Wednesday, April 4, 2012

మార్గదర్శకాలా? సెన్సార్‌షిప్పా?



ప్రజాస్వామ్య సౌధానికి నాల్గవ మూలస్థంభం లాంటి ప్రసార మాధ్యమంపై న్యాయపాలిక కత్తి దూస్తోందా? క్రైమ్‌ కేసులను ఎలా రిపోర్టు చేయాలో మీడియాకు మార్గదర్శకాలు విధించాలంటూ సుప్రీం కోర్టు చేసిన ప్రతిపాదన పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. ఇది అక్కడితో ఆగదు. సుప్రీం చేసిన ఈ ప్రతిపాదనను అనుమతించడమంటే ప్రిసెన్సార్‌షిప్‌ను అంగీకరించడమే. అంతేకాదు, భావప్రకటనా స్వేచ్ఛకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగంలోని 19(1)ఎ నిబంధనకు ఇది విరుద్ధం. ఈ దృష్ట్యానే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎడిటర్స్‌ గిల్డ్‌, జాతీయ బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఏ), జర్నలిస్టు సంఘాలు దీనికి వ్యతిరేకంగా గళం విప్పాయి. క్రిమినల్‌ కేసుల విచారణపై మీడియా రిపోర్టింగ్‌ ధోరణుల వల్ల న్యాయవ్యవస్థ నిష్పాక్షికతకు విఘాతం కలుగుతోంది గనుక వాటిని కట్టడి చేయడానికి మార్గదర్శకాలు తెస్తామనడంలో అర్థం లేదు. అలా చేయడమంటే కోర్టులు తనకు లేని అధికారాన్ని చలాయించడమే. కొన్ని కేసులలో కోర్టులు ఇస్తున్న తీర్పుల తీరుపై కూడా జనంలో భిన్నాభిప్రాయం ఉంటున్నది.
శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలకు, అలాగే ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలువబడుతున్న ప్రసారమాధ్యమానికి హక్కులతో పాటు, హద్దులనూ రాజ్యాంగం స్పష్టంగా గీచింది. అయినా, మీడియా గొంతు నొక్కే విషయంలో ఈ మూడు వ్యవస్థలు ఏదో ఒక రూపంలో నిరంతరం ప్రయత్నిస్తూనే వున్నాయి. వీటికి తోడు స్వార్థపర శక్తులు సరేసరి. ఇలా అనేక ఒత్తిళ్ల మధ్య పాత్రికేయులు పనిచేయాల్సి వస్తున్నది. అలా అని ప్రసార మాధ్యమం స్వచ్ఛమైన స్ఫటికంలా, అచ్చంగా ప్రజా ప్రయోజనాల కోసమే పాటుపడుతున్నదని ఎవరూ అనడం లేదు. నయా ఉదారవాద విధానాల ప్రభావం అన్ని వ్యవస్థలపై పడుతున్నది. మీడియాలోకి విదేశీ పెట్టుబడుల ప్రవేశం వల్ల ఇతర రంగాల్లో మాదిరిగానే మీడియా ప్రత్యేకించి కార్పొరేట్‌ మీడియాలో విలువలు, ప్రమాణాలు దిగజారాయి. దేశంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నా ఈ మీడియా కొన్నిటిని ఎలా కప్పి పుచ్చుతున్నదీ చూస్తున్నాము. నీరా రాడియా టేపుల వ్యవహారంలో మీడియాకు చెందిన కొంత మంది జర్నలిస్టుల పాత్ర రచ్చకెక్కింది. ఇటువంటి పెడ ధోరణులు మీడియా విశ్వసనీయతను మసకబరిచేవేననడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇటువంటి లోపాలు, బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజలు తెలుసుకునే హక్కుకు ప్రధాన సాధనం ఇప్పటికీ మీడియానే. ఈ విషయాన్ని న్యాయవ్యవస్థ అర్థం చేసుకోవాలి. పిఎఫ్‌ స్కాములో పాత్రధారి అయిన ఒక న్యాయ మూర్తి ఫొటోకు బదులు మరో న్యాయమూర్తి ఫొటో చూపినందుకు ఓ టీవీ చానెల్‌ క్షమాపణ చెప్పిన తరువాత కూడా పరువునష్టం దావా కింది వంద కోట్లు పరిహారం చెల్లించమని న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గురించి ఒక కథనాన్ని రాసిన నలుగురు విలేకరులకు జైలు శిక్ష విధించింది. ఇక కోర్టు ధిక్కార నేరం కింద అభియోగాలు, కేసులు షరామామూలే. తన దృష్టికి వచ్చిన తప్పిదాలను