Monday, April 30, 2012

పెద్ద పసుపులలో మద్యంపై పోరు--- పి. వరలక్ష్మిపెద్దపసుపుల గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు నెలకు దాదాపు 15వేలు, కూలి మీదే బతికే మనిషి నెలకు ఐదారు వేలు మద్యం కోసం ఖర్చుపెడుతున్నారు. ఈ ఒక్క ఊరి నుంచే మద్యం షాపు యజమానికి నెలకు 80 లక్షల ఆదాయం వస్తుంది. ఇట్లా మా చెమట, నెత్తురు మద్యం వ్యాపారుల బొక్కసాల్లోకి పారితే, మా వాళ్ళకు మాత్రం అవయవాలు కుళ్ళి, ఆరోగ్యాలు చెడి, అప్పులు పెరిగి వినాశనం మిగులుతోందని, ఇక ప్రభుత్వమిచ్చే బియ్యం, పెన్షన్ వీటిలో ఎన్నోవంతని పెద్దపసుపుల ఆడపడుచులు అడిగారు. 

మళ్ళీ ఒకసారి 90ల నాటి సారా ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా 'మా ఊర్లో మద్యం వద్దు' అని పెద్దపసుపుల గ్రామ మహిళలంతా కొంగు నడుముకు చుట్టారు. గ్రామంలో ఎంతో మంది పురుషులూ మద్యం పోరులో భాగమయ్యారు. సంవత్సరానికి ఒక్క పైరు మాత్రమే పండించగలిగిన ఆ సగటు రాయలసీమ గ్రామంలో అప్పు రాయించుకుని మరీ తాగబోయించి ఎంతో మంది ఆస్తుల్ని, జీవితాల్ని స్వాహా చేసిన మద్యం దుకాణంపై దండెత్తారు. ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న మద్యంషాపును మూతేసి దాని ఎదుటే వారం రోజులపాటు వంటావార్పు చేసుకుంటూ, ఆటపాటలతో హోరెత్తించారు. ఊర్లో ఎవరూ మద్యం షాపుకు ఇళ్ళు అద్దెకివ్వకూడదని తీర్మానించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రజాసంఘాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యమానికి మద్దతునిచ్చాయి. అన్ని పార్టీలూ దిగివచ్చాయి. నాయకగణం ఇక తమ అనుచరులెవ్వరూ ఆ ఊరి మద్యం టెండర్లలో పాల్గొనం అని ప్రమాణాలు చేశారు. చిట్టచివరిగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి షాపు యజమానితో మాట్లాడి, అవసరమైతే నష్టాన్ని తాను భరించైనా షాపు తెరవకుండా చూసుకుంటానని హామీ ఇవ్వడంతో ఉద్యమానికి తాత్కాలికంగా విరమణ ప్రకటించారు. 

పెద్దపసుపుల గ్రామం ఫ్యాక్షన్ చరిత్రలో ఎంతో పేరున్న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోనిది. పెద్దపసుపులలో పాతతరం వాళ్ళని కదిలిస్తే ఒకప్పుడు కడప జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతాంగ పోరాటాన్ని గుర్తుచేసుకుంటారు. ఇప్పటి తరానికి కమ్యూనిస్టు ఈశ్వరరెడ్డి ఊరని పరిచయం చేస్తారు. నాలుగు సార్లు కడప ఎంపిగా గెలిచి, తన ఆస్తినే కాదు జీతం డబ్బులను, జీవితాన్ని కూడా పార్టీ కోసం, ప్రజల కోసం అర్పించిన ఆయన నిజాయితీ, నిబద్ధతల గురించి గొప్పగా చెప్తారు. ఆయన తర్వాత ఫ్యాక్షనిస్టుల పాలైందిగాని కడపజిల్లాకు గర్వించదగిన ప్రజాపోరాటాల చరిత్ర ఉందని దానికి నిదర్శనంగా ఆ ఊరి చావిడికి కొంచెం దూరంలో కా.వెంకట కొండారెడ్డి పేరుతో ఉన్న పాడుబడిన స్థూపాన్ని చూపిస్తారు. 

