Sunday, December 9, 2012

ప్రశ్నార్థకమవుతున్న హక్కులు ---గుమ్మడి లక్ష్మినారాయణప్రపంచ దేశాలు ప్రతియేటా డిసెంబర్ 10 న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమును ఆనవాయితీగా నిర్వహిస్తున్నాయి. జాతి, మతం, కులం, భాష, ప్రాంతం మొదలైన వాటికి అతీతంగా అందరూ మానవ హక్కులు అనుభవించాలన్నదే మానవ హక్కుల దినోత్సవం లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల ప్రకటనను వెలువరించింది. ప్రముఖ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రీన్‌కాసిన్ ప్రమేయంతో 63 ఏళ్ల క్రితం రూపొందిన మానవ హక్కుల ప్రకటన’ మానవులందరూ స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, సమాన హక్కులతో జన్మించారు అని పేర్కొన్నది. ఈపదాలు అంతర్జాతీయ మానవహక్కుల చట్టానికి దోహదం చేశాయి. మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10ని పురస్కరించుకొని మానవ హక్కుల రంగంలో విశిష్ట సేవలందించిన వారికిచ్చే నోబెల్ బహుమతులను ఐక్యరాజ్యసమితి ప్రదానం చేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల అమలు తీరును పర్యవేక్షిస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కూడా దేశంలోని మానవ హక్కుల విషయంలో ఇంకా సంక్లిష్ట పరిస్థితి తొలగిపోలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వివక్షకు వ్యతిరేకంగా, బడుగు జీవులైతే దయనీయ స్థితిలోనూ, దైనందిన పోరాటం చేయక తప్పని పరిస్థితి.

భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న , సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి అనంతరం స్వాతంత్య్ర భారత రాజ్యాం గం ప్రజలకు ప్రాధమిక హక్కుల్ని ప్రసాదించి మత స్వాతంత్య్ర, దేశంలోపల, వెలుపల సంచరించే స్వేచ్ఛ పౌరుకిచ్చింది. భూమిపై తొలుత ఉద్బవించిన ఆదిమ, గిరిజన జాతులు 70 దేశాల్లో ఐదు వేల తెగలుగా 37 కోట్ల జనాభా ఉందని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఆదివాసుల వారసత్వ, అటవీ వనరుల, మానవ హక్కులపై 1982, ఆగస్టు 9న జెనీవాలో 26 మంది స్వతంత్ర మానవ హక్కుల నిపుణులతో జరిగిన వర్కింగ్ గ్రూపు సమావేశంలో ఆగస్టు9ని ప్రపంచ ఆదివాసుల దినోత్సవం’ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వవూపతినిధి సభ 1993లో తీర్మానం చేసి, 1994 ముసాయిదా ప్రకటనను వెలువరించింది. ఐక్యరాజ్యసమితి నిర్ణయానికి కట్టుబడి ఏదేశ ప్రభుత్వం ఆదివాసుల హక్కుల దినోత్సవంగా పాటించకపోవడం విచారకరం. మనదేశం కూడా భారత పౌరులుగా ఆదివాసుల రాజ్యాంగపరమైన హక్కులను రక్షించడంలేదు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం సహజవనరులున్న ఆదివాసీ ప్రాంతాల్లోనే ప్రవేశపెడుతున్న పరిక్షిశమలు, ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు, హరిత వేట వంటి రక్షణదళాల ఆపరేషన్లు మొదలైనవి చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన తీరు తేటతెల్లమవుతుంది.


దళిత, గిరిజన, నిమ్నకులాల ప్రజలు దేశవ్యాప్తంగా అంటరానితనం, తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని మానవ హక్కుల బృందాలు, పౌరహక్కుల సంఘాలు తరచూ ఆరోపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేకమైన చట్టాలున్నప్పటికే కనీస హక్కులను కూడా కాపాడుకోలేక ఆత్మరక్షణ వలయంలో చిక్కుకుంటున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘానికి వస్తున్న ఫిర్యాదుల్లో 35 శాతం పోలీసులకు వ్యతిరేకమైనవని నిర్ధారించింది. మనదేశంలో ఎస్సీ, ఎస్టీలు కోల్పోతున్న హక్కుల వివరాలను ఈఏడాది జరిగిన మానవ హక్కుల సార్వజనీన కాలిక సమీక్షా సమావేశంలో చైర్మన్ కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. ఇందులో జైళ్ళలో పరిమితి దాటడంతో అవి వ్యాధుల నిలయంగా మారాయి. చికిత్సలు అధ్వాన్నంగా ఉన్నాయి. 67శాతం మంది విచారణ ఖైదీలే కావడంతో కస్టడీ న్యాయం పెద్ద సమస్యగా మారింది. నిరుపేదలు సత్వర బెయిల్ పొందలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా పౌష్టికాహార లోపాన్ని అరికట్టలేకపోతున్నది. జాతీయగ్రామీణ ఉపాధి, హామీ పథకం కింద 5.5 కోట్ల మందికి ప్రభుత్వం పని కల్పిస్తున్నా, ఈ పథకం ద్వారా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, వారికి దీర్ఘకాలిక ఉపాధిని సృష్టించలేకపోతున్నది. 

