మేంకొమ్ము మాదిగలం. ఎద్దుకొమ్ము బూరల్లోంచి సమరనాదాన్ని పుట్టించి సమాజాలను మేల్కొలిపినోళ్ళం. మేం డప్పులు కొట్టే మాదిగలం. పశువుల చర్మాలతో తప్పెట పలకల్ని తయారుచేసి మీ దేవతల ఉత్సవ విగ్రహాలకి ఊపుని, తూగుని, ఉత్సాహాన్ని పుట్టించినోళ్ళం. మేం తోలు పని మాదిగలం. చర్మాల చెప్పులు తొడిగి రాళ్ళు, రప్పలు, తుప్పలు, ముళ్ళు, కొండలు, కోనలు కీకారణ్యాలలోకి మానవాళిని నడిపించినోళ్ళం. మేం పశువులు కాసే మాదిగలం. చిన్న చేతిపుల్ల వాటంతో జంగిలి గొడ్లని, ఆలమందల్ని మలేసి నిలేసి, మచ్చిక చేసుకుని, నడిపించి నోళ్ళం. చేనుల్లో, చెలకల్లో గొడ్లతో చెరి సమానంగా శ్రమచేసినోళ్ళం. మాకు ఇష్టమైనదీ, బలవర్ధకమైనదీగా భావించే ఆహారం గొడ్డు మాంసం.
మేం మాదిగలం, మాలలం. ఆదివాసులం. వెనకబడిన తరగతులం. సంచార, అర్ధ సంచారజాతులం. సబ్బండలం. మేం క్రైస్తవులం. ముస్లింలం. బౌద్ధులం. వెరసి మేమంతా బహుజనులం. మాంసం మాకిష్టపూర్వకమైన ఆహారం. మాలో కొందరం గొడ్లు, ఎడ్లు, గోవులు, దూడలు మొదలగు పశుమాంసం తింటాం. వారి వారి ఇష్టాలను బట్టి మాలో కొందరు మేకలు, గొర్రెల మాంసం తింటారు. కొందరికి పంది మాంసం, కొందరికి గాడిద మాంసం, కొందరికి కాకి, ఎలుక, పిల్లి, పిట్ట మాంసాలంటే ఇష్టం. ముడుసు, మూలిగె, ఈరిగ, దొబ్బ, కార్జం, గుండె, శేరు, వృషణాలు, నాల్క, మెదడు, పేగులు, చెవులు, సల్ల, నల్ల బట్టి వరకు వారి వారి ఇష్టాల మేరకు, అందుబాటు మేరకు ఇవన్నీ మా వాళ్ళకు ఆహారంగా ఉపయోగపడతాయి.
మాంసాహారం తినే హక్కు బహుజనులకు ఉన్నట్టే, ఇష్టంలేని వారికి తినకుండా ఉండే హక్కు ఉన్నది. ఈ హక్కును మాంసాహారులైన బహుజనులు ఎప్పుడూ అగౌరవపరచ లేదు. మాంసం తీసుకెళ్ళి బలవంతంగా శాకాహారుల కంచాల్లోనో, నోళ్ళలోనో పెట్టే ప్రయత్నాలూ బహుజనులు చెయ్యలేదు. ఐతే, కొంత మంది శాకాహారులు ఇందుకు భిన్నంగా, శాకాహారం ద్వారానే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని, గో వధను నిషేధించాలని, ఆవును పవిత్రమైన జంతువుగా పరిగణిస్తూ చట్టాలు తేవాలని ప్రచారం చేస్తున్నారు.
డిమాండు చేస్తున్నారు. ఇలాంటి అశాస్త్రీయ, అప్రజాస్వామిక, చాందస వాదనలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మెజారిటీ బహుజనుల సాంఘిక స్థితిగతులను 'హీనం'గా చూస్తున్నట్లు గానే వారి ఆహారపు అలవాట్లను కూడా అగ్రవర్ణాల వారు హీనంగా చిత్రీకరిస్తున్నారు. కొన్నికుల హిందూ సంస్థలు ఈ శాకాహార బ్రాహ్మణ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీని ద్వారా బహుజనులపై ఫుడ్ ఫాసిజాన్ని (ఆహార హింస)ను అమలు జరుపుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో గత నెల 30 వ తేదీరాత్రి జరిగిన సంఘటన ఇందుకు ఒక ప్రబల నిదర్శనం. ఎద్దు మాంసం పండగ (బీఫ్ ఫెస్టివల్) సందర్భంగా ఇఫ్లూలో బహుజన విద్యార్థులు ఎద్దు మాంసం తెచ్చి కూర వండుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు ఆగంతకులు మూకుమ్మడిగా వచ్చి, వండుతున్న విద్యార్థులను రాళ్ళతో తరిమికొట్టి, ఉడుకుతున్న ఎద్దు మాంసం కుండల్లో మూత్రం పోసి, ఆ కుండల్ని నేలపై దొర్లించివేశారు. ఈ సంఘటన గురించి తెలిసి దుఃఖమూ, కోపమూ కలిగాయి.