అటువంటి పెద్దపసుపులకు అనుకోకుండా ఒక సమస్యపై నిజనిర్ధారణ కోసం వచ్చిన ప్రజాసంఘాల బృందానికి మా ఊర్లో బ్రాందీషాపుతో చచ్చిపోతున్నాం, అది లేకుండా ఏమైనా చెయ్యగలరా అని మహిళలు మొరపెట్టుకోవడం, ఇదే ప్రధాన సమస్యగా ముందుకు రావడం కాకతాళీయంగా జరిగినా ఏళ్ల తరబడి గూడుకట్టుకున్న వేదనంతా ఉద్యమంగా పెల్లుబికింది. మొదట గ్రామాల్లో సాధారణంగా బెల్టుషాపులుంటాయి కదా అని అందరం కలిసి దాన్ని పగలగొట్టొచ్చులెమ్మని భరోసా ఇచ్చిన ప్రజాసంఘాలకు అది లైసెన్సు ఉన్న షాపని కాస్త ఆలస్యంగా తెలిసింది. తెలిశాక అది ప్రభుత్వ పాలసీకి సంబంధించిన విషయం కాబట్టి సమస్య తీవ్రతను అర్థం చేయించే ప్రయత్నం చేశాం. 

మద్యం అమ్మకాలు ప్రభుత్వానికిప్పుడు ప్రధాన ఆర్థిక వనరు అయ్యాయని, ఇది అంత తేలిగ్గా పరిష్కారమయ్యే సమస్య కాదని చెప్పాము. మా రక్తం తాగి, మా జీవితాలను నాశనం చేసి ప్రభుత్వాలు ఆదాయం సంపాదించేబదులు తలకింత పన్ను వెయ్యవచ్చు కదా అని మహిళలు ప్రశ్నించారు. మాకు రూపాయి బియ్యం ఇవ్వమని, పెన్షన్లు కావాలని మేమేం అడగలేదు. అవన్నీ ఇవ్వడానికి మద్యం అమ్మి ఆదాయం పెంచుకోవడమంత పనికిమాలిన పని ఇంకోటి ఉండదని కూడా అన్నారు. ఇవే విషయాల్ని మరుసటిరోజు జమ్మలమడుగు ఆర్డీవోకు, తర్వాత జిల్లా కలెక్టర్‌కు తెగేసి చెప్పారు. మీరు కలుగజేసుకొని మద్యం షాపును మూసేయించకపోతే గ్రామ మహిళలందరూ కలిసి అమ్మకాలను అడ్డుకుంటామని ఒక విజ్ఞాపన పత్రం రాసిచ్చి మరీ చెప్పారు. 

ప్రభుత్వ అధికారులు విస్తుపోయేలా ఒక మారుమూల పల్లె ప్రజలు ప్రభుత్వ విధానాలను ఇక్కడ ప్రశ్నించారు. వీళ్ళు ఆర్థికవేత్తలు చెప్పే చిక్కుముడుల లెక్కలకన్నా అతి సాధారణంగా తమ జీవితాల్లోనించి కూడికలను, తీసివేతలను చూపించి ప్రభుత్వ విధానాల్లోని డొల్లతనాన్ని, మోసాన్ని విప్పి చెప్పారు. పెద్దపసుపుల గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు నెలకు దాదాపు 15వేలు, కూలి మీదే బతికే మనిషి నెలకు ఐదారు వేలు మద్యం కోసం ఖర్చుపెడుతున్నారు. ఈ ఒక్క ఊరి నుంచే మద్యం షాపు యజమానికి నెలకు 80 లక్షల ఆదాయం వస్తుంది. (దీనిచుట్టూ అనధికార బెల్టుషాపులు 13 ఉన్నాయి) ఇట్లా మా చెమట, నెత్తురు మద్యం వ్యాపారుల బొక్కసాల్లోకి పారితే, మా వాళ్ళకు మాత్రం అవయవాలు కుళ్ళి, ఆరోగ్యాలు చెడి, అప్పులు పెరిగి వినాశనం మిగులుతోందని, ఇక ప్రభుత్వమిచ్చే బియ్యం, పెన్షన్ వీటిలో ఎన్నోవంతని అడిగారు. ప్రభుత్వాలు ప్రజల కోసమా, మద్యం వ్యాపారుల కోసమా అని నిలదీశారు. 

