Wednesday, December 12, 2012

సెక్యులరిజం గాలిలో దీపమేనా? - సుదర్శన్ బాలబోయిన డాక్టర్ నాగం కుమారస్వామిబాల్ ఠాక్రేను కీర్తించే చర్యలు ఈ దేశ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్ఠంగా నిలబెట్టగలవా? ప్రజాస్వామ్యమంటే హిందూ ఫాసిజానికి అండగా నిలబడటమని అర్థమా? 

ముంబయిలో 2008లో మారణకాండకు పాల్పడిన అజ్మల్ కసబ్‌కు నవంబర్ 21న ఎరవాడ జైల్లో ఉరిశిక్ష అమలైంది. ఈ సంఘటన నేపథ్యంలో 'కసబ్ ఉరి శిక్ష మొత్తం ప్రపంచానికి ఒక సంకేతం. ఇలాంటి చర్యలకు పాల్పడేవారెవరైనా ఇదేవిధంగా ప్రతిస్పందిస్తాం' అని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించారు. ఇది ఎంత వరకు వాస్తవమైందో, ఇదే ముంబయి నగరంలో హిందూ టెర్రరిజాన్ని నాలుగున్నర దశాబ్దాలుగా నిరభ్యంతరంగా నడిపిన బాలా సాహేబ్ ఠాక్రేను చూస్తే అర్థం అవుతుంది. ఇస్లాం టెర్రరిజానికి ఈ దేశంలో శిక్షల నుంచి ఎలాంటి మినహాయింపు లేదు. ఇందుకు ప్రభుత్వానికి మనమంతా ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిందే. కానీ హిందూ టెర్రరిజానికి లభించిన అనేక మినహాయింపుల్లో ఠాక్రే ఒకరు. ఈ వివక్షను పౌరుడిగా బాధ్యతతో ప్రశ్నించాల్సిందే.

శివసేన చీఫ్ అసలు పేరు బాల్ కేశవ్ ఠాక్రే. ఆదర్శవంతమైన సామాజిక కార్యకర్తగా, కుల నిర్మూలన భావజాలంతో 'సంయుక్త ముంబయి' ఉద్యమాన్ని నడిపిన కేశవ్ సీతారామ్ ఠాక్రే కొడుకే బాల్ ఠాక్రే. తన తండ్రి అనుసరించిన సామాజిక బాధ్యతకు పూర్తి విరుద్ధమైన మార్గంలో మత, ప్రాంతీయ ఉన్మాదంతో రాజకీయాలను రంగరించాడు. బాల్ ఠాక్రే జీవితంలో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. ఒకటి ఫాసిస్ట్ ధోరణి, మరొకటి ప్రాంతీయ ఉన్మాదం. ఎన్నో సామాజిక ఉద్యమాలకు నిలయమైన మరాఠా గడ్డ మీద బాల్ ఠాక్రే రక్త చరిత్రను లిఖించాడు.

విభిన్న కుల, మత, వర్గ, సాంస్కృతిక సమూహాలతో జీవిస్తున్న కోట్లాది ప్రజలను 'శివ సైన్యం'కు లోబడి ముంబయిలో ఎలా బతకాలో ఠాక్రే శాసించాడు. భయంతో బతకడాన్ని ఒక సంస్కృతిగా మార్చిన ఘనత ఆయనకే దక్కింది. బ్రిటిష్ పాలన అనంతర రాజకీయాల్లో 'మత హింసను' ప్రయోగించిన మొదటి నాయకుడు కూడా ఠాక్రేనే. ముంబయి నగరంలో 'రూల్ ఆఫ్ లా'ను ఉల్లంఘించి ఎవరైనా బతకవచ్చు, కానీ 'ఠాక్రే లా'ను ఎవరూ తప్పించుకోలేరు. ఠాక్రే శాసనాన్ని ధిక్కరించగల శక్తులు, సంస్థలు బొంబాయిలో లేవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మరాఠీయేతర వలసల నుంచి బొంబాయిని రక్షించే సాకుతో 1966లో శివసేన ఏర్పాటైంది. కానీ దాని లక్ష్యం హిందూ ఫాసిజం. కాబట్టే ఠాక్రే జీవిత కాలంలో ముస్లింలు, దళితులు, కమ్యూనిస్టులను అంతం చేయడమే సేన లక్ష్యం అని బాహాటంగా ప్రకటించాడు. గొప్ప సామాజిక ఉద్యమాలను నడిపిన గత చరిత్ర మహారాష్ట్రకు ఉంది. ఇక్కడ సంత్‌లు, సన్యాసులు (కబీర్) మత సంస్కరణ ఉద్యమాలు నడిపారు. బ్రాహ్మణీయ సామాజిక ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ మహాత్మ జ్యోతీరావ్ ఫూలే, సావిత్రి భాయి, ఛత్రపతి సాహు మహారాజ్‌లు సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు. 

