తుగా పోలవరం ప్రాజెక్టుని తన పొట్టలో వేసుకున్నాడని వింటున్నాం. అతనే తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పత్రిక నడుపుతున్నాడని వింటున్నాం. ఆయనెవరని ఆరా తీస్తే, ఆయన పాములపర్తి వారి పాత బంధువని తేలింది. 



కాంట్రాక్ట్ కుదిరిందెప్పుడు? సకలజనులు సమ్మెలో చస్తున్నప్పుడు... పసిపిల్లల జీవితాలు, రైతుల పంటలు, ప్యూన్‌ల బిడ్డల జీవితాలు ఎక్కడ తాకట్టు పెట్టబడ్డాయో ఒక్క తిరుపతి వెంకన్నకే ఎరుక. ఎప్పుడూ పాలన అనుభవం లేని వెలమ కులం నుండి ఒక అద్భుతమైన పాలక కుటుంబం పుట్టుకొస్తున్నట్లు ఇక్కడి పూజారి వరంలోంచి ఇంత పెద్ద కాంట్రాక్ట్ పెట్టుబడిదారులు పుట్టుకొస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పుట్టుకలోనే ప్రాజెక్టు కట్టడానికెంత డబ్బుపోద్దో, అక్కడి ఆదివాసుల కడుపు కొట్టడానికి ఎంతపోద్దో, తమ సంస్కృతిని, ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎంత స్వాహా చెయ్యబడుద్దో, తిరుపతి వెంకన్న (సమ్మక్క, సారక్క కాదు) హుండీ కెంత పోద్దో మనం లెక్కేసి చెప్పొచ్చు. ఈ తెలంగాణ పెట్టుబడిదారుడూ, హైదరాబాదు అవినీతి పెట్టుబడిలోనే కట్టడాలు కట్టకుండా కాంట్రాక్టరుగా ఎదిగాడు. ఇక్కడి భూస్వామ్య విలువల్లో "ఏదొడ్లో కడితేనేమి మనదొడ్లో ఈనుతే చాలు'' అనే సంస్కృతిలో భాగంగా ఇక్కడి రాజకీయ నాయకత్వం పత్రికారంగాన్ని ఆయన పడకగది నుండి ప్రారంభించింది. 



ఆనాడు బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి యస్.ఆర్.సి ఇచ్చిన గడువు రాకముందే అడ్డగోలుగా తెలంగాణను అమ్మేసారు. ఇప్పుడో అయ్యవారు, దొరవారు అడవి బిడ్డల ఆస్తైన పోలవరాన్ని అమ్మేసి ఇమ్మోరల్ క్యాపిటల్‌తో ఇండ్లు కట్టబోతున్నారు. ఇప్పుడు ఎటుచూసినా తెలంగాణ రాకముందు మొరాలిటీ గురించి చర్చ ఎందుకనే వారే, మొరాలిటీ గురించి మాట్లాడేవారిని ఎంత తిడితే అంత రేటు పెరుగుద్ది. బ్రాహ్మణ కాంట్రాక్టు పెట్టుబడి, వెలమ రాజకీయ వసూళ్ళు, రెడ్ల ఉద్యమ వసూళ్ళు, చుట్టూ దళిత బహుజన సైన్యం ఇప్పుడెవరి మీదనైనా ఉద్యమం చెయ్యవచ్చు. 



ఆడమ్‌స్మిత్‌నో, అంబేద్కర్‌లనో చదవమంటే నాలుకలు కోయించే నీతిని నిండా పులుముకొని, పైసలు, కలం, కాగితం చేతికిస్తే ఏ చదువు లేకుండా తిట్లు రాసే హనుమంతులూ దొరుకుతారు. తెలంగాణ కాస్త నీతిమంతమైన పెట్టుబడితో ఎదగాలంటే డిజైన్ మార్చిన పోలవరం నైనా ఎవరికి కాంట్రాక్ట్ కివ్వాలి? ఆ ప్రాజెక్టు ఆదివాసుల భూముల్ని ముంచుతుంది. ఆ ఆదివాసులకు తెలంగాణలోని అగ్రకులాల కంటే బిసి, ఎస్‌సిల కంటే తెలివి ఎక్కువే వుంది. వారే ఒక కన్‌సోర్టియమ్‌గా రూపొంది కాంట్రాక్టు పట్టుకునే హక్కు అడగొచ్చు. ఆ ప్రజలు 'మన్యసీమ' అడుగుతున్నారని మండిపడే ఈ వసూలు ఉద్యమ దారులకూ, రాజకీయ నాయకులకూ వారి తాబేదార్లకు వారి ప్రాంతంలో కాంట్రాక్టు పట్టే హక్కు ఎక్కడ వుంది? ఈ మధ్య కాలంలోనే అన్ని రకాల ప్రభుత్వ వనరులలో కాంట్రాక్టు వనరుతో సహా 4 శాతం దళితులకివ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. అందులో ఆదివాసుల ఊసు లేదు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల డబ్బంతా అసలు కట్టుబడులు లేకుండా తిన్నారే! ఒక్క ప్రాజెక్టు కాంట్రాక్ట్‌లో ఆదివాసులు కొంత తింటే తప్పేంటో చెప్పండి. 



