Saturday, December 8, 2012

డిసెంబర్ 9, ఒక నిజం-- Sampadakiyam



pranahita

ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక గాయపడిన చెట్టుంది! ఆ చెట్టుకు వందనం. సంతోష్ శవం వేలాడిన చెట్టు. జీవంతో తొణికిసలాడుతూ ఉన్న సంతోష్‌తో చివరి తెలంగాణ ముచ్చట్లు పంచుకున్న చెట్టు. సంతోష్ చివరి కోరికా, ఏమాత్రం మార్మికం కాని బహిరంగ ఆలాపనా ఆ చెట్టుకు తెలుసు. పచ్చదనం మాత్రమే ప్రపంచానికి పంచే ఆ చెట్టు సంతోష్ చివరి జీవునం తన్నుకులాడినప్పు డు మోడువారినట్టు విలవిలలాడినట్టున్నది. ఆ చెట్టు మూడేండ్ల కిందట సఫలమ యి విఫలమయిన కలను గన్న చెట్టు. యవ్వన తేజంతో వెలిగిన ఆర్ట్స్ కాలేజీ వైభవాన్ని, పోరాట సంప్రదాయాన్ని కళ్లు తెరుచుకుని చూసిన చెట్టు. అదొక సాఫల్యాన్ని కళ్లు విప్పార్చుకొని పత్రసతతంగా సయ్యాటలాడి వీక్షించింది. కొమ్మల తలలూపుతూ ‘కదనాన శత్రువుల కుత్తుకలు తెగటార్చ’ ఆకుల బాకులు దూసి ఇదీ తెలంగాణ అని విద్యార్థి వీరుల గానాలను విన్నది. గాలికి నృత్యం చేసింది. సంబురం అంబరమంటిన ఆ డిసెంబర్ 9 అర్ధరాత్రీ, అపరాత్రీ తెల్లవారిందాకా ఊగితూగిన తెలంగాణవాదులతో కత్తుకలిపింది. కదం కలిపింది. పదం కలిపింది. ఆ చెట్టు ఇంకా కలగంటున్నది. డిసెంబర్ 9 నిజమే. అది ఆరు దశాబ్దాల దుఃఖ సమువూదపు చివరి ఒడ్డు. అంతంలేని బాధల గాధల పల్లవుల చివరి చరణం. ఆ రాత్రి. ఎంతకీ తెల్లారని రాత్రి. మూడేండ్ల తర్వాత కూడా కలలోలా? మెలకువలాగా సందిగ్ధం లాగా సంధిలాగా.. జ్వరపీడనలాగా. ప్రేలాపనలాగా, ఆలాపనలాగా, ఆర్సిపెట్టిన దద్దరిల్లి ప్రతిధ్వనించిన ఆర్ట్స్ కాలేజీ ఏకశిలా స్తంభాలలో పరివ్యాపించిన కేకలాగా.. తెలంగాణ వచ్చింది. మున్నూటా అరవై తొమ్మిది మంది త్యాగాల మునుమే కదా! వెయ్యిమంది బలిదానాల తెగువే కదా! తెలంగాణ, తెలంగాణ.. గుండె గుండె కూ వ్యాపించింది తెలంగాణ. మనం గెలిచాం.. ఆడుదాం ధూలా. నెగళ్లు ఎగసిన ఆర్ట్స్ కాలేజీ. డిసెంబర్ రాత్రి చలికి వేడి పుట్టించిన ఆకాశమెత్తు ఎగిసిన నినాదాలు. దిక్కులు పిక్కటిల్లే చివరి నినాదం. 

గెలుపూ మనదే. విజయహాసమూ మనదే. జై తెలంగాణ. చెట్టు సంబరపడింది. చెట్టు కొంచెం క్షోభపడింది. తరతరాల దుక్కం వెక్కిళ్లలోకి అంతమైంది. కానీ, కానీ, కానీ... మూడేండ్ల తర్వాత ఒకానొక విషాద రాత్రి. కేరింతలు కొట్టిన యవ్వనం. డస్సిపోయి, భంగపడి చెట్టుదగ్గర నిలబడింది. తెలంగాణ ఇంకా తెల్లారలేదు. ఇస్ రాత్‌కా సుభా నహీఁ. విసిగిపోయాను ఈ ప్రపంచం మీద, రాజకీయాల మీద.. చివరికి ప్రజాస్వామ్యం మీదా నాలుక మడిచిన ప్రజాస్వామ్య సౌధాల మీద. చివరికి జీవితంమీదా రోసిపోయిన వాడు నిలబడ్డప్పుడు దుక్కాన్నీ, నవ్వునీ, సంబురాన్నీ, విషాదాన్నీ ఏకకాలంలో అనుభవించి న ఆ చెట్టు గజగజా వణికింది. పత్రహరితంలా పరుచుకోవాల్సిన యవ్వనం, పండు వెన్నెలై వికసించాల్సిన యవ్వనం, పండిత, సిద్ధాంత చర్చల్లో పరిఢవిల్లాల్సిన యవ్వ నం, ప్రేమలో వికసించే విద్యుత్తేజం కావాల్సిన యవ్వనం నిండురూపంతో తనముందు నిలబడి తల్లడిల్లినప్పుడు ఆ చెట్టు భయంతోనూ, భీతితోనూ మూర్ఛనలు పోయింది. రాజకీయమా! ఏమి శెరపెట్టినవ్ ఈ తెలంగాణ బిడ్డలకు. 

