Tuesday, April 17, 2012

భావప్రకటనా స్వేచ్ఛకు బేడీలుబెంగాల్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసినవారికెవరికైనా మమత బెనర్జీ అప్రకటిత ఎమర్జన్సీ విధించారా అన్న భావం కలుగకమానదు. ఆమెలో అంతకంతకూ పెరుగుతున్న రాజకీయ అసహనం, నిరంకుశ పోకడలకు జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ సీనియర్‌ ప్రొఫెసర్‌ అంబికేష్‌ మహాపాత్ర అరెస్టు తాజా నిదర్శనం. మొన్నటివరకు మమతను పొగడ్తలతో ముంచెత్తిన బూర్జువా మీడియాసైతం ఆమె దుశ్చర్యలను చూసి ఖిన్నురాలైంది. మమత నియంతృత్వ పోకడలపై వ్యంగ్య చిత్రం గీచి, మిత్రులకు ఇ-మెయిల్‌ చేసిన ప్రొఫెసర్‌ మహాపాత్రపై జరిగిన దాడిని, ఆయనను అరెస్టు చేయడాన్ని దేశ వ్యాపితంగా మీడియా ఖండించింది. హిందూ, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఆసియన్‌ ఏజ్‌, ట్రిబ్యూన్‌ వంటి పత్రికలు ఈ మేరకు సంపాదకీయాలు రాశాయి. వాటిని కత్తిరింపులు శీర్షిక కింద సంక్షిప్తంగా ఇస్తున్నాము.
-ఎడిటర్‌
భావప్రకటనా స్వేచ్ఛకు బేడీలు
బెంగాల్‌లో అణచివేత, విశృంఖలత్వం రాజ్యమేలుతున్నాయి. ఎవరైనా విమర్శిస్తే అసహనంతో విరుచుకుపడటం, భావప్రకటనా స్వేచ్ఛ హరణకు తెగపడటం వంటివి మామూలైపోయాయి. రాష్ట్రంలోని 2,480 గ్రంధాలయాల్లో అనేక పత్రికలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో లేకుండా చేసింది. ఈ పత్రికలను కొనుగోలు చేయకూడదని నిషేధం విధించింది. పాఠకుల్లో స్వేచ్చాయుత ఆలోచనా వైఖరిని పెంపొందించేందుకే కొన్ని పత్రికలను నిషేధించినట్లు మమత వివరణ ఇచ్చింది. అమెరికా లైబ్రరీ అసోసియేషన్‌ హక్కుల చట్టాన్ని ఆమె ఒకసారి చదవడం అవసరం. పత్రికను ఎవరు ముద్రించారు. దాని వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి, అందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏవిధంగా ఉన్నాయనే అంశాల ప్రాతిపదికగా ఏ ఒక్క పత్రికను నిషేధించే అధికారం ప్రభుత్వానికి లేదు. మమత ప్రభుత్వ వైఖరి ఆధునిక నాగరికతా ప్రమాణాలకు ఎంతగా తిలోదకాలిమవ్వడమే. అన్ని రకాల అభిప్రాయాలు, విశ్లేషణలను తెలుసుకునే హక్కు పాఠకులకు ఉంది. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనో, ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టేదిగా ఉందనో అభిప్రాయాలను, సమాచారాన్ని తొక్కిపెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రభుత్వ గ్రంధాలయ వ్యవస్థపై ఎటువంటి సెన్సార్‌షిప్‌ ఉండకూడదు.ప్రభుత్వ వైఖరి ప్రజల్లో తమ ప్రభుత్వం గురించి ఎటువంటి దురభిప్రాయాలు ఏర్పడకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. భారతదేశంలో లైబ్రరీలకు స్పష్టమైన ఛార్టర్‌ను రూపొందించాలి. పాఠకుల హక్కులను కాపాడేవిధంగా ఇది ఉండాలి. దానిని పటిష్టంగా అమలు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజలతో సంప్రదించి వారికి ఏ విధమైన పత్రికలు కావాలో అవగాహనకు వచ్చి స్థానిక డిమాండ్లకు అనుగుణంగా కొనుగోలు చేసే విధంగా లైబ్రరీలను నిర్వహించాలి. ఇటువంటి విధానాలు సార్వజనీనంగా ఉండాలి. పాఠకులు కోరిన పుస్తకాలను సేకరించే బాధ్యతను కూడా గ్రంధాలయాలు తీసుకోవాలి. సమాచారాన్ని తొక్కిపెట్టేందుకే ఈ చర్య ఉద్దేశింపబడింది. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో వచ్చిన వ్యంగ్య చిత్రంపై కూడా మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడిచేసి తీవ్రంగా హింసించారు. వారు దాడి చేసి వెళ్లిన కొద్దిసేపటికే పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్‌ చేశారు. ఈ రెండు సంఘటనలు రాజ్యాంగ విలువలకు పాతరేసే నిరంకుశ చర్యలకు నిలువెత్తు సాక్ష్యాలు. ప్రజాస్వామ్య విలువల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా తన మాటే శిలాశాసనం కావాలనే ఆమె వైఖరికి ఇది పరాకాష్ట. మీడియాను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోంది. ఇందుకు ప్రభుత్వాలు అనుసరించే విధానాలు కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంటాయి. తమను విమర్శించే పత్రికలకు వాణిజ్య ప్రకటనలను నిలిపివేయడం ద్వారా వాటిపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. మమత కూడా ఇదే విధానాన్ని అనుసరించడానికి భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి చేసే రోజులు సంప్రాప్తించాయి. ప్రజాతంత్ర శక్తులు దీనిని గట్టిగా ప్రతిఘటించాలి.