బహుజన విద్యార్థులు తమకిష్టమైన ఎద్దు మాంసం కూర వండుకోవటం దాడిచేసిన వారి మనోభావాలను గాయపరిచిందట! హవ్వ! ఎంత తెంపరితనం! ఏమిటీ సాంస్కృతిక దాష్టీకం? దాడిచేసినవారు పర ఆహార సహనాన్ని ఎందుకు కోల్పోయారు? తమకు ఇష్టం లేని లేదా ఇతరులు తినే మాంసాహారంపై మూత్రం పోసి, నేల పాలు చెయ్యటం వెనకున్న సాంస్కృతిక, సాంఘిక, తాత్విక ద్వేషాలు ఎప్పటివి? ఎంత బలమైనవి?
ఎంత అమానుషమైనవో ప్రజలు ఈ సందర్భంలో చర్చించాలి. వండుతున్న మాంసాహారాన్ని వొలకబోసి, ధ్వంసం చెయ్యటం మాంసాహారాన్ని తినేవారి మనోభావాలను గాయపరచటమేనని దాడిచేసినవారికి తెలియదా? ఇష్టమైన కూర వండుకు తినే స్వేచ్ఛ కూడా దళిత బహుజనులకు లేదా? మాకిష్టమైన చియ్యల కూర మేం తినడం పైన కూడా నిషేధాలేనా? దాడులేనా? అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారే! ఏమిటీ వికృతం?
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూడా 1996 నుంచి దళిత స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీఫ్ ఫెస్టివల్‌ను ఏటా నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ 'సుకూన్'లో భాగంగా జరిగిన బీఫ్ ఫెస్టివల్‌ను కొందరు కులోన్మాదులు వ్యతిరేకించారు. కానీ ఇఫ్లూలో లాగ అనాగరికమైన రూపంలో కాదు.
ఇఫ్లూలో జరిగిన దాడిలో అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులతో పాటు బీసీ విద్యార్థులూ ముందుండటం కలవరం కలిగించే విషయం. బీసీలు మేక, గొర్రె, కోడి మాంసాలను తింటారు. గొడ్డు మాంసం అంటే బీసీల దృష్టిలో మాదిగలు, మాలలు, అంటరాని కులాల వారు తినేదని. ఇదే భావన ఆధిపత్య కులాల మాంసాహారులకు ఉంది. దురదృష్టవశాత్తూ కొంతమంది బీసీలు బ్రాహ్మణీకాలను అనుకరిస్తున్నారు. అనుసరిస్తున్నారు. అసాంఘీకరణం చెందుతున్నారు. తమ సాటి మనుషులైన దళితుల మీదనే ఆధిపత్య కుల సంస్కృతిని చలాయించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆహార నియమాల వెనక కులం ఉంది; మతం ఉంది. మాంసాహారాన్ని వ్యతిరేకించే వారి వెనక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవస్థీకృతమైన బ్రాహ్మణీయ సాంస్కృతిక రాజకీయాలున్నాయి. మాంసాహారులైన బహుజనులను కించపరిచే ఉద్దేశాలు ఉన్నాయి. చరిత్రలో కాయకసరులు, కందగడ్డలు కూడా దొరకని రోజులను మా జాతులు చూశాయి. ఉంగిడి తగిలి, లేదా రోగంతో అప్పుడే చనిపోయిన పశువుల, జీవాల మాంసాన్ని తిని మావెనకటి తరాలు కరువాకలి తీర్చుకున్న సందర్భాలున్నాయి.
గురువు వీరబ్రహ్మం ఆజ్ఞను పాటించి, కుక్క మాంసాన్ని భుజించి సమ్యక్ దృష్టిని చాటిన సిద్దయ్య వారసులం. తుకతుక ఉడికి, మా నోటికాడికి అందివచ్చిన చియ్యల్ని (మాంసం ముక్కల్ని) మట్టి పాలు చేస్తే మా మనసులు తుకతుకలాడవా? మా మనోభావాలు గాయపడవా?
-కృపాకర్ మాదిగ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి
Andhra Jyothi News Paper Dated : 4/5/2011
No comments:
Post a Comment