Tuesday, April 17, 2012

ఒక తరం అంతరించింది - బి.ఎస్. రాములు



కెజి సత్యమూర్తి అలుపెరుగని మహా పోరాట యోధుడు. జీవితమంతా ఉద్యమాలకు అంకితం చేసి సామాజిక న్యాయం, సామాజిక మార్పు కోరుతూ కులరహిత, వర్గ రహిత సమసమాజ నిర్మాణం కోసం కలలు కన్నారు. కలలు కనలేని వారు విప్లవకారుడు కాలేరని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. వర్గ శత్రువు నిర్మూలన అనే పోరాట పంథా ఆచరణలో ఉన్నప్పుడు స్వార ్థం శిరస్సును గండ్రగొడ్డలితో నరికిన వారే నేటి హీరో, వర్గ శత్రువు రక్తంలో చేతులు తడిపిన వారే విప్లవకారుడు అనే నినాదాలు ఆనాడు బాగా ప్రాచుర్యంలో ఉండేవి. 

చైనాలో సాంస్కృతిక విప్లవ ం ప్రారంభమై మావో ఇచ్చిన పిలుపుతో అక్కడి పార్టీలో కిందినుంచి పైదాకా ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా చూసింది. మావో కేంద్ర కమిటీ నాయకుడుగా ఉంటూనే కేంద్ర కమిటీని ధ్వంసం చేయండి (బొంబార్డ్ ద హెడ్ క్వార్టర్స్) అని పిలుపు ఇచ్చారు. సాంస్కృతిక విప్లవాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో ప్రజలను ఎలా చైతన్యవంతం చేయాలో అనేక మార్గదర్శకాలను మావో రూపొందించాడు. చైనా సాంస్కృతిక విప్లవం భావధారను నక్సలైట్ ఉద్యమం స్ఫూర్తిగా స్వీకరించింది. ఆ క్రమంలో సత్యమూర్తి సిపియం నుంచి నక్సల్బరీ ఆలోచనకు మలుపు తిరిగారు. ఆ స్ఫూర్తితో ఆయన రాసిన 'తూర్పు పవనం వీచెనోయ్ తూర్పు దిక్కు ఎరుపెక్కెనోయ్''అనే పాట యువతరాన్ని ఉత్తేజపరిచింది. 

కెజి సత్యమూర్తి మరణంతో వయోవృద్ధులైన విప్లవకారుల తరం అంతరించింది. శివసాగర్ మహాకవిగా, మార్గదర్శకుడుగా, స్ఫూర్తి దాతగా విప్లవోద్యమానికి దశాబ్దాలు పెద్దదిక్కుగా నిలచారు. విప్లకారుడుగా జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. విద్యార్థి దశనుంచే అభ్యుదయ మార్క్సిస్టు భావజాలంతో కృష్ణాజిల్లా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1956 నుంచి తనదైన ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు. నవోదయ, విశాలాంధ్ర వంటి పత్రికల్లో ఉపసంపాదకులుగా పనిచేసారు. 

కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. చండ్రరాజేశ్వరరావ్, మద్దుకూరి చంద్రశేఖర్‌రావ్, తదితరుల సహచర్యంలో రాజకీయ చైతన్యం పెంచుకున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయినప్పుడు సిపియంలో చేరారు. ఉద్యోగరీత్యా వరంగల్‌లో సెయింట్ గాబ్రియల్ స్కూల్లో పనిచేస్తూ 1964-1968 మధ్య రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో, కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థులను కదిలించారు. 

సిపియం నుంచి చీలిపోయి చారుమజుందార్ నక్సల్‌బరీ ఉద్యమాన్ని ప్రారంభించినప్పడు సత్యమూర్తి వారిని స్వయంగా కలిసారు. 1967లో సత్యమూర్తి, కొల్లిపర రామనర్శింహ రావు (సినిమా దర్శకుడు కెబి తిలక్ సోదరుడు) తదితరులు గుత్తికొండ బిలంలో చారు మజుందారును కలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నక్సలైట్ భావజాల నిర్మాణంలో కవిగా, విప్లవకారుడిగా సత్యమూర్తి నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకమైనది. 1968లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఫ్యాక్టరీ కోసం నిరాహార దీక్షలు చేపట్టారు. వరంగల్‌లో విశాఖ ఉక్కు ఆం«ద్రుల హక్కు ఉద్యమానికి సత్యమూర్తి నాయకత్వం అందించారు. 

1969లో జై తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగినప్పుడు ఉద్యమాన్ని సమర్ధిస్తూ సత్యమూర్తి కరపత్రాలు వ్రాసి విద్యార్థి యువజనుల్లో ఉత్తేజాన్ని నింపారు. సృజన సాహిత్య మాస పత్రిక భావధారలో సత్యమూర్తి ప్రభావం ఎంతో ఉంది! విప్లవ రచయితల సంఘం నిర్మాణంలో దాని స్ఫూర్తిదాతల్లో సత్యమూర్తి పెద్ద దిక్కుగా నిలిచారు. విప్లవకారుడిగా ఉంటూ కవిగా రాస్తున్న రచనలు రచయితల్లో గొప్ప ప్రభావాన్ని కలిగించాయి. 

