Monday, December 31, 2012

అగ్రకులతత్వంతో అధ్యాపక స్పందన - డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్



ఉస్మానియా యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదు? అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి. 

భ్రష్ఠత్వానికి పరాకాష్ట (డిసెంబర్ 20, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయునిపై ఒక విద్యార్థి దాడిచేసిన విషయాన్ని ఖండిస్తూ అఖిలేశ్వరి గారు చర్చను లేవనెత్తారు. ఆ వ్యాసంలో లేవనెత్తిన విషయాన్ని కాస్త సీరియస్‌గా పరిశీలిస్తే ఆ వ్యాసకర్తలో ఎక్కడో ఒక దగ్గర అగ్రకుల భావజాలం పనిచేసిందనేది స్పష్టమౌతుంది. ఎందుకంటే మొన్న విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనను వ్యాసకర్త ఖండిస్తూ పరుషమైన పదజాలంతో విమర్శిస్తూ ఒక వర్గం విద్యార్థులపై విరుచుకపడి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'మన కళ్లముందే జరుగుతున్న విషాదానికి మనమందరమూ బాధ్యత వహించాలని, ఇది యావత్ సమాజాన్ని దిగజారుస్తోంది, సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని' ఆవేదన వ్యకం చేశారు. సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేసే స్థాయిలో ఆ ఘటన జరిగిందా అనేది సీరియస్‌గా చర్చించాలి. నిజానికి ఉపాధ్యాయునిపై దాడి జరగడానికి కారణాలు ఏమిటనేది ఆలోచించకుండా చర్చలు లేవనెత్తితే విషయం పక్కదారి పట్టి, ఒక వర్గం విద్యార్థులను అపార్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. అఖిలేశ్వరి గారి చర్చ అలాగే ఉంది. మొన్న విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిపై జరిగిన దాడిని అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఖండించారు. దాడికి పాల్పడిన అలెగ్జాండర్ అనే విద్యార్థి వైస్ ఛాన్స్‌లర్ ముందే ఆ ఉపాధ్యాయునికి క్షమాపణలు కూడా చెప్పాడు. తను ఏ బలహీన క్షణంలో దాడికి పాల్పడిందీ వివరించాడు.

గతంలో తన సోదరి స్నేహితురాలు ఉపాధ్యాయుని వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుర్తొచ్చి తాను భావోద్వేగానికి గురయ్యానని వివరించాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. ఇంత జరిగాక తన తప్పును ఒప్పుకున్న విద్యార్థిని పెద్దమనసుతో క్షమించాల్సిన ఉపాధ్యాయులు ర్యాలీలు తీస్తూ, మీడియాకు ఎక్కుతూ, ఈ దాడులకంతటికీ ఒక వర్గం విద్యార్థులే కారణం అంటూ దుష్ప్రచారం చేయడం ఆ వర్గాల విద్యార్థులను అవమానించడమే అవుతుంది. నిజానికి దాడికి పాల్పడిన విద్యార్థికి కానీ, ఆ ఘటన సందర్భంగా అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ గతంలో ఉపాధ్యాయులను వేధించిన చరిత్ర కానీ, దాడులు చేసిన చరిత్రకానీ లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత దాడికి గురైన అధ్యాపకుడు, నాపై దాడికి పాల్పడిన విద్యార్థి క్షమాపణలు చెప్పడం, అరెస్టు కావడం జరిగింది కనుక ఇంతటితో నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నానని చెప్పాడు. యూనివర్సిటీలోని మెజారిటీ అధ్యాపకులు కూడా ఈ విషయాన్ని ప్రొఫెసర్, విద్యార్థులు కూర్చొని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలని కూడా సూచిస్తున్నారు. కానీ తమ స్వప్రయోజనాలను రక్షించుకొనేందుకు ఔటా నాయకులు ఆ దాడిని ఒక సాకుగా తీసుకొని అగ్రవర్ణ భావజాలంతో ర్యాలీలు తీస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య వైషమ్యాలు పెంచి తమ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు.

అయితే గతంలో ఇదే విశ్వవిద్యాలయంలో కొందరు ప్రొఫెసర్స్‌పై విద్యార్థులు దాడులకు పాల్పడిన సంఘటనలపై ఈ అధ్యాపకులుగానీ, ఉపాధ్యాయ సంఘం(ఔటా)గానీ స్పందించిన తీరును కూడా చర్చించాలి. మరికొద్ది సంవత్సరాల్లో ప్రథమ శతాబ్దిని పూర్తిచేసుకోబోతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేకమంది బడుగు, బలహీన వర్గాల ఉపాధ్యాయులు ఒక అగ్రవర్ణ విద్యార్థి సంఘం చేతిలో అనేక అవమానాలు, దాడులకు గురయ్యారు. గతంలో ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఒక ప్రొఫెసర్‌పై అగ్రవర్ణ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు దాడిచేసి ఆయనను గాయపరచడం జరిగింది. అంతేకాకుండా ఆ ప్రొఫెసర్ భార్యను, కూతురును అవమానిస్తూ కావేరి హాస్టల్ గోడలపై రాతలు రాశారు. ఆయన తోటి ఉపాధ్యాయుల దగ్గర తన బాధను, తనకు జరిగిన అవమానాన్ని వివరించాడు. కానీ ఆ ప్రొఫెసర్‌కు ఏనాడూ ఉపాధ్యాయ సంఘం (ఔటా) మద్దతు తెలుపలేదు. ర్యాలీలు తీయలేదు. దాడికి పాల్పడి, అవమానించిన విద్యార్థి సంఘంపై చర్యతీసుకోలేదు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో చీఫ్ వార్డన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కేశవులును అగ్రవర్ణ విద్యార్థి సంఘం తమ కార్యక్రమాల కోసం చందాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అందుకు అంగీకరించని ప్రొఫెసర్‌పై ఆ విద్యార్థి సంఘ నాయకులు ఆయనపై 'సాంబారు' పోసి కొట్టి, అవమానించారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ప్రొఫెసర్ కేశవులు ఆనాడు ధర్నా నిర్వహించారు, బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని వీసీకి మొరపెట్టుకున్నారు. ఒక ఎస్సీ ప్రొఫెసర్‌పై దాడులకు పాల్పడిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని యూనివర్సిటీలో వామపక్ష, ఎస్టీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఆనాటి వీసీ కానీ ఔటా కానీ చర్య తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. ఇదే యూనివర్సిటీలో లా కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న గిరిజన ప్రొఫెసర్ పంతునాయక్‌ను ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు చెప్పులతో కొట్టి, అవమానించినా ఏనాడూ కనీసం ఔటా నాయకులు ఖండించనూలేదు. మైనారిటీ వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్ తన విద్యార్థినితో క్లాస్ రూంలో సబ్జెక్ట్ విషయమై చర్చిస్తుంటే ఇదే మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు ఉపాధ్యాయునికి, విద్యార్థికి మధ్య లైంగిక సంబంధాన్ని అంటగట్టి అవమానించి కొట్టడం జరిగింది.

మొన్నటికి మొన్న ఆర్ట్స్ కాలేజీలో ఏబీవీపీకి చెందిన ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే మందలించిన లేడీ ప్రొఫెసర్‌ను ఆ విద్యార్థి దుర్భాషలాడి, అవమానిస్తే ఆ ప్రొఫెసర్ ఎగ్జామ్ హాల్ నుంచి ఏడ్చుకుంటూ నిష్క్రమించింది. ఇలాంటి ఘటనలు విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లలో అనేకం జరిగినప్పటికీ ఏనాడూ ఖండించని ఔటా నాయకులు, అధికారులు మొన్న జరిగిన ఘటనను మాత్రం పెద్దది చేసి ఒక వర్గం విద్యార్థులను శత్రువులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే మేము యూనివర్సిటీ అధికారులను, ఔటా నాయకులను ప్రశ్నిస్తున్నాము. యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదో వివరించాలి. అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి.

అనేక సందర్భాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధ్యాపకులు దాడులకు గురైతే ఈ ఔటా నాయకులు ఎందుకు ర్యాలీలు తీయలేదో, మానవహక్కుల కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదో వివరించాలి. దాడులకు గురైన ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఏనాడూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని రిజిష్టార్ ఇవాళ ఎస్సీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి అగ్రవర్ణ ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే యూనివర్సిటీ అధికారులంతా ఆగమేఘాలమీద స్పందించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే యూనివర్సిటీ అధికారుల నిజస్వరూపం, అగ్రవర్ణ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెసర్లపై జరిగిన దాడికి ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పి, పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోయినప్పటికీ ఔటా నాయకులు ఆ విషయాన్ని అంతటితో వదిలి పెట్టకుండా మానవహక్కుల సంఘాన్ని, గవర్నర్‌ను కలుస్తూ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టిస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగిన ఆ ఘటనను ఖండిస్తూనే కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులతో, ప్రిన్సిపాల్‌తో చర్చించి, యూనివర్సిటీలో సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. ఔటా నాయకులు మాత్రం విద్యార్థుల ప్రతిపాదనను తోసిపుచ్చుతూ విషయాన్ని మరింత జఠిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

యూనివర్సిటీలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్యవర్తిత్వం వహించాల్సిన ఉపాధ్యాయులు, బాధ్యత కలిగిన అఖిలేశ్వరి లాంటి వ్యక్తులు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకుండా దానిని ఇంకా జటిలం చేస్తే ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయో ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులను సన్నిహితంగా గమనిస్తున్న అఖిలేశ్వరి గారు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడిచేయడం, పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడిచేయడం కంటే తక్కువేమీ కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక విద్యార్థి భావోద్వేగానికిలోనై ఒక ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే ఆ ఘటనను ఉగ్రవాద చర్యతో పోల్చడం ఏవిధంగా సరైనదో అఖిలేశ్వరిగారే విజ్ఞతతో ఆలోచించుకోవాలి. సమాజం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపంచి, పరిష్కారాన్ని కనుగొనాల్సిన బాధ్యత మేధావివర్గంపై ఉంటుంది. కానీ మేధావులుగా పిలవబడుతున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులు సమస్యను జటిలం చేస్తూ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే దీనిద్వారా ఎవరి ప్రయోజనాలు నేరవేరుతాయో విజ్ఞులే ఆలోచించాలి.

- డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్
రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం

Andhra Jyothi New Year 1/1/2013 

Thursday, December 27, 2012

రాజకీయ పార్టీలకు సొంత చానళ్ళు అవసరమా? --Thota Bhava Narayana



కొత్త చానళ్ళకోసం మొదలైన హడావిడి
సొంత చానళ్ళకోసం పార్టీల ఆరాటం 
మూడు చానెళ్ళలో కాంగ్రెస్‌ నేతల వాటాలు 
ఏర్పాట్లు ముమ్మరం చేసిన వామపక్షాలు 
తమిళనాట రాజకీయ చానళ్ళకు అంకురార్పణ 
కేరళ, కర్ణాటకలలోనూ ఇదే ధోరణి 
ప్రచారానికీ, ప్రతి విమర్శలకూ ఆయుధం 
నిష్పాక్షికత, ప్రభుత్వ వ్యతిరేకతలకే ఆదరణ 

politic
ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయ పార్టీలు తమకంటూ సొంత చానళ్ళు ఉండాలని గట్టిగా నమ్ముతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది కొత్త కాకపోయినా ఇప్పుడు తెలుగునాట మాత్రం ఈ ధోరణి ఒక్కసారిగా విజృంభించింది. ముఖ్యంగా 2014 ఎన్నికలు దగ్గరయ్యేకొద్దీ కొత్త చానళ్ళ ఏర్పాట్ల హడావిడి మొదలైంది. ఆ మాటకొస్తే, 2009 ఎన్నికలకు ముందుకూడా ఇలాంటి హడావిడి కనిపించినా అప్పట్లో కాంగ్రెస్‌ మాత్రమే తన వాదన బలంగా వినిపించటానికి తనకంటూ ఒక చానల్‌ అవసరమని భావించింది. నిష్పాక్షికమని చెప్పుకుంటూ మరికొన్ని చానళ్ళు వచ్చాయి. కానీ ఆ తరువాత వచ్చిన పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సాక్షి టీవీ ఆదర్శంగా మారింది. కనీసం మూడు చానళ్ళలో కాంగ్రెస్‌ ప్రముఖులు ఇటీవలికాలంలో వాటా తీసుకోగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు త్వరలో తమ తమ న్యూస్‌ చానళ్ళను ప్రజలకు అందించటానికి ఏర్పాట్లు వేగవంతం చేశాయి. మరోవైపు కాంగ్రెస్‌లో విలీనం కాకముందు పిఆర్‌పి నాయకులు కూడా కెసిటీవీ (కొణిదెల చిరంజీవి టీవీ?) పేరుతో లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసినా, విలీనం తరువాత పెండింగ్‌లో పడింది.

నిజానికి కాంగ్రెస్‌ పార్టీ తనకంటూ ఒక చానల్‌ ఉండాలనుకున్న ఆలోచన వచ్చిందే తడవుగా ధర్మాన అధ్యక్షతన ఒక కమిటీ వేసి మరీ ఆ అవసరాన్ని ధ్రువపరుచుకుంది. కేరళలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చానల్‌ ఎలా నడుస్తున్నదో తెలుసుకొని కూడా వచ్చాక ఎఐసిసి చేత కొంత పెట్టుబడి పెట్టించవచ్చునన్న ఊహాగానాలూ వచ్చాయి. అయిప్పటికీ ఆ తరువాత ఎందుకో తెలియదుగాని, ముఖ్య నేతలు ఎవరికి వాళ్ళు టీవీ రంగంలోకి దిగారు. తమ బంధువులు, అనుయాయుల ద్వారా చానళ్ళు నడపాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఒకటికి మూడు చానళ్ళు కాంగ్రెస్‌ పరమయ్యాయి. మొత్తానికి 2009 ఎన్నికలకూ, 2014 ఎన్నికలకూ చానళ్ళ విషయంలో ఇదొక చెప్పుకోదగిన మార్పు. ఎన్నికల సమయంలో ప్రకటనల రూపంలో కాకుండా డబ్బు తీసుకొని ప్రసారం చేసే పెయిడ్‌ ప్రోగ్రామ్స్‌ (సానుకూల ప్రచార కార్యక్రమాల) దెబ్బకు భయపడి సొంత చానళ్ళు ఉంటే బయటి చానళ్ళుకు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే జగన్‌ పార్టీ పట్ల ఆదరణ పెరగటానికి సాక్షి టీవీ కారణమనే అభిప్రాయంతో ఈ దారిపట్టారా అనేది నిర్దిష్ఠంగా చెప్పటం కుదరదు.

