Saturday, December 8, 2012

పురంధరుల చరిత్ర విధ్వంసం - జిలుకర శ్రీనివాస్చారిత్రక వారసత్వ సంపద లేని మట్టి దిబ్బగా ఈ దేశాన్ని తయారు చేయాలని యురేషియా బ్రాహ్మణవాద పాలకులు కుట్రలు పన్నుతుంటే ఈ దేశాన్ని ఏలాలని కలలు గనే బహుజనులు రాజకీయ యుద్ధం చేసేందుకు సిద్ధపడతారా? రాజకీయాధికారాన్ని కాపాడుకొనేందుకు మతతత్వాన్ని పెంచిపోషిస్తున్న పాలకుల 'కుల రాజకీయాల'ను అర్థం చేసుకోవాలంటే రాజకీయ చర్చలు మతం ప్రాతిపదికన కాకుండా కులం ప్రాతిపదికన జరగాలి. అప్పుడే చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోగలం. 

ఏ నాగరిక సమాజానికైనా చారిత్రక ఆనవాళ్లే గర్వాన్నీ ఘనతనూ అందిస్తాయి. మానవ నాగరికతకు చిహ్నాలైన పురాతన కట్టడాలనూ ఆకారాలనూ కాపాడుకోవటం ప్రపంచం యొక్క ప్రధాన కర్తవ్యం. ప్రపంచంలోని అన్ని దేశాలు చారిత్రక వారసత్వ సంపదను అన్ని రకాల అసౌకర్యాలకూ ఇబ్బందులకూ ఓర్చి పరిరక్షించుకుంటూ ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం అలాంటి ప్రయత్నమేమీ జరగటం లేదు. పైగా చారిత్రక కట్టడాలను విధ్వంసం చేసే కార్యక్రమాలను ప్రభుత్వమే నిస్సిగ్గుగా చేయటం కనిపిస్తుంది. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 'పురాతన మానవ జాతి' ఆధారాలను కలిగి ఉన్న వందలాది గుట్టలను మైనింగ్ మాఫియాకు అప్పగించింది. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే పోలీసు పర్యవేక్షణలో చార్మినార్‌ను ఆనుకొని ఒక ఆలయాన్ని నిర్మించే దుర్మార్గానికి ఒడిగట్టింది. ఇంత జరిగినా పురాతత్వ శాఖ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.

పురాతత్వ శాఖ అనుసరిస్తున్న ఈ ఉదాసీనతకు మూలమేంటో కూడా అన్వేషించాలి. ఈ నేపథ్యంలో చారిత్రక కట్టడాలు, ఆధారాల పరిరక్షణకు ప్రభుత్వ వ్యతిరేకతను కులం కోణం నుంచి అర్థం చేసుకోవాలి.

చరిత్ర అన్వేషకురాలు రొమిల్లా థాపర్ ప్రకారం సుమారు క్రీ.పూ నలభై మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైన జంబూద్వీప నాగరికత హరప్పా, మొహంజదారో అనే రెండు పట్టణ రాజధానులతో విలసిల్లింది. వీటిని కేంద్రంగా చేసుకొని శంబరు మహారాజు 250 పట్టణాలతో కూడుకున్న జంబూద్వీపాన్ని పాలించాడు. శంబరు మహారాజు విగ్రహం హరప్పా నాగరికతలో లభించింది. హరప్పా, మొహంజదారో నాగరికతల్లో దొరికిన లిపి (స్క్రిప్టు) ద్రావిడ భాషకు చెందినదని ఆర్కియలాజికల్ ఫిలాలజిస్టులు నిర్ధారించారు. శంబరు మహారాజుతో నలభై యేళ్లు యురేషియా (ఆర్య) బ్రాహ్మణులు యుద్ధం చేసినట్టు రుగ్వేదంలో పేర్కొన్నారు. శంబర్ మహారాజే జాంబవంతుడనే సంగతిని మనం ఈ వివరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల జంబూద్వీపాన్ని ఏలిన జాంబవుడిని యురేషియా (ఆర్య) బ్రాహ్మణులు అనేక కుయుక్తుల ద్వారా ఓడించి హరప్పా, మొహంజదారో నాగరికతలను ధ్వంసం చేశారు. రుగ్వేదంలో ఆర్యులు ఇంద్రున్ని 'పురంధరుడు' అని కీర్తిస్తారు.

అంటే పురాలను నాశనం చేసే వాడని అర్థం. అందుకే నగరాలను విధ్వంసం చేయటమే తప్ప నిర్మించటం తెలియని విదేశీ యురేషియన్ (ఆర్య) బ్రాహ్మణులు మన దేశంలో నిర్మించిన నగరం ఒక్కటి కూడా లేదు. కానీ జాంబవుని వారసులు నిర్మించిన మూలవాసీ నాగరికతకు సంబంధించిన పట్టణాలను సమూలంగా నిర్మూలించే కృషిని మాత్రం నిరాఘాటంగా కొనసాగిస్తూనే ఉన్నారు. దేశ విభజన సందర్భంగా హరప్పా, మొహంజదారో పట్టణాలు పాకిస్తాన్‌కు కట్టబెట్టడం వెనక మాదిగల గర్వకారణమైన చరిత్రను ఇక్కడి ప్రజలకు తెలియకుండా చేసే కుట్ర ఉంది. హరప్పా, మొహంజదారో నాగరికత కాలం నాటి అనేక చారిత్రక ఆధారాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చరిత్రకారులు గుర్తించారు. అలాంటి కృషిని కొనసాగిస్తున్న వారిలో ప్రఖ్యాత చరిత్రకారుడు డా. జైకిషన్ ఒకరు కాగా మరొకరు డా. జాన్ మిల్టన్. తెలంగాణ జిల్లాల్లో ఇనుము, ఉక్కు పరిశ్రమ మీద డా. 