1969-72 మధ్య సహచరులతో కలిసి విప్లవోద్యమ నిర్మాణాన్ని చేపట్టారు. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శిగా కొండపల్లి సీతారామయ్య వ్యక్తిగత ప్రవర్తన, నైతిక విలువ రీత్యా సరిగ్గాలేదని పార్టీ 1957లో ఆయనని సస్పెండ్ చేసింది. దాంతో ఆయన వాళ్ళ అన్న చెప్పిన మార్గంలో ఆదిలాబాద్ జిల్లా జన్నారం లక్సెట్టి పేట కడెం ప్రాజెక్టు ప్రాంతంలో భూములు కొని వాళ్ళ అక్క చేత వ్యవసాయం చేయిస్తూ, తాను వరంగల్‌లో హిందీ టీచర్‌గా ఉద్యోగం చేస్తుండేవారు. సత్యమూర్తి చురుకుగా ఉంటూ కొండపల్లి సీతారామయ్యను తిరిగి ఉద్యమంలో పనిచేయడానికి ప్రోత్సహిస్తూ వచ్చారు. అలా కొండపల్లి సీతారామయ్య విప్లవ రాజకీయాల్లో మహానాయకుడిగా ఎదగడానికి బీజం పడింది. 

ప్రభుత్వం సత్యమూర్తిపై రకరకాల కేసులు పెట్టి 1972-77 ఆరేళ్ళపాటు జైలులో ఉంచింది. ఆరేళ్ళ జైలు జీవితంలో ఎందరినో జైల్లోనే విప్లవకారులుగా ఆయన మలిచారు. జనతాపార్టీ ఎమర్జన్సీ ఎత్తివేసిన సమయంలో సత్యమూర్తి బహిరంగ జీవితంలోకి వచ్చారు. అప్పటికి కొండపల్లి సీతారామయ్య విప్లవ విద్యార్థి, యువజన, రైతుకూలీ సంఘాల నిర్మాణాన్ని, పార్టీని యువతరంలో బలోపేతం చేస్తూ వచ్చారు. 1977-80ల మధ్య సత్యమూర్తి బహిరంగ జీవితంలో ఉంటూ అనేక రంగాల్లో కృషి చేశారు. 

1978లో జరిగిన జగిత్యాల జైత్ర యాత్ర రైతు చైతన్యంతో ఉప్పొంగిపోయారు. 1980లో పీపుల్స్‌వార్ పార్టీగా ఏర్పడిన తర్వాత 1984లో దానికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా కెజి సత్యమూర్తి ఎన్నికయ్యారు. పార్టీలో సాగిన వర్గ వైరుధ్యాలు, కులవైరుధ్యాలు, సైద్ధాంతిక వ్యక్తిగత విభేదాలు, వ్యక్తిత్వాల సంఘర్షణ కలిసి సత్యమూర్తికి, కొండపల్లి సీతారామయ్యకు ఎడం పెరిగింది. పార్టీ నిర్మాణంలోంచి సత్యమూర్తిని బహిష్కరించటం జరిగింది. ఇతర రాష్ట్రాల నాయకులు సత్యమూర్తిని చివరిదాకా సమర్ధించారు. 

1990లో సత్యమూర్తి బహిరంగ జీవితంలోకి వచ్చారు. విప్లవ రచయితల సంఘం మహాసభల్లో పాల్గొన్నారు. విరసం సభ్యులు ఆయన పట్ల ఆదరం చూపకపోవడం ఆయనను కలచివేసింది. అంబేడ్కర్ రచనలను అధ్యయనం చేస్తూ భారతదేశంలో అంబేడ్కర్ చెప్పిన కుల నిర్మూలన, మార్క్స్ చెప్పిన వర్గ నిర్మూలన రెండింటిని మేళవించి విప్లవ నిర్మాణం చేయాలని 1985నుంచి భావిస్తూ వచ్చారు. 1990 నుంచి బహిరంగ వేదికలపై చర్చలు చేశారు. అనేక పార్టీల శ్రేణుల్లో నూతన దృష్టి ప్రవేశించడానికి ఆయన కారకులయ్యారు. అప్పటికే రాష్ట్రంలో కాన్షీరాం ప్రభావం పెరగడం, కారంచేడు ఉద్యమ స్ఫూర్తి విస్తరించటం వల్ల విప్లవ శ్రేణుల్లో సత్యమూర్తి చెప్పిన అంశాలు ఆకర్షించాయి. 1991 ఆగస్టు చుండూరు సంఘటన తరువాత జరిగిన ఉద్యమంలో ఆయన విస్తృతంగా పాల్గొన్నారు. 

