Tuesday, April 17, 2012

అడవి నుండి వాడవరకు నల్ల సూరీడు--Kathi PadmaRao



satyamurthy
ఆంధ్రదేశాన్ని ఈ అర్ధశతాబ్దిలో మలుపు తిప్పిన కవుల్లో, ఉద్యమ కారుల్లో, పోరాటవీరుల్లో అగ్రగామిగా నిలబడినవారు కె.జి. సత్యమూర్తి. ఆయన కవిగా శివసాగరుడు. సత్యమూర్తి పోరాటయోధుడు, శివ సాగర్‌ కవి. ఆకాశాన్ని భూమికి దించగలిగిన కవి. పదాల్ని ఈటెలుగా మార్చ గలిగిన కవి. సూర్యుణ్ని రాత్రులు ఉదయింప చేయగలిగిన కవి. విప్లవ కవిత్వం అంటే ఏమిటో తెలుగు ప్రజలకు చెప్పిన కవి. సత్యమూర్తి సమాజపు అట్టడుగు లోయల్లో జన్మించారు. సమాజాన్ని తాత్త్వికంగా అర్థం చేసుకున్నారు. ఆయనది నిశితమైన దృష్టి. తీక్షణమైన అధ్యయనం. ఆయనది యుద్ధ ప్రయాణం. ఆయన గీతం సమరగీతం. ఆయన శత్రువుని గుర్తించిన యోధుడు. 

ఏ సందర్భంలో శత్రువుతో రాజీపడని నాయకుడు. అంతర్గత శత్రువుని కూడా గుర్తించిన మేథావి. ఆయన యుద్ధం సామ్రాజ్యవాదం పైన, పెట్టుబడిదారీ వ్యవస్థపైన, బ్రాహ్మణవాదం పైన, నిరంకుశ పాలనపైన. ఆయుధాన్ని, కలాన్ని అంత పదునుగా వాడినవారు తెలుగు నేలపైన మరొకరు లేరు. ఆయన ప్రభావం నుండి తప్పుకోవడం తెలుగు నేలలో ఏ విప్లవ రచయితకు సాధ్యం కాలేదు. ఆయన ముద్ర బలమైంది. ఆయన ప్రేమికుడు. విశ్వప్రేమికుడు. ఆయన విప్లవ సాహిత్యాన్ని ‘నరుడో భాస్కరుడో’ కవితతో జానపద బాణీలోకి ఇమిడ్చాడు. జానపద సంస్కృతిలో ఉన్న కాల్పనిక భావాన్ని విప్లవ వెలుగుల్లో తీర్చి దిద్దాడు. ఆయన శ్రీశ్రీ కవిత్వానికి స్ఫూర్తి పొంది, హో-చ్‌-మెన్‌ కవిత్వంతో మమేకమైయ్యాడు. అప్పటి వరకు విప్లవ కవిత్వంలో వస్తున్న ఆవేశానికి ప్రకృతిని, పలుకుబడిని, కాల్పనికతని, సౌందర్యాన్ని, సమన్వయించిన మహాకవి.

చెల్లీ చెంద్రమ్మ పాట తెలుగు వారి మహాకావ్యం. గురజాడ అప్పారావు పూర్ణమ్మ కథతో స్ఫూర్తి పొందిన చెల్లీ చెంద్రమ్మని ఒక పోరాట యోధురాలుగా తీర్చి దిద్ది చెరిగిపోని చిత్రాన్ని గీసిన మహాశిల్పి. నిజానికి చెల్లీ చెంద్రమ్మా అనే పాట తెలుగు సాహిత్యానికి మకుటగీతం. ‘చెల్లేలా! చెల్లేలా! ఆహా! చెల్లేలా!/ ఓహో! చెల్లేలా! ఓహోహో! చెల్లేలా!/ నా చెల్లే చెంద్రమ్మా! ఓ! పల్లే చెంద్రమ్మా!/ రేపల్లే చెంద్రమ్మా!/ కొండకు ఆవల కారడవి ఉన్నాది/ కొండకు ఈవల ఏరొకటి ఉన్నాది/ ఏరుకు పక్కాన పల్లొకటి ఉన్నాది/ ఆ పల్లెలో ఉన్నాది చెల్లీ చెంద్రమ్మా!/ మల్లీపువ్వు వంటి చెల్లీ నా చెంద్రమ్మా!/ మొగిలిపువ్వువంటి మరిదీరా మొగిలన్న/ చూడ చక్కనిజోడు! బెమ్మా దేవుని తోడు!/ మంచి గోరింతాకు! చిగురు చింతాకు!’
గురజాడ అప్పారావు పూర్ణమ్మ కథ ఆత్మహత్యతో ముగిస్తే చెల్లీ చెంద్రమ్మ కథ విప్లవ విజయంతో ముగుస్తుంది. 

