Friday, November 4, 2011

ప్రయోజనం లేని పోలవరం By మైపతి అరుణ్ కుమార్



ఏ ప్రాంతానికీ ఉపయోగపడని ప్రాజెక్టు పోలవరం. సీమాంధ్ర విద్యార్థి, లాయర్ల జెఏసీలు ఈ ప్రాజెక్టుపై అధ్యయనాలు చేసి వాస్తవాలను నిర్ధారించుకోవాలి. పోలవరం నిర్మాణాన్ని నిలిపివేయాలని ఈ నెల 22 నుంచి ప్రారంభమవనున్న రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో 'గిరిజన సలహా మండలి' తీర్మానించాలి. పోలవరం వ్యతిరేక ఉద్యమం తమ బాధ్యత అనే వాస్తవాన్ని ఆదివాసీలు గుర్తించాలి.

పోలవరం (ఇందిరాసాగర్) ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి జెఏసి, ఆదివాసి విద్యార్థి సంఘం నాలుగు రోజుల పాటు బస్సుయాత్ర 'చలో పోలవరం' నిర్వహించాయి. సీమాంధ్ర విద్యార్థి, లాయర్ల జెఏసిలు ఈ యాత్రను అడ్డుకుంటామని ప్రకటించాయి; జీలుగుమిల్లు వద్ద వందలాది పోలీసులు ఆ యాత్రను అడ్డుకొని యాత్రికులను అరెస్టు చేశారు. పోలవరం టెండర్ల విషయమై రాజకీయ పార్టీలు పోట్లాడుకొంటున్నాయి. ప్రాజెక్టు కట్టాల్సిందేనని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు పోలవరంతో నిజంగా లబ్ధి పొందేది ఎవరు?

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 276, ఒడిషాలో 16, ఛత్తీస్‌గఢ్‌లో 14 గ్రామాలు ముంపుకు గురవుతాయి. రెండు లక్షలమంది ఆదివాసీ, ఆదివాసేతరులు నిర్వాసితులవుతారు. 1.20 లక్షల ఎకరాల సాగుభూమి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చెబుతోంది. 2006 ఆగస్టు 7న రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రం వెల్లడించిన వాస్తవం - ఆ రోజున వరదల మూలంగా 369 గ్రామాలు నీట మునిగిపోవటం.

డ్యాం నిర్మించకముందే, 28.50 లక్షల క్యూసెక్కుల వరద నీటికే పరిస్థితి ఇలా ఉంటే డ్యాం నిర్మాణం అనంతరం సంభవించగల ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో అంచనా వేయవచ్చు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఆదిమ తెగల ఉనికి సంప్రదాయాలు, సామూహిక జీవనం, అస్తిత్వం, ఆత్మగౌరవం సర్వనాశనమవుతాయి. 402 చారిత్రక కట్టడాలు, సుందరమైన పాపికొండలు ధ్వంసమవుతాయి; చిరుత పులులు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకలు ఇత్యాది వన్యప్రాణులు నశించిపోయే ప్రమాదముంది. విలువైన వనమూలికలు, భద్రాచల రామాలయం, 44 వేల రిజర్వు అడవులు నాశనమవుతాయి.

1980 ఏప్రిల్ 2న మధ్యప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య పోలవరం విషయమై ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల నీటిని నిలువ చేసే విధంగా పోలవరం డ్యాంను డిజైన్ చేశారు. 2006 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిల్వ సామర్థ్యాన్ని 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు మార్చింది; డ్యాం స్పిల్‌వేలోనూ మార్పులు చేయడం జరిగింది. పెరిగే ముంపు ప్రాంతాల నిర్ధారణ గానీ, కోబ్రా ఆపరేషన్ రూల్స్‌గాని, 50 లక్షల క్యూసెక్కులకు సరిపడ డిజైన్ గాని చేయలేదు. దీనిపై కేంద్రంగాని, రాష్ట్రంగాని చర్య తీసుకోలేదు.

డ్యాం తెగితే పరిస్థితి ఏమిటి? కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూర్కీలో ఉన్న 'జాతీయ నీటి వనరుల సంస్థ' ఇంజనీర్లచే పోలవరం విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయనాన్ని చేయించింది. ఆ నిపుణులు 1999 జూన్‌లో సమర్పించిన నివేదిక ప్రకారం పోలవరం డ్యాం బద్దలైతే పది గంటల వ్యవధిలో రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాలలో యాభై లక్షల క్యూసెక్కుల నీరు ఉంటుంది.

