Tuesday, April 10, 2012

మన కాలపు విప్లవ స్ఫూర్తి---- ఆచార్య అడపా సత్యనారాయణమహాత్మా ఫూలే ప్రభోదించిన కుల వ్యవస్థ నిర్మూలన, అగ్రకుల ఆధిక్యతా ధిక్కరణ, బహుజనుల విముక్తి ప్రస్తుత, భవిష్యత్ ప్రజా చైతన్య ఉద్యమాలకు మార్గదర్శకం కావాలి. నయా వలసవాదం, నయా హైందవం పెంచి పోషిస్తున్న కులవివక్షను, అగ్రకుల -వర్గ దురహంకారాన్ని సమూలంగా నాశనం చేయాలని సంకల్పించిన మహాత్మా ఫూలే ఆశయాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత దళిత బహుజన మేధావులపైన, అభ్యుదయ, ప్రజాతంత్ర ఉద్యమాలపైన ఉంది. 


పందొమ్మిదవ శతాబ్దంలో అగ్ర వర్ణాల నాయకత్వంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో శూద్రులు, క్రింది కులాల్లో కూడా నూతన చైతన్యాన్ని రేకెత్తించి, వారిలో సంస్కరణ బీజాలు నాటడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్రలో మహాత్మా ఫూలే ప్రజాసాంఘిక విప్లవాన్ని నిర్మించి, అగ్రకుల ఆధిపత్యాన్ని ధిక్కరించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు రూపకల్పన చేశాడు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేపట్టిన సాంఘిక, సాంస్కృతిక విప్లవాన్ని, దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడం ఎంతైనా అవసరం. హిందూ మతాన్ని ధిక్కరించడానికి, బ్రాహ్మణ, పురోహిత ఆధిపత్యాన్ని కూలదోయడానికి బడుగు వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన చేసి కృషి అమోఘం. ఉన్నత కులాల సంఘ సంస్కర్తలు చేపట్టిన ఉద్యమ పరిధిల్ని దాటి, ఆయన శూద్ర, అతి శూద్ర కులాల జాగృతికి, స్త్రీ జాతి అభ్యుదయానికి, రైతాంగ విముక్తికి ఎంతగానో పాటుపడినాడు. హైందవం సమర్థించే వర్ణ కుల వ్యవస్థను, బ్రాహ్మణ పురోహిత ఆధిక్యతను, వారి దోపిడీ విధానాన్ని సమర్థించి, బలపరిచే హిందూ మత భావజాలాన్ని, తాత్వికతను సమూలంగా నాశనం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన మొదటి సాంఘిక విప్లవకారి ఫూలే అనడంలో సందేహం లేదు. 'మొదట్లో అసలు కులం అనేది లేదు. ఆర్యులు, బ్రాహ్మణులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారని' ఫూలే అన్నారు. అగ్రవర్ణాల సంఘ సంస్కర్తలవలే కాక ఆయన హిందూ మత సాంప్రదాయాల్ని, బ్రాహ్మణీయ ఆధిక్యతను కూలదోసి దానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించడానికి కంకణం కట్టుకున్న గొప్ప సాంఘిక విప్లవవాది. ఆయన దృష్టిలో హిందూ మత గ్రంథాలు, సాంఘిక అసమానతల్ని పదిల పర్చి, బ్రాహ్మణ దైవత్వాన్ని కాపాడుకోవడానికి నిర్దిష్టమైన భావజాలాన్ని, తాత్వికతను రూపొందించి ప్రచారం చేయడానికి ముఖ్య సాధనాలు. అవి కేవలం క్రింది కులాల్ని దోపిడీ చేయడానికి బ్రాహ్మణ వర్గం సృష్టించిన