Sunday, January 22, 2012

బాలల హక్కులకు ప్రాధాన్యమివ్వాలి



మన దేశంలో బాలల హక్కులకు ఎక్కువ ప్రాధాన్యం లేదు. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. బాలలు తమ హక్కుల కోసం తాము పోరాడలేరు కాబట్టి ఆ బాధ్యత కూడా పెద్దలపైనే ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించి అనేక స్వచ్ఛంద సంస్థలు బాలల హక్కుల కోసం పోరాడుతున్నాయి. 

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలలలో అక్షరాస్యతను పెంచటానికి ప్రయత్నిస్తున్న అలాంటి సంస్థల్లో మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్‌కు ఒక విశిష్ట స్థానముంది. ఈ సంస్థ చేసిన సాయంతో వేలాది మంది బాలలు జీవితాలలో స్థిరపడ్డారు. ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించి రెండు దశాబ్దాలైన నేపథ్యంలో ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. దీనిలో పాల్గొనటానికి వచ్చిన జాతీయ బాలల హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ శాంతా సిన్హాతో ఈ వారం ముఖాముఖి.. 

బాలల హక్కులకు సంబంధించి ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలేమిటి?
మన దేశంలో బాలల హక్కులను ప్రాధాన్యం కలిగిన అంశంగా ఎవరూ పరిగణించటం లేదు. ప్రభుత్వ దృష్టి అంతా అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనే కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ అభివృద్ధి భవిష్యత్తులో కూడా సజావుగా సాగటంలో బాలలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారనే విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. 

బా లకార్మికుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించలేకపోవటానికి, బాలలలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేకపోవటానికి ఇదే కారణం. బాలల హక్కులు ఒక ప్రాధాన్యం ఉన్న అంశంగా అందరూ భావి స్తే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. నా స్వీయానుభవాల ద్వారా నాకీ విషయం అర్థమయింది. బాలల కమిషన్ తరుపున మేము అనేక రా ష్ట్రాల్లో పర్యటించాం. ఎక్కడైతే అధికారులు బాలల హక్కులను ప్రాధాన్యం కలిగిన అంశంగా భావిస్తున్నారో అక్కడ మంచి ఫలితాలు లభిస్తున్నాయి. 

ప్రభుత్వం సంగతి సరే.. మన సమాజం కూడా బాలల హక్కులకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నట్లు లేదు..
ఇది వాస్తవమే. ఎవరైతే బలహీనులు ఉన్నారో వారిని గుర్తించి.. వారి ఎదుగుదలకు సహకరించాలని మన సంస్కృతి చెబుతుంది. ఈ విధంగా చూస్తే బాలలు బలహీనులు. తమ హక్కుల కోసం పోరాడలేని వారు. అందువల్ల వారి తరపున పోరాడే బాధ్యత కూడా పెద్దలపైనే ఉంటుంది. అంతే కాకుండా బాలలకు కొన్ని హక్కులు ఉంటాయని.. వారు కూడా పెద్దవారితో సమానమనే విషయాన్ని మన సమాజం గుర్తించినట్లు కనబడదు. ఈ తేడా వల్ల కూడా చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. 

బాలల హక్కులకు సంబంధించి విదేశీ సమాజాల అనుభవాలేమిటి?
యూరోపియన్ దేశాల్లో బాలకార్మిక వ్యవస్థను చాలా కాలం క్రితమే నిర్మూలించారు. మనతో పోలిస్తే వారి ప్రజాస్వామ్య వ్యవస్థలు బాగా పరిణతి చెందాయి. అందువల్ల బాలల హక్కుల విషయంలో కూడా వారు మనకన్నా ముందు ఉన్నారు. అంతే కాకుండా వివిధ దేశాల్లో బాలలు ఎదుర్కొ నే సమస్యలకు సంబంధించిన సాహిత్యం వెలువడింది. దీనితో ఆ సమస్యలపై అందరికి అవగాహన పెరిగింది. కాని మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. మార్పు అనేది ఎవరో కొందరు పోరాడితే రాదు. సమాజంలో ఉన్న వారందరికి సమస్యపై అవగాహన కలిగినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. మనం ఇంకా ప్రజలలో అవగాహన కలిగించే క్రమంలోనే ఉన్నాం. ఒక్క సారి ఈ అవగాహన ఏర్పడితే సమస్యను పరిష్కరించటం చాలా సులభం. 

గత 60 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలించకపోవటానికి కారణాలేమిటి?
బాలల హక్కులకు ఉన్న ప్రాధాన్యత వ్యవస్థీకృతమయినప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. 6 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలలందరూ తప్పనిసరిగా స్కూళ్లకు వెళ్లేలా చేయటం ఈ చట్ట ప్రధానోద్దేశం. ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయగలిగితే బాలల్లో నిరక్ష్యరాస్యత తగ్గుతుంది. అంతే కాకుండా బాలల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలకు నైతిక మద్దతు లభిస్తుంది. 

బాలల హక్కుల కోసం మీరు అనేక ప్రాంతాల్లో పనిచేశారు.. మీ అనుభవాలేమిటి?
తమ పిల్లలను బాగా చదివించి పైకి తీసుకురావాలని అందరు తల్లితండ్రులకు ఉంటుంది. కాని చాలా సార్లు తల్లితండ్రులకు సరైన అవగాహన ఉండదు. అందువల్ల వారు తమ పిల్లలను పనిలోకి పంపుతూ ఉంటారు. చదువుకోవటం పిల్లలకు ఉన్న ఒక హక్కని.. వారిని చదివించాల్సిన బాధ్యత తల్లితండ్రులపై ఉంటుందని వారికి విడమర్చి చెప్పినప్పుడు సానుకూలంగానే స్పందిస్తారు. నేను అనేక రాష్ట్రాల్లో చూశాను. తల్లితండ్రులందరూ సానుకూలంగానే స్పందిస్తున్నారు. కాని వారికి విషయాలను విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పని ప్రభుత్వం చేయాలి. స్వచ్ఛంద సంస్థలు చేయాలి. బాధ్యత ఉన్న పౌరులందరూ చేయాలి. 

బాలల హక్కులకు సంబంధించి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి?
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ముందు ఉందనే చెప్పాలి. దాదాపు పదేళ్ల క్రితమే బాలల హక్కులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం మొదలుపెట్టింది. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో వెంకటరంగయ్య ఫౌండేషన్ వంటివి అనేకం పనిచేస్తున్నాయి. చాలా సార్లు అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.
Andhra Jyothi News Paper Dated 22/1/2012 

No comments:

Post a Comment