కానీ ఇప్పుడున్న చానళ్ళు తమకు, తమ వాదానికీ తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని మాత్రం రాజకీయ పార్టీలు అనుకున్నట్టున్నాయి.ఇంతకు ముందు రాజకీయ పార్టీలు తమ భావజాలానికి తగినంత ప్రాచుర్యం కల్పించాలనే ధ్యేయంతో పార్టీ పత్రికలు ప్రారంభించేవి. స్పష్టంగా అవి తమ పార్టీ పత్రికలని చెప్పుకునేవి. కానీ న్యూస్‌ చానళ్ళ విషయంలో మాత్రం పార్టీ పేరు నేరుగా చెప్పుకోవడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ధోరణి బాగా పెరిగిపోతోంది. ముందుగా తమిళనాట సన్‌ టీవీ విజయంతో జయలలిత కూడా సొంత చానల్‌ అవసరమనే నిర్ణయానికొచ్చారు. అలా శశికళ అన్న కుమారుడు భాస్కరన్‌ చేత జెజె టీవీ పేరుతో ఒక చానల్‌ పెట్టించినా, ఫెరా కేసుల్లో ఇరుక్కొని అది మూతబడింది. ఆ తరువాత అన్ని జాగ్రత్తలూ తీసుకొని జయ టీవీ ప్రారంభించారు. దానికి అనుబంధంగా న్యూస్‌ చానల్‌ మొదలెట్టారు. ఆ తరువాత మిగిలిన అన్ని పార్టీలూ చానళ్ళ మీద దృష్టిపెట్టాయి. పిఎంకె కోసం మక్కళ్‌ టీవీ, కాంగ్రెస్‌ కోసం తంగబాలు ఆధ్వర్యంలో మెగా టీవీ, కుమరి వసంతన్‌ ఆధ్వర్యంలో వసంత్‌ టీవీ, వైగో నాయకత్వంలోని ఎండిఎంకె కోసం ఇమయం టీవీ, డిఎండికె నాయకుడు విజయకాంత్‌ కోసం కెప్టెన్‌ టీవీ నడుస్తున్నాయి.

మారన్‌ సోదరులమీద అలిగినప్పుడు కరుణానిధి తనకంటూ మరొక చానల్‌ ఉండాలని కలైంజ్నర్‌ న్యూస్‌ చానల్‌ మొదలుపెట్టారు.ఇక కేరళ విషయానికొస్తే కాంగ్రెస్‌ పార్టీ కోసం రమేశ్‌ చెన్నితల ఆధ్వర్యంలో జైహింద్‌ టీవీ, సిపిఎం వారి కైరలి టీవీ ఉండగా, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిమ్‌ లీగ్‌ (ఐయుఎంఎల్‌) నాయకుడు, మాజీమంత్రి ఎంకె మునీర్‌కు ఇండియా విజన్‌లో భారీ వాటాలున్నాయి. కర్ణాటకలోనూ ఇదే ధోరణి సాగుతోంది. బిజెపి నుంచి గెలిచిన గాలి బ్రదర్స్‌ జనార్దన్‌, శ్రీరాములు కలిసి జనశ్రీ పేరుతో ఒక న్యూస్‌ చానల్‌ ప్రారంభించారు. దాన్నే ఇప్పుడు వాళ్ళు తాము కొత్తగా పెట్టుకున్న బిఎస్‌ఆర్‌ పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి గౌడ (జెడిఎస్‌) నడుపుతున్న ‘కస్తూరి న్యూస్‌’ను ఒకప్పుడు కాంగ్రెస్‌ నాయకుడు ప్రారంభించినా, ఇప్పుడు యెడ్యూరప్ప సన్నిహితుడు మురుగేష్‌ నిరాని నిర్వహణలో ఉన్న ‘సమయ న్యూస్‌’ ఆయా రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. 

ఇంతకీ రాజకీయపార్టీలు తమకు సొంత చానళ్ళు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాయి? ఇప్పుడున్న చానళ్ళు తగినంత ప్రచారం ఇవ్వడంలేదన్నది పైకి చెప్పుకుంటున్న ఒక కారణం. అది నిజమా? ఎవరు ఎంత ప్రచారం కోరుకుంటున్నారు? తగినంత అంటే ఎంత? దీనికి సరైన సమాధానం దొరకదు. మరో కారణం- ప్రత్యర్థులకు చానల్‌ ఉండటం. అవతలివాళ్ళకు చానల్‌ ఉండటం వలన ప్రయోజనం పొందుతున్నారనే అభిప్రాయం కలగటం. పార్టీ కార్యక్రమాలను, సిద్ధాంతాలను విరివిగా ప్రచారం చేసుకోవటానికి చానల్‌ పనికొస్తుందనేది మూడో కారణం. ఇంకో విధంగా చెప్పాలంటే తమమీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టటానికి ఒక సొంత చానల్‌ అవసరమని భావించటం. పార్టీ మీద వచ్చే విమర్శలకు సమాధానం ఏం చెప్పాలో, అవతలి వాళ్ళను ఎలా విమర్శించాలో తగిన ఆయుధాలు కార్యకర్తలకు అందించటం ద్వారా రచ్చబండల దగ్గర జరిగే చర్చోపచర్చల్లో తమ పార్టీ వాళ్ళ వాదన బాగా పదునెక్కటానికి చానల్‌ అందించే కార్యక్రమాలు పనికొస్తాయనే భావన నాలుగో కారణం.

వీటన్నిటికీ తోడుగా ఎన్నికల సమయంలో తమ పార్టీవాళ్ళ ప్రచారవ్యయంలో ఎక్కువభాగం తమ చానళ్ళకే వచ్చేట్టు చూసుకోవచ్చుననేది ఐదో కారణం.అయితే, కేవలం ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తే ప్రజలు ఆ చానల్‌ చూస్తారా? ముందుగా తమిళనాడు అనుభవాన్ని పరిశీలిద్దాం. డిఎంకెకి అనుకూలంగా ఉండే సన్‌ టీవీ వార్తలకున్న ప్రజాదరణను, అన్నా డిఎంకె అనుకూల జయ టీవీ వార్తలతో పోల్చిచూస్తే సన్‌ టీవీ లో పాతిక శాతాన్నిమించి జయ టీవీ ఏనాడూ రేటింగ్స్‌ తెచ్చుకోలేక పోయింది. పార్టీ కార్యకర్తలందరూ నిజంగా ఆయా చానళ్ళు చూస్తుంటే అది రేటింగ్స్‌లో ప్రతిఫలించాలికదా! అలాచూడటం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. పత్రికలకూ, టీవీకీ ఇక్కడే చాలా పెద్ద తేడా ఉంది.ఏదోవిధంగా నచ్చజెప్పి పత్రికకు చందా కట్టించవచ్చు. ముఖ్యంగా పార్టీ నాయకులచేత, కార్యకర్తల చేత. అలా చందాదారుల సంఖ్య పెంచుకొని సర్క్యులేషన్‌లో అది ప్రతిబింబించేలా చూసుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ నాయకులచేత, కార్యకర్తల చేత కాస్త మొహమాటపెట్టయినా చందా కట్టించవచ్చు. కానీ టీవీ విషయంలో అది సాధ్యంకాదు. బలవంతంగా టీవీ చూపించలేం. చేతిలో రిమోట్‌ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు చానల్‌ మారుస్తూనే ఉంటారు.

ఏ మాత్రం నచ్చకపోయినా, విసుగొచ్చినా క్షణాల్లో మరో చానల్‌కి వెళ్ళిపోవటం ఖాయం. అలాంటప్పుడు తన పార్టీ వాళ్ళ చానలా, ప్రత్యర్థిపార్టీ చానలా అనేది ఆలోచించరు. నిజంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ న్యూస్‌ చానల్‌ చూస్తున్నారని అనుకుంటే కచ్చితంగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లకూ, వాటి చానళ్ళు సంపాదించిన రేటింగ్స్‌కూ పోలిక ఉండాలి. కానీ ఎక్కడా అలా జరగటం లేదు.ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే, పరోక్షంగా ఒక పార్టీకి సాయపడేలా వ్యవహరించిన చానళ్ళు చాలా ఉన్నాయి. పనిగట్టుకొని ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చానళ్ళు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రయోజనం పొంది, అందుకు ప్రతిఫలంగా ఏదైనా ఒక నిర్దిష్ఠ సందర్భంలో సాయపడుతూ వస్తున్న చానళ్ళు కూడా ఉన్నాయని మనకు ఆయా సందర్భాల్లో అర్థమవుతూనే ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తనమీద, తన పార్టీ మీద కక్షగట్టాయని ఆరోపించి, పార్టీకి సొంత మీడియా అవసరమని నేరుగా ప్రకటించిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి సాక్షి పత్రిక, సాక్షి టీవీ ప్రారంభించి బాహా బాహీ తలపడాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీన్ని సమర్థించిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు జగన్‌ సొంతపార్టీ పెట్టుకున్న తరువాత అదే చానల్‌ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. 

కానీ ఆ చానల్‌ నిలదొక్కుకోవటమేగాక గడిచిన ఏడాదికాలంలో తెలుగు న్యూస్‌ చానళ్ళులో సగటున మూడో స్థానంలో నిలవటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. పార్టీ ఎదుగుదలకు సాక్షి టీవీ బాగా ఉపయోగపడిందనే అభిప్రాయమే ఈ రోజు కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీల నాయకులు కూడా సొంత చానళ్ళు పెట్టుకోవాలన్న నిర్ణయానికి రావటానికి కారణమైంది. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బలోపేతమవటానికి సాక్షి టీవీ కారణమా? సాక్షి టీవీ విజయానికి పార్టీ కారణమా? పార్టీ కార్యకర్తలవలన చానల్‌ విజయవంతమవుతోందా? సాక్షి టీవీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నరోజుల్లో దాని రేటింగ్స్‌ ఇంత గొప్పగా లేవు. కాంగ్రెస్‌ మీద దాడి మొదలుపెట్టిన తరువాతే రేటింగ్స్‌లో ముందుకు దూసుకొచ్చింది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టటమే సాక్షి టీవీ విజయంవెనుక అసలు రహస్యం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఖర్చుకు వెనుకాడకపోవటం లాంటివి ఎలాగూ మరికొంత సాయపడ్డాయి. ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే, న్యూస్‌ చానళ్ళలో వార్తలకంటే ఇతర కార్యక్రమాలే ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి. 

సాక్షి టీవీ అందుకు మినహాయింపేమీ కాదు. సాక్షిలో ప్రసారమయ్యే వార్తేతర కార్యక్రమాలకు ఎక్కువరేటింగ్స్‌ వస్తున్నమాట నిజం. పైగా, సాక్షి ప్రసారాలు మారుమూల గ్రామాలకుకూడా అందేలా దాదాపు పదివేల రిసీవర్‌ బాక్సులు పంపిణీ అయ్యాయి. మరే ఇతర న్యూస్‌ చానల్‌ ఇందులో సగం కూడా అందించలేకపోయింది. సహజంగానే, ఇవన్నీ సాక్షి టీవీ విజయానికి కారణమయ్యాయి.
ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా పార్టీల చానళ్ళు ప్రజాదరణ పొందిన దాఖలాలు ఉన్నాయా? అన్ని రాజకీయపార్టీలకూ చానళ్ళు ఉన్న తమిళనాడులో ఏ పార్టీతోనూ సంబంధం లేని పుదియ తలై మురై మొట్టమొదటిస్థానంలో ఉండటానికి కారణమేమిటి? కర్ణాటకలో టీవీ 9 కన్నడ, సువర్ణ న్యూస్‌ మాత్రమే ప్రజాభిమానం పొందటానికి కారణం- అవి ఏ రాజకీయ పార్టీకీ కొమ్ము కాయకపోవటమే కాదా? అదే విధంగా కేరళలో ఏషియానెట్‌, మనోరమ, రిపోర్టర్‌ టీవీలు మాత్రమే ముందుండటానికి వాటి తటస్థ వైఖరే కారణమని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టటానికి వెనుకాడని ధోరణి కూడా మరో కారణం.చానళ్ళు పెట్టే అన్ని రాజకీయపక్షాలూ ఆ విధంగా నిష్పాక్షికంగా పనిచేయగలవా? ఉద్యమస్ఫూర్తిని రగిలించటానికి చానల్‌ అవసరమని భావించిన టిఆర్‌ఎస్‌ కూడా తన చానల్‌ విషయంలో ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేదు. నమస్తే తెలంగాణ పత్రిక విజయమైనంతగా టీ చానల్‌ ప్రజాదరణ పొందలేకపోవటం చూశాం. 

thota
పత్రికలు చదవటం కంటే వినోదానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే టీవీ ప్రేక్షకుల స్వభావం కూడా అందుకు కారణం.ఈ అంశాలేవీ గమనించకుండా, రాజకీయ పార్టీలన్నిటికీ చానళ్ళు అవసరమనే అభిప్రాయానికి రావటం గుడ్డెద్దు చేలో పడ్డట్టే ఉంటుంది. ఇలా చానళ్ళు పెట్టాలనుకుంటున్న రాజకీయ పార్టీలకు ఇప్పుడున్న చానళ్ళ మీద నమ్మకం లేకపోవటం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. వాటికి సొంత చానల్‌ ఆలోచన వచ్చిందంటే, మెజారిటీ చానళ్ళు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆ పార్టీల ఉద్దేశమా? అదే నిజమైతే ఇప్పుడున్న చానళ్ళు అన్నీ అదెంతవరకు నిజమో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఏది వార్త, ఏది ప్రచారం అని తెలుసుకోగలిగే శక్తి ప్రజలకు వచ్చేసింది. అయినప్పటికీ ప్రచారం కోసం చానల్‌ పెట్టాలనుకుంటే ఏప్రయోజనాలను ఆశిస్తున్నారో కూడా జనం అర్థం చేసుకుంటారు.

Surya Telugu News Paper Dated: 28/12/2012 

అంతటా స్ర్తీది ఒకే దుస్థిత ---Kommineni Srinivasa Rao



- దేశాన్ని కుదిపివేసిన అత్యాచారం
- ఉద్యమరూపం దాల్చిన ఆందోళనలు
- ప్రపంచమంతటా స్త్రీ వివక్ష 
- చట్టాలు పుష్కలం, ఆచరణే శూన్యం 
- ప్రాణాంతకమైన దురాచారాలు 
- అంతులేని వరకట్న హత్యలు 
- ప్రజాప్రతినిధులపైనా అత్యాచారం కేసులు 

JM
దేశ రాజధానిలో జరిగిన దారుణ మానభంగం ఘటన దేశవ్యా ప్తంగా ప్రజలలో ఒక కదలిక వచ్చేలా చేసింది. ఇదేమి దారుణం, ఈ ప్రభు త్వాలు ఏమి చేస్తున్నట్లు? ఈ రాజకీయ పార్టీలు ఏమి చేస్తున్నట్లు? ఇంత అరాచ కానికి పాల్పడిన తీరుపై ఢిల్లీలో వెల్లువెత్తిన తీరు కూడా అందరిలో చైత న్యం పెంచింది. కొంతకాలం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టి నప్పుడు ప్రజలలో ఎలా ఒక్కసారిగా ఆవేశం ఉప్పొంగిందో, ఇప్పుడు ఈ ఘటన కూడా అలాగే అందరిని ఆలోచింప చేసింది. మానవ రూపంలో ఉన్న మృగాలు చేసిన ఘాతుకాన్ని ఖండించడానికి మాటలు ఉండవనే చెప్పాలి. 

నిజానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు అత్యాచారాలకు గురి అవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్నా, మరో వైపు మూఢ నమ్మకాలు, నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మానభంగం కేసులు కాని, మహిళలపై గృహ హింస కేసులు కాని లేని దేశం దాదాపుగా లేదనే చెప్పాలి. కమ్యూనిజం ద్వారా సమానత్వం సాధించడానికి ప్రయత్నించే చైనాలో కూడా ముప్పై శాతం మంది మహిళలు గృహహింసను ఎదుర్కుంటున్నట్లుగా ఒక సమాచారం వెల్లడిస్తోంది. ఉక్రేనియా దేశంలో పది నుంచి పదిహేను శాతం మంది మహిళలు మానభంగాలకు గురి అయ్యే పరిస్థితి ఉందని, రెండువేల మూడులో వచ్చిన ఒక నివేదిక వెల్లడించింది. పారిశ్రామికంగా ఎదిగిన దేశాలలోకన్నా, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగాఉండే దేశాలలో ఈ సమస్య మరీ అధికంగా ఉంది. అనేక దేశాలలో దీనికి సంబంధించిన చట్టాలుఉన్నా అమలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

ప్రపంచంలో యుద్ధాలు జరిగే సమయాలలో మహిళలపై జరిగే అత్యాచారాలు ఇన్నీ అన్నీ కావు. పురుషాధిక్య సమాజం ప్రపంచం అంతటా ఏదో రూపంలో కొనసాగుతున్న తరుణంలో మహిళను మనిషిగా కాక, ఆస్తిగా చూడడం కూడా దీనికి ఒక కారణంగా కనిపిస్తుంది. బోస్నియాలో యుద్ధం జరిగినప్పుడు సెర్బ్‌లు ఇరవైవేల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న సమాచారం వినడానికే దారుణంగా ఉంటుంది. సూడాన్‌లో అంతర్యుద్ధంలో వేలాది మంది మహిళలు కూడా ఇదే పరిస్థితికి గురి అయ్యారు. రవాండా దేశంలో 1990 దశకంలో మూడు లక్షల మంది టుట్సీ జాతి మహిళలు అత్యాచారాలకు గురి అయ్యారు. ఇక కొన్ని మూఢ నమ్మకాలకు కూడా స్ర్తీలు బలి అవుతున్నారు. 

స్ర్తీల జననాంగాలకు సున్తీ చేసే సంప్రదాయం కొన్ని దేశాలలో ఉన్న తీరు చాలా ఘోరంగా ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొన్ని భాగాలను తొలగించే వైనం హృదయ విదారకంగా ఉంటుంది. అమెరికా వంటి దేశాలలో దీనిపై నిషేధం విధించినా అనేక ఆఫ్రికా దేశాలలో ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇరవై ఎనిమిది ఆఫ్రికా దేశాలలో, మద్యప్రాచ్య దేశాలలో, యూరప్‌, అమెరికా, కెనడాలలోని సంచార జాతులలో ఈ దుష్ట సంప్రదాయం మహిళలకు ప్రాణాంతకంగా మారుతోంది. కొన్ని దేశాలలో ఈ సమస్య నుంచి తప్పించు కోవడానికి మహిళలు ఇతర దేశాలకు పారిపోయి ఆశ్రయం కోరుతున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది వనితలకు ఈ సమస్య ఎదురవుతోంది. మాలి దేశంలో, సూడన్‌ దేశంలో తొంభై మూడు శాతం మంది ఈ తరహా ఇబ్బంది (జెనిటికల్‌ మ్యుటిలేషన్‌) కి గురవుతున్నారంటే ఎంత విషాదమో ఆలోచించండి. 

ఇక కొన్ని ముస్లిం దేశాలలో మానభంగం జరిగినా ఫిర్యాదు చేసే పరిస్థితి తక్కువగా ఉంటుంది. సమాజ కట్టుబాట్లకు తోడు, మానభంగం కేసును రుజువు చేయడానికి నలుగురు సాక్షులు ఉండాలన్న నిబంధన ఉండడం దారుణంగా చెప్పవచ్చు. ఇక భారత దేశంలో, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలలో కట్నం హత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. రెండువేల రెండులో లెక్కల ప్రకారం ఇండియాలో ఆరువేల మంది మహిళలు కట్న హత్యలకు గురి అయ్యారు. పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ వంటి దేశాలలో మహిళల పట్ల తాలిబన్లు ఎంత పాశవికంగా అనుసరిస్తున్నది ఇటీవలి చరిత్రే. ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న నలుగురు మహిళలను తాలిబన్లు పాక్‌లో కాల్చి చంపారు. 

Vijay-Chowk
మలాలా అనే చిన్నారి, బాలికల విద్యా హక్కు గురించి గొంతెత్తినందుకు ఆమెను హతమార్చడానికి తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆ ఘటనపై ప్రపంచం అంతా తీవ్రంగా స్పందించింది. ప్రత్యేకంగా ఒక విమానం ద్వారా లండన్‌ పంపి ఆమెకు వైద్యం చేస్తున్నారు. కిర్జిస్థాన్‌ దేశంలో పెళ్లికాని యువతులను కిడ్నాప్‌ చేసి బలవంతంగా రేప్‌చేసి పెళ్లిచేసుకోవడం ఒక సంప్రదాయంగా ఉంది. మహిళలకు ఇష్టం లేకపోయినా ఒకసారి కిడ్నాప్‌కు గురి అయ్యాక తప్పనిసరిగా పెళ్లి చేసుకోవలసి వస్తోంది. పన్నెండువేల కేసులు ఈ తరహావి నమోదు అయి, అక్కడ పార్లమెంటు దీనిపై చట్టం తీసుకు రావడానికి ప్రయత్నిస్తే, కొందరు రాజకీయ నేతలు ఇది సంప్రదాయం అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మన దేశంలో మానభంగం కేసులు ప్రతి అరగంటకు ఒకటి జరుగుతుంటే, అమెరికాలో ప్రతి రెండు నిమిషాలకు ఒకటి జరుగుతోందని ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. అయితే వీటిలో అత్యధికం పోలీసు స్టేషన్‌లలో నమోదు కావు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. అమెరికా, ప్రాన్స్‌, స్వీడన్‌ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయంటే మానవ సమాజం ఎంత అనారిగకంగా ఉన్నది అర్ధం అవుతుంది. కొన్ని దేశాలలో వావివరసలతో సంబంధం లేకుండా దారుణమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే ప్రపంచబ్యాంక్‌ ఛైర్మన్‌గా పనిచేసిన స్ట్రటస్‌ ఖన్‌ అనే వ్యక్తి పై అత్యాచారం అభియోగం నమోదైంది. చివరికి ఆయన వ్యక్తిగతంగా పరిహారం చెల్లించి బయటపడ్డారు. ఇటలీ మాజీ ప్రదాని బెర్లుస్కొని సెక్స్‌ పార్టీలలో పాల్గొన్నారన్న అభియోగం వచ్చింది. 

మన దేశంలో కూడా రాజకీయ నాయకులపై అత్యాచార కేసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలలో 369 మందిపై అత్యాచారం, ఇతర కేసులు ఉన్నాయి. వీరిలో వివిధ పార్టీలకు చెందినవారు ఉన్నారు. ఈ విషయంలో ఉత్తర్రపదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ ముందంజలో ఉన్నాయి. ఈ కేసులు ఉన్నప్పటికీ ఎన్నికలలో ఆయా పార్టీల టిక్కెట్లు పొందిన వారిలో కాంగ్రెస్‌ నుంచి ఇరవై ఆరు మంది, బిజెపి నుంచి ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉండడం విశేషం. అత్యాచారం కేసులు ఉన్నా, ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందినవారు కూడా డెబె్భై ఆరు మంది ఉండడం విశేషం. 

కొందరు రాజకీయ నేతలు కొంతకాలం ఈ కేసులలో అరెస్టు అయినా, ఆ తర్వాత ఎలాగో తప్పించుకోగలుగుతున్నారు. రాజస్థాన్‌లో బన్వరీదేవి కేసులో ఒక మంత్రిపై అభియోగాలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎయిర్‌ హోస్టెస్‌ ఆత్మహత్య కేసులో హర్యానా మంత్రి అరెస్టు అయ్యారు. జమ్ము- కాశ్మీర్‌లో రెండు వేల ఐదులో నమోదైన సంచలనాత్మక మానభంగం కేసులో ఒక ప్రిన్సిపల్‌ సెక్రటరి, ఎమ్మెల్యేతో సహా పలువురు రాజకీయ నేతలపై కేసును చండీఘడ్‌ సిబిఐ కోర్టు కొట్టివేసింది. 

భారత్‌లో 1971లో రోజుకు ఏడు మహిళల అత్యాచారాలు, కిడ్నాప్‌ తదితర కేసులు నమోదైతే, రెండు వేల ఆరు నాటికి రోజుకు ఏభై మూడు కేసులు నమోదు అవుతున్నట్లుగా జాతీయ క్రైమ్‌రికార్డు వెల్లడిస్తోంది. అత్యాచార కేసులలో నిందితులుగా ఉన్న నేతలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనఉన్నప్పట్టికీ, అందువల్ల రాజకీయ కక్షలతో ఇలాంటి కేసులు నమోదైతే ఏమి చేయాలన్న చర్చ వస్తోంది. జాతీయ రికార్డుల నివేదిక ప్రకారం పది లక్షల మించి జనాభా ఉన్న నగరాలలో ఈ అత్యాచారాల కేసులలో డిల్లీ మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నట్లు తేలింది. 

రెండు వేల ఆరు లెక్కల ప్రకారం డిల్లీలో 4134 కేసులు నమోదైతే, హైదరాబాద్‌ లో 1755 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, దేశం అంతటిలో మహిళలపై అత్యాచారాలతో సహా వివిధ రకాల కేసులలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉండడం కూడా సిగ్గుచేటే. మన రాష్ట్రంలో 21484 కేసులు నమోదైతే, ఆ తర్వాత స్థానాల్ని ఉత్తర్రపదేశ్‌, మధ్యప్రదేశ్‌లు ఆక్రమించాయి. మన డిజిపి దినేష్‌ రెడ్డి ఈ ఏడాది అత్యాచారం కేసులు తగ్గాయని చెబుతున్న తరుణంలో హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ వద్ద ఒక చిన్నారి ఘాతుకానికి గురి అయినట్లు వార్తలు వచ్చాయి. సమాజం పురోగతి సాధించే కొద్దీ ఇలాంటి అత్యాచారాలు తగ్గవలసి ఉండగా, ఇవి పెరుగుతుండడం బాధాకరమే. మణిపూర్‌లో తాజాగా ఒక నటిపై నాగా మిలిటెంట్‌ ఒకరు అసభ్యంగా వ్యవహరిస్తే అతనిపై చర్య తీసుకోవాలంటూ రాష్ట్రం అంతా అట్టుడికింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో ఒక జర్నలిస్టు మరణించడం కూడా బాధాకరం. 

మొత్తం మీద ఈ అత్యాచారాలకు మూల కారణాలపై అన్వేషణ సాగాల్సిన సమయం ఆసన్నమైంది. సామూహిక అత్యాచారాలను కాని, ఏ అత్యాచారాన్ని అయినా చేసే నీచ సంస్కృతిని అరికట్టకపోతే ఏ జాతికి నిష్కృతి ఉండదు. అందులో సనాతన సంప్రదాయాలతో, మహిళకు అత్యధిక గౌరవం ఇచ్చే మతంగా పేరున్న హిందువులు అత్యధికంగా నివసించే మన దేశంలో ఇలాంటి కేసులు పెరగడం కచ్చితంగా సామాజిక రుగ్మతే. ఇక్కడ శీలం పోవడంకాదు, దానిని ఒక మహిళపై దాడిగా తీసుకోవాలి. శీలం అంటే గుణం అని అర్ధం అని ఒక కవి తన పాటలో పేర్కొన్నారు. ‘నువ్వేమి చేశావు నేరం’ అంటూ మానభంగానికి గురైన ఒక మహిళను ఆదరించే విధంగా ఆ కవి రాసిన పాట అద్భుతంగా ఉంటుంది. 

ప్రతి ఒక్కరిలో సమాజం పట్ల అవగాహన, పురుషుడు- స్ర్తీ కి మధ్య ఉండవలసిన సంబంధం, అనుబంధం మొదలైనవాటిపై చిన్నప్పటినుంచే పిల్లలకు బోధన జరగాలి. అంతేకాదు సినిమాలలో కాని, ఇతర్రతా కాని మానభంగాలు, అత్యాచార నేరాలు వంటివి ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అక్కడ సిగరెట్‌పైన, మద్యపానంపైన చట్టబద్ధ హెచ్చరిక చేస్తున్నట్లు- ‘ఇది సినిమా మాత్రమే, ఇలాంటివి చేయరాదు’ అన్న సూచనలు స్పష్టంగా చేయాలి. లేకుంటే మన సమాజం ఆటవిక సమాజంగా మారిపోయే ప్రమాదం ఉంది. 

srini
ఢిల్లీలో కాని, దేశంలోని వివిధ ప్రాంతాలలో గాని మానభంగం ఘటనపై స్పందించిన తీరు మంచిదే కాని కొందరు హింసకు పాల్పడడం ఏ మాత్రం పద్ధతి అనిపించదు. ఇందులో రాజకీయాలు చొప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఏది ఏమైనా ప్రపంచంలో అన్ని దేశాలలో మహిళల పరిస్థితి కొంచెం తర తమ తేడాలతో దాదాపు ఒకే రకంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహిళా హక్కుల సంఘాలు ఎంత కృషి చేస్తున్నా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఈ దుస్థితి మారడం లేదు. ఇది అంతర్జాతీయ సమస్య కనుక, ప్రపంచ దేశాలన్నీ ఈ సమస్యపై ఒక అవగాహనకు వచ్చి ఎక్కడ ఇలాంటి నేరాలు జరిగినా ఒకే తరహా శిక్ష వేసే విధంగా, అలాగే ప్రజలలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చైతన్యం తెచ్చే కార్యక్రమాలు రూపొందించడం అవసరం.

Surya News Paper Dated : 27/12/2012 

Wednesday, December 26, 2012

ఆదివాసీ భాషల మాటేమిటి? ----- ప్రొ. భంగ్యా భూక్యా


ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమైంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడింది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది. 