కట్టు కథలు, పుక్కిట పురాణాలు. అందువల్లనే ఫూలే, రాజారామమోహనరాయ్, దయానంద సరస్వతి, వివేకానంద లాగా వేదాలు, ఉపనిషత్తుల పవిత్రతను గుర్తించాలని గాని, హిందూ మతాన్ని సంస్కరించి పునరుద్ధరించాలనిగాని వాదించలేదు. ఎందుకంటే ఆయన దృష్టి లో వేదాలు భగవంతుని సృష్టి కావు. అవి సమాజంలో విభజనను సృష్టించిన మానవ నిర్మితాలు. అందుకే ఆయన మనుధర్మ శాస్త్రాన్ని అపవిత్ర గ్రంథంగా భావించారు. 'మనువు పెట్టిన ఆంక్షలన్నీ నిజం కాదు. వాటిని ఇప్పుడు పాటించవలసిన అవసరం లేదని' ఫూలే చెప్పాడు. సాంప్రదాయ హిందూ మత సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయంగా శూద్ర, అతిశూద్ర వర్గాల విముక్తికి అనువైన మానవీయ సిద్ధాంతాన్ని బోధించిన మహాపురుషుడు ఫూలే. అందుకే ఆయన అంబేద్కర్‌కు మార్గదర్శకుడైనాడు. 'ప్రీస్టీ క్లాస్ ఎక్స్‌పోసుడ్', 'గులాంగిరి' గ్రంథాల్లో మహాత్మా ఫూలే హేతువాదం, మానవతా వాదం, సమానత్వ సిద్ధాంతాల్ని ప్రబోధించినాడు. రాజకీయ దాస్యం కంటే సాంఘిక దాస్యం హీనమైనదని, సమాజం క్రింది కులాలపై జరుపుతున్న అన్యాయాలకు ప్రతిఘటన ఒక్కటే తగిన చర్య అని ప్రకటించినాడు. హేతువాద దృష్టితో హిందూ మత గ్రంథాలన్నిటి సారాంశాన్ని పరిశీలించి అజ్ఞానాన్ని, అవివేకాన్ని పారద్రోలడానికి, సమానత్వాన్ని సాధించడానికి దళిత బహుజన వర్గాలకు ఆధునిక విద్య, జ్ఞానం ఆవశ్యతకను మహాత్మా ఫూలే గుర్తించాడు. ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా హిందూ మతం క్రింది కులాలకు విద్యను అందించకుండా, దానిని తమ సొత్తుగానే పరిగణించింది. 'కళ్లు తెరిచి చూడండి, కులం మీద పెత్తనం బ్రాహ్మణులదే' తరతరాలుగా బ్రాహ్మణ ఆధిక్యతను కొనసాగించడానికి అది ఒక ముఖ్యమైన సాధనం. అందువల్లనే మహాత్మా ఫూలే 'ప్రజలందరికీ విద్య'ను ధ్యేయంగా పెట్టుకున్నారు. విద్యా వ్యాప్తి విషయంలో ఫూలే మిగతా సంఘ సంస్కరణవాదుల కంటే భిన్నంగా ఆలోచించారు. 19వ శతాబ్ద సంఘ సంస్కర్తలు విద్య గురించి చేసిన సూత్రీకరణలో పై తరగతుల వాళ్ల విద్యయే ప్రాముఖ్యత వహించింది. వారు వలసవాద విద్య ముఖ్య సూత్రమైన 'వడపోత సిద్ధాంతాన్ని' అంగీకరించారు. దాని ప్రకారం శిష్ట వర్గాలకు చెందిన విద్యావంతుల ద్వారా విద్య, విజ్ఞానం క్రమంగా క్రింది తరగతుల వారికి అందుతుంది. మెకాలే విద్యా విధానం వల్ల ప్రధానంగా లాభపడింది మాత్రం ద్విజులే. కాబట్టి ఫూలే తన వంతు కర్తవ్యంగా సమాజంలో నీచమైన స్థితిలో వున్న మహద్, మాంగ్, శూద్ర కులాలకు విద్య నందించడానికి వారి కోసం పాఠశాలలు ప్రారంభించారు. అంతే కాకుండా అణచబడ్డ కులాల్లోని స్త్రీలకు కూడా విద్యనందించే ఉద్దేశంతో బాలికలకు కూడా ప్రత్యేకంగా పాఠశాలలు నిర్వహించారు. ఇది నిజంగా ఒక విప్లవాత్మక