Thursday, April 5, 2012

మతోన్మాదమే గెలిచింది - జిలుకర శ్రీనివాస్



మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మతోన్మాదమే గెలిచింది. తెలంగాణవాదం ఓడిపోయింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే రెడ్డి కులవాదం గెలిచింది. వెలమలు అందుకు సంపూర్ణంగా సహకరించారు. ప్రాంతీయ ఉద్యమాలను కులాతీత, మతాతీత పరిశుద్ధ చైతన్య ప్రతీకలుగా సూత్రీకరించేవన్నీ తప్పని మొన్నటి ఉప ఎన్నికలతో నిరూపణ జరిగింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమంత అప్రజాస్వామిక ఉద్యమం మరోటి లేదని అనిపిస్తుంది. 

తెలంగాణ ప్రజలంతా రాష్ట్రం కోరుకుంటున్నారు కాబట్టి అది ప్రజాస్వామిక ఉద్యమమని భావిస్తే తప్పులో కాలేసినట్టే. ఉద్యమ స్వభావాన్ని ప్రజా సమీకరణ ప్రాతిపదికన కాకుండా, దాని భావజాలం ప్రాతిపదికగా, ఆ భావజాల రాజకీయ వ్యక్తీకరణ రూపాల ఆధారంగా మాత్రమే నిర్ధారించాలి. ఆ రకంగా చూసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో గులాబీ రంగు మాటున కాషాయ భావజాలమే గంభీరంగా ప్రచారమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని వేదమయం చేస్తానని మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక సందర్భంలో కెసిఆర్ అన్నారు. అదే మార్గంలో ఆయన అనేక మార్లు యజ్ఞ యాగాలు చేస్తున్నారు. అలాంటి కెసిఆర్ మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఒక ముస్లిం అభ్యర్ధిని పోటీలో పెట్టి గెలిపిస్తారని ఎవరైనా ఎలా అనుకుంటారు? 

మహబూబ్‌నగర్‌లో టిఆర్ఎస్ ఓటమికి బాధ్యత వహిస్తూ కెసిఆర్ ఎంపి పదవికి రాజీనామా చేయాలని సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ కార్యదర్శి లతీఫ్ ఖాన్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక ముస్లిం సంఘాలు కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే వున్నారు. అది ధర్మాగ్రహం. నిజానికి కెసిఆర్ రాజీనామా చేయటం వల్ల ముస్లింలకు ఎలాంటి ఉపకారం ఒనగూరదు. ఆయన తెలంగాణ ఉద్యమం నుంచి విరమించుకోవాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా నడుస్తుంది. 

ముస్లింలు నిరంతరం అవమానానికి గురవుతూనే ఉన్నారు. తెలంగాణ వస్తే మాకెలాంటి రక్షణ ఉంటుంది. తెలంగాణ ఏర్పడితే బిజెపి, సంఘ పరివార్ తీవ్రవాదం బలపడదనే హామీ ఏమిటి? ముస్లింలకు ఎలాంటి రక్షణ ఉంటుంది? ఎలాంటి ప్రాతినిధ్యం ఉంటుంది? అని ముస్లిం మేధావులు, ముస్లిం పౌర హక్కుల నేతలు అడిగారు. అలాంటి కోర్కె ఏమీ కోరకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని అగ్రకుల ఉద్యమకారులు సూచించారు. 

కావాలంటే ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కెసిఆర్ బహిరంగంగా చేసిన ప్రకటన నిజంగా ముస్లిం, అణగారిన వర్గాలకు ఎక్కువ మంది శత్రువులను తయారు చేసింది. ఆయన లక్ష్యం కూడా అదే. ఎస్టీ, బిసి, రెడ్డి కులాలు ముస్లింలకు, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. ముఖ్యంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఉప ముఖ్యమంత్రి పదవి అనే రెండు హామీలు ముస్లిం యేతర సమాజాన్ని వ్యతిరేకంగా నిలబెట్టాయి. అందుకే ముస్లిం అభ్యర్థి ఇబ్రహీంను ఓడించడానికి అన్ని శక్తులు ఒక్కటయ్యాయి. 

కెసిఆర్ వ్యూహాత్మకంగానే ఇబ్రహీంను పోటీకి దింపారు. ముస్లింలు అధిక సంఖ్యలో వున్న ఈ నియోజకవర్గంలో వారి ఓట్లు మాత్రమే కీలకం. అవి కాంగ్రెస్‌కు పోకుండా ఉండాలనే ముస్లిం అభ్యర్థిని నిలబెట్టారు. ముస్లిమేతర ఓట్లు బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డికి పడేలా పోలింగ్ వ్యూహం తయారుచేశారు. హరీష్ రావు, శ్రీనివాసరెడ్డిల మధ్య వున్న వ్యాపార సంబంధాలు ఒక కారణంగా కాగా అగ్రకులాల మధ్య ఐక్యత మరో కారణం. 

కెసిఆర్ మరెంతో కాలం తెలంగాణ ఉద్యమం నడపలేడు. అలాంటి ఆసక్తి కూడా ఆయనకు లేనట్లు ఉంది. కాబట్టి బిజెపిని బలపర్చాలనే ఆలోచనకు వచ్చారు. టిఆర్‌యస్ నుంచి బయటికి వెళ్ళిన జిట్టా బాలక్రిష్ణారెడ్డితో పాటు అమెరికా నుంచి ఆపరేట్ అవుతున్న తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం వరకు కోదండరామిరెడ్డితో సమన్వయం చేసుకుంటున్నది. బిజెపి రాష్ట్ర బాధ్యతలు కిషన్‌రెడ్డి తీసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమం పేరు మీద రాజకీయం నెరుపుతున్న రెడ్లకు ఒక నమ్మకం వచ్చింది. ఆ క్రమంలో కిషన్‌రెడ్డి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని రెడ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. అందుకు ముస్లిం వ్యతిరేకత తప్ప మరో ప్రాతిపదిక లేదు. 

మతం పేరుతో బిజెపి బలపడటం ఈ రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా వీలు కాలేదు. కాని, తెలంగాణ నినాదం వల్ల అది చాలా సులువైపోయింది. ఇది ముస్లింలకు మాత్రమే ప్రమాదం కాదు. బహుజనోద్యమానికి, లౌకిక ప్రజాస్వామిక ఉద్యమాలకూ ప్రమాదం. కాబట్టి బహుజనులు తెలంగాణ ఉద్యమం గురించి ఆలోచించుకోవాలి. ముస్లింలు యూటర్న్ తీసుకోవటం తప్ప మరో మార్గం లేదు. కెసిఆర్ నాయకత్వంలో జరిగే ఉద్యమం రెడ్డి, వెలమల ఆధిపత్యానికి ఉపయోగపడుతుందనే సంగతిని గుర్తించాలి. కేవలం బహుజనుల నాయకత్వంలో అంబేద్కర్ భావజాలంతో ఉద్యమం నడపటం వల్ల మాత్రమే ముస్లింలకైనా, ఇతరులకైనా మేలు చేస్తుందనే సత్యాన్ని గుర్తించాలి. 

- జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated: 06/04/2012 

No comments:

Post a Comment