Wednesday, January 11, 2012

తెలంగాణ, టిఆర్ఎస్ ఉద్యమం



- కాశీనాథ్ చిలువేరు

స్వాతంత్య్రానంతరం జరిగిన ప్రజా ఉద్యమాలలో శిఖరాగ్రాన నిలువదగిన చారిత్రక నేపథ్యం, సైద్ధాంతిక పునాది, అత్యధిక ప్రజల భాగస్వామ్యం కలిగిన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమానికి ఉన్న మహోన్నత చారిత్రక భూమికను ఎవరూ ప్రశ్నించజాలరు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 6న తెలంగాణలో పర్యటించిన విషయం తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆయన పర్యటనను విదేశీయుల దండయాత్రలా చిత్రించి, భయభ్రాంతులను సృష్టించింది. 

ఇలా చేయడంలో ఆ పార్టీ ఆంతర్యాన్ని నిజాయితీగా చర్చించినప్పుడే తెలంగాణ ఉద్యమానికి, టిఆర్ఎస్ నడుపుతున్న తెలంగాణ ఉద్యమానికి మధ్యనున్న తేడాను గుర్తించగలుగుతాం. ఈ రెండు ఉద్యమాల మధ్య వ్యత్యాసం లేదని, రెండూ ఒకటేనని భ్రమింప చేయడంలోనూ, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడంలోనూ దశాబ్ద కాలంగా టిఆర్ఎస్ పడరాని అగచాట్లు పడుతోంది. 

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం హృదయపూర్వకంగా ఉద్యమిస్తున్న ప్రజల భావోద్వేగాల నుంచి, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా లబ్ధి పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోన్న టిఆర్ఎస్ పార్టీని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రం, ఓట్ల రూపంలో ప్రజల మద్దతు సాధించాలనే విభిన్న లక్ష్యాలు నెరవేరడం ఆచరణ సాధ్యం కానివి. కోట్లాది ప్రజలు ప్రజాస్వామిక పథంలో, గాంధేయ పద్ధతులతో ఫలితం రాకపోవడానికి ప్రధాన కారణమేమిటి? తెలంగాణ రాష్ట్ర సాధనా ధ్యేయం కన్నా రాజకీయ ఆధిపత్యం సాధించాలనే బలమైన ఆకాంక్ష మూలంగా ఉద్యమం అంతిమ విజయాన్ని చేరుకోలేక పోతుంది. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన ఉద్యమానికి, నేటి వైవిధ్య భరితమైన ఉద్యమానికి స్వరూప స్వభావాలలో తేడా ఉన్నా నాయకుల 'రాజకీయ భవిష్యత్తు' అనే అంశంలో మాత్రం ఏక రూపకత ఉందని గుర్తించవచ్చు. టిఆర్ ఎస్ 2004లో కాంగ్రెస్ పార్టీతోను, 2009లో టిడిపితోను పొత్తు పెట్టుకొంది. ఈ పొత్తుల వ్యవహారంతో పాటు అప్పుడప్పుడు మధ్యంతర ఎన్నికలను ఆహ్వానించటం మొదలైనవన్నీ ఒక రాజకీయ పార్టీ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కెసిఆర్) గొప్పతనమేమిటంటే టిఆర్ఎస్ ఎదుగుదలే తెలంగాణ ఉద్యమ సూచికగా సామాన్యులలో భావోద్వేగాలు రగిలించడంలో కృతకృత్యుడవడం. తెలంగాణ విలన్ పాత్రల్లో కాంగ్రెస్, టిడిపి లను చిత్రించడంలోనూ కెసిఆర్ తాత్కాలికంగా సఫలుడయ్యారు. అయితే తెలంగాణలో టిడిపి శ్రేణులు నేటికీ కంచుకోటలా ఉన్నాయి. వాటిని బద్ధలు కొట్టాలనే ఆకాంక్షతో టిఆర్ఎస్ వ్యూహాత్మక ఎత్తుగడలను పన్నుతోంది. వాటిలో భాగమే చంద్రబాబును టార్గెట్ చేసుకోవడం. ఆడలేక మద్దల వోడు అన్న చందంగా టిఆర్ఎస్ రెండు పడవల ప్రయాణం అర్థం, పరమార్థాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషించుకోవాలి. 

ఒక వైపు ఉద్యమమే ఊపిరి అంటూనే మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం టిఆర్ఎస్ ఆట కొనసాగిస్తోంది. ఈ ద్వంద్వ వైఖరిలోని ఆంతర్యం ఏమిటి? టిడిపి, కాంగ్రెస్ శాసనసభ్యలను టెర్రరైజ్ చేస్తున్నది తెలంగాణ సాధనకా? లేక టిఆర్ఎస్‌ను బలోపేతం చేయడానికా? కెసిఆర్ నైనా లేదా టిఆర్ఎస్ నైనా విమర్శించినా, వ్యతిరేకించినా తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రవేయడం నీతి బాహ్య విధానమే అవుతుంది. మొన్న వరంగల్‌లో జిల్లాలో టిడిపి పర్యటనకు స్వాగతం పలికిన వేలాది ప్రజలను, నాయకులను తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేస్తారా? టిడిపిలో ఉన్న తెలంగాణ నాయకులు రాజకీయాలు చేయకుండా సన్యసించాలా? టిడిపిని కోల్డ్ స్టోరేజిలో బంధించి తాను రాజకీయం చేయాలనుకునే కుటిల నీతి కెసిఆర్‌ది కాదా? 

