Wednesday, December 5, 2012

కులనిర్మూలన మార్గదర్శకుడు - పాపని నాగరాజుఅంబేద్కర్ గురించి మాట్లాడుకోవటమంటే కులవ్యవస్థ గురించి మాట్లాడుకోవడమే. కులవ్యవస్థలో అంతర్భాగమైన వర్ణవ్యవస్థ గురించి మాట్లాడుకోవడమే. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యామ్నాయంగా కుల స్థిరీకరణ వాద వ్యతిరేక, కుల-వర్గ వ్యవస్థల నిర్మూలన గురించి మాట్లాడుకోవడమే. ఈ దేశంలోని కులవాదులు, వర్గవాదులు అంబేద్కర్‌ను ఈ దృష్టితో చూడకపోవడంతో బ్రాహ్మణీయ అగ్రకుల పాలకవర్గాలు రాయితీలు, రాజ్యాధికారానికే(ఎంపీ, ఎమ్మెల్యే) పరిమితం చేసి నిజమైన కుల అణిచివేత, వివక్షత, విభజన వ్యతిరేక స్వయం గౌరవం, సామాజిక న్యాయాన్ని (ఎవరెంతో - వారికంతా!, మీది మీకు - మాది మాకు!) కాలగర్భంలో కలిపి వారి అధికారాన్ని, కుల స్థిరీకరణను సుస్థిరం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏక కులపోరాట వాదులు, ఏక వర్గపోరాట వాదులు వైఫల్యం చెందడమే. కనుక కులవ్యవస్థ వ్యతిరేక పోరాటాల్ని వర్గవ్యవస్థ వ్యతిరేక పోరాటంతో సమన్వయం చేసుకొని ఈ దేశ సామాజిక విప్లవాన్ని నిర్మించే పాత్రను తీసుకోవాల్సిన బాధ్యత నిజమైన అంబేద్కర్, మార్క్స్ వాదులది.

అంబేద్కర్‌ను, తను పుట్టిన శూద్రవర్ణంలోని మెజార్టీ ప్రజల్ని ఈ దేశంలోని వర్ణ-కుల వ్యవస్థ మనుషులుగా చూడ నిరాకరించి అణచివేసి, వివక్ష చూపి అమానవీయంగా దోపిడీ చేసింది. అందుకే అంబేద్కర్ కులవ్యవస్థ వ్యతిరేకతను కలిగి, ఆచరణ ద్వారా దాని నిర్మూలనకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దృష్టితోనే ఎన్నికష్టాలెదురైనా విద్యను మానలేదు. ప్రపంచ చరిత్రను, మానవ సమాజ పరిణామక్రమాన్ని, సామాజిక, రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్ని, బ్రాహ్మణవాద శాస్త్రాల్ని అధ్యయనం చేశారు. ఈ చరిత్ర అవలోకనం చేసుకోవడంతోనే సింధు ప్రాంతంలో ఆర్యులు దండయాత్ర చేసి వర్ణ-కుల వ్యవస్థల్ని ఎలా నిర్మించారో అధ్యయనం చేశారు. అందుకే ప్రపంచ మేధావులు ఐదుగురిలో ఒకరుగా అంబేద్కర్ పేరొందారు.

కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటంలో భాగంగా అంబేద్కర్ పలు పోరాటాలు చేశారు. 1928లో సా«ధారణ నియోజకవర్గాలతో పాటు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని, అస్పృశ్యులకు వయోజన ఓటు హక్కు కావాలని కింది కులాల పక్షాన పోరాడారు. 1938 ఫిబ్రవరిలో రైల్వే కార్మికుల సభలో పాల్గొని 'బ్రాహ్మణిజం-క్యాపిటలిజం' ఈ రెండూ ఇండియా ప్రజలకు ప్రధాన శత్రువులని ప్రకటించారు. మౌలిక పరిశ్రమలు, భూమి తదితరాలు జాతీయం చేయాలంటూ ప్రకటించారు. 1949లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిందూకోడ్ బిల్లు(స్త్రీలకు జీవించే హక్కు, స్వేచ్ఛ కావాలని)ను ప్రవేశపెట్టారు. బ్రాహ్మణులైన ఆర్ఎస్ఎస్ వాది స్వామికర్ పతీజీ మహారాజ్, బాబు రాజేంద్ర ప్రసాద్, రాంనారాయణ సింగ్‌ల వ్యతిరేక ఉద్యమ ప్రభావంతో నెహ్రూ ఆ సాకును చూపి బిల్లును అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు చిన్న రాష్ట్రాల్ని ఏర్పాటు వల్ల పీడిత కులాలు అధికారంలోకొస్తారని, పరిపాలనకు సౌలభ్యముంటుందని చిన్న రాష్ట్రాల ఏర్పాటును బలపర్చారు.