గ్రామీణ ప్రాంతాలలో విద్యనాణ్యత తగ్గిపోయి అక్ష్యరాస్యత అట్టడుగుస్థాయిలో ఉన్నది. మౌలిక సదుపాయాల కల్పన అరకొరగా ఉన్నది. దేశంలోని 600 జిల్లాలకు గాను రెండు వందల జిల్లాలో వామపక్ష తీవ్రవాదం విస్తరించి ఉండగా, ప్రభుత్వం 60 జిల్లాలనే పేర్కొన్నది. అలాగైనా కనీసం 12కోట్ల మందిపై నక్సలిజం ప్రభావం ఉంది. కనుక ప్రభుత్వ కార్యక్షికమాలు ముందుకు సాగక హక్కుల ఉల్లంఘన పెరుగుతున్నదని పేర్కొన్నది. 

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2011 నవంబర్ 28 - డిసెంబర్ 9 వరకు దక్షిణావూఫికాలోని దర్భన్‌లో జరిగిన వాతావరణ సదస్సులో భూగోళాన్ని రక్షించగల కొత్త గ్రీన్ ఎకానమీ’ ప్రణాళికను రూపొందించారు. ఇందుకు రెడిప్లస్ (అడవుల నరికివేత, అడవుల వినాశనం వల్ల కలిగి ఉప ద్రవాల తగ్గింపు) విధానమును ఒప్పందం చేసి కర్బనాన్ని పీల్చుకునేందుకు గాను కొత్త తోటలను, ప్రత్యామ్నాయ అడవులను పెంచడానికి గాను వర్ధమాన దేశాలు తీర్మానించాయి. అంటే ఆదివాసుల సాగుభూమిని లాక్కుని నిర్వాసితులను చేయడం, వారి హక్కులను హరించడమే కదా! 

అనాదిగా సాగుచేసే ఆదివాసీల అటవీ భూములకు హక్కులు కల్పించేందుకు యూపీఏ ప్రభుత్వం ‘సామూహిక అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ను 2007 నుంచి అమలు చేస్తున్నప్పటికీ కేవలం 8 లక్షల హెక్టార్ల భూములకే హక్కు పత్రాలు పంపిణీ చేసింది. ఆది కూడా రాజ్యాంగంలో గిరిజనుల వారసత్వ జీవనానికి సంబంధించిన 5 వ షెడ్యూల్‌లోని అధికరణలు- 19,23,29, 330, 332, 334, 335, 338, 339 అమలు అరకొరగా ఉన్నది. గిరిజన రక్షణ చట్టాలు- భూ బదలాయింపు నిషేధ చట్టం (1/70), పంచాయితీరాజ్ విస్తణాధికారుల చట్టం (ఫెసా-1996) రూపొందిన పాలకవర్గాలే వాటిని ఉల్లంఘించడం శోచనీయం. పోలవరంలో నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు వల్ల ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల్లోని 306 గ్రామా ల ముంపుతో రెండున్నర లక్షల మంది బడుగులే నిర్వాసితులవుతున్నారు. ప్రాజెక్టు డిజైన్ భారీగా ఉండకుండా మార్పు చేస్తే వీరు వారసత్వ వనరుల, జీవన హక్కులను కోల్పోయే ప్రమాదం తప్పుతుంది.

దేశంలోని దళిత, గిరిజనులు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం-1989, 1995ను ప్రభుత్వం రూపొందించింది. చట్టం ఏర్పడి ఇరవై మూడేళ్లు గడిచినా వేధింపులు, వివక్ష తగ్గకపోగా అత్యాచారాల సంఖ్య 3, 945 కేసులతో (2009 వరకు) మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నది. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలైనా ఆదివాసీలు, దళితులపై అత్యాచారాలు, మారణకాండలు జరగని రోజులేదు. ఆదివాసీల అస్తిత్వం ఏమిటని ఆలోచిస్తే ఒక బాసగూడ, చింతల్నార్‌లో మారణకాండ, వాచతి, కాందహాల్, భల్లూగూడ, వాకపల్లిలో ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచారాలు గుర్తు కు వస్తాయి. దళితుల సంక్షేమంపై ప్రభు త్వ చిత్తశుద్ధి పరిశీలిస్తే - చండూరు, కారంచేడు, లక్షింపేట సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి సందర్భాలే ప్రభుత్వ పాలనా విధానాలను, మానవ హక్కులను వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికైనా రాజకీయ, విద్య, ఉపాధి ఉద్యోగ రంగంలో జనాభా దామాషా ప్రకారం తగిన ప్రాతినిధ్యం లభించేలా బడుగులు సామాజిక న్యాయం కోసం పోరాడడమే శరణ్యం.

-గుమ్మడి లక్ష్మినారాయణ
ఆదివాసీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
(డిసెంబర్ 10, ప్రపంచ మానవ హక్కుల దినం

Namasete Telangana News Paper Dated: 10/12/2012 

No comments:

Post a Comment