Thursday, January 19, 2012

కెసిఆర్‌లో మాతృస్వామ్యం ఉందా? - సుదర్శన్ బాలబోయిన, వేణుగోపాల్ రెడ్డి బండారి


కెసిఆర్‌లో మాతృస్వామ్యం ఉందా?

- సుదర్శన్ బాలబోయిన, వేణుగోపాల్ రెడ్డి బండారి

రాజకీయ ఆధిపత్యం కోసం తెలంగాణ ఉద్యమం పేరుతో నడుస్తున్న నాటకీయ ప్రక్రియను వివరిస్తూ ప్రొ. కంచ ఐలయ్య 'విష కన్యలు ఉద్యమ వైఫల్యాలు' అనే వ్యాసం రాశారు. ఆయన కులం పేరుతో రాజకీయాలు పులిమి రాస్తే ఒక విస్ఫోటనంలా ఈ ప్రతికలు ప్రచురిస్తాయని సూరేపల్లి సుజాత 'తెలంగాణ అంటే వాళ్ళేనా...?' అని కౌంటర్‌గా రాసింది. ఐలయ్య లేవనెత్తిన రాజకీయాల్ని అర్థం చేసుకోకుండా, కొత్త విషయాలను సంచలనం కోసం రాస్తున్నారని ఆమె చేసిన వాదనకు కౌంటర్ చేస్తూ 'కుట్రల్ని ఎత్తి చూపడం ద్రోహమా..?' అని తెలంగాణ రాజకీయాల్ని అస్తిత్వ కోణంలో సైద్ధాంతీకరించే ప్రయత్నం చేశాము. 

మా వాదనకు ప్రతివాదన చేస్తూ గోగు శ్యామల 'పితృస్వామ్య ఆధిపత్యం' పేరుతో సుజాత ఆర్గ్యుమెంట్స్‌కు బాసటగా నిలిచింది. ప్రొఫెసర్ ఐలయ్యకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అకాడమిక్ శిష్యులం కాకపోయినప్పటికి 'నీవు మా సార్‌ను తిడుతావా? నీకెంత ధైర్యం' అని సుజాతను మేం మందలించినట్లుగా రాస్తూ బలవంతంగా శిష్యరికాన్ని ఆపాదించింది. దళితేతర తెలంగాణ ఉద్యమాన్ని సుజాత, శ్యామలలు తమ నెత్తినెత్తుకున్నట్లే ఐలయ్య తెలంగాణ దళితీకరణను బాధ్యతగా, భారమైనప్పటికీ తన భుజాలపై మోస్తున్నాడు. కాబట్టి మేం ఆయన వాదానికి శిష్యరికం చేస్తున్నాం తప్ప, ఆయనకు కాదు. 

'కాంగ్రెస్ కుట్రలను కొత్తగా డిస్కవరీ' చేయకున్నా పనిగట్టుకొని పదేపదే విమర్శను సానబెట్టకుండానే మన జాతులను ఎలా చైతన్యం చేయగలం. వర్తమాన రాజకీయాలను ఎలా దళితీకరించగలం? ఉద్యమ వైఫల్యాలు అందులో విషకన్యల పాత్రల గురించి ఐలయ్య తీరుగా ఇంతవరకు ఎవరూ రాయలేదు. శ్యామల, సుజాతలకు ఈ కుట్రల గురించి ఐలయ్య కంటె ముందుగానే ఎవరు చెప్పారో మాకైతే తెలియదు. వీరికి కొత్త విషయాలే కావాలట కాని, పరిష్కారం కాని పాత విషయాలు తిరిగి సమీక్షించవద్దంటున్నారు. 

మరి తెలంగాణ సమర్థింపు వ్యాసాల్లో ఎలాంటి కొత్తదనం లేకపోయినా పదేపదే వినడానికి చదవడానికి ఉత్సాహం చూపించడం ఆశ్చర్యకరం. 'శూద్రు లు, బహుజనులు గొడ్లలాగా తలలూపుతున్నారని' మా వ్యాసాల్లో ఎక్కడా ప్రస్తావించకపోయినా, ఆ పదాల్ని మాకంట గట్టి సాక్ష్యాల్లేకుండానే మమ్మల్ని దోషులుగా నిలబెట్టడం అత్యంత దారుణం. 

తెలుగుదేశం, కాంగ్రెస్, చంద్రబాబు, జగన్, లగడపాటి, కావూరి లాంటి వారికి ఐలయ్య, వేణుగోపాల్‌రెడ్డి, సుదర్శన్ నడుమ ఉన్న తేడాలను గుర్తించలేని స్థితికి శ్యామల, సుజాతలు పరివర్తనం చెందడం తెలంగాణ ఉద్యమం గొప్పతనం కావచ్చు. అయితే మాకు సీమాంధ్ర అగ్రకుల నాయకత్వానికి మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యాలేంటో పాఠకులు బాగా తెలుసుకోగలరు. ఇక్కడొచ్చిన చిక్కల్లా ఫ్యూడల్, భూస్వామ్య, అగ్రకుల అవలక్షణాలు నరనరాన జీర్ణించుకున్న కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీష్‌రావు, కోదండరాంలకు సుజాత, శ్యామలకు మధ్య ఎటువంటి తేడా లేకపోవడమే నికార్సయిన మార్క్సిస్టు, అంబేద్కరిస్టులను వేధిస్తున్న ప్రధాన సమస్య. 