తాను ఎంచుకున్న మార్గంలో పయనిస్తున్న టిఆర్ఎస్ విధానాల పట్ల ఏ పార్టీకి అభ్యంతరాలు ఉండనక్కర లేదు. కాని ఇతర పార్టీలను శల్య పరీక్షకు నిలిపేముందు స్వీయ రాజకీయ చతురతలో స్పష్టత, నిర్దుష్టత, నిలువెత్తు నిజాయితీలను పారదర్శకంగా ప్రజల ముందు ఆవిష్కరించగలగాలి. ఇందులో వేటికీ సరితూగని కెసిఆర్, ఇతర రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని చేసే ప్రకటనలు తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి చేసేవే. ఇవి, తనకుతాను చేసే ఉత్తర కుమారుని ప్రగల్భాలలాగా మిగిలిపోతాయని గుర్తించాలి. ఎదుటి పార్టీలు బలహీనమైతే తాము బలపడతామని భావించే తత్వం నుంచి టిఆర్ఎస్ బయటపడాలి. స్వయం బలం పెంపొందించుకోకుండా ఓట్ల వేటలో సెంటిమెంట్‌ను ఎరగా చూపడం ఎంతో కాలం సాగదు. 

గడచిన పదేళ్ళలో జరిగిన ఎన్నికలను నిష్పాక్షికంగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్‌ను ఒక మంచి ఉద్యమ సంస్థగా గుర్తించారు. అయితే ఓట్ల రాజకీయాలలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో జత కట్టినా తెలంగాణలో ఏనాడూ ఐదో వంతు సీట్లను గెలుచుకోలేకపోయింది. అయినా టిఆర్ఎస్ దంతా ఎన్నికల ద్వారా తన బల నిరూపణ చేసుకోవాలనే తాపత్రయం. ఈ ప్రక్రియలో చాలా సార్లు తెలంగాణ ప్రజలు గట్టిగా తెలంగాణను కోరుకొంటున్నారా? అన్న విషయం సంశయాత్మకంగా మారింది. ప్రజలకు, పార్టీకి మధ్యనున్న ఈ వైరుధ్యం, అగాధమే టిఆర్ఎస్ పార్టీని పార్లమెంట్‌లో, శాసనసభలో బలంగా నిలుపలేకపోయింది. 

ప్రజలు కోరుకొంటున్నది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. టిఆర్ ఎస్ కోరుకొంటున్నది పార్టీ పరిపుష్టి. ఈ క్రమంలో కాంగ్రెస్, టిడిపి నాయకత్వాలను ఇరుకున పెట్టి టిఆర్ఎస్‌లో చేరకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదనే న్యూనతా భావాన్ని వారి మనస్సులలో బలంగా నాటేందుకు కెసిఆర్ చేస్తున్న ఎత్తుగడలలో భాగంగానే చంద్రబాబు పర్యటనను అడ్డుకో జూసారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇకపోతే తెలంగాణ పొలిటికల్ 'జాక్' టిఆర్ఎస్ వ్యూహాన్ని అమలు చేయడంలో శల్య సార«థ్యం వహిస్తుంది. పొలిటికల్ జాక్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని అమలుచేసే పరిస్థితి కనిపించడం లేదు. 

పైగా జాక్ నాయకులు తామేదో రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపిలు అయిపోయినట్లుగా ఊహించుకుంటున్నారు. ఇది ఉద్యమ స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుంది. ప్రతి నిర్ణయానికి ముందు కెసిఆర్ వైపు చూచే జాక్ తెలంగాణ శాసనసభ్యలను రాజీనామా చేయమని కోరే నైతిక హక్కును కోల్పోయింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పార్టీ గుర్తుపై పోటీచేయాలో స్పష్టం చేసే పరిస్థితి జాక్‌కు లేకుండా పోయింది. జాక్ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే సంప్రదాయాన్ని నెలకొల్పకుండా టిఆర్ఎస్, బిజెపి సభ్యులు తమ పార్టీల తరఫున పోటీచేయడంతో తెలంగాణ అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీల రాజకీయ ఆధిపత్యానికి ప్రాధాన్యాన్ని అంగీకరించినట్లయింది. 

దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని స్వతంత్రంగా నిర్వహించడం, కొనసాగించడంలో జాక్ సఫలం కాలేకపోయింది. మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను వ్యక్తీకరించడంలో పొలిటికల్ జాక్ ఉద్యమ శక్తులను ఏకం చేయడంలో ముందడుగు వేయలేకపోయింది. 1969 ఉద్యమం తర్వాత ఎన్నికలలో పాల్గొన్న తెలంగాణ ప్రజాసమితి ఉనికి కోల్పోయింది. ప్రస్తుత ఉద్యమ దశాబ్ది అనుభవం సైతం ఎన్నికల రాజకీయాల చుట్టూ తిరగడమే కనిపిస్తుంది. నిజాయితీ, చిత్తశుద్ధి, పారదర్శకతతో పెనవేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఏ రకమైన ఎన్నికలలోను పాల్గొనమని, తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లోనే పాల్గొంటామని శపథం చేసే నాయకత్వాలనే ప్రజలు విశ్వసించే అవకాశం ఏర్పడుతుంది. అందుకు ప్రస్తుత ఉద్యమ పంథా మారవలసి ఉంది. ప్రత్యేకంగా ఉద్యమ నాయకత్వ విధానాలను సమూలంగా మార్చుకోవలసి ఉంది. 

- కాశీనాథ్ చిలువేరు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి
Andhra Jyothi News Paper Dated 12/1/2012

No comments:

Post a Comment