చర్య. ఎందుకంటే దళిత బహుజనులకు విద్యా బుద్ధులు నేర్పడం, వారిని విద్యావంతుల్ని చేయడాన్ని అగ్రకులాలు సహించ లేదు. సామాన్య ప్రజానీకం అందులో ముఖ్యంగా అణగారిన వర్గాలు చైతన్యవంతులై ఆత్మాభిమానం కలిగి స్వేచ్ఛ సమానత్వాన్ని, హక్కుల్ని కోరితే తమ ఆధిపత్యానికి ముప్పు వాటిల్లుతుందని అగ్ర వర్ణాలు గ్రహించాయి. అందువల్లనే మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల ద్వారా క్రింది కులాల్లో వ్యాప్తికి వారు అనేక రకాలైన అడ్డంకులు కల్గించారు. అయినప్పటికి మహాత్మా ఫూలే తనకు వీలున్నంత వరకు మిత్రుల, శ్రేయోభిలాషుల సహకారంతో ఎన్నో త్యాగాలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో అనేక విద్యా సంస్థల్ని స్థాపించారు. సార్వత్రిక విద్య విషయంలో మిగతా సంస్కర్తల కంటే భిన్నంగా ఆలోచించి వారెవ్వరూ చేపట్టని కార్యక్రమాన్ని అంటే క్రింది కులాలకు, స్త్రీలకు విద్యనందించి విద్యారంగంలో నూతన శకాన్ని ఆరంభించారు. మహాత్మా ఫూలే ఏ రకంగానైతే విద్యా విషయంలో అగ్ర మేధావుల కంటే భిన్నంగా ఆలోచించారో అదే విధంగా సంఘ సంస్కరణ విషయంలో కూడా చేశారు. ఆయన చేపట్టిన సంస్కరణ కార్యకలాపాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని శూద్ర, అతి శూద్ర కులాల్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆనాటి సమాజంలో బ్రాహ్మణ పురోహిత వర్గం మత, సాంస్కృతిక రంగాల్లో తిరుగులేని అధికారాల్ని కల్గివుండి ఆచారం, సంప్రదాయం పేరుతో అనేక సాంఘిక దురాచారాల్ని పెంచి పోషించింది. 'కుల భేదాలు పాటించడం మతం కాదు. కుల వ్యవస్థ పెద్ద బూటకం. బ్రాహ్మణుడు సర్వకాల, సర్వావస్థల్లోనూ పవిత్రుడే అనే విషయం నమ్మకండి' అని ఫూలే అన్నాడు. తన సిద్ధాంతాన్ని తాత్వికతను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి వీలుగా సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి సంఘ సంస్కరణ, ఆర్థిక పోరాటాల్ని చేపట్టారు. మత, సాంస్కృతిక రంగాల్లో ఫూలే బ్రాహ్మణ పురోహిత మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించి, దళిత బహుజన కులాల్లో సత్యశోధక్ ఆధ్వర్యంలో పెళ్లిళ్లు శుభకార్యాలు జరిపించారు. అంతే కాకుండా కుల వ్యవస్థలో హెచ్చతగ్గుల్ని వ్యతిరేకించి సమాజ్ 'అందరూ సమానమనే' సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది. ముఖ్యంగా విగ్రహారాధనను వ్యతిరేకించి క్రింది కులాల్లో కొంతమంది బ్రాహ్మణుల్లో వితంతు పునర్వివాహాల్ని చేపట్టింది. సత్యశోధక్ సమాజ్ సభ్యుల్లో అత్యధికులు శూద్ర- అతి శూద్ర కులాలకు చెందిన వాళ్లు. తద్వారా వారిలో ఐక్యతను తీసుకొచ్చి అనతికాలంలోనే అది ప్రజా సంస్థగా రూపొంది బడుగు వర్గాల్లో నూతన