(ఏప్రిల్‌ 14నాటి ది హిందూ సంపాదకీయం)
పేకమేడల సామ్రాజ్యం
ఒక రాజకీయ జోక్‌ను ఈ మెయిల్‌ చేసినందుకుగాను జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ను, హృద్రోగంతో బాధపడుతున్న హౌసింగ్‌ సొసైటీకి చెందిన 75 ఏళ్ల కార్యదర్శిపై తృఱమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేయడం, ఆ తరువాత వారిని పోలీసులు అరెస్ట్‌ చేయడం వంటి సంఘటనలు రాష్ట్రంలో పరిస్థితులకు దర్ఫణం పడుతున్నాయి. చిన్నపాటి విమర్శను సైతం సహించలేని స్థాయికి మమత, ఆమె బృందం చేరుకుంది. సత్యజిత్‌ రే చిత్రం ది గోల్డెన్‌ ఫోర్ట్‌ ప్రేరణతో రూపొందించిన కార్టూన్‌ కూడా ఏమంత అభ్యంతరకరంగా లేదు. రైల్వే బడ్జెట్‌లో ప్రయాణీకుల ఛార్జీల పెంపును వ్యతిరేకించిన మమత ఆ కోపాన్ని తమ పార్టీకే చెందిన దినేష్‌ త్రివేదీపై ఆమె చూపింది. ముకుల్‌ రారును ఆ పదవిలో కూర్చోబెట్టారు. ప్రొఫెసర్‌పై టిఎంసి కార్యకర్తల దాడులు, ఆ తరువాత ఆయన అరెస్ట్‌ వంటి చర్యల ఫలితంగా ఆ కార్టూన్‌ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం పొందింది. తన ప్రత్యర్థుల పట్ల ఏ విధంగా వ్యవహరించేదీ ఈ చర్యల ద్వారా మమత చాటుకున్నారు. ఇటువంటి చర్యల ద్వారా టిఎంసి అధికార సౌథం పేకమేడలా కూలిపోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ను తన ఆరాధ్య రచయితగా పేర్కొనే మమత, ఆమె సహచరులు ఆయన పేర్కొన్న కింగ్డమ్‌ ఆఫ్‌ కార్డ్స్‌ నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలి. హాస్యాన్ని హాస్యంగానే తీసుకోవాలి. దీనిని శిక్షార్హమైన విషయంగా ఎన్నడూ భావించలేదు.
(టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఏప్రిల్‌ 16 సంపాదకీయం)
నియంతగా మారిన మమత
మమతా బెనర్జీ ఒక చిన్న సైజు నియంతగా మారారని ఒక ప్రొఫెసర్‌పై తృణమూల్‌ గూండాలు జరిపిన దాడి, ఆయన అరెస్ట్‌ సంఘటన రుజువు చేస్తోంది. రాష్ట్ర వ్యవహారాల విషయంలో ఏ మాత్రం 'కరుణ' చూపని, సాధారణ కళాకారుల పట్ల కనికరం లేకుండా వ్యవహరించే వ్యక్తి నుండి ఇంతకుమించి ఏమి ఆశించగలం? ఒక అత్యాచార సంఘటన జరిగితే దానిని ఆమె తమ ప్రభుత్వంపై సిపిఎం చేస్తున్న దుష్ప్రచారంగా వక్రభాష్యం చెప్పారు. ఈ మిస్టరీని ఛేదించిన సాహసవంతురాలైన దమయంతీ సేన్‌ అనే కొల్‌కతా క్రైంబ్రాంచ్‌ ఐపిఎస్‌ అధికారికి పనిష్మెంట్‌ బదిలీ చేశారు. ట్రాఫిక్‌ నిబంధలను ఉల్లంఘించి అరెస్ట్‌ అయిన తన బంధువును విడిపించేందుకు జరిపించిన తతంగాన్ని రాష్ట్ర ప్రజలు మరచిపోలేరు. అటువంటి రాజకీయవేత్తను ఒక రాజకీయ కార్టూన్‌ ఒంటిమీద జెర్రులు పాకేలా చేయడం వింతేమీ కాదు. 1975లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో కూడా ఇంత ఏకపక్షంగా వ్యవహరించలేదు. విమర్శకులను జైళ్లల్లో నిర్బంధించడానికి చట్టాల్లో అవసరమైన మార్పులు చేశారు. బెంగాల్‌లో అది కూడా లేదు. ఏదో ఒక ఆరోపణతో అరెస్ట్‌ చేసే పరిస్థితులు నేడు బెంగాల్‌లో ఉన్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించే ప్రతిపక్షంలోని ఒక స్మాల్‌ టైమర్‌ స్థాయి నుండి ఆమె ఇంకా ఎదగలేదని ఈ పరిణామం నిరూపిస్తోంది. టిఎంసి నాయకురాలు తన వైఖరిని సరిదిద్దుకోకపోతే ఆమె తన రాజకీయ భాగస్వామ్యపక్షాలకు గుదిబండగా మారిపోయే అవకాశాలున్నాయి. తస్మాత్‌ జాగ్రత్త!
(ఆసియన్‌ ఏజ్‌ ఏప్రిల్‌ 16 సంపాదకీయం)
మమత దురహంకారం
ఒక రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని ఈ మెయిల్‌ చేసినందుకు గాను జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ అంబికేష్‌ మహాపాత్ర, ఆయన సన్నిహిత సహచరుడు సుబ్రతా సేన్‌గుప్తాను అరెస్ట్‌ చేయడం దురహంకారానికి పరాకాష్ట. రాత్రి సమయంలో ఇంటికి తిరిగివస్తున్న ప్రొఫెసర్‌పై మూకుమ్మడిగా దాడి చేసి ఆయనను శారీరకంగా హింసించి క్షమాపణ పత్రంపై సంతకం చేయించుకోవడం, ఆ తరువాత పోలీసులు వచ్చి ఆయనను అరెస్ట్‌ చేయడం యాదృ,చ్ఛిక సంఘటనలు కావు. ఈ అరెస్టుల గురించి మమతకు తెలియవని చెప్పడం బూటకమే. వాటిని ఆమె సమర్థించుకున్న తీరు ఇందుకు తార్కాణం. పరువు నష్టం కలిగించే విధంగా, ఒక మహిళను కించపరిచే విధంగా, కంప్యూటర్‌ను ఉపయోగించి పాల్పడిన నేరంగా వారిపై అభియోగాలు మోపారు. మమత అభిజాత్యాన్ని నిరూపించే సంఘటన ఇదొక్కటే కాదు. గత పదకొండు మాసాల్లో ఇటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. అల్లర్లకు పాల్పడిన తమ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను విడిపించేందుకు మమత ఒక పోలీసు స్టేషన్‌కు దూసుకువచ్చి ఒక చెడు సంప్రదాయాన్ని నెలకొల్పారు. కారల్‌ మార్క్స్‌, ఏంగెల్స్‌పై పాఠ్యాంశాలను తొలగించిన తీరు, తమ పార్టీకే చెందిన దినేష్‌ త్రివేదీని మంత్రి పదవి నుండి ఉద్వాసన ....ఇవన్నీ ఆమె దురహంకార పోకడలకు నిదర్శనాలే. అత్యధిక సర్క్యులేషన్‌ గల పత్రికలను లైబ్రరీలు కొనుగోలు చేయకుండా నిషేధం విధించడం కూడా ఈ నిరంకుశ చర్యల్లో ఒక భాగమే. చేసింది చాలు, ఇప్పటికైనా ఆమె పార్టీవారు తన పంథాను మార్చుకోవాల్సిందిగా మమతకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి బదులు పటిష్టమైన పాలనను అందించడంపై దృష్టి సారించాలి. ఆమెను ఎన్నుకున్న ప్రజలు ఆమె నుండి దీనినే ఆశిస్తున్నారు. ఆమె ఎంత త్వరగా ఈ విషయాన్ని గ్రహిస్తే ఆమెకు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు అంత మంచిది.
(ట్రిబ్యూన్‌ ఏప్రిల్‌ 16 సంపాదకీయం)
-prajashakt
Prajashakti News Paper Dated : 16/04/2012 

No comments:

Post a Comment