తెలుగు ప్రజలూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ నేటి నుంచిమూడు రోజుల పాటు తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోనున్నారు. తెలుగు భాషాభిమానులు, పండితులు తెలుగు భాష ఇంగ్లీష్ ప్రపంచంలో కొట్టుకుపోతుందని ఎక్కడలేని బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎవరి భాషను వారు అభిమానించటంలో, పరభాష నుంచి తమ భాషను రక్షించుకోవటంలో తప్పు ఏమీలేదు. నా బాధంతా తెలుగు ప్రపంచంలో ఆదివాసీ భాషలు ఏవిధంగా కొట్టుకుపోతున్నాయో ఈ పండితులు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సదస్సులో ఆదివాసులను తెలుగు ప్రజలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆదివాసీ భాషల ఉనికినే తుడిచిపట్టే ప్రమాదం ఉంది.



మన రాష్ట్రంలో 33 ఆదివాసీ, సంచార తెగలున్నాయి. ప్రతి తెగ తన ప్రత్యేక భాషను కలిగి ఉన్నాయి. రెండు లక్షల పైన జనాభా కలిగిన తెగలు ఆరు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా తెగల జనాభా ఇలా ఉంది. లంబాడా 20,77,947, కోయ 5,68,019, యానాది 4,62,167, ఎరుకల 4,37,459, గోండు 2,52,038, కొండ దొర 2,06,381. లక్షలాది ప్రజలు ప్రత్యేక భాషలను కలిగిఉన్నా వీరి భాషలకు జాతీయస్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ ఎటువంటి గుర్తింపు లేదు.



ఈ భాషల్లో కొన్ని ఇప్పటికే కనుమరుగుకాగా, మరికొన్ని ఆ ప్రమాదం అంచున ఉన్నాయి. ఈ భాషల మనుగడకు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఆదిమ జాతులు తమ మాతృభాషతో పాటు తెలుగును కూడా తప్పనిసరిగా నేర్చుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు మెజార్టీ ప్రజల భాషగా, రాష్ట్ర భాషగా చలామణి కావటమే అందుకు కారణంగా చెప్పవచ్చు. చిన్న తెగల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఈ తెగలు తెలుగుతో పాటు వారి ప్రాంతంలోని మెజార్టీ తెగల భాషను కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రతి తెగ తెలుగుతో పాటు రెండు, మూడు ఇతర తెగల భాషలను మాట్లాడాల్సి వస్తుంది. మొత్తంగా ఆదివాసీ భాషలు ఒక దుర్భర పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాయి.



ప్రభుత్వంగానీ, భాషా పండితులు గానీ ఈ భాషల పరిరక్షణకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఈ భాషలను అభివృద్ధి చేయకపోవటానికి వీరు చెప్పే ఒక ప్రధాన సాకు ఏమంటే ఈ భాషలకు 'లిపి' లేదని. విచిత్రం ఏమంటే, ప్రపంచ భాషగా చలామణి అవుతున్న ఇంగ్లీష్ భాషకు సొంత లిపి లేదు. జాతీయ భాషగా చలామణి అవుతున్న హిందీ భాషకు సొంత లిపి లేదు. మరి ఆదివాసీ భాషల అభివృద్ధికి లిపి ఎందుకు అడ్డంకిగా మారుతుందో అర్థంకాని ప్రశ్న.



అసలు భాషకు, లిపికి ఎటువంటి సంబంధం లేదు. ఏ భాషనైనా, ఏ లిపిలోనైనా రాయవచ్చు. ఆ భాషని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చాలు. మన పాలకులకు ఆదివాసీ భాషల పట్ల నిజాం రాజులకు ఉన్న చిత్తశుద్ధి కూడా లేదు. ఆధునిక విద్యలో భాగంగా చివరి నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ ఆదివాసీ భాషల ప్రత్యేకతను గుర్తించి పాఠశాల పాఠ్యాంశాలను తెలుగు లిపిని ఉపయోగించి లంబాడా, గోండు, కోయ భాషల్లో రాయించారు. ఈ తెగల నుంచే టీచర్‌లను నియమించి వారి శిక్షణ కోసం ప్రత్యేక టీచర్ ట్రయినింగ్ సెంటర్‌లను స్థాపించారు. ఈ విధానం 1956లో హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యేంత వరకూ కొనసాగింది.



ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమైంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడింది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది.



ముఖ్యంగా మైదాన ప్రాంత తెగల భాషల మీద ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఎరుకల, యానాది భాషలు దాదాపుగా కనుమరుగయ్యాయనే చెప్పాలి. ఈ తెగలు చారిత్రకంగా సంచార జాతులు. ఇవి గ్రామ సమాజంలో స్థిరపడటంతో త్వరిత కాలంలోనే తెలుగు ప్రభావంలోకి వెళ్ళిపోయాయి. మరొక్క సంచార జాతి లంబాడాలు. వీరు వారి నివాసాలను గ్రామ సమాజానికి కాసింత దూరంలో ఏర్పరచుకోవటంతో వారి భాషను కొంత వరకు భద్రపరుచుకోగలుగుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వీరు జీవనోపాధి కోసం గ్రామ, పట్టణాలపై ఆధారపడటం ఎక్కువ కావటంతో వీరి భాష కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.



ఆదివాసీ భాషల క్షీణత వారి సంస్కృతి మీద బలమైన ప్రభావాన్నే చూపిస్తున్నాయి. భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక విధంగా భాష ద్వారానే ఈ జాతులు ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నాయి. భాషలు నశిస్తే ఈ జాతుల ఉనికి కూడా నశించే ప్రమాదం ఉంది. పాలకవర్గాలు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఈ జాతులు తమ ప్రత్యేక ఉనికిని ఉద్యమ రూపాలుగా మార్చి పాలకవర్గాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంటాయి. అందుకే పాలకవర్గాలు జాతుల ప్రత్యేక ఉనికిని ప్రమాదంగా భావిస్తాయి. ఈ విభిన్న జాతుల ఉనికిని ధ్వంసం చేసి ఒకే సంస్కృతిని స్థాపించటానికి పాలకవర్గాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. అదే పాలకవర్గ సంస్కృతి.



మన దేశంలోని పాలకవర్గాలు విభిన్న కులాల సమ్మేళమైనప్పటికీ సాంస్కృతిక వైరుధ్యాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఈ వర్గాలు ప్రాచీన కాలం నుంచి క్రమంగా తమకంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సంస్కృతి బ్రాహ్మణ సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. పాలకుడు ఏ కులస్తుడైనా ఈ సంస్కృతిని పెంచి పోషించటమో, బలోపేతం చేయటమో జరుగుతూ ఉంటుంది.



తెలుగు భాష అభివృద్ధి కోసం కాకతీయుల కాలం నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ రాష్ట్రంలోని ఆదివాసీ భాషల మీద జరుగుతున్న దాడిగానే చూడాల్సి ఉంటుంది. తెలుగు సామాన్య ప్రజల వ్యవహారిక భాషే అయినప్పటికీ ఈ భాషకు లిఖిత రూపం వచ్చిన అనంతరం ప్రజల భాష కాకుండా పోయింది. తెలుగు లిఖిత భాషగా రూపాంతరం చెందే క్రమంలో పూర్తిగా బ్రాహ్మణైజ్ అయింది. ఈ రోజు మనం మాట్లాడే, రాసే తెలుగులో అరవై శాతం సంస్కృత పదాలున్నాయంటే బ్రాహ్మణిజం ప్రభావం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాఠ్యపుస్తకాలలోని తెలుగుకి, అణగారిన కులాలు, జాతులు మాట్లాడే తెలుగుకి పొంతనే లేదు. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు డిపార్ట్‌మెంట్‌లు హైందవ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ కారణంగానే ఈ రోజు అణగారిన జాతులు, కులాలు తెలుగును వ్యతిరేకిస్తున్నాయి.



పాలకవర్గాలు ఒక్క విషయం గుర్తించాలి. ఆదివాసుల భాషను రక్షించకపోతే అపారమైన ఈ దేశ చరిత్ర, సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదముంది. భాష కేవలం కమ్యూనికేషన్ మీడియం కాదు. భాష ప్రజల చరిత్రను, సంస్కృతిని, భావాలను ప్రతిబింబిస్తుంది. ఆదివాసుల విషయంలో ఇది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆదివాసుల భాషల్లో అద్భుతమైన మౌఖిక చరిత్ర పాటల, కథల రూపంలో దాగి ఉంది. ఈ చరిత్ర వారి జాతుల పుట్టుపూర్వోత్తరాలను, సమాజ మార్పులను, రాజ్యంతో వారు చేసిన పోరాటాలతో పాటు వారి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, మత భావాలను తెలియజేస్తాయి.



ఈ చరిత్ర పాలకవర్గ చరిత్రకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక ప్రత్యామ్నాయ (అజ్ట్ఛూటn్చ్టజీఠ్ఛి) చరిత్ర. సమాజం మరో కోణాన్ని చూపించే చరిత్ర. ఆదివాసుల సంప్రదాయాల్ని, భావాల్ని వారి భాషలోనే అర్థం చేసుకోగలం.



గుత్తికోయలు తయారుచేసే 'చిగురు' సారను వివరించటానికి తెలుగులో కానీ, ఇంగ్లీషులో కానీ పదాలు లేవు. దీన్ని కేవలం గుత్తి కోయల భాషలోనే వివరించగలం. గుత్తికోయల భాష కనుమరుగైతే 'చిగురు' సారను ఏమని పిలవాలన్నది మన ముందు ఉన్న సమస్య. ఇలా చెప్పుకుంటూపోతే ఆదివాసీ యేతర భాషలకు అందకుండా ఉండే అనేక విషయాలు ఆదివాసీ భాషల్లో ఉన్నాయి.



గ్లోబలైజేషన్‌లో భాగంగా దేశంలో వస్తున్న మార్పులు ఆదివాసీ సమాజంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆదివాసీ సాంస్కృతిక రూపాలు క్రమంగా నశించిపోతున్నాయి. భాష ఒక్కటే వారి సంస్కృతి ఆనవాళ్లుగా మిగిలే పరిస్థితి ఉంది. నశించిపోతున్న ఆదివాసీ ప్రజల భాషలను చిగురింప చేయాలంటే పాలకులు, భాషా పండితులు నా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి.



తెలుగు, ఉర్దూ యూనివర్సిటీ తరహాలో ఆదివాసీ భాషలకు ఎందుకు ఒక యూనివర్సిటీని స్థాపించకూడదు? పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆదివాసులు తమ భాషను చదువుకునే పరిస్థితి ఎందుకు ఉండకూడదు? ఆదివాసులు తమ భాషను తాము చదువుకునే హక్కు ఎందుకు ఉండకూడదు? రాష్ట్రంలోని 33 ఆదివాసీ భాషలు ఈ రాష్ట్రానికే ప్రత్యేకం. మరి ఎందుకు ఈ భాషలను ఈ రాష్ట్ర భాషలుగా గుర్తించకూడదు. ఆదివాసులు తెలుగును కాకుండా తమ సొంత భాషను సగర్వంగా మాతృభాషగా రాసుకునే రోజు వస్తుందా! ఆ రోజు వచ్చిన నాడు ఆదివాసులు కూడా సగర్వంగా తమ భాష మహాసభలు జరుపుకునే రోజు వస్తుంది.



- ప్రొ. భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ

Andhra Jyothi News Paper Dated: 27/12/2012 

Sunday, December 23, 2012

మేధావులూ మౌనమేల..? - సుజాత సూరేపల్లి



తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీకి, ఒక నాయకునికి పరిమితం చేసి, ఇది ఒక రాజకీయ నిర్ణయం ద్వారానే సాధ్యం అన్న ధోరణిపై అందరూ పునరాలోచించుకోవలసిన తరుణమిది. తెలంగాణ అంశాన్ని రాజకీయ పార్టీలకు వదిలేసి చోద్యం చూస్తున్న ఆంధ్ర ప్రాంత పెద్దమనుషులు, మేధావి వర్గాలు అదే సమయంలో ఎక్కడో మెల్లిగా, చాటుగా తెలంగాణకి మద్దతు తెలుపుతున్న ప్రజాస్వామికవాదులు ఆత్మావలోకనం చేసుకోవలసిన సందర్భం ఇది... నిజానికి ఏమాత్రం చరిత్ర తెలిసినా, అన్యాయం, అసమానతలపై ఏ కొద్ది అవగాహన ఉన్నా, పోరాటాలకు, ఉద్యమాలకు విలువలపై నమ్మకం ఉంటే తెలంగాణ ఈ రోజు ఆత్మహత్యలకి కేంద్రంగా నిలిచి ఉండేది కాదు. 

శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలను చూసుకున్నా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క రంగంలో అన్యాయం జరిగిందని కళ్లకు కట్టినట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి, బలవంతంగా హైదరాబాద్ సంస్థానంపై సర్దార్ వల్లభాయి పటేల్ (1948-56), ఉక్కు మనిషి ఆధ్వర్యంలో సైన్యాలతో, బలగాలతో, గూండాలతో వేలాదిమందిని ఉక్కు పాదంతో నిర్దాక్షిణ్యంగా అణచివేసి ఈ ప్రాంతాన్ని ఈ పవిత్ర భారతదేశంలో విలీనం చేయక ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. 

ఇది దక్కనీ ప్రాంతం. ఇక్కడ నిజాం రాజుల పాలన, ఉర్దూ భాష, హిందూ ముస్లింల కలయికతో కూడిన సంస్కృతి, వ్యవసాయ ఆధారిత జీవన విధానం ఒక ప్రత్యేకత. ఇదే ఆంధ్ర ప్రాంతం నుంచి వేరుగా ఉండడానికి కారణం కూడా. ఒక భాష ఒక రాష్ట్రం అనే సాకుతో మద్రాసు నుంచి వేరుపడిన తరువాత సంపన్న ప్రాంతంగా పేరుగాంచిన హైదరాబాద్‌ను ఆక్రమించుకోవడానికి చూపిన అతి అందమైన అన్యాయం. 

1918లోనే హైదరాబాద్ సంస్థానం ముల్కీ ఫర్మానాను జారీచేసింది. 1954-56 ఉద్యమం ఉధృతంగా నడిచింది. అంతకంటే ముందుగానే 'ఇడ్లీ సాంబార్ గోబ్యాక్' నుంచి వ్యతిరేకతను వివిధ రూపాల్లో ప్రకటిస్తూనే ఉంది. ఇవికాక పెద్దమనుషుల ఒప్పందం, ప్రాంతీయ ప్రత్యేక మండళ్లు, గిర్‌గ్లానీ కమిషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చారిత్రక ఘట్టాలు తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఉన్న నేపథ్యాన్ని, అనుభవాన్ని చెబుతాయి. ఇదే పరాకాష్ఠకి చేరి 1969 విద్యార్థులపై కాల్పులకి దారితీసి 369 ప్రాణాలు నేలరాలాయి. నెత్తురోడిన హైదరాబాద్ నగరం సాక్షిగా ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. 

