Tuesday, April 17, 2012

మార్క్సిజం ఎన్నికల సిద్దాంతమా? సిపిఎం భారతీయబాణీ?!--V JayaRamudu



పాత పాటే కొత్త స్వరంతో 
ఇంకా రూపొందని ‘భారతీయ మార్గం’!
అప్పటి తప్పులకు లెంపలు వేసుకున్న నేతలు
‘భూసంస్కరణ’ల నినాదం మళ్ళీ ముందుకు 
ఎన్నికల పార్టీలా, విప్లవ పార్టీలా? 
prakash-karat
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 21వ మహాసభలు బీహార్‌ రాజధాని పాట్నాలో మార్చి 27 నుంచి 31 వరకూ జరగగా, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)- సీపీఎం 20వ మహాసభలు కేరళలోని కోజికోడ్‌లో ఏప్రిల్‌ 4 నుంచి 9 వరకు జరిగాయి. రెం డు పార్టీల మహాసభలు వైభవంగా, అట్టహాసంగానే జరిగాయి. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా, బూర్జువా భూస్వామ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయమైన వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన నిర్మాణం కోసం కృషి చేస్తామని రెండు పార్టీలూ పాత పాటనే కొత్త స్వరంతో పాడాయి. అంతేకాక ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను వ్యతిరేకిస్తామని, ఎదిరిస్తామని కూడా రెండు పార్టీల నాయకులూ నొక్కి వక్కాణించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పటిష్ఠమైన ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రజలు కలసిరావాలని సీపీఐ, సీపీఎంలు విడివిడిగా పిలుపునిచ్చాయి. 

భారత దేశంలో సోషలిజం స్థాపనకు ‘భారతీయ మార్గం’ మాత్రమే ఆచరణీయమని, ఇతర దేశాల మార్గాలను అనుసరించడం సాధ్యం కాదని, సరైన పద్ధతి కూడా కాదనీ- సోషలిజం నిర్మాణం దేశ నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా ‘భారత మార్గం’లోనే ఉంటుందనీ సీపీఎం కోజికోడ్‌లో ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంలో నిర్దేశించుకుంది. సీపీఎం ఆవిర్భావానికి ఈ వైఖరే కారణమని నాయకులు చెప్పుకున్నారు. అయితే ఇతర దేశాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. సోషలిస్టు వ్యవస్థ ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. గతంలో చేసిన తప్పులు దిద్దుకుంటామని, అలా చేయడంలోనే సీపీఎం గొప్పదనముందని చెప్పారు. పెట్టుబడిదారీ విధానాన్ని రద్దు చేయడానికి సామ్రాజ్య వాద ప్రపంచీకరణకు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయాన్ని పటిష్ఠ పరచుకోవాలని తీర్మానించారు. భారత్‌- అమెరికా అణు ఒప్పందాన్ని వామపక్షాలు వ్యతిరేకించడం వల్ల, ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటుందని సీపీఎం అప్పట్లో అంచనా వేసుకోవడం తమ తప్పేనని నాయకులు ఇప్పుడు లెంపలు వేసుకున్నారు. 

పాలస్తీనా ప్రాంతాలపై దురాక్రమణ కొనసాగిస్తుండడం ద్వారా ఇజ్రాయిల్‌ అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంఘిస్తున్నదని, శ్రీలంకలో అక్కడి ప్రభుత్వం 2009లో ఎల్‌టీటీఈపై జరిపిన యుద్ధం పిమ్మట తమిళులను ఊచకోత కోస్తున్నదని, వారికి పునరావాసం కల్పించలేకపోయిందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని- కనుక వీటన్నింటిపై దర్యాప్తు జరిపించి అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్‌ చేస్తూ తీర్మానాలు ఆమోదించారు. అలాగే భూసంస్కరణలను అమలు పరచాలని, మిగులు భూములను పేదలకే పంచాలని- ఆ విధంగా వ్యవసాయ రంగ సంక్షోభాన్ని పరిష్కరించాలని తీర్మానం చేశారు. దళిత క్రైస్తవులను, ముస్లింలను షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో చేర్చి వారికి ప్రత్యేకంగా ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కూడా సీపీఎం మహాసభ తీర్మానించింది.

పార్టీల మహాసభలలో సీపీఐ, సీపీఎంలు చాలా కాలం నుంచి అరిగిపోయిన ‘వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన’ రికార్డునే వినిపిస్తున్నాయి. అయితే కొంచెం మార్పు కనపడాలనే ఉద్దేశంతో కాబోలు సీపీఎం కోజికోడ్‌ మహాసభలో సోషలిజం నిర్మాణం దేశ నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా భారత మార్గంలోనే ఉంటుందని తీర్మానించింది. ఏదో ఒకటి చెప్పాలనే హడావుడిలో సీపీఎం తప్పులో కాలు వేసింది. చైనాలో 1948లో విప్లవం జయప్రదమై సీపీసీ రాజ్యాధికారం చేపట్టిన తర్వాత సోషలిస్టు నిర్మాణం జరుగుతున్న దశలో అది పెట్టుబడిదారీ మార్గేయుల చేతుల్లోకి పోయిన పిమ్మట గత 30 సంవత్సరాల నుంచి ‘చైనా లక్షణాలతో కూడిన’ సోషలిజాన్ని, మార్కెట్‌ సోషలిజాన్ని అమలు పరచబోతున్నామంటూ పెట్టుబడిదారీ వ్యవస్థను పునరుద్ధరించి ఆ విధానాన్నే కొనసాగిస్తున్నది.

వర్గ సమాజంలో కార్మిక వర్గ నాయకత్వంలో అంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కేవలం వర్గ పోరాటం ద్వారానే సోషలిజం స్థాపన జరుగుతుందని మార్క్సిజం సిద్ధాంతం చెబుతున్నది. సోషలిజం ఒక లక్ష్యం కాగా, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వర్గపోరాటం ఒక మార్గం. అయితే కమ్యూనిస్టు పార్టీలు వర్గపోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సోషలిజం నిర్మాణానికి అంకిత భావంతో సిద్ధాంతానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. పెట్టుబడిదారీ వ్యవస్థకు, కమ్యూనిస్టు వ్యవస్థకు మధ్యనున్న వ్యవస్థే సోషలిస్టు వ్యవస్థ. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వర్గాలను, వర్గ వైరుధ్యాలను పరిశీలించి పూర్తి అవగాహనతో ఆయా దేశాలలో నెలకొన్న పరిస్థితులకు సిద్ధాంతాన్ని అన్వయించుకుని కమ్యూనిస్టు పార్టీలు విప్లవం ద్వారా రాజ్యాధికారాన్ని చేపట్టాలి. 

ఒకానొక దశలో విప్లవ పరిస్థితులు ఉన్నాయా, లేవా అని తేల్చుకోవడానికి లెనిన్‌ మూడు కొలబద్దలను సూచించాడు. అవి: 1. ప్రభుత్వాలు సాధారణ చట్టాలతోనే కాక నిర్బంధ చట్టాలతో కూడా ప్రజావ్యతిరేక పరిపాలన సాగిస్తూ ఉండాలి. 2. పీడిత ప్రజానీకం నిర్బంధ చట్టాలను కూడా ఖాతరు చేయకుండా ప్రభుత్వాలను ఎదిరించే స్థాయికి సిద్ధంగా ఉండాలి. 3. విప్లవ సిద్ధాంతంతో కూడిన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించడానికి పూనుకోవాలి. ఈ మూడు కొలబద్దలు భారత దేశంలో 1945 నుంచే ఉన్నాయి. విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవ పార్టీలు ఉండజాలవని లెనిన్‌ అన్నాడు. కనుక కమ్యూనిస్టు పార్టీలంటే విప్లవ పార్టీలే. ఎన్నికల పార్టీలు కావు. మార్క్సిజం విప్లవ సిద్ధాంతమే తప్ప ఎన్నికల సిద్ధాంతం కాదు. 

లక్ష్యం ఎంత ఉన్నతమైనదో దానిని చేరుకోవడానికి మార్గం కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. ప్రజలకు లక్ష్యాన్ని గురించి చెప్పి మార్గాన్ని గురించి చెప్పక పోయినా, మార్గాన్ని గురించి చెప్పి లక్ష్యం గురించి చెప్పకపోయినా అది అవకాశవాదమే అవుతుంది. సిద్ధాంతానికి అనుగుణంగా వ్యూహం ఉండాలి. వ్యూహానికి అనుగుణంగా ఎత్తుగడలు ఉండాలి. అలా లేకపోతే వైరుధ్యాలు ఏర్పడతాయి. విప్లవం ముందుకు పోదు. విప్లవమే చేపట్టకపోతే అది వేరే విషయం, యాథాతథ స్థితిని కొనసాగించడానికి అంగీకరించినట్టు. చరిత్ర అందుకు అంగీకరించదు. చరిత్ర ముందుకే పోతుంది. అలా పోకపోతే మానవ సమాజమే స్థంభించి పోతుంది. కనుక అలా జరగకుండా చూడడానికి ఎవరో ఒకరు, లేదా ఏదో ఒక పార్టీ అనివార్యంగా ముందుకు వస్తారు, వస్తుంది. ఇది చరిత్ర పరిణామక్రమం. ప్రజలే చరిత్ర నిర్మాతలు. 

