December 28, 2012
కొత్త చానళ్ళకోసం మొదలైన హడావిడి
సొంత చానళ్ళకోసం పార్టీల ఆరాటం
మూడు చానెళ్ళలో కాంగ్రెస్ నేతల వాటాలు
ఏర్పాట్లు ముమ్మరం చేసిన వామపక్షాలు
తమిళనాట రాజకీయ చానళ్ళకు అంకురార్పణ
కేరళ, కర్ణాటకలలోనూ ఇదే ధోరణి
ప్రచారానికీ, ప్రతి విమర్శలకూ ఆయుధం
నిష్పాక్షికత, ప్రభుత్వ వ్యతిరేకతలకే ఆదరణ
ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయ పార్టీలు తమకంటూ సొంత చానళ్ళు ఉండాలని గట్టిగా నమ్ముతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది కొత్త కాకపోయినా ఇప్పుడు తెలుగునాట మాత్రం ఈ ధోరణి ఒక్కసారిగా విజృంభించింది. ముఖ్యంగా 2014 ఎన్నికలు దగ్గరయ్యేకొద్దీ కొత్త చానళ్ళ ఏర్పాట్ల హడావిడి మొదలైంది. ఆ మాటకొస్తే, 2009 ఎన్నికలకు ముందుకూడా ఇలాంటి హడావిడి కనిపించినా అప్పట్లో కాంగ్రెస్ మాత్రమే తన వాదన బలంగా వినిపించటానికి తనకంటూ ఒక చానల్ అవసరమని భావించింది. నిష్పాక్షికమని చెప్పుకుంటూ మరికొన్ని చానళ్ళు వచ్చాయి. కానీ ఆ తరువాత వచ్చిన పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సాక్షి టీవీ ఆదర్శంగా మారింది. కనీసం మూడు చానళ్ళలో కాంగ్రెస్ ప్రముఖులు ఇటీవలికాలంలో వాటా తీసుకోగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు త్వరలో తమ తమ న్యూస్ చానళ్ళను ప్రజలకు అందించటానికి ఏర్పాట్లు వేగవంతం చేశాయి. మరోవైపు కాంగ్రెస్‌లో విలీనం కాకముందు పిఆర్‌పి నాయకులు కూడా కెసిటీవీ (కొణిదెల చిరంజీవి టీవీ?) పేరుతో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినా, విలీనం తరువాత పెండింగ్‌లో పడింది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక చానల్ ఉండాలనుకున్న ఆలోచన వచ్చిందే తడవుగా ధర్మాన అధ్యక్షతన ఒక కమిటీ వేసి మరీ ఆ అవసరాన్ని ధ్రువపరుచుకుంది. కేరళలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చానల్ ఎలా నడుస్తున్నదో తెలుసుకొని కూడా వచ్చాక ఎఐసిసి చేత కొంత పెట్టుబడి పెట్టించవచ్చునన్న ఊహాగానాలూ వచ్చాయి. అయిప్పటికీ ఆ తరువాత ఎందుకో తెలియదుగాని, ముఖ్య నేతలు ఎవరికి వాళ్ళు టీవీ రంగంలోకి దిగారు. తమ బంధువులు, అనుయాయుల ద్వారా చానళ్ళు నడపాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఒకటికి మూడు చానళ్ళు కాంగ్రెస్ పరమయ్యాయి. మొత్తానికి 2009 ఎన్నికలకూ, 2014 ఎన్నికలకూ చానళ్ళ విషయంలో ఇదొక చెప్పుకోదగిన మార్పు. ఎన్నికల సమయంలో ప్రకటనల రూపంలో కాకుండా డబ్బు తీసుకొని ప్రసారం చేసే పెయిడ్ ప్రోగ్రామ్స్ (సానుకూల ప్రచార కార్యక్రమాల) దెబ్బకు భయపడి సొంత చానళ్ళు ఉంటే బయటి చానళ్ళుకు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే జగన్ పార్టీ పట్ల ఆదరణ పెరగటానికి సాక్షి టీవీ కారణమనే అభిప్రాయంతో ఈ దారిపట్టారా అనేది నిర్దిష్ఠంగా చెప్పటం కుదరదు.