వరద మట్టం 20 మీటర్లు ఉండి ఆ ప్రాంతాలన్నీ జలసమాధి అవుతాయి. రూర్కీ నిపుణులు ఉపయోగించిన కంప్యూటర్ మోడల్ అంచనాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించి అదనపు అంచనాలు వేయటం వలన డ్యాం బద్దలైన 10 నుంచి 11 గంటలలోపు వరదలు తణుకు, రావులపాలెం, మండపేటలను ముంచెత్తుతాయని, మరో రెండు మూడు గంటల తరువాత నర్సాపూర్, అమలాపురం, ముమ్మడివరం ప్రాంతాలను ముంచెత్తుతుందని నిర్ధారణ అయింది. దాదాపు కొల్లేరు సరస్సు నుంచి కోరంగి మధ్య ప్రాంతాలలో ఉన్న వందలాది పల్లెటూర్లతో పాటు భీమవరం, పాలకొల్లు, రాజోలు, మండపేట, రామచంద్రాపురం, రాజమండ్రి తదితర పట్టణాలతో సహా 45 లక్షల మందిని జల సమాధికి గురిచేస్తుందని పేర్కొంది.

ఇందులో ఐదు పట్టణాలు, 25 మండలాలు జల సమాధి అవుతాయి. ఇంతకూ ఈ ప్రాజెక్టు వల్ల లాభపడేది ఎవరు? ఉన్నత వర్గాలా? అణగారిన వర్గాలా? రాజకీయ నాయకులా? అనేది పరిశీలిద్దాం. 7.20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, 965 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, 80 టిఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు, 23 టిఎంసీల నీటిని విశాఖ నగరానికి తరలించడం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇవి కాకి లెక్కలనే చెప్పవచ్చు. ఎందుకని? ఇప్పటికే పోల వరం ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తామని చెబుతున్న 7.20 లక్షల ఎకరాలలో ఏలేరు, తోడిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా 5.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతూనే ఉంది.

కేవలం తాడిపూడి పుష్కర ఆయకట్టు ద్వారానే 3.92 లక్షల ఎకరాలు తడుస్తుండగా, ఈ ప్రాజెక్టు వలన నష్టపోయేది 1.85 లక్షల ఎకరాల (1.20 ఎకరాలు పోలవరం రిజర్వాయర్, 35వేల ఎకరాలు కాలువ తవ్వకం, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కోసం మరో 30వేల ఎకరాలు) ఎక్కువ ఆయకట్టు, అధిక లెక్కలు చూపిస్తూ ప్రజల ధనాన్ని దుర్వినియోగం మాత్రం చేస్తున్నారనేది స్పష్టం. 965 మెగావాట్ల విద్యుత్‌ను అందించే ఈ ప్రాజెక్టు కేవలం కృష్ణా డెల్టా సంపన్నులకు మూడో పంట కోసం, కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు విస్తరించి ఉన్న పారిశ్రామిక కారిడార్ కొరకు నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టు కట్టి నీటిని విద్యుత్‌ను తీసుకెళ్ళే ప్రభుత్వం విశాఖలో బాక్సైట్ త్రవ్వి ఆదిమ తెగలను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది.

ప్రజలకు ఉపయోగపడని పోలవరం నిర్మాణం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆదివాసీలకు చుక్కనీరులేక తాగడానికి అల్లాడుతుంటే భూములు బీడులుగా మారిపోతుంటే ఎక్కడో ఉన్న విశాఖకు నీటిని ఎందుకు తరలిస్తున్నారు? విశాఖలో ఏర్పాటు చేసే ప్రత్యేక పారిశ్రామిక మండలి కోసం కేటాయించటానికేనని స్పష్టంగా చెప్పవచ్చు. పోలవరం పూర్తయితే తప్ప అక్కడికి నీరందే పరిస్థితిలేదు. విశాఖ పారిశ్రామిక విస్తరణలో భాగంగా ఏర్పాటవనున్న సెజ్‌తో పాటు ఫార్మా సిటీ, గంగవరం పోర్టు, మెగా కెమికల్ కాంప్లెక్సు, బ్రాండిక్స్, హెచ్‌పిసిఎల్ విస్తరణ, ఐటి ప్రాజెక్టులు మొదలైన వాటికి పోలవరం నుంచే నీరు రావాలి. అందుకే ఈ శక్తులన్నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. అదే విధంగా కాకినాడ సముద్రతీరంపై బహుళజాతి సంస్థల కన్నుపడింది.

