నలభై ఏళ్ల తర్వాత జార్జిడ్డి జ్ఞాపకాలు ఇంత సజీవంగా ఉండడమంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల, తెలంగాణ ఉద్యమ చైతన్యానికి జోహార్లు చెప్పవలసిందే. నేను ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు జార్జిడ్డి విద్యార్థిగా ఉండే కాలంలోనే ఉన్నాను. కానీ ఆయనను కలుసుకోలేదు. హైదరాబాద్ నుంచి నేను వరంగల్ పీజీ సెంటర్‌కు 1970లోనే వెళ్లడం వల్ల, జార్జిడ్డి పాత్రను వినడమే తప్ప చూడలేదు. జార్జిడ్డి హత్య తర్వాత హన్మకొండలో సంస్మరణ సభకు మనోహర్ (ఇప్పుడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్) నన్ను తీసుకెళ్లాడు. అదే నేను మొట్టమొదట మాట్లాడిన పబ్లిక్ మీటింగ్. అలా ప్రారంభమైన నా ‘ప్రజా ప్రసంగానికి’ కూడా నలభై ఏళ్లు. నేను మాట్లాడిన ఈ సభ రాజకీయమైనది. అది ఒక త్యాగాన్ని గురించి మాట్లాడడం. నాకు అప్పుడు రాజకీయ చైతన్యం కూడా చాలా తక్కువే. ఆ ప్రసంగంలో ప్రధానంగా నేను ప్రస్తావించినది రెండు అంశాలు. ఒక టి- జార్జిడ్డి ప్రతిభ, విజ్ఞానార్జన, గంటల తరబడి లైబ్రరీలో గడపడం. తాను పరిశోధన చేస్తున్న న్యూక్లియర్ ఫిజిక్స్‌తో పాటు, చరిత్ర, సాహిత్యం, ఫిలాసఫి, ప్రపంచ రాజకీయాల ఉద్యమాల గురించి అధ్యయనం.
అవేకాక ఆయన ప్రతి దశలో గోల్డు మెడళ్లు సాధించినవాడే. ఇది దాదాపు బాలగోపాల్‌తో పోల్చదగిన ప్రతిభే. ఈ ప్రతిభతో పాటు రెండవది తన రాజకీయ విశ్వాసాల కోసం, సామాజిక మార్పు కోసం అంతే పట్టుదల తో సాహసంగా నిలబడ్డ వాడు. అలాంటి వ్యక్తే తన చుట్టూ మనుషులను, పరిస్థితులను ప్రభావితం చేయగలడు. విశ్వవిద్యాలయాల వాతావరణాన్ని మార్చడానికి రెండూ అవసరమే.
ఏప్రిల్ 14న పీడీఎస్‌యూ జార్జిడ్డి జ్ఞాపక సదస్సుకు పెద్దసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం సభ చాలా స్ఫూర్తిదాయకంగా జరిగింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత నాలుగైదేళ్లుగా రాష్ట్ర సాధన కోసం పెద్ద ఎత్తున సదస్సులు జరిగాయి. స్ఫూర్తిదాయకమైన సదస్సులు కూడా జరిగాయి. కానీ ఆ సదస్సులు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా జరిగాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఒక రాజకీయ సదస్సు. సామాజిక మార్పు, ప్రత్యామ్నాయ రాజకీయాలు, త్యాగ చరిత్ర, అమరవీరుల పాటలతో భిన్నంగా జరిగింది. ఈ సదస్సు చూస్తే తెలంగాణ ఉద్యమం ఒక కీలక దశకు వచ్చిందా, ఈ ఉద్య మం ఒక రాజకీయ మలుపు తిరుగుతుందా అని అనిపించింది. 1969 తెలంగాణ ఉద్యమంలో మోసపోయిన యువత భౌగోళిక తెలంగాణ రాజకీయాలు దాటి రాడికల్ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. ఆ క్రమంలోనే జార్జిడ్డి చైతన్య పరిణామ క్రమం కూడా జరిగింది. అది ఆయన ప్రాణత్యాగం దాకా చేరుకుంది. ఆయనను చంపింది మతతత్వవాదులు అని అందరికి తెలుసు. మళ్లీ అలాంటి సందర్భమే తెలంగాణలో ఏర్పడింది. చరిత్ర పునరావృతమవుతున్నట్టు అనిపిస్తున్నది.
