ఎద్దు మాంసంపై జరుగుతున్న చర్చ మేధావుల మెదడుకు మేతగా వుందేమో గానీ సామాన్యులకది పోసుకోలు వ్యవహారంగా వుంది. ఆంధ్రజ్యోతిలో ఏప్రిల్ 26న వెలువడిన డాక్టర్ గాలి వినోద్ కుమార్ వ్యాసం 'ఎద్దు మాంసంకై యుద్ధం చేద్దాం' అన్న పిలుపునిచ్చినట్లుగా వుంది. యూనివర్సిటీలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్, దాని వలన ఏర్పడిన గొడవలు, కత్తిపోట్లు ఏ ప్రజాస్వామిక సాంస్కృతిక విలువల్ని బలోపేతం చేయడానికో బోధపడడం లేదు. మత సామరస్యంతో వుండాల్సిన యూనివర్సిటీ క్యాంపస్‌ని కక్షల కార్ఖానాగా మారనీయకండి. ఇప్పటికే అనేక శకలాలగా విడిపోయిన మనుషులు తినే తిండి ద్వారా కూడా వేరుపడి పోవడంలో ఏదో కుట్ర వుంది. ఈ కుట్రని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై వుంది. సమాజ పరిణామ క్రమంలో మానవుని వేష, భాషలతో పాటు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి.
వేట మీద ఆధారపడిన ఆదిమ మానవుని ఆహారం జంతు మాంసమే! సామూహికంగా వేటాడిన జంతువుని (ఆవు, ఎద్దు, గుర్రం, జింక, దుప్పి ఏదైనాసరే) ఒక చోటుకి చేర్చుకుని అందరూ కలిసి తింటూ ఆనందంగా (ఆహారం దొరికినందుకు) కేరింతలు కొట్టడం ఆదిమ సమాజంలో ఒక ఆటవిడుపు (పండుగ). ఆధునిక సమాజంలో అలాంటి చర్యలతో ఎంజాయ్ చేయడమంటే మన ఆలోచనలు ఎటువైపు పయనిస్తున్నాయో ఊహించండి.
ఎద్దు మాంసం తింటున్న బౌద్ధులను బ్రాహ్మణులు వెలివేశారని, వారే అంటరాని వారయ్యారని చెబుతున్న వినోద్ కుమార్ అభిప్రాయానికి మూలాలు తెలియాల్సిన అవసరం ఉంది. నా అనుమానం-జీవ హింసను వ్యతిరేకించిన బౌద్ధం మాంసం తినడం కొనసాగించిందా... అయితే ప్రారంభంలో అందరూ మాంసాహారులే కనుక బుద్ధుని బోధనల తర్వాత కొందరు మారి వుండవచ్చు. అంటరాని వారందరూ బౌద్ధాన్ని స్వీకరించారా? ఇప్పుడు అంటరాని వారంతా బౌద్ధం స్వీకరించాలా? బౌద్ధులు మాంసాహారులుగా మారాలా? చరిత్ర పరిణామ క్రమాన్నీ, తెచ్చిన మార్పుల్నీ అంగీకరిస్తారా లేక కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తారా? ఆనాటి సమాజంలో సుఖాలు అనుభవిస్తూ పరాన్న భుక్కులైన హైందవ మతాధిపతుల ఉనికిని బౌద్ధం నిలదీసింది.
కదులుతున్న తమ ఊడల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో బౌద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం, వ్యక్తిగత దాడులు, బౌద్ధారామాల విధ్వంసం హైందవ మతం తీవ్ర స్థాయిలో చేసింది. అయినప్పటికీ బౌద్ధం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇక దిక్కుతోచని స్థితిలో హైందవ మతం రాజీ పడక తప్పలేదు. బౌద్ధధర్మాలు హైందవ సంస్కృతిలో అంతర్భాగమని ప్రచారం చేసింది (భగవద్గీతలో చెప్పిన చాలా విషయాలు బుద్ధుని బోధనలేనని కొందరు చరిత్ర పరిశోధకుల అభిప్రాయం). బౌద్ధం ప్రభావం వలనే హైందవ మతాధిపతులు మాంసం వదిలి శాకాహారులుగా మారారు. అలా మానిన తర్వాత మాంసం తినేవారిని అసహ్యించుకోవడం మొదలు పెట్టారు.
మరి తమ ఆధిపత్యం నిలుపుకోవాలి గదా! కానీ, శారీరక కష్టం చేసే వారికి శక్తి కావాలంటే మాంసాహారమే మంచిదనే స్వీయానుభవంతో గ్రహించిన అనేక మంది మాంసాహారాన్నే కొనసాగించారు. ఈ సందర్భంగా బౌద్ధ మతం రాజులను, ఉన్నత ధనాడ్య వర్గాలను ప్రభావితం చేసినంతగా సామాన్యులనూ, అట్టడుగు వర్గాలను ప్రభావితం చేయలేక పోయిందనే వాదన కూడా వుంది. ఇంతకూ బీఫ్ ఫెస్టివల్ ద్వారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి? ఎద్దు మాంసం తింటే జాతి పునరుజ్జీవనం జరుగుతుందా? బుద్ధులు మారతాయా? ప్రకృతిలో దొరికే అనేక జంతువులనూ, పక్షులనూ , పురుగులనూ, ఎన్నో కులాల, తెగల ప్రజలు తమ ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఎవరి జీవన విధానం, ఆహారపు అలవాట్లు వారికున్నాయి-అవసరాన్ని బట్టి మార్చుకుంటున్నారు. బహుజనులందరి ఆహారం, అలవాట్లు ఒకే మాదిరి లేనప్పుడు ఎద్దు మాంసం బహుజనులందరి కామన్ ఫుడ్‌గా డిక్లేర్ చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం!?
ఈనాడు సామ్రాజ్యవాదం అన్ని రంగాలతో పాటు మన జీవన విధానాన్ని, మనం తినే తిండిని కూడా శాసించాలని చూస్తున్నది (పుట్టుకలో భారతీయులై, వేష భాషలందు యూరోపియనులై ఉండాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆనాడు తలపోశారు. వారు ఇక్కడ నుంచి తరిమివేయబడ్డా, దురదృష్టవశాత్తూ ఆ వాసనలు పూర్తిగా తొలగిపోలేదు). పాశ్చాత్యుల ముఖ్య ఆహారం మాంసాహారం (బీఫ్, పోర్క్). ప్రపంచ ప్రజలందరి చేతా అదే తినపించాలని చూస్తున్నారు. ఎద్దు మాంసానికి అలవాటు చేసిన తర్వాత (డిమాండు పెరిగాక), మా మాంసం దిగుమతి చేసుకుంటారా, చస్తారా? అని సామ్రాజ్యవాదులు హుకుం జారీ చేస్తారు. దానికి ఆరోగ్యరహస్యాలను జోడిస్తారు. మనం ఎగబడతాం (కెంటకీ, వెబ్‌కాబ్ చికెన్ సెంటర్స్‌కి పరిగెత్తినట్లు) సామ్రాజ్యవాదుల వ్యాపారం ఊపందుకుంటుంది. మాంసం మన పొట్టలోకి, లాభం వారి జేబులోకి చేరిపోతుంది. అలా దేశభక్తి, సంస్కృతి రక్షించబడతాయి! దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మేధావులూ, ప్రజాస్వామిక వాదులూ ఆలోచించాలి.
Namasete Telangana News Paper Dated : 1/05/2012
-
No comments:
Post a Comment