కానీ ఇప్పుడున్న చానళ్ళు తమకు, తమ వాదానికీ తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని మాత్రం రాజకీయ పార్టీలు అనుకున్నట్టున్నాయి.ఇంతకు ముందు రాజకీయ పార్టీలు తమ భావజాలానికి తగినంత ప్రాచుర్యం కల్పించాలనే ధ్యేయంతో పార్టీ పత్రికలు ప్రారంభించేవి. స్పష్టంగా అవి తమ పార్టీ పత్రికలని చెప్పుకునేవి. కానీ న్యూస్ చానళ్ళ విషయంలో మాత్రం పార్టీ పేరు నేరుగా చెప్పుకోవడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ధోరణి బాగా పెరిగిపోతోంది. ముందుగా తమిళనాట సన్ టీవీ విజయంతో జయలలిత కూడా సొంత చానల్ అవసరమనే నిర్ణయానికొచ్చారు. అలా శశికళ అన్న కుమారుడు భాస్కరన్ చేత జెజె టీవీ పేరుతో ఒక చానల్ పెట్టించినా, ఫెరా కేసుల్లో ఇరుక్కొని అది మూతబడింది. ఆ తరువాత అన్ని జాగ్రత్తలూ తీసుకొని జయ టీవీ ప్రారంభించారు. దానికి అనుబంధంగా న్యూస్ చానల్ మొదలెట్టారు. ఆ తరువాత మిగిలిన అన్ని పార్టీలూ చానళ్ళ మీద దృష్టిపెట్టాయి. పిఎంకె కోసం మక్కళ్ టీవీ, కాంగ్రెస్ కోసం తంగబాలు ఆధ్వర్యంలో మెగా టీవీ, కుమరి వసంతన్ ఆధ్వర్యంలో వసంత్ టీవీ, వైగో నాయకత్వంలోని ఎండిఎంకె కోసం ఇమయం టీవీ, డిఎండికె నాయకుడు విజయకాంత్ కోసం కెప్టెన్ టీవీ నడుస్తున్నాయి.
మారన్ సోదరులమీద అలిగినప్పుడు కరుణానిధి తనకంటూ మరొక చానల్ ఉండాలని కలైంజ్నర్ న్యూస్ చానల్ మొదలుపెట్టారు.ఇక కేరళ విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ కోసం రమేశ్ చెన్నితల ఆధ్వర్యంలో జైహింద్ టీవీ, సిపిఎం వారి కైరలి టీవీ ఉండగా, ఇండియన్ యూనియన్ ముస్లిమ్ లీగ్ (ఐయుఎంఎల్) నాయకుడు, మాజీమంత్రి ఎంకె మునీర్‌కు ఇండియా విజన్‌లో భారీ వాటాలున్నాయి. కర్ణాటకలోనూ ఇదే ధోరణి సాగుతోంది. బిజెపి నుంచి గెలిచిన గాలి బ్రదర్స్ జనార్దన్, శ్రీరాములు కలిసి జనశ్రీ పేరుతో ఒక న్యూస్ చానల్ ప్రారంభించారు. దాన్నే ఇప్పుడు వాళ్ళు తాము కొత్తగా పెట్టుకున్న బిఎస్‌ఆర్ పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి గౌడ (జెడిఎస్) నడుపుతున్న ‘కస్తూరి న్యూస్’ను ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు ప్రారంభించినా, ఇప్పుడు యెడ్యూరప్ప సన్నిహితుడు మురుగేష్ నిరాని నిర్వహణలో ఉన్న ‘సమయ న్యూస్’ ఆయా రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
ఇంతకీ రాజకీయపార్టీలు తమకు సొంత చానళ్ళు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాయి? ఇప్పుడున్న చానళ్ళు తగినంత ప్రచారం ఇవ్వడంలేదన్నది పైకి చెప్పుకుంటున్న ఒక కారణం. అది నిజమా? ఎవరు ఎంత ప్రచారం కోరుకుంటున్నారు? తగినంత అంటే ఎంత? దీనికి సరైన సమాధానం దొరకదు. మరో కారణం- ప్రత్యర్థులకు చానల్ ఉండటం. అవతలివాళ్ళకు చానల్ ఉండటం వలన ప్రయోజనం పొందుతున్నారనే అభిప్రాయం కలగటం. పార్టీ కార్యక్రమాలను, సిద్ధాంతాలను విరివిగా ప్రచారం చేసుకోవటానికి చానల్ పనికొస్తుందనేది మూడో కారణం. ఇంకో విధంగా చెప్పాలంటే తమమీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టటానికి ఒక సొంత చానల్ అవసరమని భావించటం. పార్టీ మీద వచ్చే విమర్శలకు సమాధానం ఏం చెప్పాలో, అవతలి వాళ్ళను ఎలా విమర్శించాలో తగిన ఆయుధాలు కార్యకర్తలకు అందించటం ద్వారా రచ్చబండల దగ్గర జరిగే చర్చోపచర్చల్లో తమ పార్టీ వాళ్ళ వాదన బాగా పదునెక్కటానికి చానల్ అందించే కార్యక్రమాలు పనికొస్తాయనే భావన నాలుగో కారణం.