బ్రాహ్మణిజం సృష్టించిన దేవుళ్లను, వేదాల్ని, పురాణాల్ని, పుట్టుపూర్వోత్తరాల్ని తన రచనల ద్వారా బయటపెట్టి సమాజాన్ని మేల్కొలిపారు. గాంధీ, కాంగ్రెస్‌లు హిందూ మత - కుల రక్షణను చేపట్టి శూద్రాతిశూద్ర ప్రజల్ని ఆధునిక బానిసలుగా చేసేందుకే ఏర్పడ్డాయని అంబేద్కర్ నిరూపించారు. ఈ దృష్టితోనే 1927 డిసెంబర్ 25న మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేశారు. అందుకే ఆర్ఎస్ఎస్ వాదులు అంబేద్కర్‌ను హిందూ కులవ్యవస్థకు వ్యతిరేకిగా ప్రకటిస్తారు. మొత్తంగా అంబేద్కర్‌ను కేంద్రం చేసుకుని ఈ దేశ పీడిత ప్రజల నిర్మూలనకు బ్రాహ్మణీయ 'హిందూ' కులతత్వవాదులు విధ్వంసం చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండియాలో కులరహిత, వర్గరహిత సమతా రాజ్యాన్ని నిర్మించేందుకు ఇండియా విప్లవకారులు అంబేద్కర్ కుల నిర్మూలన కార్యక్రమాన్ని పరిశీలించి స్వీకరించడం అవసరం.

హిందూ మతం మూలవాసులైన శూద్రాతిశూద్రులను మనుషులుగా చూడలేదు కనుక కులవ్యవస్థకు ముఖద్వారమైన హిందూ మతాన్ని తిరస్కరించి బౌద్ధాన్ని స్వీకరించారు అంబేద్కర్. బౌద్ధం మూలవాసుల్ని మనుషులుగా గుర్తించడమే అందుకు కారణం. ఈ మతస్వీకరణే అంబేద్కర్ ఆలోచనా విధానానికి ఆటంకంగా మారి తే ఆ మత స్వీకరణను విమర్శనాత్మకంగా తిరస్కరించాలిందేగానీ ఆ పేరుతో అంబేద్కర్ ఆలోచనను స్వీకరించరాదనడం విచారకరం.

బ్రిటిష్ వలసవాదులు, వారి పరిపాలన ద్వారా అస్పృశ్యులైన దళిత బహుజన ఆదివాసీ గిరిజన, మత మైనార్టీ ప్రజలకు హక్కులు పొందడంతోనే బ్రాహ్మణీయ మార్క్సిస్టులు, విప్లవ మార్క్సిస్టులు అంబేద్కర్‌ను సామ్రాజ్యవాదుల ఏజెంట్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇండియా అధికార మార్పిడి కాబోతున్న సమయంలో బ్రాహ్మణ పాలకులు ఈ ప్రజలకు ఏమీ అందివ్వబోరని, వారికన్నా బ్రిటిష్ వలసవాదులే బడుగుల హక్కుల్ని గుర్తిస్తారని వారితో పోరాడాడు. ఇదే అంబేద్కర్ చేసిన నేరమా? నేడు నక్సలైట్, ప్రజా ఉద్యమాలు ఈ ప్రభుత్వాలు ప్రజల్ని హత్యచేస్తున్నాయని గ్రహించి వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అరెస్టు చేస్తే విడుదల చేయమని ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి విడుదల చేయిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాన్ని తిరస్కరించే వారు ఇలా విడుదల చేయమని అడగడం ఎలా సరైందో అంబేద్కర్ బ్రిటిష్ వారిని కింది కులాల హక్కుల్ని అడగడమూ అలానే సరైంది. దీనిని సాకుగా చూపి బ్రాహ్మణత్వాన్ని తిరస్కరించలేని బ్రాహ్మణ మార్కిస్టులు, విప్లవ మార్కిస్టులు అంబేద్కర్‌ను బ్రిటిష్ వలసవాదుల ఏజెంట్‌గా చిత్రీకరించారు. ఇదే బ్రాహ్మణీయ మార్క్సిస్టు వాదం.

ఈ దృష్టితో అంబేద్కర్ సహాయాన్ని స్వీకరించిన వీరన్న కొంతమేరకు ప్రయోగం చేసి మార్గాన్ని చూపారు. కనుక కుల పోరాటమంటే కుల స్థిరీకరణ కాదు, వర్గ పోరాటాన్ని మోసుకెళ్లే విప్లవ పోరాటం. వర్గపోరాటాన్ని విజయవంతం చేసే పోరాటంగా కులపోరాటాల్ని ప్రత్యామ్నాయ దృష్టితో నిర్మించాల్సి ఉంది. అప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి.

- పాపని నాగరాజు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక తెలంగాణ మహాసభ
(నేడు డా.బి.ఆర్. అంబేద్కర్ 56వ వర్ధంతి)

Andhra Jyothi News Paper Dated: 6/12/2012

No comments:

Post a Comment