అయితే గురజాడ అప్పారావు పాటకు వచ్చినంత ప్రచారం దీనికి రాలేదు. గిరిజన సమూహాలు నివసించే కొండలు, ఏరులు, వెన్నెల, చీకటి, దుబ్బుగడ్డి, జొన్న కంకులు, చిలుకలు- పదజాలంతో పాటు అక్కడ మొత్తం వాతావరణాన్ని కవి కళ్ళకు కట్టాడు. దానితో పాటు మల్లెపువ్వు వంటి నా చెల్లీ చెంద్రమ్మా అనే ప్రయోగంతో తెలుగు సాహిత్యంలోనే అలంకార శాస్త్రాన్ని తిప్పి రాశాడు. పాత్ర చిత్రణ ఒక్క పది పదాలతోనే మనకు బొమ్మ కట్టించాడు. ఒక కావ్యానికి ఉన్న లక్షణాలన్ని ఒక్క పాటలోనే తీసుకొచ్చాడు.ఇక్కడ ప్రతినాయకుడిని వర్ణిస్తూ ‘ఆ పల్లెలో వెలిశాడు వింత కాసిరెడ్డి/ కాసిరెడ్డికి కలవు నూర్ల ఎకరాలు/ కాసిరెడ్డికి కలవు బార్ల మేడల్లు/ కాసిరెడ్డికి కలవు వేనూర్ల గోవుల్లు/ కోరమీసము వాడు! కోడెనాగు వాడు!/ రాగిమీసము వాడు! రాకాసి వాడు!/ బట్టేబాజి వాడు! బట్టతల వాడు!/ గొగ్గి పళ్ళవాడు! గుడ్డెలుగూ వాడు’! ప్రతి నాయకుడిని మనం ఇప్పుడు సినిమాల్లో విలన్‌ అంటున్నాం. 

ఆ విలన్‌ను ఎనిమిది లైన్లలో చిత్రలేఖనం చేసి చూపించాడు కవి. ఇంతబలమైన చిత్రం తక్కువ రంగుతో గీసినవారు మన తెలుగు సాహిత్యంలో అరుదు. ఇక్కడ స్వభావాన్ని, ఆకృతిని నేపథ్యాన్ని తెలుగు పదజాలంతో బొమ్మ కట్టించాడు. ఒక పాటని ఒక కావ్యంగా తీర్చిదిద్దిన మహాకవి శివసాగర్‌. వాడి దినకృత్యం దోపిడీ. కాసిరెడ్డిని ఉసిరిగ నీడల్లో పసిరిగ పాముతో పోల్చి కవి తన సామర్థ్యాన్ని ఇలా చాటుకున్నాడు ‘వాడు ఉసిరిగ నీడల్లో పసిరిగ పామై/ చెంద్రీ మొగిలిల బతుకు పాడు చేశాడ!/ వాడు అంకారి బింకారి ఇంకారి తేలై/ పల్లె పల్లెనంతా పోట్లుపొడిచాడ!/ ఏమి చెప్పుదు గోడు! ఏమి చెప్పుదు కీడు!/ ఆలమందలు గాయ ఆవగింజ ఇచ్చు/ నూతుల్లు తవ్వంగ నువ్వుగింజ ఇచ్చు/ కాల్వలు తవ్వంగ కాసెగడ్డి ఇచ్చు/ దుక్కుల్లు దున్నంగ దుబ్బుగడ్డి ఇచ్చు/ పంట పండించంగ పరిగె పంచిఇచ్చు/ పెట్టు పోతలు లేవు! కత్తి కోతలు వేలు!/ వెట్టి చాకిరి కీడు! మట్టి కలిపిన కూడు’! కవి సామర్థ్యం ఇక్కడే ఉంది. పదాలు చిన్నవి దృశ్యం పెద్దది. 

