Sunday, December 16, 2012

ఆదివాసీలకు అందని ఐటీడీఏ ఫలాలు---వూకే రామకృష్ణ




దేశానికి స్వాతంత్య్ర వచ్చి 65 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఆదివాసీలకు మాత్రం నిజమైన స్వాతంత్య్రం రాలేదు. సర్వసత్తాక, సామ్యవాద, గణతంత్ర రాజ్యంలో ఆదివాసీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పాలక వర్గాలు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఆదివాసీల కోసం చేపడుతున్నామని ప్రచారం చేస్తున్నాయి. అయితే ఆదివాసీలకు మాత్రం అవి అందటం లేదు. ఐటీడీఏ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు 1970లో గిరిజనులను సమక్షిగంగా అభివృద్ధి చేయటం కోసం ప్రవేశపెట్టారు. ఆచరణలో ఐటీడీఏలు ఆదివాసీలను సమక్షిగంగా అభివృద్ధి చేయటంలో విఫలమవుతున్నాయి. ఐటీడీఏలో ఉన్నతాధికారిగా ఒక ఐఏఎస్‌ను ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ- ఐటీడీఏ)గా నియమిస్తారు. సాధారణంగా ఐఏఎస్ అధికారుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉంటున్నారు. అందులో ఎక్కువ శాతం ఆదివాసేతరులు కావటం వల్ల వారికి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, వారి చట్టాలపై సరైన అవగాహన ఉండదు. దీని మూలంగా ఆదివాసీలు చాలా నష్టపోతున్నారు.
ఆంధ్రవూపదేశ్‌లో మూడు తెగల గిరిజనులను నిజమైన ఆదివాసీలుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో కొన్ని కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆదివాసీల్లో కొన్ని తెగలకు మాత్రమే ఐటీడీఏ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్య, రంగాల్లో సమక్షిగమైన అభివృద్ధి లేక ఆదివాసీలు వెనుకబడిపోతున్నారు. జీవో 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీలను నియమించాలని ఉన్నప్పటికీ ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల్లో ఆదివాసీలను నియమించాల్సి ఉండగా, గిరిజనేతరులు దొంగ సర్టిఫికేట్లతోఅడ్డదారిలో ఉద్యోగాలు సంపాదిస్తూ, ఆదివాసీలను దెబ్బతీస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 1950 జీవో 3 ప్రకారం ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్స్ ఆదివాసీలకు మాత్రమే జారీ చేయాల్సి ఉండగా, రెవె న్యూ అధికారులు లంచాలకు ఆశపడి గిరిజనేతరులకు కూడా సర్టిఫికేట్లు ఇస్తున్నారు. దీంతో నిజమైన ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా ఐటీడీఏ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంఘాలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకునే వారులేరు. రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్డ్‌ను అమలు చేయాలని ఆదివాసీలకు న్యాయం చేయాలని ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఆదివాసీల అమాయకత్వం, నిరక్షరాస్యత మూలంగా ఐటీడీఏ ఫలాలు, సంక్షేమ పథకాలు అందటం లేదు. మన రాష్ట్రంలో ఉన్న 11 ఐటీడీఏల్లో మొత్తం ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. కొన్ని ఐటీడీఏ కేంద్రాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. ఐటీడీఏ కోసం వందల కోట్లు ప్రభుత్వం కేటాయిస్తున్నప్పటికీ అవి ఎక్కడ ఖర్చుపెడుతున్నారో, ఐటీడీఏ అధికారులు కచ్చితంగా చెప్పడం లేదు. ఐటీడీఏ ఆఫీసులో ఏదైనా సమస్య, లేదా ‘లోను’ కోసం వెళితే ఆదివాసీలను వింతగా చూస్తూ వారిని అవమానపరుస్తున్నారు. ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లో చాలావరకు గిరిజనేతరులు ఉపాధ్యాయులుగా ఉంటున్నారు. ఆదివాసీల పేరుమీద గిరిజనేతరులు లోన్లు, ఇతర ఆర్థికపరమైన లావాదేవీలు జరుపుతున్నారు. అసలు ఐటీడీఏ ఉన్నది ఆదివాసీలను అభివృద్ధి చేయటం కోసమా నాశనం చేయడం కోసమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆశ్రమ పాఠశాలలో (ఐటీడీఏ పరిధిలో ఉన్నవి) ఆదివాసీలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ వారికి ప్రమోషన్లు లేక వెట్టిచాకిరి చేస్తున్నారు. పదేళ్ల సర్వీసు దాటిన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఐటీడీఏలో జీవోలు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేయకుండాఅధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారు. వారిపై ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో వేలాది ఎకరాల ఆదివాసీలు భూములు అన్యాక్షికాంతం అవుతున్నాయి. ఐటీడీఏ అధికారులు అవినీతిపరులుగా మారి ఆదివాసీల చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారు. దీంతో ఆదివాసీల భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో అగ్రవర్ణాల వలసలు పెరిగిపోయి ఆదివాసీలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు.ఖమ్మం జిల్లాలో కొన్ని ఏజెన్సీ మండలాల్లో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో చాలామంది ఆదివాసీలను జైళ్లలో నిర్బంధిస్తున్నారు. ఆదివాసీలు నిత్యం బతుకు పోరులో బలవుతూ నేడు వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