మీడియా బహిర్గతం చేయాలా? వద్దా ? కోర్టులు సరిగ్గా న్యాయం అందించ లేకపోవడానికి విలేకరుల రిపోర్టింగే కారణం అని ఎలా చెబుతారు? కింది కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టు కొట్టివేస్తే కింది కోర్టు తప్పు చేసినట్లా? మన న్యాయస్థానాల్లో దాదాపు అన్ని కేసుల్లోను విచారణ కోర్టు నాలుగు గోడల మధ్యే జరుగుతుంది. బహిరంగ విచారణ జరిగిన కేసులు చాలా అరుదు. మిరాజ్‌కర్‌ కేసు (నరేష్‌ శ్రీధర్‌మిరాజ్‌కర్‌ అండ్‌ఓఆర్‌ఎస్‌ వర్సెస్‌మహారాష్ట్ర అండ్‌ అన్‌రాన్‌, 1966 మార్చి 3 నాటి కేసు )లో అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పిబి గజేంద్రగడ్కర్‌ ఆధ్వర్యంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తీర్పు ఇస్తూ ప్రజాస్వామ్యంలో న్యాయ స్థానాలు బహిరంగ వేదికల్లా వ్యవహరించాలి. కానీ, ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతోంది '' అని పేర్కొంది.1973లో కేశవానంద భారతి కేసులో ఏ రోజు విచారణను ఆ రోజు పత్రికలు సవివరంగా రిపోర్టు చేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో, ఎవరెవరు ఏమేం వాదించారో, ధర్మాసనం ఏ విధమైన ప్రశ్నలు సంధించిందో వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రజలకు, న్యాయ పండితులకు వీలు కలిగిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తే స్వయంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు వ్యవహరిస్తున్న తీరు దీనికి అనుగుణంగా ఉందా?
సమాచారాన్ని తెలుసుకునే ప్రజాతంత్ర ప్రక్రియను అది నియంత్రించాలని చూస్తున్నది. కోర్టులో క్రిమినల్‌ కేసుల విచారణకు సంబంధించిన వార్తలను స్క్రీనింగ్‌ చేయకుండా ఇవ్వరాదని, విలేకరులు తన మార్గదర్శకాలకు కట్టుబడి వుండాలని ఆదేశించడం పత్రికా స్వేచ్ఛను హరించడం తప్ప మరొకటి కాదు. సుప్రీం కోర్టు విధించినట్లుగానే, మిగతా పార్లమెంటు, చట్టసభలు, మంత్రులు, సంస్థలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు మార్గదర్శకాల పేరుతో ఆంక్షలు విధించుకుంటూ పోతే ఇక భావ ప్రకటనా స్వేచ్ఛకు విలువేముంటుంది? కర్ణాటక అసెంబ్లీలో ఒక వైపు కరువుపై చర్చ జరుగుతుంటే మరో వైపు మంత్రులు కొందరు బూతు బొమ్మల వీడియోలు చూస్తూ మీడియా కెమెరాలకు దొరికిపోయిన వ్యవహారంపై విచారణ జరిపిన సభా కమిటీ చివరికి తప్పంతా మీడియాదేనన్నట్లుగా చిత్రీకరించింది. మంత్రులు చేసింది తప్పుగా అనిపించలేదు, రిపోర్టర్లు కేవలం అసెంబ్లీ అధికారిక ప్రొసీడింగ్స్‌ కవర్‌ చేయడానికే పరిమితం కావాలి తప్ప మంత్రులపై అలా ఫోకస్‌ పెట్టకూడదన్నది ఆ కమిటీ భావన. కార్యనిర్వాహక వ్యవస్థ కూడా మీడియా గొంతు నొక్కేందుకు చేయని ప్రయత్నం లేదు. మీడియాలో తప్పుడు ధోరణులుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు అనేక మార్గాలున్నాయి. సిపిఐ(ఎం) సూచించినట్లుగా యావత్‌ మీడియా పని తీరును పర్యవేక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన ఒక మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. అంతేకానీ, ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని చూడడం సహించరానిది. 
Sampadakiyam Prajashakti News Paper Dated : 05/04/2012 

No comments:

Post a Comment