నక్సల్‌బరీ పోరాటాలు 1970వ దశకంలో ఉధృతంగా జరుగుతున్నాయి. నక్సలైట్లు సాహసోపేతమైన దాడులతో ప్రభుత్వానికి హడలు పుట్టిస్తు న్న రోజులు. యూనివర్సిటీ, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు, లెక్చరర్లూ, లాయర్లు, ఉద్యమబాట పట్టిన కాలం. కరీంనగర్‌లో కొంతమంది విద్యార్థులమంతా ఒకచోట కలిసి అనేక విషయాలు చర్చించేవాళ్లం. అప్పుడప్పుడు శ్రీశ్రీ సాహిత్యం, మార్క్స్, మావోల రచనల గురించి తెలిసినవాళ్ళు చెపుతుంటే అందరూ ఆసక్తిగా వినేవాళ్లం. కొంతమంది లెక్చరర్లు వ్యవస్థలోని దోపిడీ, పేదరికం గురించి మాట్లాడుతుంటే ఊగిపోయెవాళ్లం. సృజన, పిలుపు పత్రికలు చదువుతూ మైమరచిపోయేవాళ్లం.
నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాను. ఒకరోజు ఒక లెక్చరర్ ఒక మధ్య వయ స్సు గల మనిషితో కలిసి మా రూంకు వచ్చిండ్రు. తనతో వచ్చినాయనను చూపి ‘ఈ సార్ కొన్ని రోజులు మీ దగ్గర ఉంటడు మంచిగా చూసుకోండ్రి’ అని చెప్పి వెళ్ళిపోయిండు. ఆయనది ముద్దముఖం. మరీ పొట్టిగాని పొడుగుకాని శరీరం. మరీ బక్కగా లేడు, మరీ లావుగా లేడు. అందమైన తలకట్టు ధోతి కట్టుకున్నడు. తమ్ముడూ అని మమ్ముల పిలిచేది. చాలా కలుపుగోలు గుణం. మంచి మాటకారి. చిన్న చిన్న మాట ల తో మమ్ముల నవ్వించేవాడు. మెల్ల మెల్లగా ఆయనతో మాకు చనువేర్పడ్డది. దేశ రాజకీయాలు, సాహిత్యం, సినిమాలు ఎన్నెన్నో విషయాలు చర్చించడం మాకు అలవాటయ్యింది. ఆయన మాట తీరు వినేవాళ్లకు హుషారు కలిగించేది. అప్పుడప్పుడు కొన్ని పాటలు పాడి వినిపించేవాడు.
మేం ఎట్ల వంట చేసినా తినేది. అప్పుడప్పుడు కూరగాయలు, సరుకులూ తీసుకరమ్మని పైసలిచ్చేది. ఆయన ఎవరు? ఇక్కడెందుకుంటడు? అనే విషయం మాకు తెలువదు. వచ్చినవాళ్ళ వ్యక్తిగత విషయాలు అడగ డం సభ్యత కాదని ఏమి అడిగేవాళ్ళం కాదు. ఆయనకున్నది ఒక చిన్న మామూలు బట్ట సంచి. అందులో రెండు జతల బట్టలు, తువ్వాల, షేవ్ చేసుకునే బ్లేడు, కొన్ని తెల్ల కమ్మలు గల రెండు మూడు పుస్తకాలుండేవి. ఒక పదిహేను రోజులు గడిచినంక ఒక సాయంత్రం చీకటి పడ్డాక ‘మళ్ళీ వస్తాను తమ్ముడూ’ అంటూ వెళ్ళిపోయిండు. అటు ఇటు చూడకుం డా కిందివైపు చూస్తూ నడవడం నాకు గుర్తు. ఎటుపోతున్న వు అని గాని ఎపుడొస్తావని గానీ నేను అడుగలేదు. ఆ విధంగా పోయి మళ్ళీ కొన్నిరోజుల తర్వాత వచ్చిండు.
తిరిగి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పోయిండు. వచ్చేది, పోయేది. ఇట్లా రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది. మేము డిగ్రీ ఫైనలియర్‌కు వచ్చినం. ఒక రోజు పత్రికల్లో కేజీ సత్యమూర్తి అనే పీడబ్యుజీ గ్రూప్ నాయకున్ని పోలీసులు అరెస్టు చేసినారన్న వార్త వచ్చింది. ఆ తర్వాత మాకు తెలిసిందేమిటంటే మాతో కలిసున్న మనిషే ‘సత్యమూర్తి ’ అని. మేం ఆశ్చర్యపోయినం.
వెనుకకు తిరిగి ఆలోచిస్తే ఆయన గురించిన అనేక విషయాలు మమ్ము కదిలించివేసినయి. మాటలో భావుకత, అతి సామాన్యమైన జీవితం, ఏకాక్షిగతతో చదవడం, ఎవరికీ ఏ విషయం తెలువకుండా జాగ్రత్తగా పార్టీ కార్యక్షికమాలు నిర్వహించడం, మాలో ఒక సామాన్యమైన వాడిలా కలిసి జీవించడం, నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆయన చిత్తు కాగితాలతో రాసి ‘ఫేర్’ చేయని కొన్ని కవితలు చాలా కాలం దాచిపెట్టినం.ఆకాలంలో ఆయన ఉపాధ్యాయుడు. ఉద్యోగం వదిలి ఉద్యమంలోకి రావడం, అంకిత భావంతో పార్టీలో పనిచేయడం, ఏవో విభేదాలతో బయటకు రావడం, ఏ పార్టీలోను ఇమడకపోయినా ప్రజల కోసం తపించడం మరపురాని జ్ఞాపకాలుగా నాలో మిగిలిపోయినవి. నాడు విప్లవ సాహిత్యం చదువుతూ ఫ్యూడల్, బూర్జువా తత్వాన్ని, వ్యవస్థలోని దోపిడీని గురించి మాట మాటకు విమర్శిస్తూ విప్లవం జిందాబాద్, అంటూ అరిచిన మా మిత్రులు చాలా కొద్ది కాలానికే ఆ సిద్ధాంతాలు గాలికి వదిలి ఆ అవతారం అంతటితో చాలించారు. వాళ్లు అప్పుడప్పుడు కలిసినపుడల్లా నాకు సత్యమూర్తి జ్ఞాపకం వస్తుంటరు. మనసు తండ్లాడుతుంది.
-కాళిదాసు, కరీంనగ
Namasete Telangana News Paper Dated : 29/04/2012
No comments:
Post a Comment