Sunday, January 29, 2012

సిద్ధాంత విమర్శ సరే, ఆత్మ విమర్శ కావాలి


- కె. శ్రీనివాస్

కమ్యూనిస్టుల మీద ఎంతటి వ్యతిరేకత ఉన్నవారు కూడా ఒప్పుకునే విషయం ఒకటుంది. ఇప్పుడున్న ప్రపంచం అన్యాయమైనదని, దాన్ని మరమ్మత్తు చేసి తీరాలని అనుకోవడమే కాకుండా, దాని కోసం కమ్యూనిస్టులు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం కూడా గట్టి విశ్వాసంతో, దీక్షతో, సాహసంతో, త్యాగంతో చేస్తారు. ఇప్పుడు నానా గోత్రాలుగా విడిపోయిన కమ్యూనిస్టులందరికీ వర్తిస్తాయా అంటే- కనీసం కట్టుబాటు, వ్యక్తిగత నిస్వార్థత విషయాల్లో వర్తిస్తాయనే చెప్పాలి. అందువల్ల రాజకీయాల్లో కమ్యూనిస్టులను ప్రత్యేకంగా, సీరియస్‌గా పట్టించుకోవలసి ఉంటుంది.

సత్యం ఒకటే కానీ, పండితులు దాన్ని రకరకాలుగా చెబుతారు- అని వేదం అంటుంది కానీ, నిజానికి, సత్యాలు కూడా అనేకం, ఎవరి సత్యాన్ని వారు చెబుతారు. తామనుకున్నదే సత్యం అనుకోకపోతే లోకంలో ఇన్ని అభిప్రాయాలు ఎందుకుంటాయి, ఇన్ని కమ్యూనిస్టు పార్టీలు ఎందుకుంటాయి? ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలోను, దాన్ని ఎట్లా తమ లక్ష్యానికి అనుగుణంగా మార్చాలనే విషయంలోను కమ్యూనిస్టు పార్టీల మధ్య అనేక తేడాలున్నాయి. ఇతరుల అవగాహనను, పనిపద్ధతులను మితవాదమని, అతివాదమని కమ్యూనిస్టు పార్టీలు పరస్పరం విమర్శలూ చేసుకుంటాయి.

స్థూలంగా చూస్తే, పార్లమెంటరీ విధానంలో పాలుపంచుకుంటూ ప్రధాన స్రవంతి రాజకీయాలలో భాగంగా ఉండే కమ్యూనిస్టులు కొందరు, వ్యవస్థను పూర్తిగా నిరాకరిస్తూ తీవ్రమైన వైఖరితో సాయుధపోరాటమార్గంలో మాత్రమే పనిచేసే కమ్యూనిస్టులు కొందరు, ఉభయచరాలు కొందరు మనకు కనిపిస్తారు. ఆదర్శాలే హాస్యాస్పదంగా భావించే ధోరణి పెరిగిపోయాక, కమ్యూనిజాన్ని ఒకానొక అవశేషంగా భావించేవారూ పెరుగుతున్నారు. అయితే, కమ్యూనిస్టేతర పక్షాలు సర్వభ్రష్టత్వాన్ని సాధించి, ఎటువంటి గౌరవానికీ అభిమానానికీ అర్హత కోల్పోయిన సమయంలో, కమ్యూనిస్టు పార్టీల వైపు కొంత మినహాయింపుతో, ఆశగా చూస్తున్న జనమూ ఉన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ మధ్య రాష్ట్రంలో జరిగాయి. కొద్దిరోజుల్లో ఖమ్మంలో భారత కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్టు (సిపిఐఎం) రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయకమ్యూనిస్టు పార్టీల విలీనం, ఐక్యత గురించిన చర్చ మొదలయింది. కలిసిపోవాలనే ఆకాంక్ష సిపిఐ నుంచి బలంగా వ్యక్తమయినట్టు, సమస్యలున్నాయి కాబట్టి కలసిపనిచేస్తూ పోదాం అని సిపిఎం భావిస్తున్నట్టు అర్థమవుతోంది.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ 1964లో తొలివిభజనకు గురి అయిన నాటి సైద్ధాంతిక సమస్యలు, అనంతర కాలంలో దేశ వ్యవస్థను అర్థం చేసుకోవడంలో, వ్యాఖ్యానించడంలో ఉన్న భేదాలు, ఎమర్జెన్సీలో సిపిఐ వైఖరి- మొదలైనవి రెండు పార్టీల విలీనావకాశాల్లో కనిపిస్తున్న కొన్ని నలుసులు. సాయుధపోరాట మార్గంలో ఉన్న కమ్యూనిస్టుపార్టీలతో కూడా సిపిఐ మిత్రత్వాన్ని ప్రదర్శిస్తుంది కానీ, సిపిఎం అందుకు ఏ మాత్రం సుముఖంగా లేదు.

ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వేరువేరుగా పనిచేయడం ప్రారంభించి యాభై ఏళ్లు అవుతోంది కాబట్టి, ఇప్పుడు కలిసిపోవడంలో ఆచరణాత్మక సమస్యలు కూడా ఉంటాయి కానీ, వారు చెప్పుకునే సైద్ధాంతిక అంశాలు అసంగతంగానే కనిపిస్తాయి. సోవియట్ యూనియన్ ఇప్పుడు లేదు. భారతదేశంలో జాతీయ బూర్జువావర్గం పాలిస్తున్నదని సిపిఐ అనుకున్నా, బడాబూర్జువా-భూస్వామ్యవర్గాలు పాలిస్తున్నాయని సిపిఎం అనుకున్నా- వారి రాజకీయ, పోరాట వ్యూహాల్లో ప్రజలకు ఆ తేడా ఏమీ కనిపించదు. కాకపోతే, మార్క్సిస్టు పార్టీ పోరాట పద్ధతులు కొంత మిలిటెంట్‌గా కనిపిస్తాయి.

ఏ ప్రత్యామ్నాయం లేకుండా అధికారంలో కొనసాగిన కాలంలో కాంగ్రెస్ వెంట సిపిఐ నడిచేది. ఇప్పుడు మతతత్వ ప్రమాదాన్ని నిరోధించడానికో, ఉన్నశక్తుల్లో మెరుగైన మిత్రులను ఎంచుకోవాలనే విచక్షణతోనో సిపిఎం కూడా కాంగ్రెస్ మిత్రశిబిరంలోనే ఉన్నది. సిపిఐని రివిజనిస్టులని చేసే విమర్శ తీవ్రత ఇప్పుడు తగ్గింది కానీ, సిపిఐ అంటూ ఒకటి ఉంటే తప్ప, తమకు మిలిటెంట్ పరిగణన లభించదని సిపిఎంకు తెలుసు. ఎమర్జెన్సీ అనంతర కాలంలో సిపిఎం తన పాత స్వభావానికి క్రమంగా ఎడం జరుగుతూనే వచ్చింది. అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న పార్టీగా బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొన్న అక్కడ ఘోరపరాజయం పొందడం దాకా సిపిఎం చేసిన ప్రయాణంలో ఈ పరిణామాన్ని గమనించవచ్చు.

కమ్యూనిస్టులు నవ్వులాటగా మార్చిన మాటల్లో 'ఆత్మవిమర్శ' ఒకటి. తప్పులు చేయడం, తప్పు అని తెలిసి కూడా చేయడం- ఆ తరువాత ఆత్మవిమర్శ చేయడం, ఆ పైన కొత్త తప్పులు చేయడం- భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమప్రస్థానంలో ఇదొక ఆనవాయితీ. అలాగే, సిద్ధాంతం సరిఅయినదే కానీ, అన్వయంలోనే లోపాలు అని ఒకసారి, ఆచరణ సరిగానే ఉన్నది, సిద్ధాంతాన్నే మార్చుకోవాలి అని మరోసారి సమయాన్ని బట్టి వాదించడం కూడా కమ్యూనిస్టులకే చెల్లింది. బెంగాల్ పరాభవం తరువాత మార్క్సిస్టు పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటుందని కొందరైనా ఆశించారు.