దృశ్యంలో మళ్ళా నాటకీయత! అందుకే శివసాగర్‌ యుగకవి అయ్యాడు.శివసాగర్‌కు ముందు శ్రీశ్రీని మహాకవి అని పిలిచారు.ఆయన కవిత్వానికి తెచ్చిన ఒడుపును బట్టి ఆ పేరు వచ్చింది. శ్రీశ్రీలో ఇంత దృశ్య చిత్రణ లేదు. శ్రీశ్రీ అంటే శివసాగర్‌కు ఇష్టమే. శ్రీశ్రీ ఎక్కువ సంస్కృత పదజాలాన్ని కవిత్వంలో వాడాడు. కానీ శివసాగర్‌ తెలుగు పదాలకి పతాకాలు ఎత్తాడు. పదాలను అలవోకగా వాడడం గాక పదచిత్రాలుగా, లయబద్ధంగా, కాల్పనికంగా వాడాడు. డప్పుకీ డోలక్కుకీ గజ్జెలకీ ఏ శృతికైనా పలికేటట్లు వాడాడు. జానపద సాహితీ బాణీని పొదిగాడు.

కాసి రెడ్డి దుశ్చర్యల్ని వర్ణిస్తూ శివసాగర్‌ ‘ఏకాదశీనాడు రాకాసివాడు/ పిల్లగాలి మీద పిలికి కూసిందని!/ జొన్కకంకి మీద చిలుక వాలిందని/ మక్క పెరడులోన కుక్క మొరిగిందని/ వంక వంకలు పెట్టి, ముప్పు తిప్పలు పెట్టి/ మొగిలిని గుంజకు కట్టి కొరడా చేతబట్టి/ దెబ్బ మీద దెబ్బ దెబ్బ విసిరాడు/ వాడు కాసిరెడ్డి కాదు రాకాసిరెడ్డి/ దెబ్బ దెబ్బకు మొగిలి బొబ్బరించాడు/ మెగిలి మేనంత నెత్తుర్లు కాల్వ కట్టిందా!/ దెబ్బ దెబ్బకు మొగిలి బొబ్బరించాడు/ పల్లె పల్లెంత ఆ పొద్దు తల్లడిల్లిందా!/ అడుగులూ తడబడుతు గూడు చేరె మొగిలి/ నెత్తుర్లూ కారంగ గూడుచేరె మొగిలి/ నెత్తుర్లూ కక్కుతూ గూడు చేరె మొగిలి/ చావు వెంటరాగ గూడు చేరె మొగిలి/ చెంద్రీ చెయిలోన చెయివేసి శెలవు అన్నాడు/ చెంద్రీ వొడిలోన తలవుంచి తనువు చాలించాడు/ చెంద్రీ కన్నుల్లో కనులుంచి కన్ను ముశాడు/ చుక్క పొద్దువేళ చుక్కల్లో గలిశాడు’. 

