అభివృద్ధి ముసుగులో ఓపెన్‌కాస్ట్‌లూ, అభయారణ్యాలూ, వపర్ ప్రాజెక్టులూ ఇలా ఇంకా అనేక ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం జరుపుతున్న విధ్వంసకాండకు ఆదిలాబాద్ ఆదివాసీలు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఆదివాసుల జిల్లా. ఇక్కడ విస్తారమైన అడువులు ఉన్నాయి. బొగ్గు, సిమెంట్, సున్నపురాయి, పుష్కలమైన నీటి వసతులు, ఇతర ఖనిజాలు, అపారమైన అటవీ సంపదలున్నాయి. ప్రకృతి వనరులున్నాయి. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులతో, బహుళజాతి సంస్థలతో, కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై అభివృద్ధి అనే పేరుతో కుట్రపూరితమైన పథకాలు అమలుచేస్తున్నాయి. తరతరాలుగా జిల్లాలో నివసిస్తున్న ఆదివాసులను నిర్వాసితులు చేసే విధంగా ఈ పథకాలు పనిచేస్తున్నాయి.
దేశంలో రెండు దశాబ్దాలుగా నూతన ఆర్థిక విధానాలు అమలవుతున్నాయి. ఈ ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రతి దాన్ని మార్కెట్ శక్తులకు అనుకూలంగా అమలు చేయాలనే ధోరణి కనిపిస్తున్నది. ఇదే విధానం అభివృద్ధి నమూనాగా విస్తృతంగా ప్రచారం చేయబడుతోంది. ప్రకృతి వనరులపై ఆధారపడి జీవించే ఆదివాసీ ప్రజలు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారు.
సామ్రాజ్యవాదులతో ఒప్పందాలు చేసుకున్న భారత పాలక వర్గాలు ఇవాళ ఆదివాసుల రక్షణ చట్టాలను తుంగలో తొక్కి ఆదివాసీ ప్రాంతాలలో గల విశాలమైన అడవులనూ, ఖనిజ సంపదలనూ దోచుకెళ్ళడానికి ఎర్ర తివాచీలు పరుస్తున్నాయి. భారీ విధ్వంసంతో కూడుకొని ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల వల్ల వేలాది ఎకరాల ప్రకృతి సంపద భావితరాలకూ మిగలకుండా పోతున్నది. ఆదివాసీ ప్రజల జీవనాన్ని విచ్ఛిన్నం చేసి, కేవలం సామ్రాజ్యవాదుల, బహుళజాతి కంపెనీల, పాలకవర్గాల ప్రయోజనాలనూ నెరవేర్చే ఇలాంటి ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనాను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
అభయారణ్యాల పేరిట, అడవి జంతువుల రక్షణ పేరిట (టైగర్ జోన్) కవ్వాల్ అభయారణ్యాల ప్రాంతంలోని ఆదివాసీలను ఖాళీ చేయించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ శాఖ రంగం సిద్ధం చేశాయి. తరతరాల నుంచి అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలు, ఆదివాసీ భూములనూ, అటవీ సంపదనూ, అడవి హక్కునూ కోల్పోతున్నారు. అనేక మంది ఆదివాసులు నిర్వాసితులు అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యాన్ని దేశంలో 41వ టైగర్ జోన్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
45 కోట్ల రూపాయలతో 49వేల హెక్టార్ల అడవులను టైగర్ జోన్‌గా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ టైగర్ జోన్ కింద జిన్నాం, కడెం, పెంబి, బిర్యాయిపేట, ఊట్నూర్, తిర్యానీ, అటవీ రేంజ్ పరిధిలోని 43 గ్రామాలు అడవి మధ్యలో ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో 50 నుంచి 100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా అటవీభూములు సాగు చేసుకుంటూ అడవిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 43 గ్రామాలనూ రెండు దశల్లో ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు.