మీడియాకు ఎటువంటి ప్రకటనలు ఇచ్చారనేది పక్కనబెడితే- మార్క్సిస్టు పార్టీ ఇప్పుడు మౌలిక సైద్ధాంతిక అంశాలపైనే ఆత్మవిమర్శకు పూనుకున్నది. డెంగ్ స్ఫూర్తితో బెంగాల్‌లో చేయతలపెట్టిన ప్రయోగం అటు కార్పొరేట్లను, ఇటు ప్రజలను సంతృప్తిపరచలేదు. దేశమంతటా ఒక విధానం, బెంగాల్‌లో ఒక విధానం ఏమిటని బుద్ధిజీవులు ప్రశ్నించారు. ఎర్రప్రభుత్వం ఆచరణలోని ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడానికి పార్టీ పూనుకున్నది. త్వరలో జరగనున్న సిపిఎం 20వ మహాసభల్లో సరికొత్త సైద్ధాంతిక విధానాన్ని చర్చకు పెట్టనున్నది. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభలు చరిత్రలో ఎటువంటి సంచలనం సృష్టించాయో, భారత కమ్యూనిస్టు చరిత్రలో ఈ సభలు కూడా అటువంటి కలకలమే సృష్టిస్తాయంటున్నారు.

సోషలిస్టువ్యవస్థలో కూడా మార్కెట్‌కు ప్రాసంగికత ఉంటుందని, కేంద్రీకృత ప్రణాళికారచన ద్వారా మార్కెట్‌ను నియంత్రించవచ్చునని పార్టీ సైద్ధాంతిక పత్రంలో ప్రతిపాదిస్తారని చెబుతున్నారు. అంతే కాకుండా, ఏకపార్టీ వ్యవస్థ కాకుండా, మెరుగైన ప్రజాస్వామిక రూపాలను సోషలిజంలో అనుసరించాలని ప్రతిపాదిస్తారట. ప్రపంచీకరణ కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో సిద్ధాంతాలను సవరించుకోవలసిన అవసరం ఉన్నదని మార్క్సిస్టు పార్టీ అభిప్రాయపడుతున్నది. సహజ వనరులు, భారీపరిశ్రమలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని, ఒక స్థాయి వరకు వర్తక వాణిజ్యాలను ప్రైవేటురంగంలో అనుమతించవచ్చునని కూడా పార్టీ సిద్ధాంత పత్రం సూచించవచ్చు.

బెంగాల్ అనుభవం పార్టీని రాజీలేని కరకు వైఖరిలోకి మార్చగలదని ఆశించినవారికి ఈ కొత్త సిద్ధాంతాలు రుచించకపోవచ్చు. సోషలిజం వచ్చిన తరువాత ఏం చేయాలన్నది సరే, అక్కడి దాకా చేసే ప్రయాణం ఎట్లా? అన్న ప్రశ్నకు పార్టీ ముసాయిదా రాజకీయ పత్రంలో సంతృప్తికరమైన సమాధానాలు కనిపించవు. కమ్యూనిస్టు పార్టీలు స్వతంత్రంగా పనిచేస్తూ, భావసారూప్యం ఉన్న పార్టీలను వెదుక్కుని వారితో అంశాలవారీగాకానీ, ఎన్నికల రంగంలో కానీ కలసి పనిచేయడం పార్టీ రాజకీయ కార్యక్రమం. తరిగిపోతున్న గ్రామీణ పునాదుల్ని పటిష్టం చేసుకోవడం, అసంఘటిత కార్మికరంగంలో పనిచేయడం, సామాజిక అంశాలపై కూడా పోరాడడం- అన్నది ఉద్యమ కార్యక్రమం.

