Friday, April 20, 2012

ఆహార నిషేధాల అసలు లక్ష్యం ఏమిటి?-Jwalitha



బర్బరీకుని కథలో కౌరవులతో యుద్ధం చేస్తానని బర్బరీకుడు ముందుకొ చ్చినపుడు వీరబలితో కురుక్షేత్రయుద్ధం మొదలవ్వాలని వ్యూహం నడిపిన కృష్ణుడు వీరబలికి బర్బరీకుణ్ణి బలిపశువును చేస్తాడు. అందుకు అంగీకరించిన బర్బరీకుడు కృష్ణుణ్ణి ఒకమాట అడగాలని కోరి ఏకాంతంలో కలుసుకుంటాడు. ఈ రాజ్యం వల్ల మాకెప్పుడు సుఖం అన్న బర్బరీకుని ప్రశ్నకు ‘రాజ్యం మీదయినపుడు’ అని జవాబిస్తాడు కృష్ణుడు. ఆనాడయినా, ఈనాడయినా ఎంత ప్రజాస్వామికమయినా రాజ్యాధికారం బహుజనులకు రానంత వరకు అగ్రవర్ణాల అఘాయిత్యాలు కొనసాగుతాయి అనడానికి కారంచేడు, వాకపల్లినుండి నిన్నటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్దకూర పండుగ వరకు అన్ని సంఘటనలుసజీవ సాక్ష్యాలే. హింస అణిచివేత దౌర్జన్యం దోపిడి ఏరూపంలో ఉన్నా బలి పశువులు బహుజనులే...

సృష్ఠిలో ప్రతిప్రాణి జీవించే హక్కుతో పుట్టి తనకిష్టమయిన ఆహారాన్ని తింటుంది. పులి పాలు తాగదు, పిల్లి గడ్డి తినదు, ఏనుగు మాంసం తినదు. పశుపక్షాదులే కాదు జీవరాసులేవి ఒకదానిని మరొకటి ఇది తినమని కాని ఇది తినవద్దని కాని ఒత్తిడి చేయవు. ఒకటి తినే ఆహారాన్ని మరొకటి ధ్వంసం చేయవు, పని గట్టుకొని మలమూత్రాలతో అపరిశుభ్రము చెయ్యవు. మరి మనిషి మాత్రమే అదీ నాగరీకుడైన మనిషి పశువు కంటే హీనంగా వ్యవహరిస్తూ తనకిష్ట మయినది తాను తింటూ ఎదుటి వారు తినేదాని మీద, మాట్లాడే దాని మీద, కట్టుకునే దాని మీద ఆంక్షలు కట్టుబాట్లు విధిస్తూ ఉన్నాడు. ఆటవిక అనాగరిక సమాజాల్లోకూడా లేని విధంగా ఇప్పుడు ఆహార నిషేధాలెందుకు? 

విశ్వవిద్యాలయాలు సంస్కృతీ సంప్రదాయాలను కాపాడి సర్వమత సమ్మేళనాలుగా వెలగాల్సింది పోయి ఈ ఆహార నిషేధాలతో అరాచకాలెందుకు? ‘బీఫ్‌ ఫెష్ట్‌’ పై ఈ దౌర్జన్యం ఎందుకు, ఇవి నడిపించే తెర వెనుక శక్తులేమిటి? మాంసాహారులు శాకాహారులు ఇన్ని రోజులు కలిసి చదువుకుంటూ ఎవరికిష్టమయినది వాళ్ళు తింటూ బాగానే ఉన్నారు కదా! ఎద్దుకూర వ్యతిరేకుల లక్ష్యం ఏమిటి? గోమాత పవిత్రతతో గోసంరక్షణా, లేక జీవహింసను వ్యతిరేకించడమా? ప్రత్యేకంగా జంటనగరాల్లో ఎద్దు మాంసం ఎవరూ తినడం లేదా, ఏ హోటళ్ళల్లో ఇది వడ్డించడం లేదా? కొన్ని పండుగల సందర్భాల్లో సందు సందుకు గల్లి గల్లీకి ఇది సంతర్పణగా కనపడుతుంది కదా, మరి ఈ దౌర్జన్యం ఎందుకు? మాంసాహారాన్ని వ్యతిరేకించడమా, ఎద్దుకూర తినే వాళ్ళను మాత్రమే అణిచివేయడమా? పెద్దకూర వ్యతిరేకులకైనా స్పష్టత ఉదా!
వేదాల్లో పురాణాల్లో దీన్ని అన్ని వర్గాల వాళ్ళు భుజించినట్లు ఆధారాలు చెప్తున్నాయి కదా మరి వాటిని ఏమిచేద్దాం? జంతు సంరక్షణే వీరి లక్ష్యమయితే వీధుల్లో అనాథలై ఆలనా పాలనా లేక కాయితాలు, పోస్టర్లు తిని బతికే వాటిని సంరక్షించాలి కదా. 

మాంస వ్యాపార ప్రదేశాల్లో, కబేళాల్లో రక్తపుటేరులు, మాంసరాసుల సంగతేమిటి? విశ్వవిద్యాలయాల్లో మాత్రమే తినకూడదని నిషేదాజ్ఞలు ఎవరివి ? విశ్వవిద్యాలయాల్లో మధ్యం, మాదకద్రవ్యాలు సేవించవచ్చు, మిగిలిన అరాచకాలు గుట్టుచప్పుడు కాకుండా జరగవచ్చు, రాళ్ళ దాడులు జరగవచ్చు, వాహనాలు తగలపెట్టవచ్చు, సవాలక్ష అవి నీతి కార్యక్రమాలకు వ్యూహరచన జరగవచ్చు! మనవాళ్ళకు దక్కాల్సిన విద్యావ కాశాలను దశాబ్దాలుగా తిష్ఠ వేసి అనుభవించవచ్చు, రాజకీయ చదరంగాలకు అడ్డాలు కావచ్చు, అవినీతి వ్యాపారాలకు విద్యార్ధులను పావులు చేయవచ్చు! ఎవరికి ఏ అభ్యం తరాలుండవు. 

jwalitha
మనకిష్టమయిన ఆహారాన్ని మాత్రం మనం భుజించకూడదట! ఎద్దు కూర బలవర్ధకమైనదని, ప్రొటీన్లతో కూడినదని ఆహార నిపుణులు చెప్తున్నారు కదా సమస్య ఏమిటి? మన వాళ్ళు వీళ్ల కంటే బలంగా ఆరోగ్యంగా ఉండటం వీళ్ళకు కంట గింపుగా ఉన్నదా? ఒకరి అభిప్రా యాన్ని మరొకరిపై రుద్దడం కేవలం దౌర్జన్యం, ఒకరి సంస్కృతిని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నమేఇది! తెలంగాణ వాదులంతా స్పందించాల్సిందే, దిక్కులు చూడడం ఆపి గళం విప్పాల్సిందే. ఇది బహుజనులను భయపెట్టి రాజ్యాధికార ఉద్యమంనుండి దూరంచేసే ప్రయత్నమేతప్ప మరొకటి కాదు. ఆత్మగౌరవాన్ని కాపాడు కోడానికి కావాలిసింది ఐక్యతే!

Surya News Paper Dated : 21/04/2012 

1 comment: