ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి, ఆధిపత్యానికీ, నిరంకుశత్వానికీ, దాడికీ, హింసకూ దారితీసిన కాలం ఇది. వ్యక్తిగత అభిరుచులను, సాంస్కృతిక సంప్రదాయాలను, తరతరాల ఆహారపు అలవాట్లను, స్వాభిమాన ప్రకటనను శాసించదలచిన గుత్తాధిపత్య,ఆగ్రవర్ణ,మతోన్మాద, హింసారాజకీయ భావజాలపు సందర్బం ఇది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్దకూర పండుగ సందర్భం గా ఇతరుల ఆహారహక్కు పట్ల హిందూత్వవాదులు ప్రదర్శించిన అసహనాన్ని, చేసిన హింసాత్మకమైన దాడిని, ఆ అసహనం వెనుక రాజకీయాలను నిశితంగా పరిశీలించవలసి సమయం ఇది. అసలు ఒకరు తినే ఆహారాన్ని, కట్టు బొట్టు తీరును, ఆలోచనలను, ఆచరణలను ఒక్కమాటలో ఒకరి సంస్కృతిని మరొకరు చిన్న చూపు చూసే అడ్డుకునే వైఖరి నిరంకుశ, నియంతృత్వ వైఖరి. ప్రజాస్వామ్యవ్యతిరేక వైఖరి.ఈ దేశ పాలక వర్గాలకు, హిందూవూబాహ్మణీయ అగ్రవర్ణ రాజకీయాలకు అలవాటయిన వైఖరి ఇది.ఇతరులను బానిసలుగా, అస్పృశ్యులుగా, పనివాళ్లుగా, తక్కువ వాళ్లుగా చూడాలంటే వారిని తొడలనుంచో, పాదాలనుంచో పుట్టినవాళ్లుగా భగవానువాచ చెప్పించాలి.
వారి తిండినీ, ప్రవర్తననూ, భాషనూ, ఆలోచనలనూ, సంస్కృతినీ, అస్తిత్వాన్నీ అవమానించాలి. ఈ వైఖరిలో భాగమే ఇవాళ్టి ఆహార దౌర్జన్యం. నిజానికి ప్రతి మనిషీ, ప్రతి సమూహమూ తన వీలును బట్టి ఆర్థిక నైసర్గిక స్థితిని బట్టి ఒక ఆహారానికి అలవాటు పడుతుంది. చారివూతక క్రమంలో అది వారి సంస్కృతీ చిహ్నం అవుతుంది. ఆ విభిన్నమైన ఆహారాలలో ఒకటి ఎక్కువకాదు, మరొకటి తక్కువా కాదు. ఆ వైవిధ్యాన్ని గుర్తించి, ప్రతి ఒక్కరి ఆహార హక్కును గౌరవించడం దాన్ని ఇతరులు శాసించకుండా చిన్నచూపు చూడకుండా ఉండడం ఆహార ప్రజాస్వామ్యం. అది విషం అయితేనో, ఇతరులను అవమానించేదైతేనో ఆమాట చెప్పవచ్చు. చర్చించవచ్చు. కానీ దౌర్జన్యంతో దాన్ని అడ్డుకోవడం హిందూత్వ రాజకీయాలకు మాత్రమే తెలిసిన పద్ధతి. పెద్దకూర విషం కాదు. అది తినడం ఇతరులకు అవమానకరమనే పేరు మీద సంఘపరివార్ శక్తులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దౌర్జన్యానికి దిగాయి.
కానీ పెద్దకూర ఎవరికీ అవమానం కాదు. ఈదేశంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఇష్టంగా తినే ఆహారం అది. హిందూత్వ బ్రాహ్మణ్యం మేకుబందీ వ్యవస్థగా మారకు ముందు, అది బ్రాహ్మణులు కూడా తిన్న ఆహారం అని అనేక పౌరాణిక, చారివూతక ఆధారాలు ఉన్నాయి.‘అది హిందూ జాతికి అవమానం’ అనే మాట కేవలం ఇతర జాతులను చిన్న చూపు చూడదలచిన అగ్రవర్ణ మత రాజకీయాల పర్యవసానం మాత్రమే.
