హిందూ సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని విద్యాధికులుగా; ఆత్మాభిమానం కలవారిగా చేయాలన్నదే డాక్టర్ బాబూ జగజ్జీవన్‌రామ్ లక్ష్యం; ఆయన నిరాడంబరుడు, నిరంతర కార్యదీక్షా తత్పరుడు, నమ్మిన సిద్ధాంతాల కోసం వెనకడుగు వేయని వ్యక్తి. సామ్రాజ్యవాదులు ఆశ చూపిన పదవులను తృణీకరించిన నిష్కపట సేవాతత్పరుడు, గాంధేయవాదాన్ని నమ్మి ముందుకు సాగిన స్వాతంత్య్ర సమరయోధుడు. అజాత శత్రువు. సమతావాది. జగ్జీవన్‌రామ్ బీహర్‌లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న సంతోషోభిరామ్, బసంతి దేవిలకు జన్మించారు. అంటరానితనంపై బాల్యం నుంచే కత్తికట్టిన యోధుడు జగ్జీవన్‌రామ్.
ఆయన తాను చదువుకున్న పాఠశాలలో అంటరానితనాన్ని మొదటిగా చవిచూశారు. జగ్జీవన్‌రామ్ పాఠశాల విద్యనభ్యసించే రోజులలో బ్రిటీష్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో.. మంచినీటి సదుపాయాన్ని కల్పించిన చోట 'హిందూ పాని' 'ముస్లిం పాని' అని రాసి వుంచిన రెండు ప్రత్యేక.. నీటి కడవలుండేవి. బాబూజీ చదువుతున్న అగర్వాల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరో అడుగు ముందుకేసి 'హరిజన పానీ' అని రాసి వున్న మూడో కడవను పాఠశాలలో పెట్టించారు. పసిప్రాయంలోనే కులదురభిమానాన్ని రేకెత్తించే ఈ ఉదంతం జగ్జీవన్‌రామ్‌కు ఆగ్రహం తెప్పించింది.
వెంటనే ఒక రాయిని విసిరి ఆ కుండను ముక్కలు, ముక్కలు చేసి సదరు ప్రధానోపాధ్యాయునికి... గొప్ప గుణపాఠం చెప్పాడు. తాను జన్మించిన దళిత సమాజ దుస్థితికి, విద్యార్థి దశ నుంచి అనుభవించిన అమానుషమైన అంటరానితనానికి జగ్జీవన్‌రామ్ తీవ్రంగా కలత చెందారు. పసివాడిగానే ధీరత్వం ప్రదిర్శంచారు. బాల్యంలో తాను చవిచూసిన అనుభవాలే భవిష్యత్తులో ఆయన దళిత జనుల జాగృత్తికి కార్యోన్ముఖునిగా ముందుకు సాగటానికి ప్రేరణగా నిలిచాయి. అంటరానివారుగా అనేక దురాగతాలను ఎదుర్కొంటున్న దళిత కులాల వారిని జనజీవన స్రవంతిలో భాగస్వాములుగా చేయడానికి జగ్జీవన్‌రామ్ దీక్షబూనారు.
బానిసత్వంతో మగ్గుతున్న భారతమాత స్వేచ్ఛా స్వాతంత్య్రాల సాధన, అమానుషమైన అంటరానితనం నిర్మూలన గురించిన ఆలోచనలతో జగ్జీవన్‌రాం ఎప్పుడూ సతమతమౌతూ ఉండేవారు. మెరిట్ ప్రాతిపదికన ఫీజు మినహాయింపుతో ఆదానగర్ అగర్వాల్ మిడిల్ స్కూల్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. మదన్‌మోహన్ మాలవ్య ఉపన్యాసాల పట్ల ఆకర్షితులయ్యారు. మాలవ్య సిఫారసుతో బెనారస్ హిందూ యూనివర్శిటీలో చేరారు. కానీ అక్కడ కూడా అంటరానితనానికి గురై మనోవేదన చెందారు. దీనితో 'జాత్యహంకార నిర్మూలనోద్యమం' చేపట్టి ఆ రోజుల్లో బ్రాహ్మణులను వెలివేసి వారి కళ్ళు తెరిపించారు.
తర్వాత 'కాశీ' విశ్వవిద్యాలయాన్ని విడిచి కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరారు. అదే ఏడాది సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. జగజ్జీవన్‌రామ్ తనదైన శైలిలో దళితులు బలహీనతలకు స్వస్తి చెప్పాలని ప్రచారం చేసేవారు. అంటరాని తనం విముక్తి కోసం కాలినడకన గ్రామగ్రామాన పర్యటించి దళితులను చైతన్య పరిచారు. 1929 డిసెంబర్ 1న లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు. ఆ మహాసభలో పాల్గొంటూనే మరోపక్క దళిత జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. దళిత జనోద్ధరణ కోసం జగ్జీవన్‌రామ్ 'సంత్ రవిదాస్' మహాసభను ఏర్పాటు చేశారు. 1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బి.యస్.సి పట్టా పొందారు.