ఈ సమాజం ఆదివాసులను కేవలం అడవి మనుషులుగా, అనాగరికులుగా చూస్తున్నది. అడవిలో జంతువులకు ఉన్న రక్షణ ఆదివాసులకు అవసరమన్న విషయాన్ని మన పాలకులు మరిచిపోతున్నారు. పులుల రక్షణ కోసం అభయారణ్యాలను ఏర్పాటు చేసి, టైగర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఆదివాసుల జీవితాలను ఆగం చేస్తున్నది. గిరిజనులను నిర్వాసితులను చేసి నిలవ నీడలేకుండా చేస్తున్నది. అభివృద్ధిపేర, వనరుల వెలికితీత పేర ఆదివాసీ భూములను కాజేస్తున్నారు. దీనికి తోడు ప్రపంచీకరణ తోడైంది. ఛత్తీస్‌గఢ్‌లోజరుగుతున్న గ్రీన్‌హంట్ కూడా ఆదివాసులే లక్ష్యంగా సాగుతున్నది. పచ్చటి అడవిలో నెత్తు పారిస్తున్నారు. మరోవైపు సీజనల్ వ్యాధులతో యేటా వందలాదిమంది గిరిజనులు చనిపోతున్నా పట్టించుకోవడంలేదు. కనీస వైద్య సదుపాయాలు, రక్షిత మంచినీరులేక మలేరియా, కలరా, భయంకరమైన చర్మవ్యాధులతో ఆదివాసులు అలమటిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పే పాలకులు ఆదివాసుల జీవించే హక్కును హరిస్తున్నారు. ఆదివాసులకు సంబంధించిన పథకాలన్నీ సక్రమంగా అమలు కావాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులనే ఉద్యోగాల్లో నియమించాలి. ఏజెన్సీ డీఎస్సీలాగే అన్ని శాఖల్లో ఆదివాసులకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ వేయాలి. గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి ఆ ప్రాంతంలో పనిచేసే పోలీస్‌లనూ, పోలీస్ శాఖనూ ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలి. చదువులో ఆదివాసీ యువతీ యువకులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించాలి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ లాగానే ట్రైబల్ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. లేకుంటే.. ఆదివాసులు తమ హక్కుల రక్షణ కోసం అనివార్యంగా పోరుబాట పట్టక తప్పదు. అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, వనరుల వెలికితీత పేరుతో ఆదివాసులను నిర్వాసితులను చేసే విధానాలకు పాలకులు స్వస్థి పలకాలి. ఆదివాసీ ప్రజలపై ప్రభుత్వం సాగిస్తున్న అన్ని రకాల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసులకు అండగా నిలబడాలి. ఆదివాసుల విముక్తి కోసం సాగుతున్న పోరాటాలకు మద్దతుగా నిలవాలి. 


ఆదివాసీ రచయితల సంఘం, రాష్ట్ర కార్యద
Namasete Telangana News Paper Dated: 16/12/2012

No comments:

Post a Comment