Tuesday, December 4, 2012

ఆడబిడ్డలను కాపాడుకుందాం - బి. చంద్రకుమార్



విద్యకోసం సరస్వతీదేవిని, డబ్బుకోసం లక్ష్మీదేవిని, ధైర్యసాహసాల కోసం దుర్గామాతను పూజించడమే సరిపోదు. ఆడబిడ్డలకు విద్యను, ఆస్తిలో భాగాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం ముఖ్యం. తల్లితండ్రులు ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఆడపిల్లల్ని ప్రోత్సహించినట్లయితే, ప్రేమతో, ఆదరణతో పెంచితే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. 

కుటుంబమనే బండికి స్త్రీ, పురుషులిద్దరూ చక్రాల్లాంటి వారు. ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడే బండి సక్రమంగా ముందుకెళుతుంది. అదే విధంగా సమాజాభివృద్ధికి, సమాజంలోని స్త్రీ, పురుషులందరూ కలసిమెలసి పనిచేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం సమాజంలో స్త్రీలను సమానంగా, గౌరవప్రదంగా చూడడం లేదన్నది నగ్నసత్యం. ఈ మధ్య వస్తున్న వార్తలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వివక్ష మరింత పెరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. స్త్రీలను హింసించడం, వేధించడం, అవమానపరచడం, చిన్నచూపు చూడడం, విలాస వస్తువుగా చూడడం నాగరిక లక్షణం కాదు. ఇటీవల యువతుల మీద జరుగుతున్న మూకుమ్మడి అత్యాచారాల వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యాచారం చేస్తూ ఫోటోలు, వీడియోలు తీయడం, వాటి ద్వారా అమ్మాయిలను మరింత వేధించడం, వాటిని అమ్మాయిల కుటుంబ సభ్యులకు పంపడం ఆటవిక మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇటీవల ఎనిమిది నెలల గర్భవతిని మూకుమ్మడిగా అత్యాచారంచేసి, హత్యచేశారని చదివాం. అమ్మాయికి ఇష్టం లేకున్నా ప్రేమిస్తున్నామని, పెళ్ళిచేసుకోమని వేధించడం, తాము చెప్పినట్లు వినని వారిని బెదిరించడం, హత్యాప్రయత్నం చేయడం, యాసిడ్ దాడులుచేయడం సర్వసాధారణమైనట్లు వార్తలు తెలుపుతున్నాయి. వరకట్నం కోసం, అనవసరంగా లేనిపోని అనుమానాలతో వేధించడం కుటుంబ కలహాలకు కారణమవుతున్నాయి.

స్త్రీలపై జరిగే అత్యాచారాలను అరికట్టడానికి బాల్య వివాహాలు చేయడం పరిష్కారమని కొందరు, అత్యాచారాలకు అమ్మాయిలు వేసుకునే డ్రస్సులు కారణమని కొందరు, అమ్మాయిల ప్రవర్తన మార్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులు ఇస్తామన్న కట్నం ఇవ్వకపోవడం కారణమని కొందరు, స్త్రీలు ఉద్యోగాలు చేయడం, ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందడం కలహాలకు కారణమని కొందరంటున్నారు. బాల్య వివాహాలే పరిష్కారమని చెబుతున్నవారు అనేక మంది వివాహితలు, ముక్కుపచ్చలారని బాలికలు సైతం అత్యాచారానికి గురవుతున్నారనే వాస్తవాన్ని గమనించడం లేదేమో అనిపిస్తుంది. అమ్మాయిలు వేసుకునే బట్టలే కారణమని చెబుతున్నవారు గర్భిణీ స్త్రీలు, మధ్య వయస్కులు కూడా అత్యాచారానికి గురవుతున్నారనీ విషయం విస్మరిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది. స్త్రీల ప్రవర్తనే కారణమనేవారు స్త్రీల పట్ల వివక్ష గర్భంలో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే ప్రారంభమవుతున్నదనే విషయం ఆలోచించాలి. ఇస్తామన్న కట్నం ఇవ్వకపోవడమే కారణమనేవారు అడిగినంత కట్నకానుకలు ఇచ్చిన వారూ వేధింపులకు గురవుతున్నారని గమనించాలి. స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రమే కారణమనేవారు ఉద్యోగం లేక, సంపాదన లేక భర్తల మీద ఆధారపడే స్త్రీలూ వేధింపులకు గురవుతున్నారనే వాస్తవాన్ని చూడాలి. అందుచే స్త్రీల వేధింపులకు శాస్త్రీయ కారణాలేమిటి? పరిష్కార మార్గాలేమిటి? అనే విషయాన్ని లోతుగా ఆలోచించాలి.

