Monday, January 2, 2012

మార్గం చూపిన మహోన్నతురాలుప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు , పోరాట వీరులకు బాసటగా నిలిచిన స్త్రీలలో సావిత్రి బాయి ఫూలేది అద్వితీయ చరి త్ర. మార్క్స్‌కు జెన్నీ ఎంతో సహకారాన్ని అందించారు. అయితే అది తాత్విక రంగంలోనే ఎక్కువగా జరిగింది. కానీ సావిత్రి బాయి మొత్తం పోరాటంలోనే భర్తకి అండగా నిలిచారు. భారతదేశ చరిత్రలో దళితులకు పాఠశాల పెట్టిన ఘనత ఫూలే దంపతులదే. అట్టడుగు వర్గాలకు విద్య చెప్పడమనే ఒక పోరాటాన్ని వారు అప్పుడే స్వీకరించారు. స్త్ర్రీని బానిసగా చూసే ఈ సమాజంలో తన భార్యను విద్యావంతురాలిని చేయడమే కాక ఆమెలో పోరాట స్ఫూర్తిని తీసుకురావడంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒక చరిత్రాత్మకమైన బాధ్యతను నిర్వహించారు.

మహారాష్ట్ర సంస్కర్తల్లో బాల్ శాస్త్రి, జింజేకర్, బాన్ మహాజన్, దాదోబ పాండరంగలౌర్కాడ్‌కర్ (1814-82), నానాశాంకర్ సేట్ (1803-85), గోపాలరావ్ హరి దేశ్‌ముఖ్ (1823-92) పేర్కొనదగినవారు. వీరందరి నుంచి ఫూలే ప్రేరణ పొందారు. 'విద్య మానవుణ్ణి వికాసవంతుణ్ణి చేస్తుంద'ని జ్యోతిబా ఫూలే భావించారు. అందునా స్త్రీ విద్యనభ్యసించకపోవడం వల్లనే మూఢాచారాల్లో చిక్కుకుపోయిందని భావించి 1848లో బుధవారపు పేటలో ఒక పాఠశాల ఫూలే దంపతులు ప్రారంభించారు.

ఇది మన దేశంలో స్త్రీ విముక్తోద్యమానికి ప్రప్రథమంగా అ, ఆలు దిద్దిన పాఠశాల. శూద్ర స్త్రీలకు, దళితులకు విద్యా ప్రదానం అనే ఆలోచన మన సమాజంలో 1830 వరకు లేనేలేదు. ఈ పరిస్థితిని మార్చడానికి తొట్ట తొలుత పూనుకున్న వారు జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయి. సావిత్రి బాయి తన భర్త అనే జ్యోతికి నూనెలా వ్యవహరించా రు. అంటే ఆమె లేకపోతే ఆ జ్యోతికి వెలుగులేదు అన్నంతగా మమేకమయ్యారు. ఆమె సహచర్యం వల్లే జ్యోతిబా ఆలోచనలన్నీ స్త్రీ సంక్షేమం వైపు మళ్ళాయి. ఆయన కుల మతాలకు అతీతంగా స్త్రీల నందరినీ అణగారిన శూద్ర వర్గంగానే గానే భావించారు. సావిత్రి బాయి కూడా అదే అవగాహనతో ముందుకు నడిచారు.

సావిత్రి బాయి 'భారత రత్న' పురస్కారానికి అర్హురాలు. భర్తతో కలిసి ఎన్నో సంస్థల్ని స్థాపించి, సమర్థంగా నిర్వహించారు. నేడు దళిత బహుజనుల్లో కొద్దో గొప్పో సమాజ సేవ చేద్దామనుకున్న కార్యకర్తలకు ఇండ్లలో సహకారం పెద్దగా లేదు. ఉపాధ్యాయులుగా, ఉద్యోగస్తులుగా ఉన్న స్త్రీలకు దళితవాడల్లో చదువురానివారికి చదువు చెపుదామనే ఆలోచన తక్కువ. ఇది శోచనీయం. ఇల్లుని ఒక విద్యాలయంగా తీర్చిదిద్దే సంస్కృతిని సావిత్రిబాయి నుంచి ఉద్యోగస్తులైన దళిత విద్యావతులు నేర్చుకోవల్సివుంది.