వీటన్నిటికీ తోడుగా ఎన్నికల సమయంలో తమ పార్టీవాళ్ళ ప్రచారవ్యయంలో ఎక్కువభాగం తమ చానళ్ళకే వచ్చేట్టు చూసుకోవచ్చుననేది ఐదో కారణం.అయితే, కేవలం ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తే ప్రజలు ఆ చానల్ చూస్తారా? ముందుగా తమిళనాడు అనుభవాన్ని పరిశీలిద్దాం. డిఎంకెకి అనుకూలంగా ఉండే సన్ టీవీ వార్తలకున్న ప్రజాదరణను, అన్నా డిఎంకె అనుకూల జయ టీవీ వార్తలతో పోల్చిచూస్తే సన్ టీవీ లో పాతిక శాతాన్నిమించి జయ టీవీ ఏనాడూ రేటింగ్స్ తెచ్చుకోలేక పోయింది. పార్టీ కార్యకర్తలందరూ నిజంగా ఆయా చానళ్ళు చూస్తుంటే అది రేటింగ్స్‌లో ప్రతిఫలించాలికదా! అలాచూడటం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. పత్రికలకూ, టీవీకీ ఇక్కడే చాలా పెద్ద తేడా ఉంది.ఏదోవిధంగా నచ్చజెప్పి పత్రికకు చందా కట్టించవచ్చు. ముఖ్యంగా పార్టీ నాయకులచేత, కార్యకర్తల చేత. అలా చందాదారుల సంఖ్య పెంచుకొని సర్క్యులేషన్‌లో అది ప్రతిబింబించేలా చూసుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ నాయకులచేత, కార్యకర్తల చేత కాస్త మొహమాటపెట్టయినా చందా కట్టించవచ్చు. కానీ టీవీ విషయంలో అది సాధ్యంకాదు. బలవంతంగా టీవీ చూపించలేం. చేతిలో రిమోట్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు చానల్ మారుస్తూనే ఉంటారు.
ఏ మాత్రం నచ్చకపోయినా, విసుగొచ్చినా క్షణాల్లో మరో చానల్‌కి వెళ్ళిపోవటం ఖాయం. అలాంటప్పుడు తన పార్టీ వాళ్ళ చానలా, ప్రత్యర్థిపార్టీ చానలా అనేది ఆలోచించరు. నిజంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ న్యూస్ చానల్ చూస్తున్నారని అనుకుంటే కచ్చితంగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లకూ, వాటి చానళ్ళు సంపాదించిన రేటింగ్స్‌కూ పోలిక ఉండాలి. కానీ ఎక్కడా అలా జరగటం లేదు.ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, పరోక్షంగా ఒక పార్టీకి సాయపడేలా వ్యవహరించిన చానళ్ళు చాలా ఉన్నాయి. పనిగట్టుకొని ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చానళ్ళు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రయోజనం పొంది, అందుకు ప్రతిఫలంగా ఏదైనా ఒక నిర్దిష్ఠ సందర్భంలో సాయపడుతూ వస్తున్న చానళ్ళు కూడా ఉన్నాయని మనకు ఆయా సందర్భాల్లో అర్థమవుతూనే ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తనమీద, తన పార్టీ మీద కక్షగట్టాయని ఆరోపించి, పార్టీకి సొంత మీడియా అవసరమని నేరుగా ప్రకటించిన వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షి పత్రిక, సాక్షి టీవీ ప్రారంభించి బాహా బాహీ తలపడాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీన్ని సమర్థించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జగన్ సొంతపార్టీ పెట్టుకున్న తరువాత అదే చానల్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.