ఉ.సాంబశివరావు, రామారావు తదితరులతో కలిసి మార్క్సిస్టు లెనినిస్ట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎదురీత, ఏకలవ్య పత్రికలను నిర్వహించారు. దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక నిర్మాణానికి తన పూర్తి నైతిక మద్దతునందించారు. 1994లో బహుజన సమాజ్‌పార్టీలో చేరి కాన్షీరాంతో, కత్తి పద్మారావుతో, బొజ్జాతారకంతో కలిసి పనిచేశారు. పార్లమెంట్ రాజకీయాలతో రాజీపడలేక ఆ పార్టీ నుంచి వెలుపలకి వచ్చారు. మళ్ళీ దళిత బహుజన ఉద్యమ నిర్మాణానికి అంబేడ్కర్, మార్క్స్, ఫూలే సిద్ధాంతాల సంశ్లేషణకు కృషి చేశారు. ఈ క్రమంలో ఎన్నో ప్రయాణాలు చేశారు. 

మహారాష్ట్రలోని శరద్‌పాటిల్ నాయకత్వంలో నడుస్తున్న సత్యశోధక కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలను అధ్యయనం చేశారు. శరద్‌పాటిల్ నాయకత్వంలో కులనిర్మూలన ప్రధాన ఎజెండాగా ఒక ఉద్యమాన్ని చేపట్టాలని భావించారు. ఇలాంటి అనేక సంస్థల్లో, ఉద్యమాల్లో నేను, సత్యమూర్తి కలసి పనిచేశాము. విప్లవోద్యమంలో నేను పనిచేస్తున్నప్పుడు ఏకలవ్యుడిలా సత్యమూర్తి అలియాస్ శివసాగర్ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయన బహిరంగ జీవితంలోకి వచ్చాక కూడా అనేక విషయాల్లో మార్గదర్శకం వహించారు. భారతదేశంలో జాతుల సమస్యల్లో కులసమస్య గురించి జాతీయ సెమినార్ నిర్వహించారు. 

ఉద్యమ నెలబాలుడు వంటి కవితా సంపుటాలను వెలువరించారు. 'నర్రెంగ చెట్టు కింద నరుడో భాస్కరుడా!' 'తోటా రాముని తొడకు కాటా తగిలిందా అని', 'గంగదాటెల్లిపోయే చెల్లెమ్మ', 'నల్లనల్లని సూర్యుడు', 'అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు', 'మెదడులో ముద్ర రాక్షసం-గుండెల్లో మనుధర్మం' ఇలా ఎన్నో పాటలు ఉద్యమాల ప్రతిమలుపులోను నినాదాలుగా ముందుకొచ్చాయి. ఆయా ఉద్యమాలు ఆయన కవిత్వంలో ప్రతీకలుగా కవితా వస్తువులుగా అంతర్లీనంగా ఒదిగిపోయాయి. 

ఆయన సాహిత్యం, ఆయన కవిత్వం ఉద్యమాల ప్రతిఫలమే. తాత్వికంగా అనేక అంశాలను లోతుగా పరిశీలించి ఎప్పటికప్పుడు తనను తాను సవరించుకుంటూ, సంస్కరించుకుంటూ ముందుకు సాగుతూ దారిచూపిన వారు శివసాగర్. విప్లవోద్యమాన్ని ఆయన ఎంత ప్రభావితం చేశారో, దళిత బహుజన ఉద్యమంలోని అంతకు ఎన్నో రెట్లు విశాల ప్రజానీకాన్ని, వారి భావజాలాన్ని ప్రత్యక్షంగా స్వయంగా ప్రభావితం చేశారు. దశాబ్దాల సాహిత్య సామాజిక ఉద్యమాలకు చారిత్రక వారధి శివసాగర్. 

ఇలా తెలుగు సాహిత్యంలో వస్తువు భావజాలపరంగా మలుపు తీసుకోవడంలో శ్రీశ్రీ తరువాత శివసాగర్ నిర్వహించిన పాత్ర మహోన్నతమైనది. నేటికి విప్లవ సాహిత్యంలో, దళిత బహుజన సాహిత్యంలో ఆయన పెట్టిన ఒరవడే కొనసాగుతున్నది. శిలలా కరుడుగట్టి పోకుండా నిరంతరం ప్రయోగశీలతతో నూతనత్వం, నూతన భావాలను ఆహ్వానిస్తూ మహాకవిగా, విప్లవ యోధుడిగా ఆయన ముందుకు సాగారు. ఇందులో ఎన్నో వైఫల్యాలు, గుణపాఠాలు ఉన్నాయి. 

అవి యువతరానికి ఇతర ఉద్యమాలకు ఎంతో అక్కరకు వచ్చాయి. అలా తన విషాదాలను గరళ కంఠుడిగా తన కంఠంలోనే దాచుకున్నారు. ఆయన జీవితం, ఆచరణ దశాబ్దాల భారతీయ సమాజం పరిణామాలను, మలుపులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆయన జీవితం ఒక మహత్తరమైన సందేశం. నక్సల్బరీ తరంలోని తొలితరం నాయకుల్లో సత్యమూర్తి నిర్వహించిన పాత్ర మహోన్నతమైనది. వారికి ఇవే నా జోహార్లు. 

- బి.ఎస్. రాములు
సామాజిక తత్వవేత్త
Andhra Jyothi News Paper Dated : 18/04/2012 

No comments:

Post a Comment