మనదేశంలో మంత్రి పదవి జగ్జీవన్‌రామ్‌ను వరించినట్లుగా మరెవరినీ వరించలేదంటే అతిశయోక్తి కాదు. 1935 ఇండియా చట్టం ప్రకారం రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బాబూజీ కాంగ్రెస్ తరపున నిలబడి 'భీమార్' శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. గాంధీజీ హరిజనోద్ధరణకు చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై ఆయన ఏర్పాటు చేసిన హరిజన సేవాసంస్థలో చేరారు. తరువాత అదే సంస్థకు కార్యదర్శిగా నియమితులయ్యారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహాలు ప్రారంభమయ్యాయి.
ఆ సమయంలో జగ్జీవన్‌రామ్ అకుంఠిత దీక్షా పరుడని, ఎంతటి త్యాగానికైనా వెనుదీయడని భావించిన గాంధీజీ ఆయనను బీహార్ మొదటి సత్యాగ్రహిగా నిర్ణయించారు. సత్యాగ్రహంలో వుండగా పోలీసులు అరెస్ట్ చేసి కఠిన కారాగార శిక్ష విధించారు. 1941 సెప్టెంబర్ 10న జైలు నుంచి విడుదలయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఆ సమయంలో అబ్దుల్ బారీతో కలిసి బాబూజీ బొంబాయి నుంచి రహస్యంగా అజ్ఞాత ప్రదేశానికి వెళ్లి కార్యకర్తలను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1946 సెప్టెంబర్ 2న కేంద్రంలో జవహర్‌లాల్ నాయకత్వాన ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో జగ్జీవన్‌రామ్ కార్మిక మంత్రిగా నియమితులయ్యారు. 1947లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మికుల సభలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
బాబూ జగ్జీవన్‌రామ్ కార్మిక మంత్రిగా ఉండగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ న్యాయశాఖామంత్రిగా వుండేవారు. ఇద్దరూ ఒకరితో ఒకరు సంప్రదించుకొని కలిసి పనిచేసేవారు. రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా డా.బి.ఆర్. అంబేద్కర్ ఎంపిక కావడంలో జగ్జీవన్‌రామ్ చాలా కీలక పాత్ర వహించారు. అంటరానితనం నిర్మూలనపై రూపొందించిన అధికరణ 17ను రాజ్యాంగంలో లేకుండా చేసే ప్రయత్నాలను జగ్జీవన్‌రామ్ తీవ్రంగా అడ్డుకున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్‌లను కార్యరూపంలోకి తేవడానికి కూడా ఆయన ఎంతో కృషి చేసారు. రాజ్యాంగం పది సంవత్సరాలకే రిజర్వేషన్‌లను పరిమితం చేస్తే ఆ రిజర్వేషన్‌లు ఇప్పటి వరకు కొనసాగడానికి ముఖ్యకారకుడు జగ్జీవన్‌రామ్.
1952 ఎన్నికల తర్వాత నెహ్రూ తన మంత్రివర్గంలో జగ్జీవన్‌రామ్‌కు తంతి తపాలా శాఖను కేటాయించారు. 1956లో ఆయన రైల్వే మంత్రిగా నియమితులయ్యారు. ఆనాటి నుంచి జగ్జీవన్‌రామ్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల్లో ఒకరుగా మారారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో ఆయనకు కార్మిక, ఉపాధి శాఖలు లభించాయి. 1967లో వ్యవసాయ, ఆహార శాఖలు లభించాయి. రఫీ అహ్మద్ కిద్వాయ్ అనంతరం ఆహారశాఖను విజయవంతంగా నిర్వహించిన ఖ్యాతిని బాబూజీ గడించారు. జగ్జీవన్‌రామ్ కేంద్ర వ్యవసాయ శాఖా మాత్యులుగా వున్న కాలంలోనే భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మొదటిసారిగా స్వయం పోషకత్వాన్ని సాధించింది. బాబూ జగ్జీవన్‌రామ్ 1969లో భారత రాష్ట్రపతి కావలసింది. అయితే కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల కారణంగా ఆయనకు టిక్కెట్ లభించలేదు.
పార్టీ టిక్కెట్ లభించిన నీలం సంజీవరెడ్డి ఇందిర ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలన్న పిలుపుతో పరాజయం పాలయ్యారు. స్వతంత్రంగా పోటీచేసిన వి.వి.గిరిని రాష్ట్రపతి పదవి వరించింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చింది. ఇందిర నాయకత్వంలో అదే ఏడాది కాంగ్రెస్(ఆర్) ఏర్పడింది. దీనికి బాబూజగ్జీవన్‌రామ్ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1971లో లోక్‌సభ ఎన్నికల్లో బాబూజగ్జీవన్‌రామ్ అధ్యక్షతన గల కాంగ్రెస్ మున్నెన్నడూ సాధించనన్ని సీట్లు సాధించింది. బంగ్లాదేశ్ విమోచన సమయంలో రక్షణ మంత్రిత్వ శాఖ పగ్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. రాజభరణాల రద్దు, బ్యాంకు, భీమా వ్యాపారాల జాతీయీకరణ, భూ సంస్కరణల అమలు వంటి ప్రజాహిత కార్యక్రమాల్లో ఆయన ఇందిరాగాంధీకి అండగా నిలిచారు.
దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ప్రకటించడం, తదనంతర పరిణామాలు బాబూజగ్జీవన్‌రామ్‌కి ఎంతో ఆందోళనను కల్గించాయి. ఇందిరాగాంధీ నిరంకుశ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఆయన 1977లో మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తరువాత ప్రజాస్వామ్య కాంగ్రెస్ పేరిట ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ 1977 ఎన్నికల్లో జనతాపార్టీతో కలిసి పోటీ చేసింది. తర్వాత ఆయన మొరార్జీదేశాయ్ మంత్రి వర్గంలో తొలుత మంత్రిగా, అనంతరం ఉప ప్రధానిగా పనిచేశారు. జనతాపార్టీలో ఏర్పడిన సంక్షోభంతో మొరార్జీదేశాయ్ జనతా పార్లీమెంటరీ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేయగానే జగ్జీవన్‌రామ్ ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆ సమయంలో మొరార్జీదేశా య్ తర్వాత జగ్జీవన్‌రామ్ ప్రధాని కాగలరని ఊహించారు. అయితే దురదృష్టం మళ్ళీ వెంటాడింది. చౌదరి చరణ్‌సింగ్‌ను ప్రధానమంత్రి పదవి వరించింది. మనదేశంలో వ్యక్తుల కన్నా కులాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనడానికి ఈ పరిణామం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. దేశం గడ్డు సమస్యలు ఎదుర్కొంటున్న అనేక సందర్భాలలో జగ్జీవన్‌రామ్ పరిష్కారమార్గాలు సూచించారు. నిమ్నజాతుల వారికి, బడుగువర్గాల వారి అభ్యున్నతికి చేయూతనివ్వాలని, ఉన్నత స్థానాలలో వున్న వారికి, మేధావులకు ఆయన పిలుపునిచ్చారు.
రాజ్యాంగబద్ధంగా వారికి లభించవలసిన ప్రయోజనాలు వారికి కల్పించే దిశగా ప్రయత్నాలు సాగాలని నొక్కిచెప్పారు. 'హక్కుల కోసం భిక్షమెత్తకండి పోరాడి సాధించుకోండి' అని దళితులకు పిలుపునిచ్చారు. భారత రాజకీయ రంగంలో అర్ధశతాబ్దానికి పైగా సాటిలేని నేతగా ఒక వెలుగు వెలిగారు. బీహార్‌లోని 'ససారామ్' లోక్‌సభ నియోజకవర్గం నుంచి తను జీవించినంత కాలం ఓటమి ఎరుగక దాదాపు 9 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురై 1986 జులై 6న మరణించారు. ఆయన మరణంతో అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి ఆరిపోయింది. బాబూ జగ్జీవన్‌రాం జ్ఞాపకార్థం దేశ రాజధాని ఢిల్లీలో ఆయన సమాధిని 'సమతాస్థల్' గా నిర్మించారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆయన నిలువెత్తు చిత్రపట్టాన్ని ఆవిష్కరించారు. జగ్జీవన్‌రామ్ 40 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రి పదవులు పొంది దేశ ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా, రైల్వే, రక్షణ శాఖల మంత్రిగా ఎంతో సమర్థంగా నిర్వహించడంతో పాటు ఆయా శాఖలలో రిజర్వేషన్‌లు సక్రమంగా అమలుపరిచేలా కృషిచేశారు. ఆ కారణం చేతనే అనేక మంది దళితులు ఈనాడు ప్రభుత్వ ఉద్యోగులుగా... ఉన్నతాధికారులుగా ఉండగల్గుతున్నారన్న విషయం వాస్తవం.
దామోదరం సంజీవయ్యకు ముఖ్యమంత్రి పదవి రావడానికి, ఆల్ ఇం డియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి చేపట్టడానికి బాబూ జగ్జీవన్‌రామ్ చేసిన కృషి మరువలేనిది. జగ్జీవన్‌రామ్ ఏవో కొన్ని వర్గాల కృషి కోసమే కాకుండా యావత్ భారతీయుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. సమసమాజ స్థాపనకు జగ్జీవన్ ఆదర్శాలననుసరించడమే ఆయనకు జాతి సమర్పించే నిజమైన నివాళి. దేశ శ్రేయస్సుకు విశిష్ట సేవలందించిన బాబూ జగ్జీవన్‌రామ్‌కు భారత ప్రభుత్వం 'భారతరత్న' బిరుదును ప్రదానంచేయకపోవడం విచారకరం.
- కదిరికోట ఆదెన్న మాదిగ
డా.బాబూజగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల కన్వీనర్
(నేడు బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి)
Andhra Jyothi News Paper Dated : 5/4/2012
No comments:
Post a Comment