కానీ ఆ చానల్ నిలదొక్కుకోవటమేగాక గడిచిన ఏడాదికాలంలో తెలుగు న్యూస్ చానళ్ళులో సగటున మూడో స్థానంలో నిలవటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. పార్టీ ఎదుగుదలకు సాక్షి టీవీ బాగా ఉపయోగపడిందనే అభిప్రాయమే ఈ రోజు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా సొంత చానళ్ళు పెట్టుకోవాలన్న నిర్ణయానికి రావటానికి కారణమైంది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ బలోపేతమవటానికి సాక్షి టీవీ కారణమా? సాక్షి టీవీ విజయానికి పార్టీ కారణమా? పార్టీ కార్యకర్తలవలన చానల్ విజయవంతమవుతోందా? సాక్షి టీవీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నరోజుల్లో దాని రేటింగ్స్ ఇంత గొప్పగా లేవు. కాంగ్రెస్ మీద దాడి మొదలుపెట్టిన తరువాతే రేటింగ్స్‌లో ముందుకు దూసుకొచ్చింది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టటమే సాక్షి టీవీ విజయంవెనుక అసలు రహస్యం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఖర్చుకు వెనుకాడకపోవటం లాంటివి ఎలాగూ మరికొంత సాయపడ్డాయి. ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే, న్యూస్ చానళ్ళలో వార్తలకంటే ఇతర కార్యక్రమాలే ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి.
సాక్షి టీవీ అందుకు మినహాయింపేమీ కాదు. సాక్షిలో ప్రసారమయ్యే వార్తేతర కార్యక్రమాలకు ఎక్కువరేటింగ్స్ వస్తున్నమాట నిజం. పైగా, సాక్షి ప్రసారాలు మారుమూల గ్రామాలకుకూడా అందేలా దాదాపు పదివేల రిసీవర్ బాక్సులు పంపిణీ అయ్యాయి. మరే ఇతర న్యూస్ చానల్ ఇందులో సగం కూడా అందించలేకపోయింది. సహజంగానే, ఇవన్నీ సాక్షి టీవీ విజయానికి కారణమయ్యాయి.
ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా పార్టీల చానళ్ళు ప్రజాదరణ పొందిన దాఖలాలు ఉన్నాయా? అన్ని రాజకీయపార్టీలకూ చానళ్ళు ఉన్న తమిళనాడులో ఏ పార్టీతోనూ సంబంధం లేని పుదియ తలై మురై మొట్టమొదటిస్థానంలో ఉండటానికి కారణమేమిటి? కర్ణాటకలో టీవీ 9 కన్నడ, సువర్ణ న్యూస్ మాత్రమే ప్రజాభిమానం పొందటానికి కారణం- అవి ఏ రాజకీయ పార్టీకీ కొమ్ము కాయకపోవటమే కాదా? అదే విధంగా కేరళలో ఏషియానెట్, మనోరమ, రిపోర్టర్ టీవీలు మాత్రమే ముందుండటానికి వాటి తటస్థ వైఖరే కారణమని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టటానికి వెనుకాడని ధోరణి కూడా మరో కారణం.చానళ్ళు పెట్టే అన్ని రాజకీయపక్షాలూ ఆ విధంగా నిష్పాక్షికంగా పనిచేయగలవా? ఉద్యమస్ఫూర్తిని రగిలించటానికి చానల్ అవసరమని భావించిన టిఆర్‌ఎస్ కూడా తన చానల్ విషయంలో ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేదు. నమస్తే తెలంగాణ పత్రిక విజయమైనంతగా టీ చానల్ ప్రజాదరణ పొందలేకపోవటం చూశాం.
పత్రికలు చదవటం కంటే వినోదానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే టీవీ ప్రేక్షకుల స్వభావం కూడా అందుకు కారణం.ఈ అంశాలేవీ గమనించకుండా, రాజకీయ పార్టీలన్నిటికీ చానళ్ళు అవసరమనే అభిప్రాయానికి రావటం గుడ్డెద్దు చేలో పడ్డట్టే ఉంటుంది. ఇలా చానళ్ళు పెట్టాలనుకుంటున్న రాజకీయ పార్టీలకు ఇప్పుడున్న చానళ్ళ మీద నమ్మకం లేకపోవటం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. వాటికి సొంత చానల్ ఆలోచన వచ్చిందంటే, మెజారిటీ చానళ్ళు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆ పార్టీల ఉద్దేశమా? అదే నిజమైతే ఇప్పుడున్న చానళ్ళు అన్నీ అదెంతవరకు నిజమో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఏది వార్త, ఏది ప్రచారం అని తెలుసుకోగలిగే శక్తి ప్రజలకు వచ్చేసింది. అయినప్పటికీ ప్రచారం కోసం చానల్ పెట్టాలనుకుంటే ఏప్రయోజనాలను ఆశిస్తున్నారో కూడా జనం అర్థం చేసుకుంటారు.
Surya Telugu News Paper Dated: 28/12/2012
No comments:
Post a Comment