తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటుచేసుకున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. సహజంగానే ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అంబేద్కర్ విగ్రహాలపై జరిగిన ఈ దాడి ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. జాతినేతలు, దేశ అభ్యున్నతికి కృషి చేసిన వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం, స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని అభివృధ్ధిలో ప్రతిఫలింపచేసుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి జాతీయనేత! భారత రాజ్యాంగ నిర్మాతగా భారత జాతియావత్తు ఆయనకు నివాళులర్పిస్తుంది. అనితరసాధ్యమైన ఆయన కృషినుండి, మేధస్సు నుండి కుల,మతాలకు అతీతంగా జాతి నిరంతరం స్ఫూర్తి పొందుతోంది. పార్టీలు, కుల,మతాలకు అతీతంగా అంబేద్కర్‌ను దేశవ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. నిమ్నవర్గాల నుండి ఎదిగిన అంబేద్కర్ తన జీవితాంతం వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. సమాజంలో పాతుకుపోయిన కులవివక్షకు, అంటరానితనానికి నిరసనగా గళమెత్తారు. పట్టుబట్టి దళితులకు హక్కులు సాధించారు. ఈ లక్ష్యసాధన కోసం ఛాందసవాదుల నుండి ఎదురైన ప్రతిఘటనలను, అవమానాలను ఆయన జీవితకాలం భరించారు. వాటికి వ్యతిరేకంగా పోరాడారు. దళితజన అభివృద్ధే ధ్యేయంగా అంబేద్కర్ చేసిన కృషే వారికి ఆయనను తిరుగులేని నాయకుడిని చేసింది. దేశవ్యాప్తంగా దళితులందరూ 'మనవాడు' అని ప్రేమపూర్వకంగా చెప్పుకునేలా చేసింది. మహానగరాల నుండి మారుమూల పల్లెల్లోని దళితవాడల వరకు వీధివీధిన ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహాలే దీనికి తిరుగులేని సాక్ష్యం! తరతరాలుగా అణచివేతకు, పీడనకు గురై, దగాపడిన జన సమూహానికి ఆయన విగ్రహాన్ని చూస్తే చాలు పోరాట స్ఫూర్తి రగులుతుంది. దేనినైనా సాధించగలమన్న ధీమా వస్తుంది. అందుకే దళితులకు సంబంధించి ఏ కార్యక్రమమైనా అంబేద్కర్ ప్రస్తావన లేకుండా ముగియదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, ఎన్జీఓలు దళితుల కోసం చేపట్టే ఏ కార్యక్రమమైనా అంబేద్కర్ విగ్రహాల వద్ద నుండే ప్రారంభమౌతున్నాయి. పర్యటనల మధ్యలో అంబేద్కర్ విగ్రహం కనపడితే దిగి నివాళులర్పించకుండా ముందుకు సాగే నేతలు దాదాపుగా కనపడరు. దళితుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యాలుగా అంబేద్కర్ విగ్రహాలు ఆచరణలో నిలిచాయి. అటువంటి విగ్రహాలపై దాడి అత్యంతగర్హనీయం. ఒకరు రెచ్చగొట్టారనో, మరొకరు అవమానపరిచారనో కారణమేదైతేనేం ఏకంగా ఐదు అంబేద్కర్ విగ్రహాలను నేలకూల్చారు. ఇదేదో యాధృచ్ఛికంగా జరిగిన పొరపాటు సంఘటనగా దీనిని కొట్టివేయడానికి వీలులేదు. పక్కా ప్రణాళకతో ఒక వ్యూహం ప్రకారంమే ఈ విగ్రహా విధ్వంసం చోటుచేసుకుందన్న విషయం స్పష్టంగా కనపడుతోంది. ఒకే మండల పరిధిలో, దాదాపుగా ఒకే సమయంలో, ఒకే రకంగా ఈ దాడులు జరిగాయి. పగలంతా పనులు చేసి అలసిసొలసిన జనం గాఢనిద్రపోయే సమయంలో విధ్వంసకులు గుట్టుచప్పుడు కాకుండా ఈ దుర్మార్గానికి తలపడ్డారు. ఐదు ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగినా ఒక్కరు కూడా స్థానిక ప్రజలకు చిక్కలేదంటే ఇదే కారణం. పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి తమ ధ్వంసరచనను అమలు చేసిన అగంతకులు గుట్టుచప్పుడు కాకుండా తప్పుకున్నారు. తెల్లవారిన తరువాత ఈ దుర్మార్గాన్ని చూసిన ప్రజానీకం భగ్గుమంది. దళితసంఘాలే కాదు ప్రజాతంత్రవాదులంతా నిరసనగా గళమెత్తారు. ప్రదర్శనలు జరిపారు. ఇంత జరుగుతున్నా . రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. నిర్లిప్త ధోరణినే ఈ విధ్వంసం పట్లా ప్రభుత్వ పెద్దలు చూపించారు. సోమవారం ఉదయానికే రాష్ట్రమంతా విగ్రహాల విధ్వంసం విషయం తెలిసిపోయినప్పటికీ ఆ విషయమే పట్టన్నట్టు వారు వ్యవహరించారు. సోమవారం సాయంత్రం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి విగ్రహవిధ్వంసంపై ఒక్క ప్రకటన కూడా రాకపోవడం గమనార్హం. దళితుల పట్ల, వివక్షపట్ల, అంటరానితనాన్ని నిర్మూలించాలన్న లక్ష్యం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశు ద్దిఉందో దాని స్పందనే తెలియచేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనల జోరు పెరిగిన తరువాతే అనివార్యంగా ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించింది. హడావిడిగా ఈ సంఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి విగ్రహ విధ్వంసకులను కనుగొనేందుకు ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దోషులు ఎంతపెద్దవారైనా వదలవద్దని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. విగ్రహాలను ప్రభుత్వ ఖర్చుతో పున: ప్రతిష్టాస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకూడదు. దర్యాప్తు యంత్రాంగానికి చిత్తశు ద్ది ఉంటే ఈ వ్యవహారంలో దోషులెవ్వరో కనుగొనడం పెద్దపనేమి కాదు. ఆ దిశలో తక్షణమే చర్యలు ప్రారంభించి దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సంకుచిత రాజకీయ దృష్టితో ప్రవర్తించరాదు. మంగళవారం సాయంత్రానికి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వారి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సిఉంది. విగ్రహాలపై దాడిచేసిన వారితో పాటు ఈ విధ్వంసకాండకు కుట్ర చేసిందెవ్వరన్న అంశాన్ని దర్యాప్తు బృందాలు తేల్చాలి. కుట్ర చేసినవారితో పాటు, వారికి సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలి. దళితుల పట్ల ప్రభుత్వ తీరు ఎలా ఉందో కన్పిస్తోంది గనుకే దుండగలు ఈ దుశ్చర్యకు తెగబడ్డారు. దళితులపై దాడులు జరిగిన సంఘటనల్లోనూ, వివక్షను ప్రదర్శించిన సందర్భాల్లోనూ చట్టాన్ని ఉల్లం ఘించిన వారిపై కేసులు నమోదు చేయకుండా సర్ధుబాటు చేయడానికి ప్రభుత్వం, దాని యంత్రాంగం అధికారపార్టీ పూనుకోవడం దాచినా దాగనిసత్యం. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృత్తం కాకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.
Prajashakti News Paper dated 24/1/2012 Sampadakiyam
No comments:
Post a Comment