పోనీ ఈ గోవధ నిషేధవాదులు ప్రకటిస్తున్న గోమాత ఆరాధన నిజమైనదేనా? నిజాయితీతో కూడినదేనా? ఇతరవర్గాల ప్రజలను, ముఖ్యం గా దళితులను మైనారిటీలను దెబ్బతీయడానికి, అవమానించడానికి హిందూత్వవాదుల చేతిలో అమాయకమైన గోవు ఒక ఆయుధం అయింది గానీ, నిజంగా గోవుల మీద పశు సంతతి మీద వాళ్లకూ ఏమీ ప్రేమ లేదు. అంత ఆరాధించే గోవు చచ్చిపోతే దగ్గరికి కూడా పోకుండా, దాన్ని లాక్కుపోయే పని దళితులకు అప్పజెప్పే అగ్రవర్ణాలివి. ఆ గోవులు పనిచేయ గలిగినంత కాలం, పాలు ఇస్తూ, సంతానాన్ని కంటూ తమకు ఉపయోగపడేంతకాలం వాటి ఆలనాపాలనా చూసి, వట్టిపోయినాక నిష్పూచిగా వదిలేసే అగ్రవర్ణాలివి. అనేక ఇతర జంతువులను ఇష్టంగా ఆహారం చేసుకున్న వాళ్లే ఒకానొక జంతువు మీద ఇంత ప్రేమ చూపడం అసంగతం మాత్రమే కాదు, అది నిజానికి ఒక కుటిల రాజకీయం.
ఆ ఒకానొక జంతువును తినే ప్రజాసమూహం మీద దాడికి మార్గం.
ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గోహత్య, ఎద్దుకూర వండడం, బహిరంగంగా తినడం తప్పు అనే వాదనలు చూస్తే .., ఆ హిందుత్వ వాదులు వారి పండుగలు, వారి విందులు ఈ ప్రాంగణంలో జరుపుకోవడం లేదా? విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాలలో, ఇతర హిందూ పండుగలలో వీరంగాలు ఎలా జరుగుతున్నాయి? ఒకప్పుడు లైబ్రరీకి వెళ్లే దారిలో మూడు పక్కలా నాపరాతి బండలతో ఒక విగ్రహం మాత్రం ఉన్న హిందూత్వ దేవతలకు ఇవాళ పెద్ద పెద్ద గుళ్లు ఎలా వచ్చాయి? విశ్వవిద్యాలయం హిందూ అగ్రవర్ణ అగ్రహారమేనా? అందులో ప్రవేశించి తమ పండుగలు జరుపుకునే తమ సాంస్కృతిక ప్రత్యేకతలు చూపుకునే హక్కు దళిత బహుజనులకు లేదా? ఇంకా వారు ఊరి చివర ఉండవలసిందేనా?
ఎద్దుకూర ఇష్టమా కాదా, ఎద్దుకూర తింటారా తినరా అనేదాని కన్నా ముఖ్యమైనది, ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష పట్ల, ఒక సాంస్కృతిక ఆస్తిత్వ ప్రకటన పట్ల ఇతరులు ఎలా వ్యవహరిస్తారేది ప్రశ్న. తిననివాళ్లు, ఇష్టం లేని వాళ్లు కూడా సమర్థించవలసిన పండుగ ఇది. ఈ దేశ జనాభాలో గణనీయమైన భాగానికి, ప్రధానంగా ఈ దేశ సంపదకు సృష్టికర్తలైన భాగానికి ఆచారం ఇది. ఆహా రం అది.తమ ఆహార సంస్కృతి చిన్నచూపునకు గురవుతున్నదని, దాన్ని ఇతరుల ఆహారంతో సమానంగా చూడకపోవడమంటే తమను అవమానించడమేనని ఒక వర్గం భావించింది. ఆ అవమానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నది. ఇప్పుడు సమానత్వాన్ని కోరేవాళ్లందరూ ఆ ప్రతిఘటనను సమర్థించవలసి ఉంటుంది. ప్రతిఘటించేవాళ్ల రాజకీయాలు, ఉద్దేశాలు, వ్యక్తిగత అభిరుచులు నచ్చినా నచ్చక పోయినా దానికన్న ముఖ్యంగా గుర్తించవలసింది అది ధిక్కార ప్రకటన.అది స్వాభిమాన ప్రకటన.అది నిరంకుశత్వం మీద సవాల్. దాన్ని సమర్థించడం ప్రతి ఒక్కరి బాధ్యత.‘నీ అభివూపాయాలతో నాకు ఏకీభావం లేకపోవచ్చు, కానీ నీ అభివూపాయాలు చెప్పుకునే హక్కును కాపాడడానికి నా ప్రాణాలైనా ఇస్తాను’ అన్న వోల్టేర్ మాట ప్రజాస్వామ్య స్ఫూర్తికి చిహ్నం.
ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ స్ఫూర్తిని ప్రకటించవలసి ఉన్నది. కొందరి అభివూపాయాలను, సంస్కృతిని, ఆహారపుటలవాట్లను తొక్కివేయడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు స్వేచ్ఛా ప్రియులందరూ ఆ అభివూపాయాలను , సంస్కృతిని, ఆహారపుటలవాట్లను ఎత్తిపట్టవలసి ఉన్నది. సంఘపరివార్ తప్పుడు ప్రచారానికి బలి అయి, ఆ చాణక్య దమననీతిలో పాలుపంచుకుంటున్న వారు ఏ వర్గాలవారైనా వారి అభిరుచులేవయినా ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తుంచుకోవాలి. ‘ఎదిరించినోని పీకనొక్కు’ సిద్ధాంతం ఫాసిజం అన్నాడు కాళోజీ. సంఘపరివారానికి తెలిసినది ఫాసిజం మాత్రమే.కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రజాస్వామిక స్ఫూర్తి వల్ల వీరోచితమైన విద్యా ర్థి ఉద్యమాల వల్ల ఆ ఫాసిస్టు ప్రమాదం కొన్ని దశాబ్దాలుగా కోరలు దాచుకుని ఉన్నది. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామనే పేరుతో ఇటీవల సంఘపరివార్ మరొకసారి బలం పుంజుకుని కోరలు విప్పుతున్నదనడానికి ఈ ఎద్దుకూర పండుగ మీద దాడి ఒక సూచన. తెలంగాణ న్యాయమైన ఆకాంక్షలకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. కానీ మీ హింసావాద హిందూత్వ దుర్మార్గం ఇక్కడ చెల్లదు.
దళితుల పట్ల సబ్బండ వర్ణాల పట్ల మైనారిటీల పట్ల మహిళల పట్ల విషాన్ని, ద్వే షాన్ని చిమ్మే మీ మనువాద రాజకీయాలు ఇక్క డ చెల్లవు అని తెలంగాణవాదులు ప్రకటించవలసిన సమ యం ఆసన్నమైందని ఉస్మానియా ఘటనలు హెచ్చరిస్తున్నాయి. పెద్దకూర పండుగ గురించి ఆలోచించిందీ నిర్వహించిందీ ఆజాద్, స్టాలిన్, రాజేష్, సుదర్శన్ వంటి తెలంగాణ బిడ్డలే. తెలంగాణ వాదులే. ‘బీఫ్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, మై నాలెడ్’్జ అనే అద్భుతమైన ఇంగ్లిష్ పాటను రాసి పాడిందీ శరత్ అనే తెలంగాణ బిడ్డే. మరి సంఘ పరివార్ ఎందుకు వ్యతిరేకించినట్టు? నిజానికి సంఘపరివార్ తన మతోన్మాద, అగ్రవర్ణ భావజాల ఎజెండా కోసం తెలంగాణను పక్కన పెడుతుందని మొన్న మహబూబ్‌నగర్ ఉప ఎన్నిక రుజువు చేసింది. నిన్న పెద్దకూర పండుగ రుజువు చేసింది.
ఎద్దుకూర పండుగ ఎంత ఆహ్వానించదగిన సాంస్కృతిక అస్తిత్వ ప్రకటన అయినా ప్రజాస్వామిక వ్యక్తీకరణ అయినా దానికదిగా దళితుల పురోగతిని సాధించజాలదని కూడా విద్యార్థి సోదరులు తెలుసుకోవాలి. రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారి భాష, ఆహారం, కట్టుబొట్టు, సంస్కృ తి, భావజాలాలు కూడా అధికారంలో ఉంటాయి. పాలకవర్గాలు ప్రజలను మాత్రమే కాదు, ప్రజల భావాలను కూడా పాలిస్తాయి. కనుక భావాలలో మార్పు సాంస్కృతిక సమానత్వం రావాలంటే రాజ్యాధికారం ఈ పాలకవర్గాల చేతుల్లోంచి ఇవాళ దోపిడీ పీడనలకు గురవుతున్న అసంఖ్యాక పాలిత ప్రజానీకం చేతుల్లోకి రావాలి. ఆదివాసీ, దళిత, బహుజన, మైనారిటీ వర్గాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యాధికారం కావాలి. ఆ సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించకుండా, చేయకుండా గెలవకుండా నిజమైన స్వేచ్ఛా ప్రకటనగా, స్వాభిమాన ప్రకటనగా ఎద్దుకూర పండుగ ప్రాధాన్యం నిలబడదు.
-ఎన్. వేణుగోపాల్
Namasete Telangana News Paper Dated : 17/04/2012
No comments:
Post a Comment