Wednesday, April 4, 2012

బిసిలకూ సబ్‌ప్లాన్ - ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి



ఇక్కడ తొలిసారిగా చెప్పవలసిందేమంటే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రణాళిక తయారు, కేటాయింపు దాని వినియోగంపైన ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేయడం పట్ల బిసిలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు దీని కోసం గళం విప్పి పోరాడిన పార్టీలను, వారి ఆవేదనను విన్న ప్రభుత్వాన్ని ఇందుకు అభినందించడం కూడా చేస్తున్నారు. కాని ఇదే విషయంలో బిసిలు తమకు ప్రణాళికలో సబ్ ప్లాన్ కావాలని దాన్ని అమలుచేయాలని అభివృద్ధి కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చులో తమ వాటా తమకు కావాలని ఎంతో కృషి చేశారు. విశ్వవిద్యాలయ ఆచార్యులు దీని కోసం ఎంతో శ్రమించి దానికి సంబంధించిన ప్రణాళికను తయారు చేసి పెద్ద సదస్సులు నిర్వహించారు. కొన్ని పార్టీలు కూడా దీనిని ఆహ్వానించాయి. మద్దతు పలికాయి. అంతే కాదు బిసి సంక్షేమ సంఘం వంటి ఇతర సంస్థలు కూడా దీని కోసం ఎంతో పరితపించాయి. కానీ వీటన్నింటిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 

ఈనాడు కమ్యూనిస్టు పార్టీ, సిపిఎమ్, దాని అనుబంధ సంస్థలు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ప్రణాళిక కావాలని దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. అందుకు వీరిని అభినందించాలి. కాని బిసి కులాలు ఏదైనా సామాజిక అంశం మీద పోరాటం చేస్తే కుల ప్రాతిపదికన మేము ఉద్యమాలు చేయమని అలాంటి సమావేశాలకు సదస్సులకు ఈ కమ్యూనిస్టు పార్టీల వారు తమ ప్రతినిధులను పంపడం లేదు (మిగతా పార్టీలు కనీసం తమ ప్రతినిధులను పంపి తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. గొంతు కలుపుతున్నాయి). కానీ ఎస్సీ, ఎస్టీల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు తమ మద్దతు తెలిపే విధంగానే అతి కింది స్థాయిలో ఎంతో అణగారి ఉండి ఎంతో సామాజిక వివక్షకు గురవుతూ భిక్షాటన వృత్తిలో ఉన్న బిసి కులాలు ఎన్నో ఉన్నాయి. వాటి పట్ల జరిగే సామాజిక వివక్ష, అవి పొందుతున్న అన్యాయం విషయంలో కమ్యూనిస్టు పార్టీలు, ప్రగతి శీలమైన ఆలోచనలు చేసే వారు కూడా కులం అనే దాన్ని బూచిగా చూపి దూరంగా అంటీముట్టకుండా ఉండడం సబబు కాదు. 

బిసి-ఎ కేటగిరీలో ఉండే ఎన్నో వృత్తికులాల వారు అత్యంత హీన స్థితిలో జీవిస్తున్నారు. బిసి-డి కేటగిరీలో ఉన్న వారు కూడా కొందరు అత్యంత హీనమైన సామాజిక వివక్షకు గురౌతున్నారు. గడచిన శతాబ్దాలలో దేవదాసీలుగా ఉన్న కులాల వారు వివిధ మైన పేర్లతో ఇటువంటి వృత్తి గడిపిన వారు ఈనాడు కూడా చాలా సామాజిక వివక్షకు గురౌతున్నారు. పిచ్చుకుంట, గంగిరెద్దుల, వీర ముష్టి, కూనపులి, గౌడజెట్టి, పటంచాకలి ఇత్యాది ఇంకా ఎందరో భిక్షుక, ఆశ్రిత గాయక కులాల వారు అత్యంత సామాజిక వివక్షకు లోనై కటిక దారిద్య్రంలో మగ్గుతున్నారు. వీరందరూ బిసి కులాల్లో ఉన్నారన్న సంగతి ఇటు ప్రభుత్వానికి కానీ అటు రాజకీయ పార్టీలకు కానీ గుర్తు ఉందా లేదా అని అనిపిస్తూ ఉంది. 

ఇలాంటి అతి వెనుకబడిన కులాలవారే కాదు, గ్రామాలలో నిత్యం సేవలు అందించే రజక, క్షురక, కుమ్మరి, గాండ్ల (కొన్ని ప్రాంతాలలో), నీరుడి, బైటకమ్మర వంటి సేవక కులాల వారు కూడా అత్యంత హీన స్థితిలో ఉన్నారు; సామాజిక వివక్షకు గురై జీవిస్తున్నారు. ప్రభుత్వం వీరికి అందించే ఆర్థిక సహాయం ఏ పాటిది? అది ఎలా అమలు జరుగుతూ ఉంది అని ఎప్పుడైనా సమీక్షించారా? రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వీటిని గురించి అసలు పట్టించుకుంటున్నాయా? వీరికి బిసిలు అంటే రాజకీయంగా బలపడి ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నవారు, మంత్రులు అవుతున్న పద్మశాలీ, గౌడ, కాపు వంటి కొన్ని కులాలే కన్పిస్తున్నాయి. కాని అంతకు ఎన్నో రెట్లు దళితుల కన్నా హీనంగా బ్రతుకుతున్న బిసిలు వీరికెవరికీ గుర్తురావడం లేదు. 

రుంజ, ఆది పనస, కోమటి పనస, పెక్కర్లు వంటి వారి పేర్లు ప్రభుత్వ జాబితాలో కూడా లేవు. వీరందరూ ఏదో కళను ప్రదర్శిస్తూ భిక్షాటనం చేసి జీవిస్తున్న కులాలే. వీరు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను, అణగారి పోయిన దళిత కులాల కన్నా నిష్ట దారిద్య్రాన్ని అనుభవిస్తున్న వీరి పరిస్థితి చూస్తే, ప్రభుత్వం బాగా గమనిస్తే వీరికి కూడా ప్రత్యేకార్థిక ప్రణాళిక అవసరమని అలా చేయడం తప్పనిసరి అని తెలుస్తుంది. కాని అటు వైపున రాజకీయ పార్టీలు కాని ప్రభుత్వం కాని దృష్టి సారించే స్థితి కనిపించడం లేదు. 

మేధావులు, వివిధ బిసి సంఘాలు చేసే ఆందోళన అరణ్యరోదనే అవుతూ ఉంది. జాతీయ ఉత్పత్తిలో భాగమైన ఉత్పత్తి కులాలను శ్రామిక వర్గంగా భావించి ఆ ప్రాతిపదికన పోరాటం చేయడానికి కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఎక్కడా అడ్డురావు. ఇకనైనా ప్రగతిశీల ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వామపక్షాలు ఇతర రాజకీయ పార్టీలు అత్యంతంగా అణగారిన కులాల పైన దృష్టి పెట్టాలని బిసిలు ఆశిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం యథార్థ పరిస్థితిని అధ్యయనం చేయడానికి సాధికారిక సంఘాన్ని వేసి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేసే దిశగా అడుగులు వేయాలి. దీని ద్వారానే సమాజంలోని అట్టడుగు వర్గానికి న్యాయం జరుగుతుంది. 

- ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
Andhra Jyothi News Paper Dated: 05/04/2012

No comments:

Post a Comment