2009 నుంచి జరుగుతున్న ఉద్యమంలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. చనిపోయిన వాళ్ళు పిరికివాళ్ళే కావొచ్చు, అవగాహన లోపం ఉండొచ్చు కానీ వారి చావులను అవమానపరిచి ఉద్యమంలో వారిగురించి మాట్లాడకుండా ఉండడం అమానవీయమే అవుతుంది. ఒక ప్రాంత ఆకాంక్షను, ఉద్యమాన్ని చిన్నచూపు చూడడంతో నిరాశా, నిస్పృహలకి గురై ప్రాణాలు పోగొట్టుకున్న వారి చావుకు ఎవరు కారణం అనేది విశ్లేషించాలి. ఐదు సంవత్సరాల ఎన్నికల పండుగకు ప్రజల క్షేమాన్ని కుదించి, డబ్బు, కుల, స్వార్థ రాజకీయ నాయకులకు జీవితాలను అంకితం చేస్తున్న పరిస్థితులను చూసి మౌనంగా ఉన్న మేధావులు, ప్రజాసంఘాలను ఎలా అర్థం చేసుకోవాలి. 

ఉద్యమ నేపథ్యం చూస్తే తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ జనసభ, మహాసభ తర్వాత వచ్చినదే తెలంగాణ రాష్ట్ర సమితి (2001). కేవలం రాజకీయ నిర్ణయం ద్వారానే తెలంగాణ సాధ్యం అని గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. ఈ మలుపులు అన్నీ తెలంగాణ ఉద్యమంలో అనేక పార్శ్వాలను అంటే కులం, వర్గం, రాజకీయ అవగాహనను బయటపెట్టాయి. జై తెలంగాణ అన్నప్పుడల్లా జై ఆంధ్ర ఉద్యమం రావడం 1972 నుంచి మొదలైంది. అప్పుడు ముల్కీ విధానం రద్దు కావాలని జై ఆంధ్ర ఉద్యమం నడిచింది. 

ఇప్పుడు మళ్ళీ ఒక రాష్ట్రం, ఒక తల్లి పిల్లలం అని మరొక నినాదంతో కొంతమంది రాజకీయ నాయకుల కనుసన్నలలో, తప్పుడు తడకల ఆధిపత్య భావజాలంతో సీమాం ధ్ర ప్రజలను మోసం చేస్తూ సమైక్యాంధ్ర ప్రోగ్రాం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా కేసీఆర్, అటు లగడపాటి, కావూరి లాంటి వాళ్ళు నడిపిస్తున్నారని చాలా మంది సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయంగా తెలుస్తుంది. మీడియా కూడా ఈ భావననే పెంచి పోషిస్తుంది. 1969 నుంచి ఉధృతంగా ఉద్యమం భావవ్యాప్తి దిశగా నడిచింది. 

ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించాక రాజకీయ పార్టీల ద్వారా పరిష్కారమౌతుందని అనేక ప్రయత్నాలు 2001, 2004, 2009 ఎన్నికలలో నడిచాయి. ఏ పార్టీ కూడా తెలంగాణ అజెండా ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకుండా పోటీ చేయలేదు. గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తిరిగిన ప్రతి పార్టీ కూడా మేము తెలంగాణకి వ్యతిరేకం కాదు అని చెప్పే స్థితికి ఉద్యమం తీసుకొచ్చింది అన్న సత్యం మనముందున్నది. ఈ విషయం చెప్పడానికి కూడా మనకి పరకాల ప్రభాకర్, లగడపాటి, కావూరి, కేసీఆర్‌లు కావాలా? విధిలేని పరిస్థితిలో కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చోవడం, ఉద్యమం ఒక్కసారిగా పైకి లేవడం అందరికీ తెలిసిందే. 

డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తిరిగి తెలంగాణ ప్రాంతానికి ఒక కొత్త ఊపిరిలూదింది కానీ ఆ ఆశలు నిలువక ముందే మళ్ళీ కపట రాజకీయ పార్టీలు బరిలోకి దిగి ప్రకటన వెనుకకుపడేట్టు చేశాయి. రాజీనామాలు, ఎన్నికలు, మిలియన్ మార్చ్‌లు, సకలజనుల సమ్మె, బం ద్‌లు, ఆత్మహత్యలు నిత్యకృత్యం అయ్యాయి. దీనికి బాధ్యత గల ప్రజాసంఘాలు, మేధావుల నిశ్శబ్దం కాలానికి ఒక మాయని మచ్చ గా మిగిలిపోనున్నది. ఈ మధ్యలో లవణం గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, కొద్దిమంది రచయితల 'కావడి కుండలు' వంటి రచన లు, బహుజన కెరటాలు, కుల నిర్మూలన వంటి కొద్ది విశిష్ట పత్రికలూ తప్పితే ఎక్కువ బాహాటంగా మద్దతు ఇచ్చిన వారు చాలా తక్కువ. 

ఒక ప్రాంతం అల్లకల్లోలమవుతుంటే, ఉద్యమాలనే ఊపిరిగా మలుచుకొని బతుకుతుంటే ఒక పరిష్కార మార్గాన్ని చూడడంలో, చూపడంలో సమైక్యాంధ్రలో బుద్ధిజీవులు కరువయ్యారు అని తెలంగాణ ప్రాంతం భావించదా? రాజకీయ పార్టీలంటేనే స్వార్థం, వాటి మనుగడ కోసం ఏమైనా చేస్తాయి అన్న విషయం తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కళ్లారా చూసారు. దీనికి తెలంగాణ రాజకీయ నాయకులు మినహాయింపు కాదు. 

సీమాంధ్ర పెద్దమనుషులు రెండు ప్రాంతాలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ ఇక్కడ వివరిస్తాను. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో ఉన్న సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనే ప్రముఖ పరిశోధన సంస్థ ఢిల్లీలో ఇరు ప్రాంతాల నేతలను, పరిశోధన కారులను పిలిచి తెలంగాణ అంశంపై ఒక సానుకూల పరిష్కార మార్గం చూసే నేపథ్యంలో ఒక ప్రయత్నం చేసింది. దానికి 'డైలాగ్ ఆన్ తెలంగాణ' అని పేరు పెట్టి, రాజకీయాలతో సంబంధం లేని వారిని దాదాపుగా 50 మందిని ఎంపిక చేసి ఆహ్వానించారు. 

తెలంగాణ ప్రాంతం నుంచి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, జాహెద్ అలీ ఖాన్ (ఎడిటర్, సియాసత్), భిక్షం గుజ్జా, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బూర్గుల విజయ్, పాండు రంగారెడ్డి, డాక్టర్ సూరేపల్లి సుజాత, ఆంధ్ర ప్రాంతం నుంచి సి.వి. రాఘవులు, కె.ఎస్. చలం, డాక్టర్ చిన్నయ సూరి, కె.వి. రమణా రెడి, వీరితో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులని, పరిశోధనకారులని, కొద్దిమంది మీడియా మిత్రులని, శ్రీకృష్ణ కమిటీ వారిని కూడా పిలిచారు. 

తెలంగాణ రాష్ట్రంపై కనీసం మేధావులు అన్నా నోరు విప్పుతారని, నిజానిజాలు కోపాలు, ఉద్రేకాలు, ఆవేశకావేశాలకు లోనుకాకుండా మాట్లాడుకోవచ్చని ఎంతో ఆశపడ్డ మాకు చాలా నిరాశ ఎదురైంది. అంతే కాకుండా ఇంకా బాధ కలిగించిన అంశం యునైటెడ్ ఆంధ్రా జాక్ రెసిడెంట్ వై. నరసింహారావు, కన్వీనర్ వి.అంజిరెడ్డి నుంచి నిర్వాహకులకు అందిన లేఖ. దాని సారాంశం 'మీరుపంపిన ఆహ్వానంలో తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్ నోట్ తెలంగాణకు మద్దతు పలికేదిగా ఉందని, అందుకని మేము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఉంది. 

నిజానికి ఆ విధమైన అభిప్రాయముంటే అక్కడికొచ్చి నివృత్తి చేసుకోవచ్చు ఈ మేధావులు. కానీ ఆ విధంగా జరగకుండా చూసి ఏమి నిరూపించుకున్నారు? అక్కడ కనీసం 'చర్చ' అని కూడా అనలేదు కేవలం 'డైలాగ్' అని మాత్రమే అన్నారు. ఆ సమావేశానికి శ్రీకృష్ణ స్వామి అయ్యర్ వంటి నీటి నిపుణులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు దుగ్గల్, సంజయ్ బారు వంటి ప్రముఖులు హాజరయి వారి అభిప్రాయాలను తెలిపారు. ఒక చర్చకి, డైలాగ్‌కి సిద్ధంగా లేని పెద్ద మనుషులు రెండు రాష్ట్రాల మధ్య సుముఖంగా, సవ్యంగా ఒక పరిష్కారానికి వస్తారని అశలు లేవు. 

తెలంగాణపై వోట్లు, సీట్లు, నోట్లు అన్న సూత్రాలతో రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ విషయం పట్టించుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజలు ముందుకు రావడం లేదు. రానివ్వట్లేదు అంటే బాగుంటుందేమో. ఒక ప్రాంతం అతలాకుతలమవుతుంటే ఇంకొక ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రేక్షకులుగా చూస్తూ ఊరుకోవడమేనా? గత 60 ఏళ్లుగా తమ వ్యాపారాల కోసం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి సొంత ప్రాం తాలని, వాటి అభివృద్ధిని మరిచిపోయిన సీమాంధ్ర నాయకులని అడిగే కనీస ప్రయత్నం చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం కాదా? 

నిజానికి అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్రకి, శ్రీకాకుళం వంటి జిల్లాలకి రాజధాని హైదారాబాద్ అంటే ఎంత దూరమో, అభివృద్ధిలో అంతే దూరంగా ఉంది. వారికి రేపు విజయవాడో, విశాఖపట్నమో రాజధాని అయితే లాభం చేకూరుతుంది అని ఆలోచించే సమయం ఇది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొద్దిమంది అగ్రకుల పెట్టుబడిదారుల చేతిలో నలిగిపోతున్న సమైక్యాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన కులాల, వర్గాల వారికి న్యాయం చేకూరుతుంది అన్న వాస్తవాన్ని ప్రజల ముందుంచాలి. శ్రీకృష్ణ కమిటీలో కూడా స్పష్టంగా గ్రామీణులు, కిందిస్థాయి వారు రెండు ప్రాంతాలను కోరుకుంటున్నారని తెలియజేశారు. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం రాష్ట్రాల విభజనతో అభివృద్ధికి నోచుకోదా? 

ఇప్పటివరకు ఏర్పడ్డ ఛత్తీస్్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మానవాభివృద్ధి సూచికలు జాతీయస్థాయి కంటే మెరుగ్గా ఉన్నాయన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1956, మార్చ్ 5 బహిరంగ సభలో చెప్పారు. 'విశాలాంధ్ర' అనే భావనే సామ్రాజ్యవాద విస్తరణకు తోడ్పడేదిగా ఉందని 1953, అక్టోబర్ 17లో చెప్పారు. ఆయన అపోహలు, ఫజల్ అలీ ఖాన్ భయాలు నిజమయ్యాయి అని వేరే చెప్పక్కర్లేదు. 

తెలంగాణ అనగానే ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొడతారని, నీళ్ళు ఇవ్వరని, హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలని, ముస్లింలకు చేటని, మావోయిస్టుల సమస్య వస్తుందని పుకార్లు, వదంతులు పుట్టిస్తున్న వారి వార్తలను నమ్మి మోసపోతున్నది సామాన్య ప్రజలే. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని అమెరికా వంటి దేశాలు నిరూపిస్తున్నాయి. ఈ రాష్ట్రాల ద్వారా భాష, సంస్కృతి, వనరుల వినియోగం, నిధుల పంపకం సక్రమంగా అన్ని ప్రాంతాలకు అందుతాయని చరిత్ర చెబుతుంది. 

ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు, మేధావులు, విద్యార్థులు అ అవగాహనను ప్రచారం చేయవలసిన బాధ్యత భుజాన వేసుకోవాలి. స్వేచ్ఛ, స్వతంత్ర సమానత్వ పునాదుల మీద న్యాయాన్యాయాల నిర్ణయం జరగాలి. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం నిరంకుశ రాచరిక పాలన వైపు, పెట్టుబడిదారుల కబంధ హస్తాల చేతిలో చిక్కుకుని ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే వైపుకు తీసుకుపోతాయి. ఇవే పెట్టుబడిదారీ శక్తులు నేడు ప్రభుత్వాలను శాసిస్తున్నాయి, ఉద్యమాల నోర్లు మూయిస్తున్నాయి అన్న విషయం తెలుసుకొని కూడా మౌనంగా ఉండడం సమాజానికి చేసే ద్రోహమే. 

- సుజాత సూరేపల్లి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రచయితల వేది

Andhra Jyothi News Paper Dated: 23/12/2012

Friday, December 21, 2012

Talk On African-American and Dalit Studies: Reflection on Life Narratives By Dr Jangam Chinnaiah Assistant Professor Dept of History, Carlton University, Ottawa, Canada.


Talk On African-American and Dalit Studies: Reflection on Life Narratives By Dr Jangam Chinnaiah
Assistant Professor Dept of History, Carlton University, Ottawa, Canada.  

హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు ---డేవిడ్,



మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో సుమారు 700 తెగలకుచెందిన 9 కోట్ల మందికి పైగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 92 శాతానికి ప్రధాన జీవనాధారం అటవీ భూములే. మన రాష్ర్టంలో 30 తెగలకు చెందిన ఆదివాసులు, మరో ఐదుతెగలకు చెందిన మైదాన ప్రాంతవాసు లు- 60 లక్షల మందికి పైగా 9 జిల్లాలోని షెడ్యూలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాజ్యాంగ పరంగా షెడ్యూలు 5,6లలో ప్రత్యేక రక్షణలు కల్పించిన ఆది వాసుల జీవనం నేడు పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నది. మైదాన ప్రాంత షావుకార్ల, వడ్లీవ్యాపారుల మోసాలకు, అన్యాయాలకు, దోపిడీ దౌర్జన్యాలకు, ఫారెస్టు అధికారుల వేధింపులకు గురౌతూ ఆదివాసులు మనుగడకోసం, మెరుగైన జీవనంకోసం పోరాతున్నారు. 

ఈ సమస్యలన్నింటికీ తోడు వేలాది, లక్షలాది ఎకరాల అటవీ భూములను పరిశ్రమల స్థాపన పేరిట, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట, గనుల తవ్వకం పేరిట బడా, బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టటం ద్వారా వారిని అడవుల నుండి శాశ్వతంగా దూరం చేసేందుకు పాలకులు పూనుకున్నారు. ప్రభుత్వాలులు గత ఆరున్నర దశాబ్దాలుగా చేపడుతున్న విధానాల ద్వారా ఆదివాసులకు కల్పించామన్న రక్షణలన్నింటినీ గత రెండు దశాబ్దాలుగా ఒక్కొక్కటిగా తొలగించివేస్తున్నారు.