విప్లవం, సమసమాజం వంటి సుదూర ఆశయాల సంగతి పక్కనబెడితే, సాధారణ ప్రజలు కమ్యూనిస్టు పార్టీల నుంచి, ముఖ్యంగా ఉభయకమ్యూనిస్టుల నుంచి కోరుకుంటున్నది తక్కిన పార్టీల కంటె భిన్నంగా ఉండడం. రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల లెక్కలు చూడకుండా, ప్రజలకు అవసరమైన చోట్ల, అవసరమైన రీతిలో అండగా నిలబడడం. ప్రపంచీకరణ పేరుతో ఆర్థిక వలసీకరణ జరుగుతున్నదని, అమెరికా ఏకధ్రువ ఆధిపత్యానికి, మూడోప్రపంచ దేశాల ప్రజలకు మధ్య ఉన్న వైరుధ్యమే ప్రధానమైనదని భావించేవారు, అందుకు అనుగుణమైన కార్యక్రమాన్ని రూపొందించాలి. సిద్ధాంతాన్ని సమీక్షించుకోగలిగిన వారు తమ ఆచరణలను కూడా సమీక్షించుకోగలగాలి.

విప్లవానంతరం కమ్యూనిస్టుదేశాల్లో శ్రామికవర్గ నియంతృత్వం పార్టీ నియంతృత్వంగా, పార్టీనేత నియంతృత్వంగా పరిణమించిందని గుర్తిస్తున్నవారు, తమ సొంత పార్టీల్లో ఎంత మేరకు ప్రజాస్వామ్యం ఉన్నదో, కేంద్రీకృతప్రజాస్వామ్యం, ఉక్కు క్రమశిక్షణ పేరుతో మైనారిటీ అభిప్రాయాలకు ఏ గతి పడుతున్నదో చూడగలగాలి. అస్తిత్వ ఉద్యమాలన్నీ ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్ ప్రోత్సాహం పొందుతున్న ధోరణులని చెప్పగలుగుతున్న ప్రకాశ్ కరత్ వంటి వారు, కమ్యూనిస్టు పార్టీల్లో అగ్రకుల ఆధిపత్యం, పురుషాధిక్యం ఎందుకు కొనసాగుతున్నాయో చూడడానికి అంతర్ముఖులు కావాలి.

రెండు కమ్యూనిస్టు పార్టీలు రెండుగా ఉండడమే సామాన్యులకు హితవుగా ఉంటుంది. పద్ధతి ప్రకారం పనిచేయగలిగిన పార్టీలు ఎన్ని ఎక్కువుంటే అంత మంచిది. రెండు పార్టీలు ఉండబట్టే కదా, ఒకటి తెలంగాణవాదాన్ని, మరొకటి సమైక్యవాదాన్ని సమర్థిస్తున్నాయి? సిపిఐ అంటూ విడిగా ఉండబట్టే కదా, బుద్ధదేవ్ హయాంలో బెంగాల్ తీరుతెన్నులపై మిత్రవిమర్శ అయినా వచ్చింది! పోరాట తీవ్రతలో తేడాలుండవచ్చును కానీ, భిన్నాభిప్రాయలపై సహనం, ఉదారత సిపిఐ అధికంగా కనబరుస్తుందనే అభిప్రాయం ఉన్నది. కలసి పనిచేయగలిగే రంగాలలో కలసి పనిచేయవచ్చు. అధికారానికి రాగలిగే చోట్ల పీఠాలను పంచుకోనూ వచ్చు. కానీ, ప్రజారంగంలో మాత్రం బహుళత్వమే ఆహ్వానించదగింది.

- కె. శ్రీనివాస్ 
Andhra Jyothi News Paper Dated 30/1/2012 

No comments:

Post a Comment