మహబూబ్‌నగర్ ఎన్నికల తర్వాత సంగాడ్డిలో మతద్వేషాలు, పాతబస్తీలో మత ఘర్షణలు, బీఫ్ ఫెస్టివల్ మీద దాడి వంటివి తెలంగాణ రాజకీయ పరిణతికి స్పీడ్ బ్రేకర్స్‌లా పనిచేస్తాయి. తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని తట్టుకోవడానికి పాలకులకు మతతత్వ రాజకీయాలు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. సామాజికంగా బలమైన కులాల నాయకులు వేగంగా కాషాయ జెండా కిందికి చేరుకుంటున్నారు. ఇది తెలంగాణకు కొత్త అనుభవమేమీ కాదు. రాడికల్ రాజకీయాలు తీవ్ర దశలో ఉన్నప్పుడు వరంగల్, కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థులు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. యువత చైతన్యం పెరిగితే ప్రత్యామ్నాయ రాజకీయాలు పుంజుకున్నప్పుడల్లా మన దేశంలో మతతత్వమే పాలకుల జవాబుగా ముందుకు వస్తున్నది.
ఈసారి తెలంగాణ ఉద్యమంలో 1969లో లేని కొన్ని విపరీత ధోరణులను చూస్తు న్నాం. 1969 ఉద్యమం తీవ్రంగా జరిగింది. రాజ్య అణచివేతను, రాజ్యపు క్రూర స్వభావాన్ని 360 మంది మరణాల్లో చూడవచ్చు.
ఈసారి ఉద్యమంలో పరిణతి ఉంది. ఉద్య మం గ్రామీణ స్థాయిదాకా వెళ్లింది. తెలంగాణ వస్తుందన్న విశ్వాసం ఏర్పడింది. రాదే మో అనిపించినప్పుడల్లా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలో అంతు పట్టడం లేదు. వాటికి ఎలా స్పందించాలో అన్నది కూడా సమస్యే. జార్జిడ్డి మరణానికి ఎలా స్పందించాలో మనకు తెలుసు. అది రాజకీయ విశ్వాసాల కోసం త్యాగం. ఆత్మహత్య త్యాగమేనా? త్యాగమని అంటే మరికొందరు ఆ బాటనే పడ్తారేమో అన్న భయం. 1969 ఉద్యమం పోరాట స్ఫూర్తి కలిగిఉంటే ఈసారి ఉద్యమం ఉద్యమస్ఫూర్తి కలిగి ఉంది. ఈసారి ప్రజాసమీకరణ అప్పటి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నది. సకల జనుల సమ్మెకు అనూహ్యమైన మద్దతు వచ్చింది. ఉద్యమం చాలా కాలం నిలిచింది. కాని గమ్యం కనిపించడం లేదు.
1967తో పోలిస్తే పార్లమెంటరీ రాజకీయాలు చాలా దిగజారిపోయాయి. అబద్ధాలు చెప్పడం, డబ్బులు చేసుకోవడం, రోజుకో మాట మాట్లాడడం, సిగ్గువదిలిపెట్టడం, ప్రజాదరణ లేకున్నా ఖాతరు చేయకపోవడం. ఇది చాలా విపరీత ధోరణి. ఉద్యమమేమో ప్రజాస్వామ్యంగానే జరుగుతున్నది. శాంతియుతంగా సమీకరణ జరుగుతున్నది. కానీ రాజకీయ నాయకులకు ఈ పద్ధతుల పట్ల గౌరవం లేదు. వాళ్ల ప్రయోజనాలు తప్ప మరే ప్రయోజనం లేదు. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతులకు, రాజకీయ ద్రోహానికి మధ్య అంతరమే ఆత్మహత్యలకు కారణం కావచ్చు.
ఈసారి ఉద్యమంలో డబ్బుల ప్రభావాన్ని ఇంతకు ముందు రాసిన వ్యాసంలో పేర్కొన్నాను. 1969లో నాకు తెలిసినంత వరకు డబ్బుల ప్రభావం ఇంతగా ఉండేది కాదు. యువతలో నిజాయితీ కూడా చాలా ఎక్కువే. ఈసారి దిగజారిన సంస్కృతి కొత్త విశ్వాసాన్ని కలిగించలేకపోవడం వల్ల కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయేమో. నిజాయితీ కొత్త ఉత్సాహాన్ని, ఆశయాలను, ఆదర్శాలను పెంచుతుంది. అక్రమ డబ్బు మనిషి చైతన్యంమీద చాలా బరువు మోపుతుంది. ఇదేకాక ఎందుకో ఈసారి ఉద్యమం చాలామంది కళాకారులను, కవులను, గాయకులను, సాహిత్యకారులను సృష్టించగలిగింది. కానీ ప్రత్యామ్నాయ రాజకీయ నాయకులను సృష్టించలేకపోయింది. పాత రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ ఒక్క కొత్త యువనాయకుడిని కూడా ఎదగనివ్వడం లేదు. విద్యార్థులు చైతన్యంతో ఎదుగుతుంటే విద్యార్థి సంఘాలను, వాళ్ల సమష్టి తత్వాన్ని ముక్కలుగా చేయగలిగారు. ఈ నలభైఏళ్లలో మార్పులు తెలంగాణ ఉద్యమాన్ని, గమ్యా న్ని, గమనాన్ని చాలా ప్రభావితం చేశాయి.
జార్జిడ్డి వర్ధంతి సభ ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయం, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం ఒక కొత్త స్ఫూర్తిని కలిగించాయి. ఈ స్ఫూర్తి వెలుగులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న యువత మరింత నిజాయితీగా, నిబద్ధతతో పాల్గొనడానికి తోడ్పడాలి. నలభై ఏళ్ల తర్వాత ఒక విద్యార్థి నాయకుడిని ఇంత పెద్ద ఎత్తున జ్ఞాపకం పెట్టుకున్న సమాజాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. నిజానికి ఇది తెలంగాణ తత్వంలోనే ఇమిడి ఉన్నది. ఒకవైపు అవకాశవాద రాజకీయాలు, ఇంకోవైపు మతతత్వ రాజకీయాలు, మరోవైపు జార్జిడ్డి జ్ఞాపకం, ఆయన పోరాట వారసత్వంపై గౌరవం. జార్జిడ్డి స్ఫూర్తి ఆత్మహత్యలను ఆపగలిగితే, తెలంగాణ ఉద్య మం వక్రీకరణలను అడ్డుకోగలిగితే, అలాంటి త్యాగాలు చేసిన వేలాదిమంది అమరవీరులకు అదే నిజమైన నివాళి. ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్న వారికి ఈ సంద ర్భం ఒక కొత్త స్ఫూర్తి కావాలి. అంత త్యాగం చేయాలనుకుంటే జార్జిడ్డిలా పోరాడండి. భవిష్యత్ తరాలు మిమ్మ ల్ని గుర్తుంచుకుంటాయి. ఈ సమాజాన్ని మార్చడానికి భిన్నరకాల పోరాటాలు చేయవచ్చు. ఆత్మహత్య పోరాట రూపం కాదు. అది గుర్తించండి.
ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బీఫ్ ఫెస్టివల్ మీద దాడి జరిగింది. దీనికి కూడా తెలంగాణ ఉద్యమ నేప థ్యం ఉన్నది. బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న విద్యార్థులు, జార్జిడ్డి వర్ధంతి సభకు హాజరైన విద్యార్థులు, తెలంగాణ ఉద్యమంలో నిరంతరంగా పాల్గొంటున్న విద్యార్థులు అంతా ఒక్కటే. బీఫ్ తినాలా వద్దా అనేది సమస్య కాదు. మన సమాజంలో డాక్టర్ అంబేద్కర్ అన్నట్టు శ్రమను విభజించే బదులు శ్రామికులను విభజించారు. ఈ విభజన ఎన్ని పద్ధతుల్లో సాధ్యమైతే అన్ని పద్ధతుల్లో చేశారు. ఇది బట్టలు, బొట్టు, తిండి, ఇల్లు, దేవతలు, పూజా విధానాలు, పుట్టుకలు, చావులు, ఒక్కటి కాదు ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా మనుషులను విభజించారు. అందుకే ఒక రకమైన ఆహారం గొప్పదని, మరొక ఆహారం నీచమైని, ఆహారాన్ని విభజించారు. ఏది గొప్పది, ఏది తక్కువ అని ఎవరు నిర్ణయిస్తారు? శ్రామికవర్గాల తిండిని బలవంతులు నిర్ధారించడం ప్రజాస్వామ్యమేనా? అందుకే బీఫ్ ఫెస్టివల్ అస్తిత్వ ఉద్యమంలో, ఆత్మగౌరవ ఉద్యమంలో భాగం అయింది. కారణం ఏదైనా వామపక్ష సంఘాలు, దళిత, కుల సంఘాలు, తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్య వాదులు ఈ ఉద్యమంలో భాగమయ్యా రు. ఉద్యమాలు మనల్ని ఏకం చేయలేకపోయినా బీఫ్ ఒక్కతాటిమీదికి అందరినీ తీసుకొచ్చింది. ఈ ‘ఐక్యత’ ప్రజాస్వామ్య సంస్కృతికి, తెలంగాణ ఉద్యమ గమనానికి తోడ్పడితే ఇటు తెలంగాణ ఉద్యమం, అటు జార్జిడ్డి స్ఫూర్తి సమ్మిళితమై ఒక కొత్త బాటకు దారి తీసినట్టే.
ప్రొఫెసర్ హరగోపా
Namasete Telangana News Paper Dated : 20/04/2012
No comments:
Post a Comment