సాంప్రదాయక మనువాదాన్ని ధ్వంసం చేసే సామాజిక విలువలకై పరితపించారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అంటరాని కులాల విముక్తితో పాటు, బొంబాయి కార్మిక ఉద్యమాలను నిర్మించాడు. కమ్యూనిస్టులు డాంగే, రణదివేలు చారిత్రాత్మక పారిశ్రామిక ఉద్యమాలను నిర్మించారక్కడ. ఆసియా పారిశ్రామిక ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చెందిన ముంబయిలో మహత్తర ఉద్యమాన్ని నడిపిన నిస్వార్థ కార్మిక నాయకుడు దత్త సామంత్, ఆయనకు కార్మిక వర్గంలో ఉన్న పట్టును నియంత్రించడానికి ఘోరంగా హత్య చేసిన ముఠాకు సేన అండగా నిలబడింది. మార్క్స్, అంబేద్కర్ భావజాల స్ఫూర్తితో కులాన్ని, వర్గాన్ని నిర్మూలించే లక్ష్యంతో దళిత పాంథర్స్ ఉద్యమం పుట్టింది ఇక్కడే. ఇలాంటి మహత్తర సామాజిక ఉద్యమాలు నడిచిన చోట 'హిందూ ఫాసిజాన్ని' నెలకొల్పిన వ్యక్తి ఠాక్రే.

బాలా ఠాక్రే హింసాకాండ 'జాగో లుంగీ' నినాదంతో దక్షిణ భారతీయ వ్యతిరేకతను మరాఠీయుల మనసుల్లో రేకెత్తించింది. 'మరాఠీ - మరాఠీయేతర' అంశాన్ని రాజకీయ వస్తువుగా మలిచాడు. లుంగీలు ఊడగొట్టి వేల మందిని తన్ని తరిమారు. 1966 దసరా ర్యాలీలో ఉడిపి, హోటల్స్, రెస్టారెంట్స్‌ను ధ్వంసం చేశారు. ప్రాంతీయ విద్వేషంతో చెలరేగిన శివసైనికులు 1969లో 59 మంది కన్నడిగులను క్రూరంగా హత్యచేశారు. శివ సైనికులు నార్త్ ఇండియన్స్‌ను కూడా తమ దాడుల నుంచి మినహాయించలేదు. మరాఠీయేతర ప్రజలను అత్యంత నీచంగా అవమానపర్చే సంస్కృతిని శివ సైనికులు నెలకొల్పారు. బీహార్, గుజరాతీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన లక్షలాది ప్రజలు వీరి దాడులు భరించలేక ముంబయి విడిచి వెళ్ళారు. 'ఉమ్మిన పళ్ళెంలోనే తింటారని' బీహారీల నుద్దేశించి ఠాక్రే చేసిన అవమానకరమైన వ్యాఖ్య పార్లమెంటులో ప్రాంతీయ దురభిమాన కుంపట్లను రేకెత్తించింది.

