Monday, April 2, 2012

తిరుగుబాటు యాత్ర - మందకృష్ణ మాదిగ



ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల తిరుగుబాటు యాత్ర జరుగుతుంది. ఏప్రిల్ 5న చిత్తూరు జిల్లా పీలేరు నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి జిల్లాలో యాత్ర ఉంటుంది. జూన్ 5న హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుబాటు మహాసభ జరుగుతుంది. 

ఎస్‌సి రిజర్వేషన్ వర్గీకరణ సాధన కోసం గత 18 సంవత్సరాల నుంచి ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఈ పోరాటానికి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల, సంఘాల, పార్టీల సంపూర్ణ మద్దతు ఉంది. మొదటి దశ ఉద్యమం 1994లో మొదలై 1999 చివరి నాటికి విజయం సాధించింది. 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ ఫలాలు అనుభవించిన చరిత్ర మనకు ఉంది. అయితే 2004 నవంబర్ 5న సాంకేతిక కారణాల సాకుతో సుప్రీంకోర్టు వర్గీకరణను కొట్టివేయడంతో తిరిగి రెండో దశ ఉద్యమాన్ని గత 8 ఏళ్లుగా కొనసాగిస్తున్నాం. 

మన పోరాటాన్ని ముందుకు తీసుకువెళుతున్న వివిధ సందర్భాలలో లాఠీ దెబ్బలు తింటున్నాం. కేసులు పెడితే జైలు కెళుతున్నాం. చివరకు ఉద్యమంలో యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడా రాజీపడకుండా పట్టుదలగా ఉద్యమాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం. ఇందుకు మనం నడిపిన నెలరోజుల దీక్షలే సాక్ష్యం. ఏ పార్టీ, ఏ సంఘం చేయలేని విధంగా మనం చేసి నిరూపించాం. 

అయినా వర్గీకరణకు చట్టబద్ధత ఎందుకు సాధ్యపడట్లేదు? ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి సాంకేతిక, రాజకీయ ఇబ్బందులు లేకపోయినా చట్టబద్ధత జరగకపోవడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరం వేసుకోవాల్సిన అవసరముంది. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ గత నెలలో రంగారెడ్డి జిల్లా గండిపేటలో రెండురోజుల పాటు ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నా వర్గీకరణ జరగకపోవడానికి మూడు కారణాలను రాష్ట్ర కమిటీ గుర్తించింది. అవి 1.కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం; 2. పాలకపక్ష నిర్లక్ష్యాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్ష టిడిపి మౌనం; 3. మాదిగ ప్రజాప్రతినిధుల బానిస మనస్తత్వం-చేతగానితనం. 

వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సాంకేతికంగా 2004లోనే వర్గీకరణ చేపట్టాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2008లో వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ 2009లో తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర జాతీయ పార్టీలన్నీ ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖలు కూడా రాశాయి. వర్గీకరణకు ఎలాంటి సాంకేతికపరమైన, రాజకీయ పరమైన అడ్డుంకులు లేకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే జరగట్లేదని తేలిపోయింది. 

అధికారంలో వున్నప్పుడు నాలుగేళ్ల పాటు (2000 నుంచి 2004 వరకు) టిడిపి ప్రభుత్వం వర్గీకరణను అమలుచేసింది. టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వర్గీకరణ చట్టాన్ని సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు 2004లో కొట్టివేసింది. అప్పటి నుంచి ఎమ్మార్పీఎస్ రెండవ దశ ఉద్యమాన్ని ప్రారంభించి ఈ రోజు వరకూ పోరాటాన్ని కొనసాగిస్తోంది. అయినా గత 8 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి అధినాయకత్వం పూర్తిగా మౌనంగా ఉంది. ఈ ఎనిమిదేళ్లలో ప్రతిపక్ష నాయకుడు వర్గీకరణ అంశంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ 8 సెకండ్లు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో వర్గీకరణ సాధించుకునే దిశగా ప్రజాఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే చట్టసభల్లో మన వాణిని వినిపించుకునే దిశగా మనం అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. 

- మందకృష్ణ మాదిగ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
Andhra Jyothi News Paper Dated : 3/04/2012 

No comments:

Post a Comment