Tuesday, January 24, 2012

దుర్మార్గం - సంపాదకీయంబాబా సాహెబ్ అంబేద్కర్‌ను రాజ్యాంగ రూపశిల్పిగానో, దళిత జనోద్ధారకుడిగానో తరచు ప్రస్తావిస్తుంటారు. ఆ విశేషణాలకు ఆయన అన్ని విధాలా అర్హులు. కానీ, అంబేద్కర్ అంటే అవి మాత్రమే కావు. ఆయన అందించిన చైతన్యం వల్ల, ఆయన చేసిన పోరాటం వల్ల భారతదేశంలోని దళితులు, బలహీనవర్గాలు ప్రత్యేకంగా లబ్ధిపొంది ఉండవచ్చు. సామాజిక న్యాయపోరాటానికి ఆయన గొప్ప స్ఫూర్తి ప్రదాత అయి ఉండవచ్చు. బడుగుల సాధికారతకు ఆయన ప్రతిపాదించిన సానుకూల వివక్షా చర్యలు గొప్ప మార్గాన్ని వేసి ఉండవచ్చు. అయినప్పటికీ, భారతదేశంలోని సకలవర్గాలకు, వర్ణాలకూ కూడా బాబాసాహెబ్ చెందినవారు. 

భారతదేశంలో ఒక మానవీయమైన మహోన్నతమైన సమాజం ఆవిర్భవించడానికి తపించిన వ్యక్తి అంబేద్కర్. "నిమ్నకులాల వారు అంతరాల కుల వ్యవస్థ కారణంగా బాధితులయినట్టే, ఈ దేశంలోని అగ్రవర్ణాల వారు కూడా అమానవీయతకు లోనయి బాధితులయ్యారు. వారిని వారి అహంకారం నుంచి, అమానవీయతనుంచి విముక్తం చేయవలసిన బాధ్యత కూడా మనమీద ఉన్నది'' అని అంబేద్కర్ భావించారు. 

భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన, అవమానకరమైన కులవ్యవస్థ నిర్మూలన జరగనిదే న్యాయమైన హేతుబద్ధమైన సమాజావిష్కరణ జరగదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా, రాజ్యాంగం రాసుకుని అరవైరెండేళ్లు గడుస్తున్నా ఇంకా అసంఖ్యాక ప్రజానీకం అణగారిపోయి ఉన్నారు. తగిన అవకాశాలు లేక న్యూనభావనలో ఉన్నారు. 

అతి స్వల్పసంఖ్యాకులు మాత్రం ఇంకా ఆధిక్యభావనలోనే ఉన్నారు, తరతరాలనుంచి సంక్రమిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే ఉన్నారు. భారతదేశ సామాజికార్థిక వాస్తవికతలో కులానికి వర్గానికి దగ్గర సంబంధం ఉండబట్టే, అంబేద్కర్, తన తరానికి చెందిన ఇతర నాయకుల వలె కాక, ఉద్వేగప్రతీకగా, ఆరాధ్యుడిగా, వర్తమాన ప్రాసంగికత ఉన్న సామాజిక విప్లవకారుడిగా జనం మనసులో ఉన్నారు. 

సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు జరిగిన అపచారం ఏహ్యమైనది. తీవ్రంగా ఖండించదగ్గది. ఏదో ఒక సామాజికవర్గం మాత్రమే ఆవేదన చెంది ఆందోళన చేయవలసిన సంఘటన కాదది. సభ్యసమాజమంతా ముక్తకంఠంతో నిరసించవలసిన దుర్ఘటన. జరిగిన అపచారాన్ని తాము సహించడం లేదని సమాజంలోని ప్రతిఒక్కరూ గొంతువిప్పాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. 

వీధిమొదళ్లలో, రహదారుల కూడళ్లలో నిలబడిన విగ్రహాలకు ప్రాధాన్యం లేనట్టు కనిపిస్తుంది కానీ, ఆ విగ్రహాలు అక్కడ నిలబడడం వెనుక, అక్కడి ప్రజలకు ఆ విగ్రహవ్యక్తులకు ఉద్వేగపూరితమైన అనుబంధం ఉన్నది. విగ్రహాలకు రోజూ పూజలు చేయకపోవచ్చు, కానీ అపచారం జరిగితే ప్రజలు సహించరు. 