చైతన్యాన్ని, స్పృహను తీసుకొచ్చింది. అందుచేతనే మహాత్మా జ్యోతీబా ఫూలే ను 'మహారాష్ట్ర లూథర్' గా వర్ణించారు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో చెలరేగుతున్న దళిత బహుజన అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటాలు భారత సమాజంలోని సం స్కృతి, ఆచారం, సంప్రదాయం, మతం, కులం మొదలైన అంశాలపై గురించి లోతుగా ఆలోచింపజేస్తున్నాయి. ఈ సందర్భంలో వివిధ వర్గాల కులాల మధ్య ఉన్న ఆర్థిక సాంఘిక అసమానతలు మరింత ప్రస్ఫుటంగా ముందుకొస్తున్నాయి. సమాజాన్ని మార్చడానికి కుల -వర్గ వ్యవస్థను అంతం చేయడానికి వివిధ వర్గాలు, పార్టీలు తమ తమ ఆలోచనా విధానాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అందువల్ల మహాత్మా ఫూలే ఆలోచనా విధానాన్ని, ఉద్యమాలని స్మరించుకొని స్ఫూర్తి పొందడం అణగారిన వర్గాలకు అత్యంత ఆవశ్యకం. మహాత్మా ఫూలే చేపట్టిన ఉద్యమాలు మహత్తర మైనవి. అయినప్పటికి వాటి పరిధుల్ని పరిగణనలోనికి తీసుకొని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆయన సిద్ధాంతాల్ని అన్వయించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. మహాత్మా ఫూలే ప్రభోదించిన కుల వ్యవస్థ నిర్మూలన, అగ్రకుల ఆధిక్యతా ధిక్కరణ, బహుజనుల విముక్తి ప్రస్తుత, భవిష్యత్ ప్రజా చైతన్య ఉద్యమాలకు మార్గదర్శకంగా కావాలనేది నా నమ్మకం. ఆయన చెప్పినట్లు 'రాజకీయ దాస్యం కంటే సాంఘిక దాస్యం మరీ హీనమైనది. సమాజం క్రింది వర్గాలపై జరుపుతున్న అన్యాయాలకు ప్రతి ఘటన ఒక్కటే తగిన చర్య'. నయా వలసవాదం, నయా హైందవం పెంచి పోషిస్తున్న కులవివక్షను, అగ్రకుల -వర్గ దురహంకారాన్ని సమూలంగా నాశనం చేయాలని సంకల్పించిన మహాత్మా ఫూలే ఆశయాన్ని మరింత ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత దళిత బహుజన మేధావులపైన, అభ్యుదయ, ప్రజాతంత్ర ఉద్యమాలపైన వుందని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కులం నిర్మించిన అడ్డుగోడల్ని తొలగించి బహుజన పేద వర్గాల్లో ఐక్యతను పెంపొందించాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది అనే విషయం కూడా స్పష్టమవుతోంది. అందువల్ల కుల నిర్మూలనా పోరాటాల్ని, పౌర హక్కుల, దళిత బహుజన, స్త్రీ విముక్తి ఉద్యమాలతో ఐక్యం చేసి ప్రజాతంత్ర సాంఘిక విప్లవాన్ని నిర్మించాలి. అందుకే ఈ తరుణంలో అణగారిన కులాల విముక్తికి సైద్ధాంతిక ప్రాతిపదికను ప్రభోదించి, పోరాటాల్ని నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలేను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.

ఉస్మానియా విశ్వవిద్యాలయం
(నేడు ఫూలే జయంతి)
Andhra Jyothi News Paper Dated : 11/04/2012 

No comments:

Post a Comment