మ్రాన్పడిపోయింది చెట్టు. ఉరితాడు వేస్తున్నప్పుడు బిగుసుకుపోయింది. శవమై వేలాడినప్పుడు కన్నీటి చుక్కలు విడిచి మ్రాన్పడిపోయింది చెట్టు. ఆ చెట్టు ఇప్పుడు మౌన సాక్షి. ఆ చెట్టు ఇప్పుడు ఘనీభవించిన నిశ్శబ్ద సంకేతం. ఆ చెట్టు ఇప్పుడు పిట్ట పీచుమనని నీరవ నిశబ్దంలోకి జారుకున్నది. ఆ చెట్టుకు వందనం. సంతోష్ కూ, అతని తెల్లారని కలకూ వందనం. ఆ కల తెల్లారాల్సి ఉన్నది. ఆ కల సాకారం అయ్యే తీరవలసి ఉన్నది. అది తెలంగాణ. డిసెంబర్ 9 నిజమే. అది వర్తమానంలో దశాబ్దాల పేదనలకు ఒక ఊరట. రెక్కవిప్పి గర్జించిన ఆత్మగౌరవ విజయ చిహ్నం డిసెంబర్ 9. ఆ డిసెంబర్ విని ఆవాహన చేసుకోవడమే చెట్టు సందేశం. ఆ చెట్టే మన ప్రాణం. ప్రాణమై వికసించడమే. నిరాశ నుంచీ, నీరసాల నుంచీ, అచేతన నుంచి, నిశ్శబ్దాలను బద్దలుకొట్టడమే చెట్టు జీవనసారం. యస్. డిసెంబర్ 9 ఒక స్ఫూర్తి. ఒక ఆలంబన. ఒక పోరాటం. గెలిచిన రోజు. కేసీఆర్ ఆస్పవూతిలో మరణపు మెట్ల ముందు దీక్షలో ఉన్నాడు. తెలంగాణ భగ్గున మండింది. అంటుకున్నది తెలంగాణ. విద్యార్థులు గర్జించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు లేచిన గుడారాల్లో విప్లవాలకు కలలు నేర్పారు. కత్తులకు కోలాటం నేర్పింది తెలంగాణ ఎత్తిన జెండా. ఆర్ట్స్ కాలేజీ నిద్రపోలేదు. అవును ముట్టడిస్తాం అసెంబ్లీని. ఎంతకైతె గంతకాయె. మాకు తెలంగాణ కావాలె. ముట్టడిస్తాం మీ సౌధాలను. డిసెంబర్ 9 ఒక కల విడుదలయింది. ఒక రాత్రి ఇంకా తెల్లారనేలేదు.

‘డూ నాట్ డై’కృషాంక్, తలపగిలిన భాస్కర్ ఢిల్లీలో ఉన్నట్టున్నారు. తల్లిచెట్టుకు దూరంగా. ఆర్ట్స్ కాలేజీ బోసిపోయి ఉన్నది. నిన్న కూడా ఇక్కడ సభ జరిగింది. చెట్టు తలూపి ఉంటుంది. మౌనంగా చూసి ఉంటుంది. అది సంతోష్ దుక్కంలో మునిగిపోయి ఉంటుంది. ఢిల్లీ తోలుబొమ్మలాటల కేంద్రం. అదొక ఆత్మలేని సిమెంటు తాపడం చేసిన నగరం. జర్రున జారే రోడ్ల మీద ప్రవహిస్తున్న తెలంగాణ యవ్వనం. జాడ తప్పి జంతర్ మంతర్ ముందర. అవును మేం ముట్టడిస్తాం. దేన్ని. ఆర్ట్స్ కాలేజీ బోసిపోయి ఉన్నది. మూడేండ్ల కిందటి సంబురాలు లేవు. ఢిల్లీ గేట్ల ముందర ఆట. గారడి ఆటలకు గుండెలు తెరుచుకోవు. శాస్త్రి భవన్ చెట్టుకు వేలాడిన యాదిడ్డి. ఢిల్లీకి కూడా అంటిన తెలంగాణ నెత్తుటి చారిక. టెన్ జనపథ్ లో మరుగున పడిన త్యాగాల కలలను కూడా గుర్తించదు. సాఫల్యాలనూ వైఫల్యం చేసే గారడి విద్యలు తెలిసినవారు మూగిన ప్రాంతాలు మన నిషేధిత ప్రాంతాలు.