మద్యం కుంభకోణంలో పీకలదాకా కూరుకుపోయిన ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోదలచుకోలేదు. ప్రభుత్వ నిర్వహణలోకి మద్యం షాపులు తేవాలని, యం.ఆర్.పి రేట్లకే మద్యాన్ని అమ్మాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు వీటికి సమాధానాలు చెప్పాలనుకోలేదు. నిరసనగా ఏప్రిల్ 16 నుంచి మద్యం షాపు ఎదుటే వందలాది మహిళలు కూర్చొని అమ్మకాలు జరగనివ్వలేదు. వెనకవైపు నుంచి దొంగచాటుగా సీసాలు పోతున్నాయని తెలిసి ఒక్కసారిగా దాడి చేశారు. షాపు మూసేయించారు. వారం రోజులపాటు అక్కడే బైఠాయించారు. ఆరుగురు మహిళలపై పోలీసులు కేసులు పెట్టినా కూడా పట్టుదల పెరిగిందేగాని సడలలేదు. 

మరోవైపు ప్రజాపథం పేరుతో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించినా వీళ్ళవైపు చూడలేదు. దీనిపై ఆయనను కలవబోయిన ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కలెక్టర్ మాత్రం ఎక్సైజ్ అధికారుల ద్వారా ఆ షాపు నిబంధనల ప్రకారమే నడుస్తున్నదని 'తెలుసుకొని' ఇక తన పరిధిలో చేయగలిగిందేం లేదని అనిపించుకున్నాడు. జనంలో అసహనం పెరిగి ఉద్యమం రెండో దశలోకి వెళుతున్న దశలో, ఆ దుకాణం నడుస్తున్నది 'ఇందిరమ్మ' ఇంటిలో అన్న విషయం ప్రజాసంఘాల దృష్టికి వచ్చింది. తీగలాగి డొంక కదిలించబోయే తరుణంలో, పెద్దపసుపుల నిప్పురవ్వలు జిల్లాలో మరో మూడు గ్రామాల్లో అగ్గిరాజేసిన క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏప్రిల్ 22న రంగ ప్రవేశం చేశారు. రెండు నెలల్లో లైసెన్సు గడువు పూర్తవుతుంది కాబట్టి ఈ రెండు నెలలకుగాను మద్యం షాపు యజమానికి అవసరమైతే తాను నష్టపరిహారం చెల్లించైనా షాపును తెరవకుండా ఒప్పిస్తానని, ఈ ఊరి వరకు తన వర్గం వారెవరూ టెండర్లు వేయకుండా చూసుకుంటానని హామీ ఇచ్చి ఉద్యమాన్ని విరమింపజేశారు. 

'ఈ జాడ్యం విస్తరిస్తే ఎలా' అని కలెక్టర్ నిర్మొహమాటంగా ప్రజాసంఘాల ప్రతినిధులతో అనడం, ప్రజాపథం తర్వాత ఎమ్మెల్యే దిగివచ్చి అనధికారికంగా షాపును మూసేయిస్తాననడం - అన్వయించి చూస్తే సులభంగా అర్థమయ్యేవే. అసలు మద్యం షాపు ఆదినారాయణ రెడ్డి బినామీకి బినామీదని, కాబట్టే ఆయన అనుకుంటే దాన్ని కొంతకాలం మూసేసి, ప్రత్యామ్నాయంగా సరుకును ఇంకెక్కడైనా అమ్ముకోగలడని గ్రామస్థులు అర్థం చేసుకున్నా 'మా ఊరి నుంచి మహమ్మారిని తరిమేశాం, వేరే ఊర్లలో సంగతి వాళ్ళు చూసుకోవాల'ని మాతో చెప్పి ప్రస్తుతానికి సంబరాల్లో మునిగిపోయారు. 

సాధించింది కొంతేనని, తమ ఊర్లో మాత్రమే మద్యం షాపు పోయినంత మాత్రాన సమస్య పూర్తిగా తొలగిపోదని వాళ్ళకు తెలుసు. ఇక్కడి నుంచి అంచెలంచెలుగా చేయవలసిన పోరాటానికీ వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ఆ ప్రణాళికా వాళ్ళ వద్ద ఉంది. అందులో వాళ్ళ స్ఫూర్తిని సమున్నతంగా నిలబెట్టే ఒక్క అంశం ఎన్నికల సమయంలో మద్యం ఏరును పారించాలని చూస్తే ఏ రాజకీయ పార్టీనైనా మా ఊర్లోకి రాకుండా అడ్డుకుంటాం. ఈ 'జాడ్యం' విస్తరించాల్సిన, విస్తరింపజెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పి. వరలక్ష్మి
విరసం కార్యదర్శి
Namasete Telangana News Paper Dated : 1/05/2012 

No comments:

Post a Comment