Monday, April 2, 2012

మతతత్వ తెలంగాణ మాకొద్దు - యూసుఫ్



పాలమూరు ఎన్నికల సందర్భంగా కొన్ని కారణాలు చూపుతూ 'రజాకార్ల కాలం గుర్తుకువస్తే ఎందుకు తప్పుపట్టాలి?' అంటూ మందాడి సత్యనారాయణరెడ్డి చేసిన వాదన (29 మార్చి 2012 ఆంధ్రజ్యోతి) ఏ రకంగా చూసినా సమర్థనీయం కాదు. పాలమూరు ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు ఓటు వేస్తే రజాకార్లకు వేసినట్టేనని బిజెపి ప్రచారం చేయడం దుర్మార్గం. మొదటి నుంచి కూడా తెలంగాణలో రజాకార్ల ప్రస్తావన మాటిమాటికి తెస్తూ ముస్లింలపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం బిజెపి చేస్తూ వస్తున్నది. 

రజాకార్ల విషయంలో నిజానిజాలు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. ముందుగా గ్రహించాల్సింది రజాకార్లకుగాని, నిజాం పాలకులకు గాని ప్రస్తుత తెలంగాణ ముస్లింలకు ఏమీ సంబంధం లేదన్న విషయం. కాకతీయులకో, రెడ్డి రాజులకో, మరొకరికో ఇప్పుడున్న ఆయా కులస్తులకు సంబంధం ఉంటుందా? బ్రిటిష్‌వారితో ఇక్కడి క్రైస్తవులకు ఏమిటి సంబంధం? కేవలం ముస్లింలకు మాత్రమే నిజాం రాజులతో సంబంధం కలిపి, రజాకార్ల ప్రస్తావన తెచ్చి విమర్శించడం సరైంది కాదు.

మరొక విషయం, రజాకార్లంటే కేవలం ముస్లింలు అనే ప్రచారం కూడా అవాస్తవం. రెడ్లు, వెలమలు, బ్రాహ్మణ దొరల దగ్గరి గూండాలు రజాకార్ల అవతారమెత్తిన విషయం మరవొద్దు. వారిలో ముస్లిమేతరులు కూడా ఉండేవారన్న సంగతి మరుగున పడుతోంది. దొరలు చేయించిన అకృత్యాలన్నీ రజాకార్ల పేరుమీద ముస్లింలకు ఆపాదిస్తూ ముస్లిం వ్యతిరేకతను పెంచే ప్రయత్నం కావాలనే బిజెపి, దాని అనుబంధ సంస్థలు చేస్తున్నాయి. ఇవి కేవలం ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లిమేతరులను రెచ్చగొట్టి ఓట్లు దండుకుని సీట్లు పెంచుకునే ఎత్తుగడ మాత్రమే. 

తెలంగాణ ఉద్యమంలో ఇంకొక ముఖ్యవిషయం ఏమంటే- 2009 ఎన్నికల్లో నిజామాబాద్‌లో డి.శ్రీనివాస్ ముస్లింలకు మద్దతుగా మాట్లాడుతూ ఓ తీవ్రమైన కామెంట్ చేశాడన్న నెపంతో ముస్లిమేతరులనంతా రెచ్చగొట్టి డిఎస్‌ను ఓడించి తమ అభ్యర్థిని గెలిపించుకుంది బిజెపి. తెలంగాణ కోసం రాజీనామాలు చేసినప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో డిఎస్ గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ముస్లింలు ఓటేయకుంటే గెలవలేని పరిస్థితి బిజెపికి ఏర్పడింది. దాంతో ముస్లింలు తెలంగాణకు అనుకూలమా కాదా అనే విషయాన్ని తెర మీదికి తెచ్చి ముస్లింలను ఇరుకున పెట్టారు. దాంతో మనసు చంపుకొని ముస్లింలు తెలంగాణ కోసం బిజెపికి ఓటేశారు. 

ఎంతకూ మనసొప్పని వారు ఓటు వేయకుండా ఉండిపోయారు. దాంతో బిజెపి గెలిచింది. అప్పుడు కనీసం ముస్లింలకు కృతజ్ఞతలు కూడా చెప్పని నీతి బిజెపిది. ఏరు దాటగానే తెప్ప తగలేసిన చందంగా మళ్లీ ఎప్పటిలాగే ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేస్తూనే వస్తున్నారు. నిజానికి ఆ రుణం తీర్చుకునే అవకాశం మహబూబ్‌నగర్‌లో వచ్చింది. 

కానీ అలాంటి అవకాశం ఏమాత్రం ఇవ్వకపోగా, కెసిఆర్ తమతో చర్చించలేదని, జెఎసికి మాట మాత్రంగానైనా చెప్పకుండానే పోటీకి పెట్టారని వంకలు చెబుతూ బిజెపి పోటీకి దిగింది. మిగతా విషయాల కన్నా టిఆర్ఎస్ ముస్లిం అభ్యర్థిని పోటీకి దించడమే బిజెపి పోటీకి అసలు కారణం.పోటీకి దిగడమే కాకుండా జెఎసి వాళ్లతో మేనేజ్ చేసుకుని, కెసిఆర్ మీద వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటినీ కలుపుకొని, 'రెడ్డి' కార్డు ఉపయోగించి, అగ్రవర్ణాలన్నీ ఏకమై చివరికి ముస్లిం అభ్యర్థిని ఓడగొట్టడం తెలిసిందే. 