ఒక్క ఆదిమ సమాజం తప్ప- తర్వాత ఏర్పడిన బానిస, ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ సమాజాలన్నీ వర్గ సమాజాలే. ఈ సమాజాలలో దోపిడీ స్వరూపాలు మారియి గాని వర్గదోపిడీ మారలేదు. ఈ సమాజాలన్నీ వర్గ పోరాటాల ద్వారానే ఏర్పడ్డాయి. కనుక ప్రపంచ చరిత్ర వర్గపోరాటాల చరిత్రే. సోషలిజం కోసం భారత దేశ మార్గాన్ని చేపట్టాలని సీపీఎం నాయకులు తీర్మానించారు. మరి దేశంలో నెలకొన్న పరిస్థితులను, వైరుధ్యాలను గురించి సీపీఐ, సీపీఎం నాయకులు ఎప్పుడైనా అధ్యయనం చేశారా? అప్పటికీ ఇప్పటికీ విప్లవ పరిస్థితులు లేనేలేవు కనుక విప్లవాన్ని వాయిదా వేసుకున్నామని ఆ రెండు పార్టీల ఉవాచ. కేవలం ఎన్నికల పరిస్థితులే ఉన్నాయా? 
చారు మజుందార్‌ నాయకత్వం వహించిన మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ భారత సమాజం అర్ధ ఫ్యూడల్‌, అర్ధవలస వ్యవస్థ అని విశ్లేషించింది. దానికి మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంతాన్ని అన్వయించి సకల జనులను దోపిడీ, పీడనలనుంచి విముక్తి చేయడానికి, రాజ్యాధికారం చేపట్టడానికి నూతన ప్రజాస్వామిక విప్లవమే ఏకై మార్గమని, దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారానే ఆ లక్ష్యాన్ని చేరుకోగలమని తీర్మానించింది.

అందువల్లనే 1969 ఏప్రిల్‌ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు- లెనినిస్టు) స్థాపించారు. నేడు నూతన ప్రజాస్వామిక విప్లవం 15 రాష్ట్రాలకు విస్తరించి కొనసాగుతున్నది. సీపీఐ, సీపీఎం నాయకులు చారు మజుందార్‌ది విప్లవ పంథా కాదని ప్రచా రం చేశారు. విప్లవాన్ని ఎలా నడపాలో, కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని ఎలా చేపట్టాలో ఆ నాయకులు ఆచరణలో చూపించలేకపోయారు. సీపీఐ 1924 డిసెంబర్‌లో ఏర్పాటైంది. ఆ తర్వాత అందులోంచి కొందరు చీలిపోయి1964 ఏప్రిల్‌లో సీపీఎంను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచీ వారు ఏం చేస్తున్నట్టు? 
తాము వ్యతిరేకించినా భారత్‌- అమెరికా అణుఒప్పందం ఆచరణ యోగ్యమవుతుందని నాడు అంచనా వేయలేపోయామని తాజా తీర్మానంలో సీపీఎం నాయకులు వాపోయారు. యూపీఏ సర్కార్‌కు 2008 జూలైలో నాలుగు వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి.

అంతకు ముందు యూపీఏ పల్లకీని 50 నెలల పాటు వామపక్ష పార్టీలు ఎందుకు మోయాల్సి వచ్చింది? అణు ఒప్పందంలో- అమెరికా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌ దేశాలలో మూలన పడ్డ పాత అణు రియాక్టర్లను, ఇతర పరికరాలను (భారత్‌చేత కొనుగోలు చేయించి తమ పబ్బం గడుపుకోవాలనే తలంపుతో) భారత దేశం కొనుగోలు చేసి అణు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలనే అంశాన్ని పొందు పరచారు. తమిళనాడులో కుడంకుళంలో అణువిద్యుత్‌ ఉత్పత్తికి గాను రష్యా నుంచి నాలుగు అణు రియాక్టర్లను భారతదేశం దిగుమతి చేసుకుంది. జపాన్‌లో సంభవించిన అణుప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని- తమిళనాడు ప్రజలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. జపాన్‌లో జరిగిన అణు ప్రమాదం ఆదీ కాదు, అంతమూ కాదు.

