Thursday, April 5, 2012

‘అభివృద్ధి’కి,‘అన్నల’కుమధ్య అడకత్తెరలో ఆదివాసీలు---డేవిడ్,



abujmad
గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ పేరుతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల దాడి- మావోయిస్టుల ప్రతిదాడి నేపథ్యంలో అబూజ్‌మాడ్‌ కొండల్లో ని గిరిజనుల పరిస్థితి అస్తవ్యస్థంగా మారుతోంది. చత్తీస్‌గఢ్‌ రాష్ర్టంలోని బస్తర్‌ పశ్చిమ ప్రాంతంలోని ఈ కొండలు మావో యిస్టులకు అడ్డాగా మారాయని, అక్కడి అడవుల్లో శిక్షణ పొందుతూ బలగాలను సమీకరిం చుకుని పరిసర ప్రాంతాల్లో డాడు లకు తెగబడుతు న్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. అబూజ్‌మాడ్‌లో ప్రభుత్వ దాడులను మావోయిస్టుపార్టీ తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాచీన గిరిజన తెగలుండే ప్రాంతాలలో ఒకటైన అబూజ్‌మాడ్‌ కొండలు, అక్కడ నివశిస్తున్న గోండుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. 

పది సంవత్సరాల క్రితం కొత్తగా ఏర్పడిన చత్తీస్‌గఢ్‌ రాష్ర్టంలో బస్తర్‌ ముఖ్యమైన ప్రాంతం. అడవులతో పాటు పుష్కలంగా ఖనిజ వనరులున్న ఈ ప్రాంతం ఒప్పుడు ఒకే జిల్లాగా ఉన్నా, తర్వాత ఐదు జిల్లాలుగా విడిపోయింది. అబూజ్‌మాడ్‌ అంటే ఎవరికీ తెలియని ప్రాంతం అని అర్థం. మాడ్‌ కొండల్లో నివశించే అదిమతెగలను మాడియా లేదా మారియాగాలుగా వ్యవహరి స్తారు. బస్తర్‌లో, గడ్చిరోలిలోనూ విస్తరించిన మాడియా గోండుల మూల నివాసం మాడ్‌ కొండలే. కాలక్రమేనా కొన్ని కుటుంబాలు కొండలు దిగి మైదాన అటవీ ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. మాడ్‌ గిరిజనుల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలు విభిన్నమైనవి. వైవిధ్యంతో కూడుకున్నవి. ప్రకృతితో విడదీయరాని సంబంధం కలిగినవి. వీరికి ఏ చిన్న రోగం వచ్చిన మరణమే శరణ్యమవుతుంది. ఆస్పత్రులు, స్కూళ్లు, రోడ్లు లేవు.అన్నింటికంటే ముఖ్యంగా మార్కెట్‌ లేదు. దోపిడీ లేదు.

స్వాత్రంత్యానంతర కాలంలో పాలకుల కన్ను అబూజ్‌మాడ్‌ వనరులపై పడింది. అభివృద్ధి పేరిట పరిసర ప్రాంతాలల్లో ఇనుపగనుల తవ్వకం మొదలైంది. వెదురు, టేకు, అటవీ సంపద కోసం ఫారెస్టు సిబ్బంది రావడం, గిరిజనులు సేకరించుకున్న ఇప్పపువ్వు తదితర ఉత్పత్తులను లాక్కెళ్లడం ఆరంభించారు. ఇటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలోకి నక్సల్స్‌ (పీపుల్స్‌వార్‌) అడుగుపెట్టారు. మాడ్‌ వాసులతో చెలిమి చేశారు. వారి జీవితంలో భాగంగా మారిపోయారు. ఆదివాసుల జీవితాలను మార్చడాన్ని ఆచరణలో నిరుపించయత్నించారు. మహిళలకు బ్లౌజుల పంపిణీచేశారు. పురుషులకు భూమి దున్నడం నేర్పించారు. పిల్లలకు, పెద్దలకు చదువు నేర్పించడానికి ఊరూరా స్కూళ్లు ఏర్పాటు చేశారు.

క్రమంగా మావోయిస్టులు అబూజ్‌మాడ్‌ గోండుల పాలిట దేవుళ్లయ్యారు. మాడ్‌ వాసులు తమ పిల్లలను దళాల్లోకి పంపించడం ప్రారంభించారు. దీంతో సురక్షితంగాఉన్న ఈ అబూజ్‌మాడ్‌ను మావోయిస్టులు తమ స్థావరంగా మార్చుకున్నారు. పోలీసులు ఆరోపిస్తున్నట్టు శిక్షణ, విశ్రాంతి తదితర కార్యక్రమాలకు ఈ ప్రాంతాన్ని ఉపయోగిం చుకుంటున్నారు. దట్టమైన ఈ కొండలపైకి పోలీసులు ఎప్పుడు వెళ్లడానికి ప్రయత్నించినా మట్టుబెట్టారు. ఫలితంగా ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య ఘర్షణ తీవ్రమై ప్రస్తుత స్థాయికి చేరింది. ప్రభుత్వ దాడులతో మాడ్‌ ప్రజల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. 

మావోయిస్టులను అబూజ్‌మాడ్‌ కొండల నుంచి తరిమేయడానికి స్థానిక గిరిజనుల గ్రామాలను ఖాళీచేయించి బయట పునరావాస శిబిరాల్లో ఉంచడానికి ప్రయశ్నించడంతో ప్రాచీనతెగల్లో ఒకటైన మాడియా గోండుల సంస్కృతి, సంప్రదాయాలను కాలరాయ డానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. పోలీస్‌- నక్సల్‌ వర్గాల పోరాటంలో ప్రాచీన అదివాసుల జీవితం ప్రశ్నార్థకంగా మారింది.కేంద్ర ప్రభుత్వం ఇస్రో సహాయంతో అబూజ్‌మాడ్‌ అడవులను శాటిలైట్‌ సహాయంతో సర్వే చేయించింది. అక్కడి మావోయిస్టు ఉద్యమాన్ని పారామిలటరీ బలగాలతో అణచలేక పోవడంతో చివరకు సైనికదాడి చేయాలని భావించింది.