తెలంగాణలో ఇప్పుడు విచిత్ర గాంధీలు పుట్టారు. వసూళ్ళు చేసో, కాంట్రాక్ట్ డబ్బులు కట్టలు కట్టలు తిని, తెలంగాణ కోసం 'నిరాహారదీక్ష' హాస్పిటల్‌లో చేసి బతికున్న అమరులౌతున్నారు! ఆంధ్ర పెట్టుబడి అవినీతిమయమై తిరుపతి ఎంకన్న చుట్టూ బట్టలిప్పుకొని బొర్లుతే తెలంగాణ పెట్టుబడి ఏం చేయాలి? భద్రాచలం రాముని చుట్టూ కూడా కాదు, ఆ తిరుపతి ఎంకన్న చుట్టే తిరగాలి. దోపిడీకి, రక్షణనిచ్చే దేవతలకు సరిహద్దులుండవు కదా! హైదరాబాద్ క్యాపిటల్ ఇప్పుడు పాపకూపంలో కొట్టుమిట్టాడుతుంది. 'ఒంటెలాంటి పెద్ద జంతువైనా సూది రంధ్రం నుంచి దూరిపోయి స్వర్గం చేరుతుంది కాని అక్రమంగా సంపాదించిన ధనవంతు డు దేవుని రాజ్యంలో అడుగుపెట్టలేడని' జీసస్ చెప్పారు. 



హైదరాబాద్‌లో ఇప్పుడు జమయ్యే పెట్టుబడిదారులంతా ఆ కోవకు చెందినవారే! మొత్తం జలసంబంధ కాంట్రాక్టులన్నీ డబ్బుకొల్లగొట్టే డీల్స్‌గా మారాయి. జలయజ్ఞం పేరుతో మొదలైన పైసల యజ్ఞం మరీ ప్రమాదకరంగా మారింది. నీతిని దేవుడు కూడ కాపాడలేని సమాజ విలువలతో బీదప్రజల జీవితాలను ప్రాంతమేదైనా మార్చడం అసంభవం. ప్రభుత్వ రంగంలోనూ, జుడిషియరీలోనూ, నీతికి, న్యాయానికి ప్రజాస్వామిక విభాగాల్ని, సంస్థల్ని పటిష్ట పర్చాలి. లాభాలు చట్టపరమైనవిగా, పన్ను వ్యవస్థకు లోబడి ప్రజల మధ్య పంపిణీ చెయ్యబడేవిగా ఉండాలి. హైదరాబాదు పెట్టుబడిదారుల అన్యాయపు విలువల వల్ల బీదప్రజల కోసం స్కూళ్ళు, హాస్పిటల్స్, హాస్టల్స్ నిర్మించిన దాఖలాలు ఎక్కడా లేవు. 



ఏ ప్రాంతమైనా వెనుకబడి ఉండడానికి దాని విద్యా వెనుకబాటుతనం ముఖ్య కారణం. ఒక ప్రాంతాన్ని మారుస్తామని ముందుకొచ్చి, ఉద్యమాలు నడిపే క్రమంలోనే కొల్లగొట్టే విలువలని పెంచి పోషిస్తే ఏ సమాజమైనా ఎలా బాగుపడుతుంది? సిబిఐ వంటి సంస్థలు, కోర్టులు కాంట్రాక్టు పద్ధతులు, జమ, ఖర్చు విషయంలో కూ డ పరిశోధనలు జరపాల్సిన అవసరముంది. అయితే ఈ సమాజమే 'దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే' సమాజం కనుక లోక్‌పాల్ వం టి బలమైన యాంటి-కరప్షన్ సంస్థల్ని, లోకాయుక్త వంటి రాష్ట్ర స్థాయి సంస్థల్ని విస్తృత అధికారాలతో ఏర్పర్చాలి. సీమాంధ్ర అగ్రకుల ఇమ్మోరాలిటీని తెలంగాణ ఇమ్మోరాలిటీతో మార్చలేము కనుక పెట్టుబడికి, డ బ్బు సమీకరణకు మోరల్ చెక్స్ చాలా పెట్టాల్సివుంది. ఏ మోరాలిటీ లే ని పాలకులు ఎక్కడి వారైనా మునిగేది శ్రమ జీవులే. అందుకే ఆపండి పోలవరం కాంట్రాక్టుని. దానిపై ఆదివాసులదే హక్కుఅని గుర్తించండి.
- కంచ ఐలయ్య    Andhra Jyothi News Paper Dated 12/11/2011

No comments:

Post a Comment