ఒక వర్గం పురోభివృద్ధితో ఒక నాయకుడి గొప్పతనం ముడిపడి ఉన్నప్పుడు, సహజంగానే ఆ నాయకుడి విగ్రహానికి అవమానం జరిగిన సందర్భంలో ఆ వర్గం మనోభావాలు గాయపడతాయి. ఆ వర్గంతో రాజకీయంగానో, సామాజికంగానో వైరమో వైమనస్యమో ఉన్న ఇతరులు ఆ విగ్రహ ప్రతీక మీద దాడిచేయడం ద్వారా ఆ వర్గం మీద పరోక్ష దాడి చేస్తారు. అవాంఛనీయమైన ఈ ధోరణి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. 

పదిహేనేళ్ల కిందట మరఠ్వాడా విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ పేరుపెట్టడం మీద సాగిన వివాదం పెద్ద ఎత్తున హింసాకాండకు కూడా దారితీసింది. అంబేద్కర్ విగ్రహాల మీద వరుసదాడులు జరగడంతో, అధికారయంత్రాంగం కూడళ్లలో ఉన్న విగ్రహాల చుట్టూ ఇనుపకంచెలు నిర్మించి రక్షణ కల్పించింది. ప్రతిష్ఠను ఇనుమడింపజేసుకోవడానికి తన విగ్రహాలు తానే నెలకొల్పుకున్న మాయావతికి ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి నిరోధాలు ఎదురయ్యాయి. ఇప్పుడు యుపిలో ఎక్కడ చూసినా ముసుగులు కప్పిన విగ్రహాలు కనిపిస్తాయి. 

తెలంగాణ ఉద్యమంలో కూ డా విగ్రహాల మీద దాడులు అనేకం జరిగాయి. తెలంగాణకు వ్యతిరేకమని అనుకున్నవారి విగ్రహాల మీద ఉద్యమకారులు దాడులు చేశారు. తగిన ప్రాతినిధ్యం లేదన్న కారణంతో టాంక్‌బండ్‌మీద జరిగిన విగ్రహవిధ్వంసం వేరు కానీ, అనేక చోట్ల పొట్టిశ్రీరాములు విగ్రహాలపై దాడులు జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల వర్గంగా ఉన్న వైశ్యులు ఆ చర్యలకు నొచ్చుకోవడం, ఈ మధ్యనే పొట్టి శ్రీరాములును గౌరవించాలని ఉద్యమనేతలు నిర్ణయించడం తెలిసిందే. 

ఇక, వైఎస్ స్మ­ృతి ఆధారంగా తన రాజకీయభవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్న జగన్ అం దుకు అనుగుణంగానే ఊరూరా విగ్రహస్థాపనకు పూనుకున్నారు. అనుమతిలేకుం డా పెట్టిన విగ్రహాలను తొలగిస్తామని చంద్రబాబు ఇటీవల చేసిన ప్రకటన వివాదాస్పదమయింది. ఇంకోవైపు ఎన్టీయార్ విగ్రహాలపై దాడులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రరాజకీయ చిత్రపటానికి అనుగుణంగానే ఈ విగ్రహాగ్రహాలు కొనసాగాయి. 

విగ్రహాలకు అపకారం చేయడం ద్వారా పచ్చగడ్డిని కూడా భగ్గుమనిపించవచ్చునని అనేక గత ఉదంతాలు నిరూపిస్తున్నాయి. అనేక సందర్భాలలో కృత్రిమ అశాంతి సృష్టించే ప్రయత్నాల్లో కూడా అసాంఘిక శక్తులు విగ్రహాలను ఉపయోగించుకోవచ్చు. దుండగుల చర్యలకు రెచ్చిపోకుండా, తమ మనసుల్లోని అభిమానాన్ని పదిలం చేసుకోవడమే వివేకవంతులు చేయవలసింది.
Andhra Jyothi News Paper Dated 25/1/2012 

No comments:

Post a Comment