నేడు పారిశ్రామికాభివృద్ధితో పాటు స్త్రీలు చదువుకుని ముం దంజ వేస్తున్నారు. అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. స్త్రీలకు సమానత్వపు హక్కు, ఆస్తి హక్కు వచ్చాయి. కానీ మన సమాజం భూస్వామిక మనస్తత్వం నుంచి ఇంకా పూర్తిగా బయటపడటం లేదు. ఇప్పటికీ 'స్త్రీ విద్యకు అర్హురాలు కాదు, పురుషులతో సమానురాలు కాదు, స్త్రీలను అణచివుంచాలి' మొదలైన భావాలు అక్కడక్కడ కనబడతాయి. పారిశ్రామికాభివృద్ధితోపాటు డబ్బు విలువ పెరిగిపోయింది. డబ్బుంటే ఏమైనా చేయవచ్చనే ఆలోచన బలపడింది. ఏ మార్గాన్ననుసరించైనా డబ్బులు సంపాదించడం ముఖ్యమై, సామాజిక స్పృహ, సామాజిక శ్రేయస్సు, ఉమ్మడి ప్రయోజనాలు, నైతిక విలువలు చివరకు కుటుంబ సంబంధాలు కూడా విస్మరించబడుతున్నాయి. వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో, నవలల్లో ఇతర రచనల్లో స్త్రీని అసభ్యంగా, విలాస వస్తువుగా చూపుతున్నారు. చట్టాలెన్నివున్నా స్త్రీకి రక్షణ కరువైంది. స్త్రీలు బయటకు వెళ్తే, సిటీ బస్సులలో ప్రయాణిస్తే, ఒంటరిగా వెళ్లవలసి వస్తే వేధింపులకు గురౌతున్నారు.

కొంతమంది దుర్మార్గులు పిల్లలను, యువతులను ఏదో విధంగా మోసం చేసి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్తే స్త్రీలకు రక్షణ కరువైంది. చదువుకునే విద్యా సంస్థల్లో, పనిచేసే కార్యాలయాల్లో సైతం వేధింపులకు గురౌతున్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్ళు గడిచినా, వ్యక్తి స్వాతంత్య్రం పట్ల, ప్రజాస్వామిక విలువల పట్ల, సమతా భావం పట్ల ప్రజల్లో పూర్తి చైతన్యం రాలేదు. దేశభక్తి, జాతీయ భావాలు, వ్యక్తిగత బాధ్యత, సామాజిక దృక్పథం లోపిస్తున్నాయి. సామాజిక శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు ఉంటుందనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి.

స్త్రీలు విద్యావంతులైతే కుటుంబం బాగుపడుతుందనే వాస్తవాన్ని గ్రహించాలి. చదువుకున్న స్త్రీలకు పిల్లల్ని ఎలా పెంచాలో బాగా తెలుస్తుంది. అందుకే స్త్రీ విద్య పట్ల, పూర్తి శ్రద్ధ అవసరం. బాలికలు చదువును మధ్యలో ఎందుకు ఆపేస్తున్నారో సరైన కారణాలు తెలుసుకుని అందరికి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందించాలి. ముఖ్యంగా బాలికలకు పూర్తి సహకారం, ప్రోత్సాహం ఇవ్వాలి-తగినన్ని వసతులు కల్పించాలి. పేదరికం వలన కొనసాగించలేకపోతున్నామనే భావన ఎవ్వరికీ రాకుండా చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి ఉచిత విద్య, వైద్యం, న్యాయం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత, విధి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల లక్ష్యమదే. నేడు ఆడపిల్లలు చదువు కొనసాగించలేక పోవడానికి పేదరికం, తగిన వసతులు లేకపోవడం, వేధింపులు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అనేక ఉన్నత పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవు. అందుచే ప్రభుత్వం కనీస సౌకర్యాలను వెంటనే కల్పించాలి. పేద విద్యార్థినులందరికీ తగిన సహాయ సహకారాలు అందించాలి. మరిన్ని హాస్టల్స్, మెస్‌లు ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఆడపిల్లల్ని బడికి పంపే పేద కుటుంబాలకు మరిన్ని ప్రోత్సాహక పథకాల్ని ప్రవేశపెట్టడం వలన ప్రయోజనం ఉంటుంది.