జైకిషన్ గొప్ప గ్రంథం రాశారు. తెలంగాణ పది జిల్లాల్లో ఉన్న అనేక వందలాది గుట్టల మీద, వాటి పరిసర ప్రాంతాల్లో ఇనుము, ఉక్కు తయారీకి సంబంధించిన పురాతన ఆధారాలను ఆయన కనుగొన్నారు. అలాంటి చారిత్రక ఆధారాలున్న ఈ గుట్టలను వారసత్వ సంపద కింద పురాతత్వశాఖ గుర్తించలేదు. కొన్నింటిని గుర్తించినప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ మాఫియాకు అప్పగించినా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కరీంనగర్ జిల్లాలో సుమారు 800లకు పైగా, వరంగల్ జిల్లాలోని 500లకు పైగా గుట్టలను మైనింగ్‌కు అనుమతులిచ్చారు. చివరికి కరీంనగర్‌లో హుస్నాబాద్ నియోజకవర్గంలో రాక్షస గుళ్లనూ తవ్వేస్తుంటే ఆర్కియాలజీ డిపార్టుమెంటు మౌన ంగా ఉండిపోయింది.

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పాలనల్లో అభివృద్ధి పేరుతో అనేక చారిత్రక స్థలాలు ఆనవాళ్లు లేకుండా చేశారు. హైదరాబాద్ కేంద్రంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, రసాయనిక పరిశ్రమల వల్ల రంగారెడ్డి జిల్లాలోని అనేక బౌద్ధ, జైన ఆనవాళ్లు కానరాకుండా పోయాయి. రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చారిత్రక కట్టడాలన్నీ ప్రమాదంలో పడ్డాయి. గోల్కొండ కోట భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పురాతన బౌద్ధ నిర్మాణాలను ప్రభుత్వం సినిమా పరిశ్రమ కోసం, మైనింగ్ కోసం అగ్రకుల పెట్టిబడిదారుల కోసం కేటాయించింది. రాయలసీమలోని అనేక గుట్టలను దశాబ్దాలుగా అగ్రకుల ఫ్యాక్షనిస్టులు తవ్వుకొంటూనే ఉండగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాలి జనార్దన్ రెడ్డి, జగన్ రెడ్డి మైనింగ్ జరిపి తుడిచిపెట్టేశారు.

కాకతీయుల కోటను పునరుద్ధరించే పేరుతో తూర్పు కోటను పురాతత్వ శాఖ పీకి పందిరేసింది. వందలాది నాగదేవతల విగ్రహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కోట శిధిలావస్థకు చేరుకున్నప్పటికీ ఆర్కియాలజీ అధికారులు గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ చేపట్టిన చర్యలు శూన్యం. కాకతీయుల ఉత్సవాలకు 150 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ తెలంగాణలోని కాకతీయుల కోట, రామప్పతో సహా పురాతన గుట్టలను పరిరక్షించే కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు. అభివృద్ధికి మౌలిక వసతుల కల్పన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్) మూలం. మౌలిక వసతుల కల్పన వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం ధనాపేక్ష ఉన్న అగ్రకుల కంపెనీల లాభాల కోసం చారిత్రక ప్రాంతాలను సైతం ధారాదత్తం చేయటం ఒకటి కాగా హైదరాబాదును ఏకైక అభివృద్ధి కేంద్రంగా మార్చేయటం మరోటి. దీనివల్ల హైదరాబాదు ప్రాచీన గుర్తింపు కోల్పోయింది. అనేక తోటలు, చెరువులతో ఆహ్లాదకరంగా పర్యావరణ ప్రేమికురాలిగా ఉండే హైదరాబాదు కాంక్రీటు జంగల్‌గా మారిపోయింది.

రోడ్ల విస్తరణలో కూలిపోయిన పురాతన కట్టడాలనేకం. మెట్రో రైలు పేరుతో కూలిపోతున్న చారిత్రక కట్టడాలు కూడా అనేకం. తెలంగాణ రాష్ట్రం గురించి ఉద్యమించే కార్యకర్తలు గానీ ఒక్క గుడి రోడ్డు విస్తరణలో కూలిపోతుందంటే రక్తం చిందించే మతవాదులు గానీ చారిత్రక కట్టడాలు అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని వ్యతిరేకించడం లేదు. ఆ క్రమంలోనే చార్మినార్ చుట్టూ ఉన్న చమన్‌ను, ముళ్లకంచెను తొలగించి రోడ్డు వేశారు. అంతేకాదు చార్మినార్ పక్కనే ఎత్తైన భవన నిర్మాణాలకు అనుమతిచ్చారు. వాయు, ధ్వని కాలుష్యాల వల్ల చార్మినార్ గోడలు బీటలు వారుతున్నాయి. చార్మినార్ పరిరక్షణ కోసం ఉద్యమించే వారిని చులకనగా చూసిన ప్రభుత్వం నేడు అభివృద్ధి వల్ల ఎలాంటి ఫలితం లేదని గ్రహించి మత ఘర్షణల ఎజెండాను చేపట్టింది.