భారత రాజ్యాంగం ప్రకారం ఒక షెడ్యూల్డు గ్రామానికి ఆ హోదాను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. పోలవరం వలన 276 గ్రామాలు ముంపుకు గురవనుండగా అందులో 274 గ్రామాలు షెడ్యూల్డు హోదా గలవే. మరి వీటిని ముంపుకు గురిచేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? పంచాయతీరాజ్ చట్టం (1988) ప్రకారం షెడ్యూల్డు ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించాలంటే ముందుగా గ్రామ సభలను సంప్రదించాలి.

వాటి అనుమతి తప్పనిసరి. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అటవీహక్కుల చట్టం (2006) అనేక అంశాలపై ఆదివాసీలకు సాముదాయక హక్కు ఉంది. జాతీయ గిరిజన ముసాయిదా చట్టం(2006) ప్రకారం యాభైవేల కంటే ఎక్కువ జనాభా నిర్వాసితులు అయితే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకూడదు. పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం గిరిజనులకు, పేదలకు, పర్యావరణానికి హాని జరగకుండ శాస్త్రీయ అధ్యయనం జరగాలి.

ఇన్ని చట్టాలను ఉల్లంఘించి రాజ్యాంగ విరుద్ధంగా పాలకులు నేడు ఈ ప్రాజెక్టులను నిర్మించాలని చూస్తున్నారు. వ్యతిరేకించాల్సిన రాజకీయపార్టీలు టెండర్లు మాకు దక్కలేదంటే మాకు దక్కలేదని కొట్టుకొంటున్నాయి! అసలు మన ప్రభుత్వ పాలన, రాజకీయపక్షాల విధానాలు ఎటు పయనిస్తున్నాయి? ప్రజాస్వామ్యం వైపా? అప్రజాస్వామ్యం వైపా? అనేది స్పష్టం కావాలి.

ఏ ప్రాంతానికీ ఉపయోగపడని ప్రాజెక్టు పోలవరం. సీమాంధ్ర విద్యార్థి, లాయర్ల జెఏసీలు ఈ ప్రాజెక్టుపై అధ్యయనాలు చేసి వాస్తవాలను నిర్ధారించుకోవాలి. న్యాయాన్ని కాపాడవల్సిన న్యాయవాదులు పోలవరాన్ని నిర్మించాలనడం న్యాయమా? దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులు ఆదివాసీలను సమాధి చేయాలని చూడటం సమంజసమా? లాయర్లు, విద్యార్థులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. నీటి నుంచి చేపను వేరుచేస్తే ఎంత ప్రమాదమో అడవి నుంచి ఆదివాసీలను వేరుచేస్తే కూడా అంత ప్రమాదం అనేది గుర్తించాలి. పోలవరం వ్యతిరేక పోరాటం న్యాయమైనది. అందుకే ప్రజాస్వామిక వాదులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు ఈ పోరాటానికి మద్దతు తెలపాలి. ఈ పోరాటం ప్రాంతీయ విభేదాలతో కూడుకున్నది కాదు. పేద ప్రజలను రక్షించే ఉద్యమం.

ఆదివాసీ సంఘాలు ఏకమై తుడుం మోగించాలి. ఏజెన్సీలోని రాజకీయ పార్టీలను నిలదీయాలి. గిరిజన శాసన సభ్యులు, ఎంపీలు, మంత్రులు 'గిరిజన సలహా మండలి'ని నిలదీయాలి. ఈ నెల 22 నుంచి జరిగే రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈ సలహా మండలి పోలవరం నిర్మాణాన్ని నిలిపివేయాలని తీర్మానించాలి. మాట్లాడని పక్షంలో వీరిని కులతప్పు క్రింద కుల బహిష్కరణ చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతులకు విలువనివ్వని ప్రభుత్వ పాలన వ్యవస్థను స్తంభింప చేయాలి. పోలవరం వ్యతిరేక ఉద్యమం తమ బాధ్యత అనే వాస్తవాన్ని ఆదివాసీలు గుర్తించాలి.

- మైపతి అరుణ్ కుమార్
ఆదివాసి విద్యార్థి సంఘం (తుడుం దెబ్బ)   Andhra Jyothi Dated 05/11/2011

No comments:

Post a Comment