శ్రీకాకుళ గిరిజన రైతాంగఉద్యమానంతరం అటవీ ప్రాంతంలో ఆదివాసుల భూమిహక్కును నామమాత్రంగానైనా పరిరక్షించే 1/70 చట్టాన్ని రాష్ర్టప్రభుత్వం చేసింది. ఈ చట్టాన్ని నీరుగారుస్తూ వచ్చిన ప్రభుత్వాలన్నీ, అటవీ భూములను గిరిజనేతర భూస్వాముల పరం చేయడంతో పాటు, పెద్దఎత్తున బడా పారిశ్రామిక సంస్థలకు కట్టబెడుతూ వచ్చాయి. ఆదివాసుల స్వయంపాలనలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ 1996లో ‘పంచాయితీరాజ్‌ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టం’ (పెసా) తెచ్చింది. 15 సంవత్సరాల తర్వాత ఇటీవల ప్రభుత్వం దాని అమలుకు నిబంధనలు రూపొందించడంలోనే- ఆదివాసుల హక్కుల అధికారాలను పంచాయితీలకు, మండల పరిషత్తులకూ కట్టబెట్టింది. 

తద్వారా ఆదివాసుల అటవీభూములను అన్యాక్రాంతంచేసే చర్యలను వేగవంతం చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారమే లక్షఎకరాల అటవీభూములను ఆక్రమించుకుని అనుభవిస్తు న్నారని ప్రభుత్వం నియమించిన గిర్‌గ్లానీ కమిటీ వెల్లడించేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ ఆదివాసుల భూముల దురాక్రమణను ప్రధానంగా ప్రస్తావించింది. ప్రపంచీకరణ విధానాలను అమలుచేయటం ప్రారంభమైన తర్వాత అదివాసుల జీవనం ‘పెనం మీదనుండి పోయ్యిలో పడిన’ చందం అయ్యింది. 

విదేశీ, సామ్రాజ్యవాద బడా కంపెనీలు విచ్చలవిడిగా అడవులలోని భూగర్భ, ఉపరితల సహజ సంపదలన్నింటినీ కొల్లగొట్టు కెళ్ళేందుకు పాలకులు అన్నిరకాల అనుమతు లూ ఇచ్చివేస్తున్నారు. విద్యను అందని ద్రాక్షగా మార్చి కార్పొరేటీకరించిన పాలకులు మరో చేత్తో విద్యాహక్కు చట్టం చేసిన విధంగానే; వైద్యాన్ని ఖరీదైన అంగడిసరుకుగా మార్చిన పాలకులే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలతో భ్రమలు కల్పిస్తున్నట్లుగానే; ఆహార భద్రతచట్టం అంటూనే ఆదివాసుల హక్కులన్నింటినీ హరించి వేస్తున్న పాలకులు, ఆదివాసీహక్కుల చట్టం-2006 పేరిట మరో చట్టాన్ని ముందుకు తెచ్చారు.

అటవీ ఉత్పత్తులు సేకరించి సంతల్లోనో, ఐటిడిఏ ద్వారానో అమ్ముకుంటూ, పోడు వ్యవసాయం చేసుకుంటూ సాప్రదాయక ఆదివాసుల జీవనం సాగిస్తూ వస్తున్నారు. తాము వ్యవసాయంచేస్తున్న ప్రాంతంలో భూసారం తగ్గాక మరో ప్రాంతాన్నెంచుకొని వ్యవసాయం చేయటమనే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే వీరు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు చట్టబద్ధ పట్టాలను, వాటిపై మరొకరి ఆధిపత్యాన్ని ఎరగరు. 

పాలకులు తీసుకువచ్చిన ఆదివాసీ హక్కుల చట్టం వీరికి అదనంగా హక్కులు కల్పించకపోగా, సాంప్రదాయకంగా అడవిపై సంక్రమించిన హక్కులను హరించివేయటానికే మరోరూపంలో పూనుకున్నది. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 5 ఎకరాల నిర్దిష్ఠ, నిర్ణీత అటవీ భూమిపై ప్రభుత్వ పట్టానిచ్చి, వారిని శాశ్వతంగా అక్కడివరకే కట్టడి చేయబూనుకోవడం ఈచట్టం అసలు ఉద్దేశ్యం. తద్వారా పాలకులు, మిగిలిన అటవీ భూములన్నింటినీ యథేచ్ఛగా దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు చట్టపరంగా వెసులుబాటు పొందే ఆలోచన దీని వెనుక దాగిఉంది.

సమతా కేసులో సుప్రీంకోర్టు 1/70ని పునరుద్ఘాటిస్తూ ఏజన్సీ ప్రాంత భూములను గిరిజనేతరులకు ఇవ్వరాదని పేర్కొన్నది. పాలకులు ఈ తీర్పును నీరుగార్చుతూ వచ్చారు. ఏజన్సీ ప్రాంత భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలో వినియోగిస్తున్నట్లుగా నాటకమాడి జిందాల్‌ వంటి వివిధ సంస్థలకు కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా తీవ్రనిర్బంధాన్ని, అణచివేతలను ఎదుర్కొంటూ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఒరిస్సాలోని కళింగ నగర్‌లో తమ భూములను ఆక్రమించి నిర్మిస్తున్న టాటా ఉక్కు కర్మాగార స్థాపనను నిరసించిన ఆదివాసులపై ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మందిని బలిగొంది.

‘పోస్కోకు ‘వేదాంత’ కోసం అటవీ భూఆక్రమణలకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాటం సాగిస్తున్నారు. మన రాష్ర్టంలోని విశాఖ జిల్లా చింతపల్లి ఏజన్సీలోని బాక్సైట్‌ గనుల తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కన్నెధారకొండ మైనింగ్‌ లీజుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 9 మండలాల పరిధిలోని 276 ఆదివాసీ గ్రామాలకు చెందిన లక్షాయాభైవేల మందిని నిర్వాసితుల్ని చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసులు బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ‘ఆడవికి ఆడవి’, ‘భూమికి భూమి’ నినాదంతో ఉద్యమిస్తున్నారు.

ఆదివాసుల జీవనాన్ని ఈ విధంగా విధ్వంసం చేయడంతో పాటు, వారి సంస్కృతిని, జీవన విధానాన్ని కూడా కనుమరుగుచేసేందుకు పాలకులు విష సాంస్కృతిక దాడిని తీవ్రం చేశారు. గత రెండు దశాబ్దాల కాలంలో సామ్రాజ్యవాద సాంస్కృతిక మాధ్యమాలను ఆదివాసుల మధ్యకు జొప్పిస్తున్నారు.ఆధునిక సౌకర్యాల పేరిట, విద్యుత్తు వెలుగుల మాటున వినోదం, విజ్ఞానం బదులుగా వస్తు వ్యామోహ సంస్కృతితో ముంచెత్తుతున్నారు. టీవిలను, సెల్‌ఫోన్లను ఆదివాసులకు కూడా అందుబాటులోకి తేవడమే వారి అభివృద్ధికి నిదర్శనంగా పాలకవర్గ మేధావులు పేర్కొంటున్నారు. 

ఆగస్టు 15, జనవరి 26ల సందర్భంగా మువ్వన్నెల జెండాలను ఎగురవేసి దళిత, పీడిత, తాడిత ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యంగా గొంతుచించుకొనే పాలకులు, ఆదివాసీల సంక్షేమానికి చేపడుతున్న విధానాలు, చర్యలు శూన్యమని స్పష్టమవుతున్నది. ఆదివాసుల విద్య, వైద్యం, సంక్షేమం కోసం కేటాయించిచే నిధులనుకూడా కుదించివేస్తున్నారు. రాష్ర్ట బడ్జెట్‌లో గిరిజన సబ్‌ప్లాన్‌క్రింద 6.6 శాతం నిధులను ఖర్చుచేయాలి. కానీ కేటాయించిన నిధులనైనా వెచ్చించకుండా ఇతరేతర పద్దులలోకి దారి మళ్ళిస్తున్నారు. 

ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆదివాసుల్లో 50 శాతం మందికి కనీస పౌష్ఠికాహారం అందడం లేదు. మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత, పౌష్ఠికాహార లోపం కారణంగా పురిట్లోనే ప్రాణాలు విడుస్తున్న పసిబిడ్డల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రతి వెయ్యి మంది శిశువులకు శిశు మరణాలు150 నుండి 250 వరకూ ఉంటున్నాయి. అత్యధిక ఆదివాసీ గ్రామాల్లో నేటికీ కనీస వైద్య సదుపాయం కానీ, తగిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు, వసతి సౌకర్యాలు కానీ అందుబాటులో లేవు.

1999లో విశాఖ ఏజన్సీలో విషజ్వరాల బారినపడి 3 వేల మందిి పైగా జనం మరణించిన సంఘటనపై నాటి మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ డా వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్‌ ప్రభుత్వానికి అందజేసిన నివేదికను పాలకులు ఏనాడో పాతిపెట్టేశారు. ఈ సంవత్సరం జులై నాటికే విశాఖ ఏజన్సీలోనే 100 మందికి పైగా ఆదివాసులు మరేరియా, డయేరియా, కామెర్లవ్యాధులతో చనిపోయారు. గత సంవత్సరం విజయనగరం జిల్లాలోనే 4 వేలమంది ఆదివాసులు మరేరియా బారిన పడ్డారు. ఇప్పటికే ఈ ఏడాది ఆదివాసీ ప్రాంతాల్లో 280 మంది డెంగ్యూ, మలేరియా వ్యాధులకు గురయ్యారు. 

ఫాల్సీఫారమ్‌ మలేరియా మెదడుకు సోకి మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ నాటికీ అదివాసుల్లో అక్షరాస్యత 16 శాతానికి మించలేదు. సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలను తలపిస్తున్నాయి. ఇప్పు గిరిజన సంక్షేమహాస్టళ్ళను, గురుకుల పాఠశాలలను కుదించి వేస్తున్నారు. గురుకుల ఆదివాసీ పాఠశాలల్లో ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరిపై వేధింపులు, లైంగిక దాడులు, దౌర్జన్యాలు సర్వసాధారణమయ్యాయి. ఇటీవల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చెబుతూ ‘గర్దాసిల్‌’ అనే టీకాను గురుకుల పాఠశాలలో చదువుకునే ఆదివాసీబాలికలపై ప్రభుత్వ ప్రోద్బలంతో ప్రయోగించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ అనైతిక ఔషధప్రయోగాల ఫలితంగా వీరిలో కొందరు మరణించగా అనేకమంది ఔషధ పరీక్షల దుష్ఫలితాలనెదుర్కొంటున్నారు.

అదివాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కుదించి వేస్తున్నారు. ఎలాంటి హక్కులు, భద్రత లేని తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతుల్లో మాత్రమే కొన్నైనా అవకాశాలు కల్పిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో 15 వేల అదివాసుల పోస్టులు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయలేదు.ఆదివాసీ యువకులకు ఈ మధ్యకాలంలో ఎమైనా ఉద్యోగాలు కల్పించారంటే అవి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యగాలు మాత్రమే!ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసుల పోరాటాలను ఏఎఫ్‌ఎస్‌పిఏ వంటి క్రూర చట్టాలతో పాలకులు అణయివేయ చూస్తున్నారు. అస్సాంలో ఆదివాసుల గుడిసెలను ఏనుగులతో తొక్కిస్తే, గుత్తికోయల గ్రామాలను మన రాష్ర్టంలో తగులబెట్టించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నారు. 

devid
‘గ్రీన్‌హంట్‌’ పేరిట పోలీసు, సైనిక బలగాలను మోహరిస్తున్నారు. నక్సలైట్లను అణచి వేసేందుకోసం ‘సాల్వజుడుం’ పేరిట ఆదివాసుల నుండే ప్రత్యేక బలగాలను రూపొందించి, శిక్షణ, ఆయుధాలుఇచ్చి వారిని ప్రయోగిస్తున్నారు.ఆదివాసీ ప్రాంతా ల వారు దోపిడీ వ్యవస్థపై పోరాటం ఎక్కుబెట్టకుండా అనేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. సమస్తవనరులనూ కొల్లగొట్టేనిమితం మానవరహి త అడవులుగా మార్చేందుకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పోరాట యోధులు బిర్సాముండా మొదలు కొమురంభీం వరకూ సాగించిన సమరశీల పోరాట స్ఫూర్తిని ఆదివాసీ ఉద్యమాలు స్వంతం చేసుకోవాలి. అటవీ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆదివాసులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సాగిస్తున్న ఉద్యమాలను ఇతర పీడిత వర్గాల సమన్వయంతో సాగించాలి

Namasete Telangana Telugu News Paper Dated : 22/12/2012

సాంస్కృతిక పునరుజ్జీవనం ---- గోగు శ్యామల


‘తెలంగాణ ధూంధాం’ ఇందూరు జిల్లా కామాడ్డిలో 2002 సెప్టెంబర్ 30న చిందుఎల్లమ్మ కాలి గజ్జెల సాక్షిగా పురుడు పోసుకున్నది. అద్బుత కళారూపమైన చిందు పేరెత్తి గొప్ప పని చేసిం డ్రు. తెలంగాణ వృత్తికులాలు, తెగలకు చెందిన అనేక కళారూపాలు కలగలిసిన ధూంధాం విశాలాంధ్ర దళారీ రాజకీయ శక్తులకు ఎలాంటి సందీయకుండా, సీమాంధ్ర టీ వీ చానళ్ల, పత్రికల, రాజకీయ పార్టీల దుష్ప్రచారానికి ధీటుగా, సకలజనుల కళారూపాలతో ప్రకాశిస్తున్న ధూంధాం ఇది.

నిజమే! తెలంగాణ ప్రజలందరికీ ఇది సాంస్కృతిక ఆయుధమే. కానీ ‘కత్తికి రెండువైపుల పదును’ అన్నట్టు మనకంటే ఎక్కువ, మనకంటే ముందు మన కళారూపాలు సాంస్కృతిక ఆయుధంగా మారింది సమైక్యాంవూధులకే. వీర తెలంగాణ పేరుతో విశాలాంవూధ ను, దున్నేవానికే భూమి, విశాలాంవూధలో ప్రజారాజ్యం, భూమి, భుక్తి, విముక్తి, ‘మరో ప్రపంచం మరో ప్రపంచం’ అనే నినాదాలు, పాటలు పాడి, మన కళారూపాలను వాడుకుని లగడపాటీలను, కావూరీలను, రామోజీలను, జగన్, వైఎస్‌లను తెలంగాణ నెత్తిమీద కూసోపెట్టిండ్రు. మన నీళ్లు, నిధులను, సర్వాన్నీ దోచిండ్రు. 