సావిత్రిబాయి త్యాగమయి. ఆమె ఒక నిర్మాణ కార్యకర్త. మహాత్మా ఫూలే, డాక్టర్ అంబేద్కర్ గురించి మనం ఎలా ప్రచారం చేస్తున్నామో, అలాగే సావిత్రి బాయి గురించి నిర్మాణాత్మకంగా ప్రచారం చేయవలసిన చారిత్రక సందర్భం మన ముందుకు వచ్చింది. ఆ రోజుల్లోనే దళితుల విద్య గురించి ప్రభుత్వానికి ఆమె ఇలా నివేదించారు: 'మహర్లు, మాంగులు అంటరానివాళ్లుగా భావింపబడటం వల్ల, వాళ్ళ పిల్లలు ఎలాంటి ప్రాథమిక విద్య అందుకోలేక పోతున్నారు. ఈ పరిస్థితి గమనించి ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక పాఠశాలలు తెరిచింది. కానీ అవి కేవలం పట్టణాలలో మాత్రమే ఉన్నాయి.

పూనా నగరంలో మహర్, మాంగ్‌ల జనాభా 5000కి మించి ఉంది. అక్కడ వారి పిల్లల కోసం కేవ లం ఒక్కటే పాఠశాల ఉంది. దానిలో చదివే పిల్లల సంఖ్య 30 కంటే తక్కువే. అందరూ బాలురే. ఈ స్థితి విద్యాశాఖాధికారులకు ఏ విధంగాను పేరు తెచ్చేది కాదు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే విక్టోరియా మహారాణిగారి ప్రకటనలో వాగ్దానం చేసినట్టు మహర్, మాంగ్ కులస్తులకు ఇతర నిమ్న జాతులకు ఎక్కడైతే వారి జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందో అక్కడ వారికోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయవల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కుల వివక్ష వల్ల అగ్ర వర్ణాల వారు వీరిని సాధారణ పాఠశాలల్లోకి రానివ్వరు కనుక ఈ ఏర్పాటు అవసరం'.

ఎన్నో పోరాటాల ఫలితంగా దళిత విద్యార్థులకు పలు హాస్టల్స్ ఏర్పడ్డాయి. అయితే ఆ హాస్టల్స్‌లో వారు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. సావిత్రి బాయి ఆదర్శంగా ఈనాడు ఈ విద్యార్థులకు దళిత ధనవంతులు, ఉద్యోగులు ఎంతో సహకారాన్ని అందించవలసివుంది. లక్షలు ఖర్చు పెట్టి వివాహాలు చేసుకుంటున్నారు. పుట్టిన తేదీలకు పెద్ద పెద్ద కేకులు కోస్తున్నారు. పిల్లల్ని ఫైవ్‌స్టార్ చాక్లెట్లతో పెంచుతున్నారు. అయితే తమ పక్కనే తమ జాతి విద్యార్థులు ఒక కిలో కూర ముప్పై మంది వడ్డించుకుని జీవిస్తున్నారు. కొన్ని వేల హాస్టల్స్‌లో మగ్గుతున్న ఈ పిల్లలకు ఒక దళిత ఉద్యోగి యాపిల్ పండ్లు పంచిన సంఘటన మనకు కరువైంది.

ఈ పరిస్థితుల్లో సావిత్రి బాయి లాగా, ఉద్యోగస్తులైన దళిత స్త్రీలు ప్రతి ఆదివారం ఏదో ఒక హాస్టల్‌కి వెళ్ళి అక్కడ పిల్లల్ని పరామర్శించాల్సిన బాధ్యతను తీసుకోవాలి. 'విద్యావంతులు కండి'అని అంబేద్కర్ పిలుపునిచ్చింది కేవల ం ఉద్యోగులుగా జీవించడం కాదు. ఇతరులకు సహాయపడే గుణాన్ని పెంచుకోవాలి. ఈ స్ఫూర్తిని అంబేద్కర్ సైత ం సావిత్రి బాయి ఫూలే నుంచి అందుకున్నారు.

సావిత్రి బాయి ఫూలే ఒక సజీవమైన జీనవ స్రవంతి. మానవతా పరిమళాన్ని వెదజల్లిన కార్యకర్త. ఆమె కరుణ శీలి. భర్తని కాపాడటంలో వీర మాత. భారత్‌లో ఇంత మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహిళ మరొకరు లేరు అనడంలో అత్యుక్తిలేదు. తన పరిపరాలను సేవామయం చేసిన మహోన్నతురాలు సావిత్రి బాయి. మనం ఆమె మార్గంలో నడుద్దాం.

- డాక్టర్ కత్తి పద్మారావు
(నేడు సావిత్రీ బాయి ఫూలె 180వ జయంతి)
Andhra Jyothi News Paper Dated 03/01/2012

No comments:

Post a Comment