కుడంకుళం అణువిద్యుత్‌ కర్మాగారాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే సీపీఎం దానిని గురించి ఎందుకు ప్రస్తావన చేయలేదు? తమిళనాడులో ఏఐడీఎంకే ప్రభుత్వం అణువిద్యుత్‌ కర్మాగారాన్ని మొదట్లో వ్యతిరేకించినా తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాని జయలలితకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం నాయకులు వ్యవహరించరు. ఎందుకంటే వారివి ఎన్నికల పొత్తు రాజకీయాలు కనుకనే! 2011 మే ఎన్నికల్లో జయలతితతో పొత్తు పెట్టుకుని సీపీఐ 9 అసెంబ్లీ స్థానాలు, సీపీఎం 10 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ వారి దృష్టిలో ప్రజాతంత్ర పార్టీలే! ఇదే వారి ఎన్నికల రాజకీయం. శ్రీలంకలో తమిళులను అక్కడి ప్రభుత్వం ఊచకోత కోస్తున్నదని, వారికి పునరావాసం కల్పించలేకపోయిందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని సీపీఎం తీర్మానం చేసింది.

తమిళులపై మారణహోమం 1983 నుంచి జరుగుతున్నా ఆ విషయం వీరికి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది? కోజికోడ్‌ మహాసభలకు ఆంధ్రప్రదేశ్‌నుంచి వెళ్ళిన ప్రతినిధలలో ఇద్దరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తీర్మానం చేయాలని పట్టుపట్టారు. కాని మిగతా 800 మంది ప్రతినిధులు వ్యతిరేకించారు. భూమి ప్రధానమైన ఉత్పత్తి సాధనం. దేశంలో ప్రస్తుతమున్న భూసంస్కరణ చట్టాలు పరమ లోపభూయిష్ఠంగా ఉన్నాయి. అయినా అవి అమలుకు నోచుకోలేదు. కనుక వాటిని పూర్తిగా మార్చాలి. ప్రభుత్వాలు ఆ పనిచేయవు. చివరకు అసైన్డ్‌ భూములు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. కనుక సీపీఐ, సీపీఎంలు భూములు ఆక్రమించుకునే బలమైన ఉద్యమాలను చేపట్టి పేదలకు భూమిని పంపకం చేయాలి. 

ఆ రెండు పార్టీలు ఇదొక్క పనీ చేస్తే చాలు! ప్రజల ప్రయోజనాలకంటె వ్యక్తి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సింగూరు, నందిగ్రామ్‌లలో ఏం జరిగిందో సీపీఎం విస్మరించరాదు. పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడిదారుల కొమ్ము కాయరాదు. ప్రజల తరపున ప్రభుత్వాలే పరిశ్రమలను స్థాపించాలి. కేరళకు చెందిన సీపీఎం నాయకులు పినరయ్‌ విజయన్‌, ఎంఎ బేబి, థామస్‌ ఐసాఖ్‌ అమెరికా పెట్టుబడులకోసం (అప్పటి ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌కు తెలియకుండా) అమెరికా దౌత్యవేత్తలతో మంతనాలు జరిపారు. పినరయ్‌ విజయన్‌ (పార్టీ) ఆఫీసులో మీటింగ్‌ ఏర్పాటు చేసి కేరళ రాష్ట్రాభివృద్ధికి అమెరికా పెట్టుబడులు ఎంతో అవసరమని, ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, కనుక అమెరికా సహాయం చేయాలనీ అభ్యర్ధించారు.

v.jayarramudu
కోకా- కోలా కంపెనీకి పెట్టిన ఇబ్బందుల గురించి అమెరికా ప్రతినిధులు గుర్తు చేయగా అవన్నీ తాము చూసుకుంటామని విజయన్‌ హామీ ఇచ్చారు (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుచ్చి ఎడిషన్‌ 2001 ఆగస్టు 30). తెర వెనుక ఇలాంటి సామ్రాజ్యవాద అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్న సీపీఎం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు చేయగలదా? దేశ ప్రయోజనాల దృష్ట్యా వామపక్షాలు పడక కుర్చీ రాజకీయాలకు, కేవలం పార్లమెంటరీ పంథాకు స్వస్తి చెప్పాలి. మార్క్సిజం ఆచరించడానికే తప్ప వల్లించడానికి కాదని గుర్తుంచుకోవాలి.

Surya News Paper Dated:17/04/2012 

No comments:

Post a Comment