ప్రజాజీవితం అంటే ఒక వ్యాపారంగా, రాజకీయం అంటే త్యాగం సాహసం మచ్చుకైనా కనిపించని స్వార్థపురొచ్చుగా మారిన కాలంలో కంభం జ్ఞాన సత్యమూర్తి ఒక అనామకుడే కావచ్చు. కృష్ణాజిల్లాలో ఒక మారుమూల గ్రామంలో దళితవాడలో ఆరిపోయిన గుడ్డిదీపమే కావచ్చు. కానీ, రాజకీయాలంటే స్వార్థం శిరస్సును గండ్రగొడ్డలితో నరకడమూ ప్రజల గుండెల కొండల్లో మాటుకాసి ట్రిగ్గర్ నొక్కగలగడమూ అని గ్రహింపు కలిగినవారికి కె.జి. సత్యమూర్తి ఒక హీరో. ఒక ద్రష్ట. భారతీయ సమాజానికి సమూలచికిత్స చేయ తలపెట్టిన యోధుడు. ఏటికి ఎదురీది అయినా చందమామ లాంటి అందమైన దీవికి చేరుకోవాలని తపనపడిన స్వాప్నికుడు. ప్రజలను సాయుధం చేసిన రివల్యూషనరీ కవి. గుండెలోన మాసియాంగునూ అంబేద్కర్‌నూ, చేతిలోన ఎర్రటి నీలిజెండానూ నిలుపుకుని నడిచిన ఘనచరిత్ర.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలం నుంచి కొండపల్లి సీతారామయ్య సహచరుడిగా విప్లవాచరణ ప్రారంభించిన సత్యమూర్తి, సిఓసి స్థాపనలోనూ పీపుల్స్‌వార్ అవతరణలోనూ సహభాగస్వామ్యం వహించారు. సత్యమూర్తిగా అజ్ఞాతవాసం చేస్తూ, శివసాగర్‌గా విప్లవ కవిత్వోద్యమానికి నేతృత్వం వహించారు. సుబ్బారావు పాణిగ్రాహి మార్గంలో నిబద్ధతకూ నిమగ్నతకూ అభేదం పాటించారు. విప్లవ కాల్పనికుడిగా, భావుకుడిగా అద్భుతమైన వచనకవిత్వం రాస్తూనే, పాటమార్గంలోకి మళ్లారు. జాతిజనులు పాడుకునే మంత్రకవిత్వాన్ని రాస్తానని సంకల్పం చెప్పుకున్న శ్రీశ్రీ సైతం, 1970లలో శివసాగర్ 'నరుడో భాస్కరుడా'ను ఆలపిస్తూ ఊరూరా తిరిగారు.
1980లలో సీతారామయ్య నిర్బంధంలో ఉన్న కాలంలో పీపుల్స్‌వార్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తరువాత కాలంలో పార్టీలో విభేదాల కారణంగా బయటకు వచ్చారు. 1990లో జరిగిన విప్లవ రచయితల సంఘం ద్విదశాబ్ది సభల్లో, సత్యమూర్తి అజ్ఞాతం నుంచి బహిరంగం కావడం పెద్ద సంచలనం. ఆ తరువాత నుంచి ఆయన ఆచరణ వేరే దారిలో సాగింది. దళిత, బహుజన రాజకీయాలలో ముఖ్యపాత్ర వహించడం ప్రారంభించారు. పత్రికలు నిర్వహించారు. చుండూరు మారణకాండ తరువాత ఉద్యమంలోను, చలపతిరావు, విజయవర్ధనరావు ఉరిశిక్ష రద్దు ఉద్యమంలోను ప్రధానపాత్ర వహించారు. పదేళ్ల కిందట తిరిగి మరోసారి విప్లవ రాజకీయాల్లోకి వెళ్లి కొంతకాలం అజ్ఞాతవాసం చేశారు. కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.