స్త్రీలపై జరిగే అత్యాచారాలను అరికట్టడం సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలి. స్త్రీల పట్ల సద్భావన కలిగే విధంగా రచయితలు, కవులు రచనలు చేయాలి. అటువంటి రచనల్ని ప్రోత్సహించాలి. పాఠ్యపుస్తకాల్లో స్త్రీల పట్ల గౌరవం కల్గించే పాఠ్యాంశాలను చేర్చాలి. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో స్త్రీల పట్ల వివక్ష పోగొట్టే విధంగా విద్యార్థులను చైతన్యవంతులుగా చేయాలి. వ్యాపార ప్రకటనల్లో స్త్రీని విలాసవస్తువుగా, స్త్రీ పట్ల చిన్న చూపు కలిగే విధంగా చూపడాన్ని పూర్తిగా నిషేధించాలి. సినిమాల్లో, సీరియల్స్‌లో, పుస్తకాల్లో స్త్రీలను కించపరిచే విధంగా ఉండే సన్నివేశాలను తొలగించాలి. నిర్మాతలు, దర్శకులు కూడా వ్యాపార దృష్టితో పోకుండా సామాజిక దృష్టితో సినిమాలు, సీరియల్స్ తీయాలి. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు విభాగాలను, టీమ్‌లను ఏర్పాటు చేసి మహిళా పోలీసులను మామూలు డ్రస్సులో బస్‌స్టాప్‌లలో ఇతర చోట్ల ఏర్పాటు చేసి మహిళలను వేధించే వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.

ఏ మహిళపై అత్యాచారం జరిగినా శాస్త్రీయ పద్ధతులలో విచారణ జరిపి నేరస్థులు తప్పించుకోని విధంగా సాక్ష్యాధారాలను సేకరించాలి. అధికార, ధన బలంతో ఎటువంటి నేరం చేసినా బయటపడవచ్చుననే భావనను పోగొట్ట గలగాలి. నేరస్థులు ఎంతటివారైనా శిక్ష తప్పని పరిస్థితులు రావాలి. స్త్రీలపై జరిగే అత్యాచారాలను అరికట్టడం సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలి. పని ప్రదేశాల్లో ఉద్యోగినులు వేధింపులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోపంగా చూడడం లేదా చివాట్లు పెట్టడంతో కూడా కొంతవరకు ఆ వేధింపులను అరికట్టవచ్చు. తోటి ఉద్యోగస్తుల సహాయం తీసుకుని అధికారులకు తెలియజేయాలి. అవసరమైతే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. పత్రికల, టివి వారి సహాయం తీసుకోవాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల కనుగుణంగా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మహిళల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలి. పదిమంది కలసి ఏమి చేయాలని ఆలోచించాలి. మంచి హృదయమున్న పెద్ద వారి సహకారం తీసుకోవాలి. విలేఖర్ల, న్యాయవాదుల, ఇతర పెద్దల సహాయం తీసుకోవచ్చు.

సమాజంలో కొంత మందైనా ముందుకు వచ్చి తమ సహాయం చేస్తారు. ఏ సమస్యనయినా పదిమంది కలిసి ఆలోచించి కార్యాచరణకు దిగితే ఎంతో మంచి ఫలితాలు వస్తాయి. పదిమంది అమ్మాయిలు కలసికట్టుగా వుంటే, ఎవరైనా ఏ అమ్మాయినైనా వేధించడానికి వెనుకంజ వేస్తారు. అధికారులు కూడా కదలి వస్తారు. తల్లితండ్రులకు, ఇతర స్త్రీలకు ధైర్యం వస్తుంది. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆత్మ రక్షణ కోసం బలప్రయోగం చేసే హక్కు కూడా ఉంది. స్త్రీ తన మాన ప్రాణాలు రక్షించుకోవడానికి చేతికి రాయి, కర్ర ఏది దొరికితే దాన్ని ఆయుధంగా వాడవచ్చు. అయితే అవసరానికి మించిగానీ, అవసరం లేనప్పుడూ ఏ ఆయుధాన్ని ఉపయోగించవద్దు. ఈ విషయంలో పోలీసు అధికారులు, న్యాయ సేవా సంస్థలు బాలికలకు తగు సూచనలు చేయాలి. ్టౌజూజూ జట్ఛ్ఛ ఞజిౌn్ఛ nఠఝఛ్ఛట ఏర్పాటు చేసి, పోలీసులు ఫోన్ వచ్చిన వెంటనే స్పందించే విధంగా ఏర్పాటు చేయాలి. ఆడపిల్లలు కూడా ఏ పనిచేసినా ఆలోచించి చేయాలి. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా మసలుకోవాలి. ఎవ్వరిని నమ్మాలో, నమ్మకూడదో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించాలి. ఏదైనా పొరపాటు నిర్ణయం జరిగినా భయపడకుండా ఆ పరిస్థితి నుంచి ప్రజ్ఞతో బయటపడాలి. తల్లితండ్రులు, కుటుంబ పెద్దలు ఆడపిల్లల పట్ల వివక్ష చూపకూడదు. 