ఇదంతా వృత్తికారుల కళారూపాలను సాంస్కృతిక ఆయుధంగా మన పై ఎక్కుపెట్టి, మనల్ని మతగొల్పి, జడ్తవట్టిచ్చి ఎర్రజెండా పేరుతో బలిచ్చిండ్రు. మన జమిడీకే కథలు, మాదిగ మాష్టి డప్పులు, కంజెర్లు ఇతర వృత్తికులాల కళారూపాలైన బుడిగ, బుర్ర కథలు, వాడుకొని, ఒగ్గు, గొంగడి వేషాలు వేసి, అన్నీ పార్టీలు కలగలిసన విశాలాంధ్ర, ఐఎంఎఫ్ అమెరికన్ డాలర్ ఆంధ్రాను తెచ్చిండ్రు. తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేసిండ్రు. ఇదంతా తెలంగాణ కళారూపాలను ఆయుధంగా మల్చుకోవడం వల్ల మాత్రమే వారికి సాధ్యమైంది. అంటే యాభై ఏండ్లకిందటే వీటిని ఆంధ్రోళ్లు ఆయుధంగా చేసుడు మొదలుపెట్టిండ్రు. యాభై ఏండ్లు గా పాతుకుపోయిన విశాలాంధ్ర లూట్ మార్‌ను ఎండగట్టడంలో గత పదేండ్లుగా ధూంధాం, ధూం తడాఖనే చూపిస్తున్నది. ఇది తెలంగాణ సకల జనుల అనేక కళారూపాల సమ్మేళనం.

ఇందులో తెలంగాణ అస్తి త్వం కోసం, వనరుల, నీళ్ల, నిధుల, విద్య, ఉద్యోగాల, ఆత్మగౌరవం, అన్నింటికి మించి స్వయం పాలిత రాష్ట్రం కోసం రాజీలేని సాంస్కృతిక యుద్ధాన్ని ధూంధాం విజయవంతంగా నడుపుతున్నది. ఇది పార్టీయేతర సాంస్కృతిక యుద్ధం. ఈ ధూంధాం ఈ వర్గం, ఆ వర్గం అనే తేడాలేకుండా, ఎలాంటి విదేశీ పాశ్చాత్య భావజాలం లేకుండా అపూటమైన పునరుజ్జీవన ఉద్యమం. పునరుజ్జీవన ఉద్యమం అంటేనే చాలామంది మేధావులకు బెంగాలో, లేదా యూరప్ రెనైస్సాన్స్ మాత్రమే యాదికొస్తాయి. అక్కడ ఎంతమంది కవులు, గాయకులు, రచయితలు పుట్టిండ్రో తెలువది కానీ బెంగాల్ నిండ తొక్కుడు రిక్షాలు కాకుండా, పిక్కలు గడ్డకట్టంగా దేశంలో ఎక్కడా లేని గుంజుడు రిక్షాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 

గత పదేళ్ల సాంస్కృతిక పునరుజ్జీవనంతో తెలంగాణ వేలాదిమంది కవులును, రచయితలను, గాయకులను, కథకులను ప్రపంచం మీదికి తెచ్చింది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం ఏ ఎజెండా నుంచి వచ్చింది కాదు. ‘మాది మాకు’ అనే నేటివిటీ నుంచే వచ్చింది. ఈ ఒరవడిని ఎవరైనా గుర్తించకుండా ఉంటే అది వారికే నష్టం. ఎందుకంటే దేశంలో ఇలాంటి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం జరగలేదు. దీని యాభైఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు ఉన్నాయన్నది మరువకూడదు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పదేళ్లుగా తమ ఆటపాటలతో ధూంధాం జీవం పోస్తున్నది.

సమైక్యాంధ్ర అగ్రకుల మనువాదం, టీవీ, సినిమాల ద్వారా తెలంగాణ మీద విషం గక్కే గోబెల్స్ ప్రచారమై, ఫాసిజమై, దొరతనమై, తెలంగాణ ప్రజానీకంపై, తెలంగాణ సంస్కృతిపై, కళారూపాలపై దాడి చేసిం ది. కమ్యూనిస్టు ముసుగులేసుకొని కళారూపాల్లోకి, వాయిద్యాల్లో జొర్రిం ది. ఆ రూపాలను లోబరుచుకుని తన విశాలాంధ్ర దళారీ దోపిడీ సిద్ధాంతాన్ని అంటువ్యాధిలా అంటించింది. యాభై ఏళ్లుగా వివిధ రకాలుగా బలితీసుకుంది. తెలంగాణ జీవావరణాన్ని, జీవనోపాధులను విధ్వంసానికి గురిచేసింది. ఇలాంటి చోట తేటనీళ్ల చెలిమె వెలసినట్లు ధూంధాం తెలంగాణలో మొల్కల పున్నమైంది. తెలంగాణ వాకిట్లో వేపచెట్లు పచ్చగా విస్తరించి ఉన్నట్టు ధూంధాం అంతటా ఆటపాటలతో, రాష్ట్రం కోసం చైతన్యం పంచుతూ విస్తరించింది. ధూంధాంకు రసమయి బాలకిషన్ రథసారథిగా బాధ్యతనెత్తుకొని ఎంతమంది సాంస్కృతిక ఉద్యమ సారథులను తయారు చేసిండో! తెలంగాణ సకల రూపాలు తల్లిపాల స్వచ్ఛత గలవి. ఈ వృత్తి కళారూపాలతో రాష్ట్రం వచ్చే వరకు, తర్వా త కూడా ధూంధాం, మన సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా నడపాలి.

-గోగు శ్యామ

Namasete Telangana News Paper Dated: 22/12/2012 

ధూంధాం పదేళ్ల నడక---డాక్టర్ కాశీం



kishan
తిరుపతి ఏడు కొండలపై ప్రపంచ తెలుగుమహాసభలు. దక్కన్ పీఠభూమి హైద్రాబాద్ నడిబొడ్డున ధూంధాం పదేళ్ల సభ. కాలం కత్తి అంచున రాలుతున్న రక్తపు బొట్లను తాగి బలిసిన కోస్తాంధ్ర పెత్తనానికి నిలు సాక్ష్యం తెలుగు మహాసభలు. శ్రీకాకుళ పోరాటంలో సుబ్బారావు పాణి గ్రాహి, చిన బాబును చంపిన వెంగళరావు 1975లో తెలుగు మహాసభలను జరిపాడు. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని కనుమరుగు చేయడానికి తెలుగు భాషా ఉత్స వాలు సాధనమయ్యాయి. తెలంగాణ విద్యార్థులను, కవులను, కళాకారులను హత్య చేసినవాడు భాషపేరుతో ఊరేగాడు.

మళ్లీ ఇవ్వాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ప్రపంచ తెలుగు మహాసభల కు పూనుకున్నాడు. తెలంగాణలో వెయ్యిమంది విద్యార్థులు నేలరాలారు. రచయితలను, కళాకారులను (అరుణోదయ విమల)బంధిస్తున్నారు. తెలంగా ణ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నది. మరోవైపు పాలకులు భాష పేరుమీద పండగ చేస్తున్నారు. నేటి పాలకులు కాసు బ్రహ్మానందడ్డి, జలగం వారసులే. తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షను కనుమరుగు చేయటానికి తెలుగు భాషను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.

అందుకే తెలంగాణ బుద్ధిజీవులు ఆంధ్ర భాషా సాహిత్యాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ సాహిత్యం, కళారూపాల ను ఎజెండా మీదికి తీసుకురావాలి. ఈ సందర్భంలో హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఈనెల 22న జరుగుతున్న పదే ళ్ల ధూంధాం దశాబ్ది ఉత్సవాలు కాకుండా తెలుగు మహాసభలకు ధీటుగా తెలంగాణ కళలు, సాహిత్యాన్ని నిలబె వేదికగా మారాలి. తెలంగాణ ప్రజలపై కోస్తాంధ్ర పాలకులు ప్రయోగిస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా కలాలు, గళాలు విన్పించే శబ్దం కావాలి.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగా ణ గానకోకిల బెల్లి లలితను కోస్తాంధ్ర పాలకు లు పదిహేడు ముక్కలుగా నరికేసి, ఐలన్నను బూటకపు ఎన్‌కౌంటర్ చేసి విద్యార్థులను, మేధావులను జైళ్లలో బంధించి గద్దర్‌పై తుపా కి పేల్చి ఆట, పాట, మాటపై ఆంక్షలు విధించి న రోజుల్లో కళాకారుల సంఘటితశక్తిగా 2002 సెప్టెంబర్ 30న ధూం ధాం ఆవిర్భ వించింది. ఏ తెలుగు నిఘంటువును వెదికి నా ఈ పదం కనిపించదు. నిఘంటువుకు కావాల్సిన జనం పదాన్ని ఎజెండామీదికి తెచ్చిన ఘనత తెలంగాణ కళాకారులది. తెలంగాణ పల్లెలన్ని ధూంధాం ఆడాయి. రాజకీయ వేదికలన్నీ ధూంధాం సభలుగా మారాయి. కాలం విధించిన సామాజిక బాధ్యతను ధూం ధాం కళాకారులు నెరవేర్చా రు. బాలకిషన్ అనే అరుంధతి సుతుండు ధూంధాంకు సర్వనామమయిండు. సాధార ణ బడిపంతులు అసాధారణ మనిషిగా ఎద గటానికి ఈ కాలం సహకరించింది. ఈ నేల మీద చిందిన నెత్తురు, కారిన కన్నీళ్లు, రాలిన చెమట ధూంధాం పుట్టుకకు నేపథ్యమైంది.

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని కాళోజీ చెప్పినట్లు తెలం గాణ కోసం యాదగిరి అమరుడయ్యాడు. నైజాం ఘోరీ కట్టి చుక్కల్లో చంద్రుడ య్యాడు. పశుల పిలగాని చేతికి పాటను అందించి ముళ్లుగపూరను ఆయుధంగా మలచిన సుద్దాల హన్మంతు ఈ భూమి పుత్రుడే. తేనెపూసిన కత్తివి నీవు నెహ్రయ్యా అనగలిగిన సాహసం పోరాడే ప్రజలు తెలంగాణ కవులకు ఇచ్చారు. నాగలి మోసిన రైతు తుపాకిని ఎత్తి నైజాం సర్కారు మెడలు వంచితే రివిజని జం పార్లమెంటులో కూర్చుంది. రైతు భంగపడ్డాడు. ఊరుపోయింది. మళ్లీ తెలుగు నేలలో వసంత కాలమేఘం శ్రీకాకుళం మీదుగా తెలంగాణలో కురిసింది. ఈ వానకు తడిసి ఊరు మనదిరా/ ఈ వాడ మనదిరా/ దొర ఏందిరో/ వాని దోపిడేందిరో అంటూ గూడ అంజయ్య పాటల కొలిమి రాజేశాడు. చెర బండరాజు కొండలు పగలేసే బండలు పిండిన మనిషి కోసం కలాన్ని ఎక్కుపె ట్టాడు. సిరిమల్లె చెట్టు కింద ఒంటరి శోకం పెడుతున్న లచ్చుమమ్మ కొడుకుగా పుట్టిన గుమ్మడి విఠల్‌రావు తూప్రాన్ తుపాన్ బిడ్డగా గద్దరయ్యాడు. 

ఒరిగిపో యిన బిడ్డల కోసం కరిగిపోయిన గుండెలను ఎర్రజెండాలుగా మలచి నెత్తుటి జెండాను ఎత్తుకొని మురిసిపోయాడు.‘అన్నెము పున్నెము ఎరుగని చిన్నితమ్ము ల తీసుకెళ్లి/అడగరాని ప్రశ్నలడిగి అన్నలను చూపెట్టుమని’ రాజ్యం రౌడీగా మారినప్పుడు రాజ్యహింసను గానం చేస్తూ తిరిగిన బైరాగి గోరటి వెంకన్న పాటల చెలిమెలో ఊరిన నీటి చెమ్మ. ఈ ప్రజా వాగ్గేయకారుల పాటలకు చైతన్యం పొందిన రెండో తరం కళాకారులు కలిసి సృష్టించిన జలపాతమే తెలంగాణ ధూంధాం. జన నాట్య మండలి పాటలు పాడుకుంటూ అన్నలు ఇంటికొస్తే బువ్వపెట్టిన పిలగాడు ధూం ధాం రసమయిగా మారటానికి ఇంతటి చరిత్ర ఉంది. కోట్లాదిమందిని లాలించి, ఊగించిన పాట గురించి పాటను రాసిన భిక్షపతి ఎన్ని త్యాగాలను నెమరువేసుకొని ఉంటాడు. 

దయానర్సింగ్, నాగరాజు, నేర్నాల కిషోర్, అమరుడు కృష్ణవర్మ, గర్జన విద్యార్థి వీరులను మల్లెపులుగా మట్టి వాసనలుగా కవిత్వీకరించిన దరువు ఎల్లయ్య ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన సూర్యుళ్లను మరిగించిన అభినయ శ్రీనివాస్, దేశప తి, ఏపూరి సోమన్న ఇట్లా వందలాది గళాలు విచ్చుకోవటానికి జననాట్య మండ లి, అరుణోదయ సంస్థలు చిందించిన నెత్తురే కారణం. ఎక్కడో ఒకచోట వీళ్ల నాడుల్లో ఎరుపు ప్రవహిస్తుంది. వీళ్లందరి సామూహిక బృందగానమే ‘ధూంధాం’. వీళ్లందరిని కూడేసిన మనిషి మాత్రం కచ్చితంగా రసమయి బాలకిషన్. వ్యక్తులుగా గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, డప్పు రమేష్, అంద్శై, జయరాజ్ సంస్థలుగా అరుణోదయ, ప్రజాకళామండలి ఈధూంధాం విస్తరించడానికి మూలం. 

ఊరు, వాడ ఏకమై కళాకారుల కోసం 70వ దశకం ఎదురు చూసినట్లు, మళ్లీ ధూంధాం కళాకారుల కోసం ఎదురుచూసింది. నాయకులు వేదిక కింద కూర్చుంటే, కళాకారులు వేదికపై నుంచి పాటలు పాడే ప్రజాస్వామిక వాతా వరణానికి ధూంధాం పునాది వేసింది. కళాకారులే సభను నిర్వహించే స్థితి సృష్టించబడింది. దళితులే ఆటగాళ్లుగా, పాటగాళ్లుగా మారారు. నాయకులయ్యా రు, గాయకులయ్యారు. కొత్త సాహిత్య వస్తువు, కొత్త రూపం కష్టజీవి కనుకొ లుకుల నుంచి వచ్చింది. ఊరు, పేరు తెలి య ని కవులకు, కళాకారులకు ధూం ధాం వేదికయింది. ఏ ఉద్యమంలో లేని అద్భుత మైన రసాయన చర్య ధూంధాంలో జరిగింది. చరి త్రలో ఒక లోటును ధూంధాం పూడ్చింది. అల్లిక వారసత్వం నుంచి ఎదిగివచ్చిన అందె శ్రీ తెలంగాణ గొంతుల్లో జయజయహే తెలంగాణగా మారాడు. జనగర్జనల జడివాన ను కురిపించాడు. ఇదొక గుణాత్మక మార్పు. 