దట్టమైన అడవుల్లో ఉన్న మావోయిస్టు స్థావరాలను ధ్వంసం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఏరియల్‌ బాంబింగ్‌ చేయాల్సి ఉంటుంది. అందుకోసం వేలాదిమంది గిరిజనులను అక్కడినుంచి తరలించవలసి ఉంటుంది. అయితే శాంతి భద్రతలకు విఘాతంగా మారారనుకుంటున్న మావోయిస్టులను ఈ ప్రాంతం నుంచి తరిమేసేందుకు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో సిద్ధపడిన ప్రభుత్వాన్ని కొన్ని హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు తప్పుపడుతున్నారు. ఈ యుద్ధం మావోయిస్టులను ఏరివేయడానికి కాదని, అక్కడున్న అటవీ సంపదను దోచుకోవడానికి, వాటిని బహుళ జాతి కంపెనీలకు అప్పగించడానికి అని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోిపణల్లో వాస్తవం లేకపోలేదు. పాతికేళ్లుగా మావోయిస్టులు గెరిల్లా జోన్‌గా ఏర్పరచుకున్న అబూజ్‌మాడ్‌ ను విముక్తి చేయాలన్న తలంపు ఇప్పుడే ప్రభుత్వాని ఎందుకు కలిగిందనేది ఆలోచించాలి. 

తూర్పున విజయనగరం, విశాఖ పట్నం మొదలు చత్తీస్‌గఢ్‌ వరకు- ఒడిషా మొదలు లాల్‌గఢ్‌ వరకు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో అడవులను అక్రమించుకొని అదివాసులను నిర్వాసితుల్ని చేస్తూ, ఈ అభివృద్ధి నమునాను ప్రతిఘటిస్తున్న విప్లవోద్యమాన్ని సాకుగా చూపుతున్నాయి. ప్రభుత్వాల ఏకపక్ష ధోరణులకు గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిషా రాష్ట్రాలలో దాదాపు 16 లక్షల మంది నిర్వాసితులయ్యారు. వీరిలో 80శాతం మంది అదివాసులే. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ సముద్ర తీరం వెంబడి అటవీప్రాంతాల్లో ఎనభై ప్రత్యేక ఆర్థికమండళ్లు రానున్నాయి. ఒక్క చత్తీస్‌గఢ్‌ లోనే 23 రకాల విలువైన ఖనిజాలు ఉన్నాయి. జపాన్‌కు చెందిన పోస్కో కంపెనీ, ఎస్సార్‌, టాటా, జిందాల్‌, లక్ష్మీ మిట్టల్‌ల వంటి బహులజాతి కంపెనీల దృష్టి ఈ అటవీ సంపదపై పడింది. 

అన్ని రాష్ట్రాలు ఈ కంపెనీలకు వేల ఎకరాలు కట్టబెట్టాయి. లాల్‌గఢ్‌లో ఐదు వేల ఎకరాలను ఉక్క ఫ్యాక్టరీ కోసం గత బుద్ధదేవ్‌ ప్రభుత్వం జిందాల్‌ కంపెనీకి అప్పగించింది. కానీ ఈ యుద్ధాన్ని మావోయిస్టులకు ప్రభు త్వానికి మధ్య పోరాటంగా చూపించటానికి పాలకవర్గాలు పూనుకుంటున్నాయి. సామ్రాజ్యవాద ప్రపంచీ కరణ అభివృద్ధి నమూనాను, దానిని వ్యతిరేకిస్తున్న ప్రజల మధ్య పోరాటంగా మనం దీనిని చూడాలి. స్వాతత్య్రం సాధించినప్పటి నుంచి నేటివరకు ఏ ప్రభుత్వం కూడా జల్‌, జమీన్‌, జంగ్‌పై అదివాసులకు ఉన్న హక్కులను గురించి ఆలోచించిన పాపాన పోలేదు. గతంలో తమ హక్కుల కోసం బిర్సా ముండా, వీర్‌ నారాయన్‌సింగ్‌, దారుబందు చంద్ర య్య, కోమురం భీంల నాయకత్వంలో ఆదివాసీలు విల్లంబులు ఎక్కుపెట్టి ఎందుకు యుద్ధం చేశారో ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.

devid
అలాగే మావోయిస్టు పార్టీ లేనిచోటసైతం కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదివాసీలపై దాడులు చేయకుండా ఉన్నాయా అనేది ఆలోచించాలి. కేరళలో నేషనల్‌ పార్కు కోసం ఏంజరిగింది? పోలవరంలో ఏం జరుగుతోంది? గోదావరి పొడవున సింగరేణి గనుల్లో ఏం జరుగుతోంది?60 ఏళ్లుగా దేశ వ్యాపితంగా భారీ పరిశ్రమలకోసం, జలయజ్ఞాలు, అణుపరిశోధనలు, ఉక్కు ఫ్యాక్ట రీలు, సైనిక శిక్షణలు వంటి అవసరాల కోసం ఆదివాసీలను నిర్వాసితులను చేశారు. ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు కట్టబెట్టేందుకు అటవీ సంపద కోసం ఆదివాసీలపై యుద్ధం ప్రకటించారు.

Surya News Paper Dated : 06/04/2012 

No comments:

Post a Comment