విప్లవపార్టీల ఆచరణపై, కులసమస్యపై వారి అవగాహనపై సత్యమూర్తి చేసిన విమర్శలు రెండుదశాబ్దాల కిందట వివాదాస్పదమయ్యాయి. అప్పుడప్పుడే బలం పుంజుకుంటున్న దళితోద్యమానికి సత్యమూర్తి గొప్ప చేర్పు అయ్యారు. అయితే, సుదీర్ఘకాలం తాను విశ్వసిస్తూ వచ్చిన మార్క్సిజాన్ని వదులుకోవడానికి సత్యమూర్తి సిద్ధపడలేదు. విప్లవపార్టీల నాయకత్వాన్ని విమర్శిస్తూనే, ఆ పార్టీ కార్యకర్తల త్యాగాన్ని, సాహసాన్ని కీర్తించారు. మార్క్సిజాన్ని, అంబేద్కర్‌వాదాన్ని మేళవించడానికి, భారతీయ సమాజాన్ని కులవర్గ సమాజంగా పరిగణించడానికి ఆయన మొగ్గు చూపారు. భారతదేశంలో సరి అయిన విప్లవకార్యాచరణకు అవసరమైన మౌలిక సైద్ధాంతిక కృషి చేయాలన్నది ఆయన ప్రయత్నంగా ఉంటూ వచ్చింది.
సాధారణ దళిత కుటుంబంలో జన్మించి, ఒక కమ్యూనిస్టు పార్టీ అధినేతగా ఎదిగిన సత్యమూర్తి సాహిత్య, సైద్ధాంతిక అధ్యయనాల్లో అసమానమైన మేధావి. కవిగా ఆయనది నిరుపమానమైన స్థానం. 1970ల తరువాత రెండు దశాబ్దాల పాటు, ఆయన పేరే సాహిత్యలోకంలో ఉద్వేగభరితంగా ధ్వనించేది. చెల్లీచెంద్రమ్మ, వివాలా శాంటియాగో, తోటారాముడు, ఏటికి ఎదురీదువాళ్లమురా, మాతృఘోష, అమ్మా నన్ను కన్నందుకు- ఆయన కవిత్వానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కఠినమైన విప్లవజీవితం, మృదువైన వ్యక్తీకరణ- ఆయనలో ఆశ్చర్యం కలిగించే ద్వంద్వం. అయితే, ఆయన దృష్టిలో అది వైరుధ్యం కాదు.
కాల్పనికుడు కానివాడు విప్లవకారుడు కాలేరనేవారు. భావుకతకు, వాస్తవికతకు పోటీలేదనేవారు. 'దరిద్రంలో సచేల స్నానం చేసి చరిత్ర చెక్కిలి ముద్దాడిన'వాడు శివసాగర్. విప్లవాన్ని ప్రేమించే సాహిత్యం ఆయన దృష్టిలో చిరుగాలి సితారా సంగీతం. వయసు మీద పడినా ఇంకా విప్లవంలో మునిగితేలాలని కోరుకుని జీవితమా, నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు- అని తపనపడ్డాడు. దళిత సౌందర్యశాస్త్రానికి ప్రవేశికగా నల్లనల్లటి సూరీడి గురించి, ఆకుచెప్పుల సూరీడు గురించి, అంటరాని సూరీడిగురించి, దమ్మమే సద్దమ్మగా పురివిప్పిన సూరీడి గురించి రాస్తాడు. బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి పాతాళానికి తొక్కే పరమఛండాల చరిత్రనూ రాస్తాడు.
సత్యమూర్తి అస్తమించారు. కానీ, ఆయన చరిత్రకు, భవిష్యత్తుకు చేసిన దోహదం దినదిన ప్రవర్థమానమవుతుంది. కమ్యూనిస్టు విప్లవకారుడిగా, దళిత బహుజన విప్లవకారుడిగా రెండు జీవితాలుగా కనిపించినా వాటి మధ్య ఆయనకు కొనసాగింపే తప్ప అభేదం లేదు. మన సమాజాన్ని మానవీకరించడానికి, విప్లవీకరించడానికి, అన్యాయం లేని అందమైనలోకాన్ని సృష్టించడానికే ఆయన ప్రయాణం అంతా. శివసాగర్ శాశ్వతం. ఆయన అక్షరం చిరంజీవి. తెలుగుసాహిత్యానికి అది ఒక అలంకారశాస్త్రం, ఆగ్రహానికి, ఆయుధానికి, ఆర్ద్రతకి హృదయానువాదం. కవికి ఉండవలసిన తాదాత్మ్యానికి, అక్షరానికి ఉండవలసిన నిజాయితీకి శివసాగర్ ఒక ఉదాహరణ.
Andhra Jyothi News Paper Dated : 18/04/2012
No comments:
Post a Comment