తమకు లొంగని మరాఠీయేతరులపై దాడులే కాకుండా, వారి ఆస్తులను స్వాధీనం చేసుకొనేవారు. సొంత హిందువులపైనే దాడిచేసే సంస్కృతి శివ సేన సొంతం. ఠాక్రే మరొక ముఖం హిందూ ఫాసిజం. 'హిందూయిజం తప్ప మరే ఇజాన్ని నేను సహించనని' బాహాటంగా చెప్పాడు. హిందువుల హృదయాలను గెలుచుకున్న విజేతగా శివసైనికులు ఈయనను కీర్తిస్తారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముంబయి నగరంలో ముస్లింలపై మారణకాండ జరిపించిన నాయకుడాయన. 1992 బాబ్రీ విధ్వంసం తరువాత సుమారు 700 మంది ముస్లింల హత్యలకు పథకం అమలు చేశాడు. ముంబయి మత ఘర్షణలకు శివసేన రగిలించిన మత విద్వేషం ఒక ప్రధాన కారణమని శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ముస్లింలపై దాడులు చేయడానికి పోలీసులు శివసైనికులకు సహాయం చేయాలని ఠాక్రే పిలుపిచ్చాడు. అక్కడ పోలీసులు ఖాకీలు ధరించిన శివసైనికులు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో శివసైనికులు పట్టించిన వందలాది ముస్లిం యువకులను పోలీసులు కాల్చి చంపారు. 

ముస్లింలు క్యాన్సర్ లాగా వ్యాపిస్తున్నారని వారిని అడ్డుకోవడానికి ఈ దేశానికి శస్త్ర చికిత్స చేయాలని అంటాడు. ఠాక్రే టెర్రరిజానికి వ్యతిరేకం కాదు, అందుకే 'పెరుగుతున్న ఇస్లాం టెర్రరిజాన్ని కేవలం హిందూ టెర్రరిజమే అడ్డుకోగలదని' హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. పైగా సూసైడ్ బాంబర్స్‌గా అవతరించాలని హిందూ యువతకు పిలుపునిచ్చాడు. ఇంత పెద్దఎత్తున మత ఉన్మాదాన్ని(హింస) బాహాటంగా రాజకీయాలకు అన్వయించిన మరొక నాయకుడు ఈ కాలంలో మనకు కనిపించడు. ఈ దేశం హిందువులది, ఇస్లాంను హిందువుల మోకాళ్ల దగ్గర నిలబెట్టాలని హిందూ నేషనలిజాన్ని సామాన్యుల మనసుల్లో కసితో నూరిపోశాడు. కుల, వర్గ సామాజిక అంతరాలను నిర్మూలించే లక్ష్యంతో ఏర్పడిన మిలిటెంట్ సంస్థ 'దళిత్ పాంథర్స్'. శివసేన ఐడియాలజీ మనువాదం, హిందూయిజం. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది దళిత్ పాంథర్స్ భావజాలం. ఈ రెండింటి మధ్య యుద్ధం భావజాల స్థాయిని దాటి భౌతిక నిర్మూలనకు చేరుకుంది. దళిత్ పాంథర్స్ నాయకుడు భగవతి జాదవ్‌ను 1974లో అత్యంత క్రూరంగా హత్య చేశారు. 1984లో విదర్భలో దళితులపై 6 నెలల పాటు వరుస దాడులు జరిపారు, వందల మందిని తీవ్రంగా హింసించారు.