ఈ మొత్తం ప్రహసనంలో అందరూ కలిసి ముస్లింలను ఒంటరి చేసిన వైనం భయం గొలుపుతున్నది. తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు, మతాలు, పార్టీలు, శక్తులు అందరూ తెలంగాణ కోసం ఏకమయ్యారు అనే విశ్వాసంలో ఇప్పుడు బిజెపియే ఒక చీలిక తీసుకొచ్చింది. మరి మిగతా శక్తులు ముస్లింల గురించి ఏమాలోచిస్తున్నాయి? అందరు శక్తుల్లో ముస్లింలు కూడా భాగమా కాదా? బిజెపి మద్దతు కోసం ముస్లింలను వొదులుకోవడానికైనా జెఎసి, మిగతా శక్తులు సిద్ధపడుతున్నాయా? అన్నది ముఖ్యమైన ప్రశ్న. లేదంటే ప్రజాఫ్రంట్ మౌనంగా ఎందుకుంది? 

కృష్ణమాదిగ లాంటివారు కూడా బిజెపికి ఎందుకు మద్దతు పలికారు? కేవలం కెసిఆర్ మీది వ్యతిరేకతే కారణమంటారా? నిజానికి- ముస్లిం అభ్యర్థికి వ్యతిరేకంగా బిజెపి చేస్తున్న విష ప్రచారం మొత్తంగా ముస్లింల మనోభావాలను గాయపరుస్తున్నదని, ముస్లిం అభ్యర్థి ఓడిపోవడం వల్ల మొత్తంగా తెలంగాణ ముస్లింలు తెలంగాణ ఉద్యమ శక్తులను అనుమానించే పరిస్థితి తలెత్తే అవకాశమున్నదని అప్పటికే ప్రచారమై ఉన్నది. అయినప్పటికీ జెఎసి మౌనం, స్థానిక జెఎసి బిజెపి వైపు మొగ్గడం, న్యూడెమోక్రసి, మాదిగ దండోరా తదితర శక్తులన్నీ బిజెపికే మద్దతు ఇవ్వడం ఎలాంటి సంకేతాలనిస్తోంది? 

పైగా ఇప్పుడు టిఆర్ఎస్‌కు బిజెపినే ప్రత్యామ్నాయమనీ, బిజెపి అధికారంలోకొచ్చి తెలంగాణ ఇస్తుందనీ బిజెపి ప్రచారం చేసుకుంటోంది. దీనివల్ల ముస్లింల మీద విష ప్రచారంతో గెలిచే పార్టీ, ఒక మతతత్వ పార్టీ ఇచ్చే తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాందోళనలకు ముస్లింలు గురికావడంలో అతిశయోక్తి ఏముంది? ముస్లింలుగా మాకు 'మతతత్వ తెలంగాణ' అవసరం లేదు. ప్రజాస్వామిక, సెక్యులర్ పార్టీలు పోరాడి తెచ్చుకునే తెలంగాణ కావాలి. విషప్రచారంతో, అబద్ధపు ప్రచారాలతో ముస్లింల మనోభావాలు గాయపర్చే క్రూర రాజకీయాలను అందరూ వ్యతిరేకించాలని కోరుతున్నాం. 

కాబట్టి ఇన్నాళ్లు మార్క్సిస్టులుగా, బహుజన దృక్పథంతో పనిచేస్తున్నవారుగా ఎంతో చైతన్యం ప్రదర్శించినవారు ఒక మతతత్వ పార్టీ ఇచ్చే తెలంగాణ వల్ల ముస్లింల, క్రైస్తవుల కాళ్లకింది భూమిని కోతకు గురిచేయొద్దని మనవి. 2014 తర్వాత బిజెపి గెలిస్తే తెలంగాణ ఇస్తుందని జరిగే ప్రచారం వల్ల మొదటికే మోసం జరిగే అవకాశముంది. కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకి రాకపోతే తెలంగాణ మొత్తానికే వెనక్కుపోయే అవకాశం ఉంది. 

అంతేకాక తెలంగాణలో ఇన్నేసి పార్టీలు, ఇన్నేసి ప్రజాసంఘాలు, విప్లవ సంఘాలు- పార్టీలు ఉండికూడా చివరికి ఒక మతతత్వ పార్టీ మీద ఆధారపడే దౌర్భాగ్య పరిస్థితిని కల్పించుకోవద్దని కూడా మనవి. టిఆర్ఎస్ కూడా ఎలాగోలా 2014 వరకు లాగి మరోసారి తెలంగాణపై బేరసారాలాడొచ్చని భ్రమిస్తూ ఉండవచ్చు. 2014 వరకు లాగితే ముస్లింలతో పాటు అంబేద్కరిస్టులంతా తెలంగాణను వ్యతిరేకించే అవకాశముందని గ్రహించడం అవసరం. ఎంత నీచానికైనా ఒడిగట్టే ప్రచారాలతో రెచ్చగొట్టి ఓట్లు పొందాలనుకునే బిజెపి కుట్రలకు టిఆర్ఎస్ కూడా బలి అయ్యే అవకాశముంది. 

ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఉద్యమం వేడెక్కిన ఈ సందర్భంలోనే తెలంగాణ ఏర్పాటుకు మరింత వత్తిడి పెంచాల్సిన అవసరముంది. అప్పటికీ కాంగ్రెస్ కదలకుంటే మరింత పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె ద్వారా సర్వం స్తంభింపజేసి తెలంగాణ సాధించుకోవడం ఒక్కటే మార్గం. లేదంటే తెలంగాణలోని అతిపెద్ద సమూహమైన ముస్లింలు తెలంగాణ ఉద్యమానికి దూరమయ్యే ప్రమాదముంది. బిజెపి వ్యతిరేక శక్తులంతా కూడా దూరమవుతారు. ఆ పరిస్థితిని నివారించడానికి అందరం ఇప్పుడే ప్రయత్నం చేయాలి. 

- యూసుఫ్
ముస్లిం విద్యావంతుల-రచయితల వేదికల తరఫున
Andhra JyothI News Paper  Dated : 3/04/2012

No comments:

Post a Comment