చివరికిలా మిగిలామా? యూటూ.... వీధులు ఎదురు చూస్తున్న వేళ. అసెంబ్లీ భవనాలు ముట్టడి కోసం ఇనుప కంచెలు కట్టుకుంటున్న వేళ. ఉవ్వెత్తున ఎగసే అలల కోసం ట్యాంక్‌బండూ, నెక్లెస్‌రోడ్డూ ఎదురుచూస్తున్న వేళ జంతర్‌మంతర్ దగ్గర దిగాలు పడ్తున్న యవ్వనం. ఆర్ట్స్ కాలేజీ ఢిల్లీకి తరలిపోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ ఆత్మలను కోల్పోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ అపవూభంశపు పోకడలు పోతున్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ ముందరి ఆ చెట్టు విలవిలలాడింది. తండ్లాడింది. బిడ్డలారా! గొంతు గద్గదమై ఏ మాటా చెప్పలేకపోయింది చెట్టు. బతుకు ఇక్కడే. చావు ఇక్కడే. బాతఖానీ క్లబ్బుల్లో ప్రవహించే అబద్ధాల సాలెగూడుల్లోకి వెళ్లకండి వీరులారా! విద్యార్థులారా! సంతోష్ మీద ఆన.. మీ కోసం ఆర్ట్స్ కాలేజీ ముందరి మైదానం ఎదురుచూస్తున్నది. సబ్బండ వర్ణాలు, సబ్బండ జాక్‌లు ఒక్కటై, ఒక్క పొలికేక పెట్టి.. అయ్యో! నిజమే ఉద్యమం ‘ఇన్నోసెన్స్’ను కోరుకుంటుంది. త్యాగనిరతిని కోరుకుంటుంది. ఉద్యమం ఐచ్ఛికతనూ, అంకితభావాన్ని, స్వీయ ప్రయోజన రాహిత్యాన్ని కోరుకుంటుంది. ఏవవి. మిత్రులారా! పోగొట్టుకున్నాం మనం. 

కానీ పొందడానికి ఏమీ లేదు. ఇంకా మూడేండ్ల కిందటి డిసెంబర్ అతి పొడవైన ఆ రాత్రి తెల్లరనే లేదు. నిజమే. స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరకగలిగిన వాడే నేటి హీరో... తెలంగాణ పిలుస్తున్నది. నిజమే ఢిల్లీల లేదు పరిష్కారం. నిజమే గల్లీలనే ఉన్నది. జీనాహైఁతో మర్‌నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో.. తెలంగాణ వచ్చింది. దాన్ని కాపాడుకోవడమే. ఒక కల సాకారమైంది. దాన్ని అనుభవించి పలవరించడమే. పట్టిన పట్టు సడలకపోవడమే. తోలుబొమ్మలాటల్లో చిక్కుపడిన దారపు కండె ఉద్యమం.

ఈంట్‌కా జవాబ్ పత్థర్‌సే...
ప్రతీకారం కోరుతున్నది తెలంగాణ. వర్నిలో ఆంధ్రులు తెలంగాణ పిల్లలను కొట్టారు. తెలుసా! రెండు ఇటుకల మధ్య తల ఇరికించి ఇప్పుడనరా! సమైక్యాంధ్ర జిందాబాద్ అని హింసించిన వాడి చిరునామా నిజామాబాద్. పాలమూరు విశ్వవిద్యాలయంలో పోలీసులు, షర్మిల సేన నెత్తురు కళ్ల చూశారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులకు బహుమానం. భైంసాలో ఇల్లిల్లు తిరిగీ కొట్టారు పోలీసులు. మాలల తిరుగుబాటు. మన్నాల తిరుగుబాటు. చంద్రబాబూ తెలంగాణపై తేల్చమన్నందుకు లాఠీల కరాళనృత్యం. ప్రపంచం సజావుగా ఉన్నది. కవి తీవ్ర అభినివేశంతో మరో కవిత రాసుకుంటున్నాడు. సంకలనం కొత్తదొకటి తయారవుతున్నది. ఇప్పుడిది సందర్భం. పాటగాడు కొత్త క్యాసెట్ కోసం రికార్డింగ్ థియేటర్ గుమ్మం ముందు నిలుచున్నాడు. వీర విద్యార్థి ఒకడు నియోజకవర్గం ముందు తలదూర్చుకుని నిలుచున్నాడు. యువసేన తెలంగాణ క్రికెట్ ఆటాడుతున్నది. ఇందిరాపార్క్ ముందు పదమూడోసారి ధర్నాలో ప్రసంగిస్తున్నడు ఒక నాయకుడు తెలంగాణపై ఏమి చేయాలన్న మీమాంసలో సదస్సు జరుగుతున్నది. వేదికలు పునరుక్తి దోషాలతో తడబడ్తున్నవి.