చార్మినార్ ఆర్కియాలజీ డిపార్టుమెంట్ పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు గానీ ఇతరేతర నిర్మాణాలుగానీ చేపట్టరాదు. అందుకు విరుద్ధంగా చార్మినార్ గోడలకు పక్కనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆలయ నిర్మాణం పనులు చేపట్టింది. ఈ పనికి పోలీసు బలగాలతో సహా అన్ని రకాల సహకారం అందించింది. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవాలయం ఉన్నదని ప్రభుత్వం బుకాయిస్తోంది. మీడియా ఈ అసత్యాన్ని సత్యంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. చార్మినార్ సౌందర్యాన్ని బ్రిటిషు వారి కాలం నుంచీ ఫోటోల్లోనూ, ప్రపంచీకరణ తర్వాత వీడియోల్లోనూ అణువణువూ బంధించారు. అవి ఇంటర్నెట్‌లో లభిస్తున్నాయి. వాటిల్లో ఎక్కడా చార్మినార్‌ను ఆనుకొని గానీ దాని పరిధిలో గానీ ఎలాంటి దేవాలయం కనిపించడం లేదు. ఈ వాస్తవం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు అక్కడ దేవాలయం ఉన్నదనీ దాన్ని విస్తరించే పనికి దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చిందని చెబుతున్నారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవటం ఒక రాజకీయ చర్యని నమ్మబలుకుతున్నారు.

చారిత్రక కట్టడాలకు వంద మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదని ఆర్కియాలజీ నిబంధనలను అమలు చేయాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు విరుద్ధంగా చార్మినార్‌ను ఒక వివాదాస్పద అంశంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనితో ముస్లిం, ముస్లింయేతరుల మధ్య చిచ్చుపెట్టాలనే ఎత్తుగడతో బీజేపీతో కిరణ్ ప్రభుత్వం చేతులు కలిపింది.

దేశంలో మత కలహాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమనీ, అది బీజేపీతో చేతులు కలిపి మారణహోమం సృష్టిస్తుందని కాన్షీరాం ఎప్పుడూ చెబుతుండేవారు. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు వంటి లౌకిక విషయాల కన్నా ఎక్కువగా మతతత్వ విషయాలు ఉపకరిస్తాయనే సంగతి కాంగ్రెస్ పార్టీ అనుభవంలో ఉన్నవే. కిరణ్ కుమార్ రెడ్డి పాలన వల్ల కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో నెగ్గే పరిస్థితులు కనబడటం లేదు. అందుకే రాజకీయాలను మతం ప్రాతిపదికన నడపాలని ఆ పార్టీ సంకల్పించింది. మత రాజకీయాలను ఇంత కాలం బీజేపీ మాత్రమే చేస్తుందని భావించే వారు చార్మినార్ సంఘటనతోనైనా వాస్తవాలను గ్రహించాలి.

ఈ మొత్తం పరిణామాలను సంగ్రహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అధికారంలోకి రాకుండా చేసే యుద్ధనీతి కనిపిస్తుంది. చరిత్రను వక్రీకరించే కృషి అందులో ఒకటి కాగా తమ చారిత్రక ఆధారాలను తుడిచిపెట్టేయాలి. అదేవిధంగా ముస్లింల చరిత్రనూ వైభవాన్నీ కాలాంతరాలకు అందించే నిర్మాణాలను ధ్వంసం చేయటమో లేదా వివాదాస్పదం చేయటమో అగ్రకుల పాలకులనుసరిస్తున్న రణనీతి. చారిత్రక వారసత్వ సంపద లేని మట్టి దిబ్బగా ఈ దేశాన్ని తయారు చేయాలని యురేషియా బ్రాహ్మణవాద పాలకులు కుట్రలు పన్నుతుంటే ఈ దేశాన్ని ఏలాలని కలలుగనే బహుజనులు రాజకీయ యుద్ధం చేసేందుకు సిద్ధపడతారా? అధికారాన్ని కాపాడుకొనేందుకు మతతత్వాన్ని పెంచిపోషిస్తున్న పాలకుల 'కుల రాజకీయాల'ను అర్థం చేసుకోవాలంటే రాజకీయ చర్చలు మతం ప్రాతిపదికన కాకుండా కులం ప్రాతిపదికన జరగాలి. అప్పుడే చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోగలం.

- జిలుకర శ్రీనివాస్

Andhra Jyothi Telugu News Paper Dated: 9/12/2012 

No comments:

Post a Comment