1997 భువనగిరి సభ మొదలు మారోజు వీరన్న బహుజన తెలంగాణ మీదుగా ఐలయ్య ప్రయాణించి, 'మావోయిస్టుల మద్దతు లేకుండా తెలంగాణ సాధ్య మా?' తెలంగాణలో దళిత బహుజన నాయకత్వ ఆధిక్యతలోనే రాష్ట్రం సిద్ధించాలని కోరుకుంటున్నారు. సూరేపల్లి సుజాత తన బ్లాగుల్లో (పత్రికల్లో ఒక మాట బ్లాగుల్లో ఒక మాట) రాసిన వ్యాసాల్ని మాత్రమే శ్యామల చదివి ఐలయ్య, సుదర్శన్‌లు పదిహేనేళ్ళుగా రాస్తున్న వ్యాసాల్ని తెలంగాణ రాజకీయోద్య మ చరిత్రల్ని చూడలేకపోవడం ఒక రచయితకుండాల్సిన స్వభావం కాదు. 

'నేను హిందువునెట్లయిత' అనే వరకే ఆగకుండా నేను 'గ్లోబలైజ్డ్ గొల్లోన్ని' అనేంత వరకు ఐలయ్య విస్తృతి చెందాడు. కాని, ఆయన తాత్విక పరిణామాన్ని అర్థం చేసుకునే విషయంలో తెలంగాణ (నేనెట్ల తెలంగాణోన్నైత?) దగ్గరే ఆగిపోవడం సామాజిక ఉద్యమకారులకుండాల్సిన అబ్జర్వేషన్ క్యారెక్టర్ కాదు. 

తెలంగాణలో టైగర్ జోన్, ఒపెన్ కాస్ట్, పోలవరం, పులిచింతల, స్పెషల్ ఎకనామిక్ జోన్‌లతో జరుగుతున్న విధ్వంసాన్ని ప్రత్యేక రాష్ట్ర సాధనతో నిర్మూలిస్తామనుకోవడం అవగాహనా రాహిత్యమే. కాపిటల్ విధ్వంసాల్ని ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుతో పూడ్చగలం అనుకోవడం అమాయకత్వం తప్ప అంబేద్కరిజమో, మార్క్సిజమో అసలే కాదు. ప్రపంచ పెట్టుబడిని తెలంగాణ ముల్లుగర్రకు బిగించి కడితే ఎవరికి ప్రమాదం? గ్లోబల్ విధ్వంసాన్ని స్థానిక సమస్యకు (ప్రాంతీయ అస్తిత్వం) ముడిపెట్టడం అవగాహనా రాహిత్యమే. 

మా వ్యాసంలో ఎక్కడా అనని మాటల్ని మేము రాసినట్లుగా ఉటకించడం వాదన ప్రతిపాదన పద్ధతికి పూర్తి విరుద్ధం. మేము లేవనెత్తిన అంశాలకు ఏ ఒక్కదానికీ సమాధానం రాయలేదు. పైగా శ్యామల ఉద్దేశంలో మేము 'పితృస్వామ్య ఆధిపత్య లక్షణం'తో వాదిస్తున్నామని చెప్పడం అత్యంత దారుణం. మా రాతల్లో కనిపించిన పితృస్వామ్యం కెసిఆర్ చేతల్లో కన్పించకపోవడం ఆశ్చర్యకరం. మనువుకు స్వయాన మనుమడు లాంటి కెసిఆర్‌ని మాతృస్వామ్యానికి మోడల్ సింబల్‌గా ప్రతిపాదించడానికి వీరుపడుతున్న తాపత్రయం దళిత బహుజన ఉద్యమాలకు అతి పెద్ద ప్రమాదం. 

సీమాంధ్ర వలస దోపిడీ నుంచి రాజకీయ, ఆర్థిక వెసులుబాటును కోరుకుంటున్న తెలంగాణ అగ్రకులాలతో పాటుగా, ఈ ప్రాంతపు అణగారిన వర్గాల కులాల విముక్తిని లంకెవేయకుండా చేసే ప్రయాణం దళితులను శాశ్వతంగా బందీలు చేయడమే. వనరులన్నింటిలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాలంటే ప్రత్యేక రాష్ట్రమే అనివార్యం. తెలంగాణ ఒక ప్రాంతీయ అస్తిత్వం. ఈ అస్తిత్వం కింద కుల, మత, జెండర్, పర్యావరణం లాంటివి ఉంటాయి. 

ప్రాంతీయ అసిత్త్వం ఉప అస్తిత్వాలను మింగేసినట్లయితే అది అపరిపక్వ ప్రజాస్వామిక దృక్పథమే అవుతుంది. ఉప అస్తిత్వాల కోసం ప్రాంతీయ అస్తిత్వాన్ని సానుకూలంగా ప్రశ్నించుకుంటే వ్యక్తిగత విమర్శలెందుకు. సృజనాత్మకంగా, ప్రజాస్వామికంగా సమాజాన్నావిష్కరించడానికి దోహదపడే వాద ప్రతివాదాలకు ఆహ్వానం పలుకుదాం. 

- సుదర్శన్ బాలబోయిన, వేణుగోపాల్ రెడ్డి బండారి
రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా యూనివర్శిటీ
Andhra Jyothi News Paper Dated 20/1/2012 

No comments:

Post a Comment