కానీ సమాజంలో పెరిగిన విలువల రాహి త్యం కళాకారులపై పడింది. చెడు అలవాట్ల కు, రాజకీయ నాయకులకు బానిసల య్యా రు. ఉద్యమం కోసం కాకుండా ఓట్ల కోసం, నోట్ల కోసం పాడటానికి పూనుకున్నారు. విప్లవ సాంస్కృతిక సంస్థలు బలంగా లేకపోవ డం వలన ఇలా జరిగిందని సంతృప్తి చెందితే ఉద్యమానికి నష్టం. సైద్ధాంతిక పునా ది లేని ధూం ధాంలే కళాకారులు ధ్వంసం కావటాని కి కారణమయ్యాయంటే తప్పు అన్నవాళ్లది కాదు. రాజకీయ నాయకులను ఓట్లలో గెలి పించడమే ప్రధాన లక్ష్యంగా ధూం ధాం ప్రయాణించటం కూడా కారణం. కవులు, కళాకారులు ప్రతిపక్షంగా ఉండాలనే ఎరుకను కళాకారులు మర్చిపోయారు. అగ్రకుల నాయకులు కళాకారులకుండే ప్రజాదరణ కు భయపడ్డారు. దీంతో వీళ్ల ప్రాధాన్యాన్ని తగ్గించటానికి కుట్రపూరితంగా ఈ విలువల రాహిత్యాన్ని పెంచారు. కళాకారులకు ఎప్పుడైనా బండి యాదగిరి, బెల్లిలలిత, గద్దర్ నమూ నా కావాలే తప్ప, రాజకీయ నాయకులు కాదు. 

కళాకారులు తెలంగాణ కోసం ఎన్నికలను ఎత్తిపట్టే వారుగా, ఉద్యమం ద్వారానే తెలంగాణ అని చెప్పే వారుగా చీలిపోయారు. ధూంధాం ఎన్నికల వైపు మొగ్గు చూపిందని చరిత్ర రుజువు చేసింది. గద్దర్ గౌరవాధ్యక్షులుగా, గూడ అంజయ్య అధ్యక్షులుగా తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఉద్యమాల ద్వారానే తెలంగాణ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. అంటరానివిగా చూసి న కళారూపాలను గౌరవంగా ప్రదర్శించిన తెలంగాణ ధూంధాం, సాంస్కృతిక ఉద్యమం ఇవాల్టి సందర్భంలో బలం పుంజుకోవాలి. ధూంధాం ఉత్సవాలుగా కాకుండా పదేళ్ల నడకలో జరిగిన లోటుపాట్లను చర్చించుకునే సభగా మార్చి తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. రసమయికి చరివూతలో చోటు దొరుకుతుంది. 

-డాక్టర్ కాశీం
(పదేళ్ల ధూంధాం సభ సందర్భంగా..

Namasete Telangana News Paper Dated: 22/12/2012

అంబేడ్కర్‌వాద ఫలమే ‘ఉపప్రణాళిక’---Donda Badraiah



విప్లవాన్ని వ్యాఖ్యానించడం కాదు, దాన్ని ఆచరించడమే ముఖ్యమని లెనిన్‌ చెప్పాడు. దళిత గిరిజన ఉప ప్రణాళిక బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన వారం రోజులకే ఉపప్రణాళికకు చెందిన రూ.8 కోట్లను భారత ఎన్నికలసంఘం నిర్వహించాల్సిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్రపరచే గోదాములకోసం మళ్ళించడాన్ని బట్టి, ఈ వర్గాల అభివృద్ధిపట్ల ప్రభుత్వాల చిత్తశుద్ధిని గమనంలోకి తీసుకోవలసిఉంది. దేశంలోని దళిత, ఆదివాసి వర్గాల ప్రజల అభివృద్థికి ప్రభుత్వాలు కొన్ని పథకాలు, చట్టాలు రూపొందిస్తున్నాయి. వాటిలో భాగంగా 1974లో ఎస్‌టి ఉప ప్రణాళిక, 1979లో ఎస్‌సి ఉపప్రణాళిక ప్రకటించారు. ఆ తరువాత 20 సూత్రాల పథకం వచ్చింది. 

వీటిని అమలు చేయడంలో ఇవే ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడంవల్ల దళిత ప్రజలు ఇప్పటికీ ఆశించిన అభివృద్ధిని సాధించలేక పోయారు. ఆ పథకాలను సక్రమంగా అమలుచేసి ఉంటే, నేడు ఎస్‌సి ఉపప్రణాళిక, ఎస్‌టి ఉపప్రణాళిక చట్టబద్ధత బిల్లు అవసరం ఉండేదికాదు. ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళిక చట్టబద్ధత బిల్లును శాసనసభ, శాసనమండలి ఆమోదించడం ఆహ్వానించదగింది. అయితే ప్రభుత్వం ఈ వర్గాల ప్రజలను అన్నిరంగాల్లో అభివృద్ధిలోకి తేవాలనే ఈ బిల్లును తీసుకువచ్చిందా అనేది ఆలోచించాలి. ఈ బిల్లును ఆమోదించినంత మాత్రాన ఆ వర్గాల ప్రజలు లక్షాధికారులు కాలేరు. ఈ బిల్లులో అనేక లోపాలున్నాయి. 

ఆ ఫలితమే బిల్లు ఆవమోదించిన వారం రోజులకే రూ. 8 కోట్లను మళ్లించడమే కాక, ప్రభుత్వం కనీసం దీనిపై సంజాయిషీకూడా ఇవ్వకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. ఈ బిల్లును ఆమోదించేందుకు జరిగిన సమావేశాల్లో చిన్న, పెద్ద తేడాలేకుండా అన్ని పార్టీలు తామంటే తాము ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి కృషిచేశామని, ఇక ముందుకూడా వీరి సర్వతోముఖాభి వృద్ధికి కట్టుబడిఉంటామని పోటీపడి చెప్పుకున్నారు. ఒక అంశం ఆకాంక్షగా రూపాంతరం చెందాలంటే దాని వెనుక ఎంతో సాహిత్య, సాంస్కృతిక బావజాలంతోపాటు స్థానిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా కారణమౌతాయి. దానికోసం ఎంతోమంది తమ విలువైన కాలాన్ని, మేధస్సును, శ్రమను ధారపోయాల్సి ఉంటుంది. అదే విధంగా సామాజిక న్యాయం అంశం ఈ రాష్ర్టంలో 80వ దశకంనుండి ఉనికిలోకి వచ్చింది. 

అదేకాలంలో జరిగిన కారంచేడు సంఘటన- ఈ దేశంలోనే సామాజిక సంక్షోభానికి సంకేతంగా రాజకీయ కుల పైశాచికత్వానికి ప్రతీకగా జరిగింది. ఈ ఘటన తర్వాత చుండూరు ఘటనతో బాధితుల ఉద్యమం సామాజిక న్యాయ అంశంతో రూపుదిద్దుకుంది. అప్పుడు దళిత ఉద్యమ వేడి ఢిల్లీని తాకింది. పర్యవసానంగా అనేక సామాజిక పరిణామాలు ఈ రాష్ర్టంలో చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత బహుజన సమాజ్‌ పార్టీ సామాజిక న్యాయం కోణంలో ‘ఓట్లు మావే, సీట్లూ మావే’ అంటూ రాజకీయ పిలుపు నిచ్చినప్పటికి సరియైన వ్యూహం లేక, నాయకుల మధ్య ఐక్యత లేక ఆ పార్టీ చతికిలపడిపోయింది. ఆ ఉద్యమాలన్నిటికి సైద్ధాంతిక భూమిక బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానం. 

ఈ ఆలోచనకు తోడుగా మహాత్మాజ్యోతి రావు ఫూలే సామాజిక ఉద్యమ స్ఫూర్తి కూడా ఎస్‌సి, ఎస్‌టిలకు తోడుగా బలహీన వర్గాలను కలుపుకు పోయేందుకు దోహదపడింది. ఈ విధంగా రాష్ర్టంలో దళిత గిరిజన బలహీన మైనారిటీ వర్గాలలో- సామాజికన్యాయ కోణంలో ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలనే ఆకాంక్ష క్రమంగా బలపడింది. ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అవమానాలపై ఉద్యమాలు చేయడం అవసరం. దళిత, బలహీన వర్గాలకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చొరవతో రాజ్యాంగంలో పొందు పరచిన రక్షణలు ఒక వైపు ఉన్నప్పటికీ, ఆ హక్కులు, రక్షణలు రాజ్యాంగానికి పరిమితమైతేనే సరిపోదు. వాటిని సాధించుకోవడానికి నిరంతరం పోరాటాలు చేయాలి.

ఎందుకంటే ఈ పాలక ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్న రక్షణలను కల్పించవు. అవి ఈ దేశ సామాజిక వ్యవస్థను, కుల కట్టుబాట్లను ఎదిరించేవిగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సమాజంలోని ప్రజలు కులాలుగా చీలిపోయి ఉన్నారు. రాజ్యాంగం అందరూ సమానమే అని చెబుతుంది. అయినా, అందరూ సమానమే అనే ప్రగతిశీల భావాన్ని దేశపాలకులు వెంటనే ఒప్పుకోరు. వారు పాలకులుగా ఉండేందుకు రాజ్యాంగం మీద ప్రమాణంచేసి పదవుల్లోకి వస్తారు. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పుకుంటూనే, ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులను అమలు చేసేందుకు ఇష్టపడరు. అందుకే దళిత, బలహీన వర్గాలు నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఆ హక్కులను ప్రభుత్వాలచేత అమలు చేయించుకుంటూ ఉపయోగించుకోవాలని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు. 

ఈ భావజాలాన్ని గౌరవించిన అనేక మంది సామాజిక ఉద్యమకారులు ఆ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూ, వాటి ఆధారంగా ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ దేశంలో అంబేడ్కర్‌ భావజాలాన్ని, సైద్ధాంతిక విధాలను వేలాదిమంది అంకిత భావంతో అనునిత్యం తమ రచనల ద్వారా, పోరాటాల ద్వారా సమావేశాల ద్వారా ఈ వర్గాల ప్రజలకు తెలియజేయడంలో నిమగ్నమవుతున్నారు. ఆ ప్రభావం ప్రభుత్వాలు తీసుకునే విధానాలపై పడుతుంది. ప్రభుత్వాలు తమ విధానాల్లో ఈ వర్గాల ఆకాంక్షలను జోడింప చేస్తున్నాయి. ఆవిధంగా జోడించిన విధానమే ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికలకు చట్టబద్ధతను కల్పించే బిల్లును ఆమోదించడం. 

అయితే ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు ఈ వర్గాల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాయి. అందుకు ఆ వర్గాల ప్రజలు డిమాండ్‌ చేసి, పోరాటాలు చేస్తే గాని ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ ప్రభుత్వాల పనితీరును అంబడ్కర్‌ స్వయంగా చూశారు కాబట్టి, ఈ దేశ సామాజిక వ్యవస్థ- ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై బలమైన ప్రభావాన్ని చూపించడాన్ని ఆయన అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి, ఈ వర్గాల ప్రజలు రాజ్యాంగంలోని హక్కులు, రక్షణలను పరిరక్షించుకోవాలంటే నిరంతరం ఉద్యమాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఆ పిలుపు ఈ దేశంలోని దళిత, ఆదివాసి, బలహీన వర్గాలను నడిపిస్తోంది. డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ తన జీవిత చరమాంకంలో దళిత గిరిజన వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, అధికారుల గురించి చాలా వేదనకు లోనయ్యారు. 

ఈ వర్గాల రాజకీయ నాయకులు, అధికారులు వారి వ్యక్తిగత జీవితాల, కుటుంబాల ఉన్నతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వాఉ ఈ వర్గాల ప్రజలకు మేలు జరిగేందుకు ఉపయోగపడాలని వాంఛించారు. అందుకే ఈ వర్గాలకు చెందిన ప్రజలు విద్యపై దృష్టి పెట్టి విద్యాధికులై ఈ దేశ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకొని, చైతన్యవంతులై రాజ్యాంగంలోని రక్షణల అమలుకు పోరాటాలు చేయాలని స్పష్టంచేశారు. ఆయన చెప్పిన మాటలు నేటికి కూడా అక్షర సత్యాలుగా మనముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ దేశపాలకులు, ప్రభుత్వాలకు దళిత గిరిజన వర్గాలను మిగతా వారితో సమాన స్థాయికి తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ 65సంవత్సరాల కాలం పడుతుందా? ఈరోజు ఈ ఉపప్రణాళిక అవసరం ఉంటుందా? రాష్ర్టంలో, 

దేశంలో నెలకొన్న దళిత ఆదివాసీల ఉద్యమ చైతన్యం వల్ల, ఆ వర్గాల ఉద్యమ నాయకుల త్యాగాల వల్ల, తద్వారా ఈ దేశంలో వ్యాప్తి చెందిన అంబేడ్కర్‌ భావజాలం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తోందని ఏ రాజకీయ నాయకుడు గుర్తించడం లేదు. ఇదేదో తాము సాధించిన ఘనతగా, లేదా తమ పార్టీ దాచుకున్నదంతా ఈ వర్గాల ప్రజలకు ఊరికే ఇస్తున్నంత ఘనంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అసెంబ్లీలో నాయకులు తమ తమ పార్టీల గొప్పతనాల గూర్చి ఉపన్యాసాలు ఇచ్చారు కానీ, ఈ 65 సంవత్సరాలుగా ఈ దుస్థితికి ఈ ప్రభుత్వాలే కారణమని ఎవరైనా చెప్పారా? తమ పార్టీ ఈ వర్గాలకు దాచిపెట్టిందని ఒకరు, ఈ వర్గాలకోసమే పుట్టిందని ఇంకొకరు, 

dontha
మా పార్టీలేకపోతే ఈ వర్గాలు అగ్రకులాల చెప్పులక్రింద ఉండేవారని మరొకరు పోటీపడి ఉపన్యాసాలు ఇచ్చారు. దళిత గిరిజన వర్గాల ప్రజలు ఈ సామాజిక వ్యవస్థ మూలాలను అర్థంచేసుకొని తద్వారా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అందుకోవడంతోనే అభివృద్థి జరుగుతుందని, హక్కులను ఈ ప్రభుత్వాలు అమలు చేయవు కాబట్టి వాటికోసం ఉద్యమాలే శరణ్య మని, హక్కులు భిక్షమెత్తుకుంటే రావు, పోరాడి సాధించు కోవాలని అంబేడ్కర్‌ ఉపదేశించాడు. ఈ ఆలోచనా విధానంతో ఉద్యమాలు చేస్తూ, అంబేడ్కర్‌ చెప్పిన భావజాలాన్ని సాహిత్యపరంగా, కళల ద్వారా, పోరాటాల ద్వారా ఎవరైతే వ్యాప్తి చేస్తున్నారో వారి విజయంగా ఈ ఉపప్రణాళికా బిల్లును భావించాలి.

Surya News Paper Dated : 21/12/2012