మొదటి దశలో నాలుగు గ్రామాలనూ (దొంగపల్లి, అల్లినగర్, మాల్యాల, మైసంపేట) అక్కడి నుంచి ఎత్తివేసి వారికి పునరావాసం కల్పించాలని భావిస్తున్నది. మిగిలిన గ్రామాల వారికి కౌన్సిలింగ్ ద్వారా అడవి నుంచి మైదాన ప్రాంతాలకు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో ఖనిజాల పేరిట వేల ఎకరాల భూమిని ఆదివాసుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ప్రభుత్వం ఒక పక్క హక్కులు కల్పిస్తామంటూ మరోపక్క ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నది.
ఇప్పటికీ అనేక రకాలుగా వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకొని ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నది. అభయారణ్యంలోని అటవీ ప్రాంత ఆదివాసులను జంతువుల కోసం అడవి నుంచి వెళ్ళగొట్టడం అంటే జంతువుల కంటే ఆదివాసులను హీనంగా చూడడమే అవుతుంది. తమ స్థిరమైన జీవనాధారం కోల్పోతున్న ఆదివాసులు భూమీ మీద, అడవి మీద నీటి మీద హక్కుల కోసం వాటిని కాపాడటం కోసం పోరాడుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా రాజ్యం వారిపై హింసను ప్రయోగిస్తున్నది.
నేరడిగొండ మండలం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న అందమైన అపురూపమైన జలపాతంపై మినీ హైడల్ స్కీమ్‌ని ప్రైవేట్ రంగం ఆధ్వర్యంలో నిర్మించడానికి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం అనుమతించింది. కడెం నదిపై గ్రానైట్ పరుపు బండలపై సుమారుగా నాలుగు కిలోమీటర్లు ప్రవహించి 70 అడుగుల కిందికి దూకి నాగుమల్లె రిజర్వ్ ఫారెస్ట్‌నూ చీల్చుకుంటూ చివరికి కడెం రిజర్వాయర్ చేరుతుంది. కుంతాల జలపాతంపై ఆరు మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి సూరపరాజ్ అనే కాంట్రాక్టర్ రాజీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుమీద 1999లోనే ప్రభుత్వ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ జలపాతాన్ని మింగివేయడానికి 12 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న సూరపరాజు ప్రభుత్వంలో ఉన్న తన ఇతరత్రా సాధనాలను ఉపయోగించుకొని ఇవాళ తెరమీదకు తీసుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో కుంతాల జలపాతం ఒక టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చెందింది. దీనిపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. అలాగే అడవిపై ఆధారపడిన ఆదివాసులు, చేపలు పట్టుకొనే బెస్తవాళ్ళు జీవనం గడుపుతున్నారు.
కుంతాల జలపాతం ఇక్కడ ఆదివాసీ తెగ అయినటువంటి గోండులకూ పరమ పవిత్ర ప్రదేశం. సంవత్సరానికి రెండుసార్లు వారు ఇక్కడికి వచ్చి గుండంలో స్నానం చేసి తమ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రెండు రోజులు సోమన్న జాతర జరుగుతుంది. కుంతాల జలపాతంపై పవర్ ప్రాజెక్ట్ నిర్మించి ఆదివాసుల సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కుంతాల జలపాతం మీదుగా కడెం ప్రాజెక్టుకూ నీరు వస్తుంది. పవర్ ప్రాజెక్టు కట్టడం వలన కడెం ప్రాజెక్టు నీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది.
కుంతాల జలపాతం పరిరక్షణ కోసం జిల్లా వాసులు కదులుతున్నారు. తెలంగాణలోని సకల జనులు ఐక్యమై సామ్రాజ్యవాద అభివృద్ధికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించడం ద్వారానే నిజమైన ప్రజా ప్రత్యామ్నాయం నిర్మించగలం. ఈ రాష్ట్రంలో ప్రతి ఆదివాసీ ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న ఆదివాసులందరూ కొమురం భీం, అల్లూరి, బీర్సముండా పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆదిలాబాద్ ఆదివాసులకు అండగా, మిలిటెంట్‌గా పోరాడుదాం.
- వూకే రామకృష్ణ
ఆదివాసీ రచయితల సంఘం, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
Andhra Jyothi News Paper Dated : 24/04/2012
No comments:
Post a Comment