అంబేద్కర్ రచనల ప్రచురణ 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆయన రచనల్లోని 'హిందూ మతం - చిక్కుముడులు' చాప్టర్ ప్రచురించవద్దని అడ్డంకులు సృష్టించి అంబేద్కర్ భావజాల వ్యాప్తిని నిలువరించాలనే కుట్రలకు పాల్పడింది. హిట్లర్ నెలకొల్పిన 'గ్రేట్ డిటెక్టర్ షిప్' శివసేన పొలిటికల్ ఫిలాసఫీ. జాతి విద్వేషంతో లక్షల మందిని జ్యూవుస్‌ను అంతం చేసిన హిట్లర్ ఠాక్రే కు ఆదర్శవంతమైన నాయకుడు. నేను హిట్లర్ అడ్మైరర్‌ను అని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు. జర్మనీని తన ఉక్కు చేతులతో పాలించిన హిట్లర్ నియంతృత్వం భారతదేశానికి తక్షణావసరమని ప్రజాస్వామ్య వ్యతిరేక వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఇందిర ఎమర్జెన్సీకి మద్దతిచ్చిన కొద్దిమందిలో ఈయనొక ప్రముఖుడు. సంజయ్‌గాంధీని ఈ దేశ నియంత పాలకుడిగా నిలబెట్టడానికి ఠాక్రే చాలా ప్రయత్నించాడు. హిట్లర్ జర్మనీలో నాజీ సైన్యం (హంతక ముఠా) నెలకొల్పినట్టు ఈ దేశంలో ఠాక్రే శివ సైన్యాన్ని సృష్టించాడు. హిట్లర్‌ను తమపొలిటికల్ ఫిలాసఫర్‌గా బాహాటంగా ప్రకటించిన లీడర్ బహుశా ఠాక్రే మాత్రమే కావచ్చు. 'డెమోక్రసీ మీద నాకు నమ్మకంలేదు' దాన్ని నిర్మూలించే 'ఠాక్రే క్రసీ' నెలకొల్పుతానని ముం బయిలో ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టి నియంతృత్వాన్ని స్థాపించాడు. బయటి ప్రపంచానికి బాలా కేశవ్ ఠాక్రే మహారాష్ట్రీయుల అవకాశాలను రక్షించే నాయకుడు.

కానీ నాలుగున్నర దశాబ్దాల పాటు సల్మాన్ ఖుర్షీద్ చెప్పిన చట్టం ముంబయిలో చచ్చుపడింది. ముంబయి పారిశ్రామిక నగరాన్ని సాంప్రదాయక మనువాదంతో రక్త కాసారంగా మార్చాడు. ఇతడు నెలకొల్పిన రిలీజియస్, రీజనల్ ఫాసిజం ప్రజాస్వామ్యానికి, జాతీయ సమైక్యతకు గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్యాన్ని బొందపెడతానని చెప్పిన వ్యక్తిని 'దృఢమైన నాయకుడని' ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొనియాడటం సిగ్గుచేటు. ఠాక్రే ఎలాంటి రాజ్యాంగబద్ధ పదవిని (ఎంపీ, ఎమ్మెల్యే) అధిష్టించలేదు. అయినా పార్లమెంట్ ఆయనకు నివాళులు అర్పించింది. పార్లమెంట్ సభ్యుడు కాకుండానే ఇలాంటి గౌరవం దక్కిన ఏకైక నాయకుడు ఠాక్రే మాత్రమే. మరణానంతరం ఆయన దేహంపై జాతీయ జెండా కప్పి పోలీసు లాంఛనాలతో అంతిమ యాత్ర చేశారు.

ప్రపంచంలోనే ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. దాని గొంతు నులిమే లక్ష్యంతో జీవితాంతం పనిచేసిన వ్యక్తిని కీర్తించే చర్యలు ఈ దేశ రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పటిష్ఠంగా నిలబెట్టగలవా? ప్రజాస్వామ్యమంటే హిందూ ఫాసిజానికి అండగా నిలబడటమని అర్థమా? ఈ దేశంలో సెక్యులరిజం గాలిలో దీపమేనా? ఇస్లాం టెర్రరిజాన్ని ఉరికంభం ఎక్కిస్తున్న పాలకులు హిందూ ఉన్మాది (టెర్రరిస్ట్) ఠాక్రేను చట్టం పరిధిలో ఎందుకు శిక్షించలేకపోయారు. ఠాక్రే అతని శివసైన్యం జరిపిన మారణకాండలకు ఖుర్షీద్, యూపీఏ ప్రభుత్వం ఏం శిక్ష విధించింది. అందరినీ సమానంగా ట్రీట్ చేస్తామంటున్న మన్మోహన్, సోనియా, ఖుర్షీద్ దీనికి జవాబివ్వగలరా?

- సుదర్శన్ బాలబోయిన
డాక్టర్ నాగం కుమారస్వామి
రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా యూనివర్సిటీ
Andhra Jyothi Telugu News Paper Dated: 13/12/2012+


No comments:

Post a Comment