తల్లితండ్రులు ఎటువంటి బేధం చూపకుండా పిల్లలందరిని సమానంగా పెంచాలి. ముఖ్యంగా తల్లి ఆహారపదార్థాలు ఇచ్చే సందర్భంగా కావచ్చు లేదా ఏదైనా కొనిచ్చే సందర్భంగా గానీ లేదా చిన్న చిన్న పనులు చెప్పేటప్పుడు వివక్ష చూపుతున్నారు. ఏ కోర్సు చదవాలో నిర్ణయించేటప్పుడు పిల్లల ఆసక్తిని బట్టి వారికిష్టమైన కోర్సులో చేర్పించాలి. తల్లితండ్రులే వివక్ష చూపినప్పుడు లేదా ఇంట్లోఉండే పెద్దవారు వివక్ష చూపినప్పుడు ఆ మాటల ప్రభావం మగపిల్లలపై ఉంటుంది. అటువంటి మాటలను, పెద్దల ప్రవర్తనను గమనించే అబ్బాయిలు అప్పటి నుంచే ఆడపిల్లల పట్ల చిన్న చూపు చూడ డం ప్రారంభమవుతోంది. నీకెందుకులే అంత విలువైన ఆటబొమ్మ? నీకెందుకులే అంత విలువైన బట్టలు? నీవేమైనా చదివి దేశాలేలాలా? 

ఏ రోజుకైనా ఒక అయ్యచేతిలో పెట్టాల్సిందే కదా! నీ ఇష్టాఇష్టాలతో ఏముంది? రేపటిరోజున నీ భర్త ఒప్పుకోవాలిగా? ఈ దరిద్రాన్ని వదుల్చుకోవడానికి ఆస్తు లు అమ్ముకోవాల్సిందే, ఈ ఆడబిడ్డ పుట్టకుండా వుంటే ఈ బాధలు వచ్చేవి కాదు గదా... ఇలాంటి మాటలు పిల్లల మనసులపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తాయి. విద్యకోసం సరస్వతీదేవిని, డబ్బుకోసం లక్ష్మీదేవిని, ధైర్యసాహసాల కోసం దుర్గామాతను పూజించడమే సరిపోదు. ఆడబిడ్డలకు విద్యను, ఆస్తిలో భాగాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం ముఖ్యం. తల్లితండ్రులు ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తే, ప్రేమతో, ఆదరణతో పెంచితే అద్భుత ఫలితాలు సాధించొచ్చు. వారు ప్రేమమూర్తులుగా, తల్లులుగా, మంచి గృహిణులుగా తయారు కావచ్చు.

వివాహం పరమార్థాన్ని అందరూ గ్రహించాలి. భార్యభర్తలు కలసిమెలసి ఉండడం వలన ఒనగూరే ప్రయోజనాలను, ఆనందాన్ని తెలుసుకోవాలి. ఏ సమస్యవచ్చినా పరస్పరం చర్చించుకుని, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇద్దరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇద్దరి తెలివితేటలు కుటుంబానికి, పిల్లలకు ఉపయోగపడాలి. అభిప్రాయభేదాలను చర్చించి పరిష్కరించుకోవాలి. స్త్రీలను కట్నకానుకల కొరకో, మరో విషయానికో వేధిస్తే వేధించే వారికి సైతం మనోవేదన కలుగుతుందనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. సమాజంలో ప్రతిఒక్కరూ సరైoన విధంగా ప్రతిస్పందించినప్పుడే స్త్రీలకు పూర్తిరక్షణ కలుగుతుంది. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా స్వేచ్ఛగా తిరగగలిగిననాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని గాంధీజీ చెప్పిన మాట అక్షర సత్యం.

దేశ భక్తులు, సామాజిక స్పృహ కలిగినవారు, సత్యం కోసం, న్యాయం కోసం నిలిచే మేధావులు, యువత ముందుకు వచ్చినప్పుడే గాంధీజీ కలలు నిజమౌతాయి. యువతరం నూతన భావాలను పెంపొందించుకుని ధైర్య సాహసాలతో ఆదర్శవంతమైన నూతన సమాజ నిర్మాణానికి పూనుకోవాలి. కన్నబిడ్డలు కూతురా, కుమారుడా అనే భేదంచూపక మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లితండ్రులుచేపట్టాలి. భవిష్యత్తులో ఎందరో కిరణ్ బేడీ, సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళను చూస్తామని ఆకాంక్షిస్తూ .. 'చేయి చేయి కలుపుదాం, అత్యాచారాలు ఆపుదాం, ఆడబిడ్డలను కాపాడుకుందాం'.
- బి. చంద్రకుమార్
న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

Andhra Jyothi news paper Dated: 4/12/2012

No comments:

Post a Comment