కాశిరెడ్డి మొగిలిని గుంజకు కట్టి కొరడా చేతపట్టి తన చేలో పిల్లగాలిమీద పికిలివాలిందని వంకపెట్టి జొన్నకంక్కిమీద చిలుకవాలిందని వంకపెట్టి నెత్తుర్లు కారేటట్టు కొట్టి చంపాడు. ఈ సందర్భంలో కవి చుక్కపొద్దు వేళ చుక్కల్లో కలిశా డు అని ప్రయోగం చేశాడు. శ్రామికుల్ని చుక్కలుగా పోల్చడంలో కవి మహోన్నత వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. ఇటువంటి దృశ్యాన్ని భారతం మొత్తంలో ఏ యుద్ధకాండలో ఎవరిని చంపిన సందర్భంలో కూడా చూపించలేక పోయారు. చివరకు కర్ణపర్వం కూడా పేలవంగానే నడిచింది. శ్రీనాథుడి పల్నాటి చరిత్రలో కొన్ని వర్ణనలు ఉన్నా ఇంత రసోద్ధతితో ఆ వర్ణనలు కనిపించవు. ఒక యుగ కవి త్వానికి నాయకత్వం వహించగల శక్తి శివసాగర్‌కు ఇక్కడే వచ్చింది. నాజర్‌ బుర్ర కథలోని బీభత్సరస సంఘటనలు ఇక్కడ మనకు కళ్ళకట్టినట్టు కనిపిస్తాయి. 

‘చెంద్రీ చెయిలోనచెయివేసి శెలవు అన్నాడు’ నాలుగు మాటల్లో ఊపిరి పోవడాన్ని చూపించాడు. ఆ తరువాత చెల్లీ చెంద్రమ్మా శోకించిన విధానాన్ని కరుణ రసార్థం గా శిల్పించాడు. ‘నా చెల్లీ శోకమ్ము ఏరులై పారిందా!/ నా చెల్లీ శోకమ్ము వరదలై పొందిందా!/ నా చెల్లీ శోకమ్ము సంద్రమై లేచిందా!/ నా చెల్లీ శోకమ్ము ఆకసము తాకిందా!/ వగచి వగచి వగచి వొరిగిపోయింది/ కనలి కనలి కనలి కుమిలిపోయింది/ మెల్లె జిల్లేడా! తల్లడిల్లిన బతుకు!/ వల్లకాడు మనసు! వల్ల మాలిన దినుసు!’ ఇక్కడ కవికి చెల్లెలు చెంద్రమ్మా మొయిలికి భార్య. ఇక్కడే కవి ఆకాశమంత ఎత్తుఎదిగాడు. కవి థర్డ్‌ పర్సన్‌గా కాకుండా బాధితురాలిని తన చెల్లిగా సంబోధించాడు. అందుకనే విప్లవ ఉద్యమానికి, విప్లవ సాహిత్యోద్యమా నికి నాయకుడు కాగలిగాడు. చెంద్రమ్మకి వీర రసావిష్కరణ చేశాడు. చెంద్రీ గుండె భుగ భుగలాడ బాసచేసింది. 

katipadmar
‘ఓరీ! కాసిరెడ్డీ! ఇలలో బత్తెము తీరె!/ ఓరీ! కాసిరెడ్డీ! నీకు భువిలో నూకలు చెల్లె!/ ఓరీ! కాసిరెడ్డీ! నీ బిడ్డలకు నువులేవు!/ ఓరీ! కాసిరెడ్డీ ! నా ఉసురు నీ ఉరితాడు!’ నీకు భువిలో నూకలు లేవని ఒక్కపదంతో ఆమె శబ్దాన్ని సుస్థిరం చేసి ‘ఓరీ దొరా ఒగలమారి దొరా’ అంటూ ఎత్తిన కత్తి కుత్తుకలో దిగగుచ్చె అనడంతో కవి చెంద్రమ్మ యుద్ధా న్ని ఆమెలోని ఆవేశాన్ని శ్రోతలోకి ప్రవేశింప చేస్తాడు. చెంద్రమ్మ పాట పాడు కొని చెంద్రమ్మలైన వాళ్ళు ఎందరో. కవి ఒక తత్త్వవేత్తలా తన పాటతో సమాజాన్ని మార్చగలిగాడు. పాట రసానుభూతిగాక మరో పాత్ర నుండి పాత్ర సృష్టించగలగడాన్ని గమనించగలి గినటై్లతే ఒక ఉద్యమ నాయకుడు పాట ఎందుకు రాస్తాడో అర్థమౌతుంది. 


17వ తేదీ మంగళవారం కె.జి. సత్యమూర్తి కన్ను మూశా

Surya News Paper Dated: 18/04/2012 

No comments:

Post a Comment