Thursday, April 19, 2012

దళితుల ఆహారం చర్చనీయాంశమా? - ప్రొ. పులికొండ సుబ్బాచారి



ఆంధ్రప్రదేశ్‌లో కాని ఇతర రాష్ట్రాలలో కాని దళితులు గొడ్డు మాంసం (ఆవు, ఎద్దు, దున్న, బర్రె) తింటారు. అసలు దళితులు చరిత్ర క్రమంలో అంటరానివారు కావడానికి ఇదే కారణమైందనే సాంఘిక సిద్ధాంతం కూడా సమాజ శాస్త్రంలో ఒకటుంది. కాని ప్రస్తుతం దళితుల ఆహారం బాగా చర్చనీయాంశమవుతోంది. ఇటీవలి ఉస్మానియా యూనివర్సిటీ ఉదంతం ఆకస్మాత్తుగా జరిగింది కాదు. దీని వెనుక సైద్ధాంతిక పరమైన ఆలోచనతో ఒక హక్కును చాటుకోవడానికి చేసిన దళిత ప్రయత్నంగా కనిపిస్తోంది. 


ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టల్‌లో బీఫ్ ఫెస్టివల్ జరుపుకోవడానికి దళిత విద్యార్థులు, మరికొందరూ ప్రయత్నించడం, దాన్ని మరొక వర్గం విద్యార్థులు అడ్డుకోవడంతో పెద్ద హింసాకాండే జరిగింది. ఉస్మానియా చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇది తొలిసారి. ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్ళలో శనివారం, ఆదివారం కోడిమాంసం, మేక, గొర్రె మాంసాలను ఆహారంలో ఇస్తారు. (నేను 1980 నుంచి 1987 దాకా ఉస్మానియా హాస్టళ్ళలో ఉన్నాను. విద్యార్థిగా నాకు బాగా తెలిసిన విషయం ఇది). దళిత విద్యార్థులు ఆ రోజుల్లోనే మేము తినే మాంసం కూడా పెడితే బాగుంటుంది కదా అనే వాదన చాలా గుంభనంగా చేసేవారు. 



దాన్ని పైకి గట్టిగా అనడానికి కూడా బాధపడే వారు. దాన్ని వారే చిన్నతనంగా భావించే రోజులు అవి. కాని సామాజిక అస్తిత్వ ఉద్యమం పెరిగిన తర్వాత దళితులు తమ సమాజపు సాంఘిక జీవన విధానాన్ని పూర్తిగా ఎస్సర్ట్ చేసుకుంటున్నారు (తమ జీవితాన్ని తమ ఇష్టం ప్రకారం గడపాలనే భావన). ఈనాడు దళితులు తమ ఆహారపు అలవాట్లను తమ హక్కుగా బహిరంగంగా చెప్పి తమ జీవన శైలిపై, ఆహారపు అలవాట్లపై సమాజంలోని ఇతర వర్గాలు ఆంక్షలు పెట్టడానికి వీలు లేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనగానే ఉస్మానియా విశ్వవిద్యాలయపు బీఫ్ ఫెస్టివల్‌ని అర్థం చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలు కొన్నింటిలో బీఫ్‌ను కూడా హాస్టళ్ళలో విద్యార్థులకు ఇస్తున్నట్లు తెలియవచ్చింది. 



కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పరిపాలించే రోజుల్లో గోవధ నిషేధం గురించి చర్చ జరిగే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చౌకధరలో తమకు మంచి ఆహారం (ప్రొటీన్ రిచ్ ఫుడ్) దొరికే మార్గం ఇదే, దీన్ని ఎందుకు నిషేధిస్తారు అని వారు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. బహు సంస్కృతుల ప్రజలు నివసించే విశాలమైన దేశంలో ఇలాంటి భేదాభిప్రాయాలు రావడం చాలా సహజం. అది ఆయా ప్రజల సమాజ హక్కులకు రాజ్యాంగం ప్రతిపాదించిన హక్కులకు సంబంధించిన విషయం. 



అడవి జంతువులను వేటాడి చంపడం నేరం అని చెప్పి నిషేధించిన ప్రభుత్వం ఇంటి జంతువులైన కోళ్ళు మేకలు, గొర్రెలను చంపడాన్ని నిషేధించలేదు. మున్సిపాలిటీలలో ఇంతకు ముందు కుక్కలను పట్టుకుపోయి కరెంటు పెట్టి చంపేసే వారు. జీవకారుణ్య సంఘాల వారి కృషి ఫలితంగా వాటిని చంపడం ఆగిపోయి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే ప్రక్రియ అమలులోనికి వచ్చింది. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. కాని ఈ జీవ కారుణ్య సంఘాల వారు బ్లూక్రాస్ వగైరా వగైరా పేర్లతో దేశవ్యాప్తంగా ఉన్న జీవ కారుణ్య సంఘాల వారు జంతుబలిని కాదు జంతు వధని నిషేధించమని కోరరు ఎందుకని? అసలు మొత్తం మాంసాహారాన్ని నిషేధిస్తే జంతు వధ అనేది ఉండదు. 



ఈనాడు మానవుడికున్న అవగాహన ప్రకారం ప్రతి జంతువుకూ బ్రతికే హక్కు సహజంగా ఉంది అని అంగీకరించినప్పుడు ఏ జంతువునూ చంపి తినే హక్కు ఏ మనిషికీ లేదు. ఇలా ఆలోచించినప్పుడు నిషేధించవలసింది జంతు బలిని కాదు, జంతు వధను. హిందువులకు పవిత్రమైనదిగా భావించే గోవును వధించడం మాత్రమే నిషేధించాలి అనడం సరికాదు. అసలు ఏ జంతువునూ చంపకూడదు అలా చంపే హక్కు మనిషికి లేదు అని నిషేధించడం చాలా అవసరం. ఇదే సహజ న్యాయం కూడా. (ఈ వ్యాసకర్త బ్రాహ్మణేతరుడైన సంపూర్ణ శాకాహారి). అంతే కాని కొన్ని జంతువులను చంపి తినడం సరైనదే. 



కొన్ని జంతువులను చంపి తినడం న్యాయం కాదు అని వాదించడం రాజ్యాంగ బద్ధమైన సమన్యాయానికి విరుద్ధం అవుతుంది. ప్రభుత్వాలు మొత్తం జంతువధని అంటే మాంసాహారాన్ని నిషేధించే దిశగా అడుగులు వేసి అన్ని ప్రాణుల్ని చంపడాన్ని నిషేధించాలి. అంత దాకా ఒక సామాజిక వర్గానికి చెందిన ఆహారాన్ని అనుమతిస్తూ మరొక వర్గానికి చెందిన ఆహారాన్ని అంటే వారి జంతువధని ప్రశ్నించే వీలు లేదు. దళితుల ఆహారం అప్పటిదాకా చర్చనీయాంశం కారాదు.



- ప్రొ. పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
Andhra Jyothi News Paper Dated : 20/04/2012 

1 comment:

  1. చాల బాగా మీ ఫీలింగ్స్ వెల్లడించారు. మనకు ఉన్న దౌర్బాగ్యం ఏంటంటే ఎదుటవాడు తినే తిండిని బట్టి కుడా మన సమాజం విడగోట్టబడుతుంది. హక్కుల కోసం , ఆత్మాభిమానం కోసం పోరాడుతుంటే వాళ్ళకు హేళన గా ఉంది. అందుకే ఈ సమాజానికి మానవత్వం లేదు అనేది

    ReplyDelete