టీవీ చర్చలో పదహారోసారి. తెలంగాణను రోషంతో వీరరసంతో నూటా ఒక్కటో సారి అదే భాషతో పలికిస్తున్నడు విశ్లేషకుడు. చంద్రబాబు కు, షర్మిలకు, కిరణ్‌కుమార్‌డ్డికీ తెలంగాణ మీద అప్రకటిత ప్రేమ కలిగినందు వల్ల వారు ఊరూరా పొరుకపోడుగా పదఘట్టనలతో ఊదరగొడ్తున్నారు. ఢిల్లీకెళ్లిన చైతన్యం.. చెట్టు ప్రాణవాయువు నింపుకుని రాయి విసిరి రక్తమోడుతున్నది. పల్లెబాటలు బారులు తీరుతున్నవి పతాకాలు. కూద్ ఖేల్.. మస్తీ మజా.. జంప్ జిలానీలు అగ్గడ్‌బగ్గడ్ ఆగమాగంగ దుంకుతున్నరు. తరాజులో న్యాయంవేపు ఆశగా చూస్తున్నదొక బిచ్చగత్తె. ఎఫ్‌డీఐల్లో విప్లవాన్ని కలగంటున్నడు కురువృద్ధుడైన మన్‌మోహన్‌సింగ్. ప్రపంచం సజావుగానే ఉన్నది.

వర్నిలో గాయపడిన పిల్లగాని పెయ్యి సలుపుతున్నది. అతనికి లోలోన ఆక్రమించుకున్న కలకూడా సలుపుతున్నది. లగడపాటి మళ్లీ మాట్లాడాడు తీవ్ర విద్వేషంతో. యూనివర్సీటీకి రా దమ్ముంటే అని విద్యార్థి నాయకుడొకరు సవాల్ చేశాడు. అతను ఆర్ట్స్ కాలేజీని మూతేయమని చెప్పినవాడు. రాడు. లగడపాటిని వెతకాల్సిన పనిలేదు. కానీ వెతుకులాటలేని వ్యథల జీవితంలో ‘డూ నాట్ డై’... నిజమే. దిమ్మెలుండవు. జెండాలుండవు. ఫ్లెక్సీలు తగులబడుతవి. డిసెంబర్ 9 ఒక సఫలమైన కల. డిసెంబర్ 9 ఒక ఆకాంక్షకు అర్థవంతమైన ముగింపు. తెలంగాణ దానిచుట్టూ బరిగీసి నిలబడి ఉన్నది. రక్షించుకుందాం డిసెంబర్ 9ని.. అది మన తెల్లారని రాత్రి. కనుప్పలల్లో దాగున్న విజయం. ఖబడ్దార్ డిసెంబర్ 9 నిజం. అఖిలపక్షా లు, అడ్డగోలు ప్రకటనలు ఇంకానా ఇక చెల్లవు. రగులుకుంటున్నది రగల్ జెండా. తెలంగాణ డిసెంబర్ 9ని కీర్తిస్తున్నది. ఆవాహన చేసుకుంటున్నది. నమ్ముతున్నది.. ఆర్ట్స్ కాలేజీలో మూడేండ్ల కింద ప్రారంభమైన సంబరాలు.. అతి పొడవైన ఈ రాత్రి నుంచి వేకువ కోసం ఎదురు చూస్తున్నది.. రగులుకుంటున్నది. ఎర్రటి పొద్దు. అవును తెల్లవారక మానదు. తెలంగాణ రాక మానదు. ఇంటి వాకిట్లో నిలబడి ఉన్నడు శ్రీకాంతచారి నిలువెత్తు మంటల్లో.. ఇక తప్పదు. అడ్డంపడ్డ వారి చీకటి కొట్టాలకు నిప్పంటక మానదు. మళ్లీ పాడతాం అదేపాట.. ఆ చెట్టుకు మొక్కి.. చెట్టు ఆకుల బాకులు దూసేదాక.. ఈ రాత్రి తెల్లారే దాకా.. చెట్టు మీద ఆన.. జై తెలంగాణ.

-అల్లం నారాయ

Andhra Jyothi News Paper Dated: 9/12/2012 

No comments:

Post a Comment