Wednesday, January 18, 2012

మాతృభాషే వికాస సాధనం




girl05-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema


విద్యాహక్కు చట్టంలో మాతృభాషలో బోధన అనే విలువను కాపాడే బదులు, ‘వీలైనంతవరకు మాతృభాషలో’ అని మాత్రమే చేర్చారు. ‘మాతృభాష’, ‘ఇంటి భాష’, ‘పరిసర భాష’ ఏ పదం ఉపయోగించినా, విద్యార్జన తెలిసిన భాషలో ప్రారంభం కావాలనేదే ప్రధానం. మాతృభాషలో విజ్ఞానాన్ని పొందా లనేది మా తరం, మా తర్వాత తరాలు కూడా- 1947 నుంచి దాదాపు 1970 దాకా పెద్ద వివాదాంశం కానేకాదు. అందరూ హైస్కూల్ దాకా తమ భాషలో పూర్తిచేసేవారు. ఉన్నతవిద్య కూడా మాతృభాషలోనే ఉండాలనే వాదన ముందుకు రావడంతో 1968-69 ప్రాంతంలో ఆ మార్పు వచ్చింది.



1960 దశాబ్ది చివరిలో దేశవ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం కావడంతో, ఆ అసంతృప్తిలో నుంచి ఎదిగిన ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రజలకు సన్నిహితం కావడానికి లేదా సన్నిహితం అవుతున్నామనే ఒక ప్రజాభివూపాయాన్ని కలిగించడానికి తెచ్చిన మార్పులలో ప్రజల భాషలో ఉన్నత విద్య అనే అంశం ఒకటి. ఈ విధానాన్ని సర్వత్రా ప్రవేశపెట్టే బదులు ఇంగ్లిషును, మాతృభాషను సమాంతరంగా నడపడంతో సమస్య రాను రాను జటిలమైపోయింది. ఉన్నత వర్గాలు, కులాలు ఇంగ్లిషు మాధ్యమంలో, అణచబడ్డ వర్గాల గ్రామీణ విద్యార్థులు మాతృభాషలో చదవడం వలన, విద్య వర్గ అసమానతలు, వివక్ష పెరగడానికి కారణమయింది. ఈ ద్వంద్వ విధానంలో మాతృభాష వివా ద విష వలయంలో చిక్కుకుపోయింది. మాతృభాషలో బోధన కోసం కావాలసిన సిద్ధాంత గ్రంథాలను రాయడానికి, ఇంగ్లిషు నుంచి కొన్ని ప్రాముఖ్యం గల గ్రంథాలను తర్జుమా చేయడానికి అకాడమీలు నెలకొల్పారు.



అలా వచ్చిందే తెలుగు అకాడమీ. ఈ అకాడమీలు మొదట ఉత్సాహంగానే పనిచేశాయి. చాలామంది ప్రొఫెసర్లు ఈ బృహత్తర కృషిలో భాగమయ్యారు. ‘సామాజిక పాలన’ అనే గ్రంథాన్ని నేను మరొక లెక్చరర్ రాశాము. తెలుగు అకాడమీ ఒక మంచి జర్నల్‌ను కూడా నడిపేది. ఈ కృషి అదే ఉత్సాహంతో సాగకపోవడానికి బోధనా భాషలో ద్వంద్వ విధానం ప్రధాన కారణం.



బొంబాయి దగ్గరి తారాలో జరిగిన అఖిల భారత సదస్సులో ఈ అంశాన్ని గురించి ప్రసంగించిన అనిల్ సర్గోపాల్ భాషా విధానాన్ని స్వాతంత్య్రం రావడంతోనే మౌలికంగా మార్చి, అన్ని దేశ భాషల సాహిత్యాన్ని, విజ్ఞానాన్ని దేశభాషలన్నింటిలోకి తర్జుమా చేయడానికి ఒక హైపవర్ కమిషన్‌ను ఏర్పాటు చేయవలసి ఉండే దన్నారు. అలాంటి కృషి జరిగితే అన్ని భాషలు సుసంపన్నమయ్యేవి. అది జాతి అవగాహనకు, జాతి సమైక్యతకు, భిన్న జీవన శైలిల సమగ్ర అవగాహనకు తోడ్పడేదని అన్నారు. నా దృష్టిలో పార్లమెంటులో కూడా సభ్యు లు తమ భాషలో ప్రసంగించినప్పుడు ఇతర భాషలలోకి అప్పటికప్పుడు అనువదించే అనువాదకులుంటే ప్రజాస్వామ్య సంస్కృతి మరింత బలపడేది. అలాకాక వివాదం మొత్తం హిందీ, ఇంగ్లిషు చుట్టూ తిరుగుతూ వచ్చింది. మన పాలకులకు వైవిధ్యపూరిత, బహుభాషా సమాజాన్ని జాతి రాజ్యంగా ఎలా నిర్మించాలనే చారివూతక అవగాహన లేకపోవడం వలన ఇప్పుడు సమైక్యత, సద్భావన, సహకార సంస్కృతి, వైవిధ్యాన్ని హర్షించే దృక్పథమే కరువైంది. సమాజం చీలికలుగా మారి అస్తి త్వ సమస్య తలెత్తడంతో అస్తిత్వ ఉద్యమాల వలయంలోకి నెట్టబడ్డాము. 



ఈ సంక్షోభాన్ని 1985 నూతన విద్యావిధానంతో పరిష్కరించే బదులు అసమానతలను పెంచే విధానాన్ని రూపొందించారు. ప్రైవేటురంగంలో విద్యను ప్రోత్సహిస్తూ కొత్త వైరుధ్యాలను సృష్టించారు. ఇంగ్లిషు, తెలుగు, ప్రైవేటు-పబ్లిక్ విద్యా సంస్థలు రావడంతో విద్యావిధానం సామాజిక విచ్ఛిన్నానికి కారణమయింది. దీనికి తోడు మార్కెట్‌లో అవకాశాలు ఒక మీడియానికి ఎక్కువ, మరో మీడియంలో చదువుకున్నవారికి తక్కువ. ఎక్కువ జీతాలున్న పదవులను ఇంగ్లిషులో చదువుకున్నవారికి ఇవ్వడంతో మార్కెట్ తన మాయాజాలాన్ని దేశ భాషలు తేరుకోని విధంగా వేసింది.



ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం వల్ల, 1990లో ప్రపంచ మార్కెట్‌లో మన దేశీయ పెట్టుబడి మిలాఖత్ పూర్తిగా కావడం వల్ల ‘మాతృభాష’ విలవిలలాడే పరిస్థితి ఏర్పడింది. ఉన్నత విద్యావంతులు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆదాయాల వేటలో పడడంతో కోట్లాదిమంది కొన్ని వేల లేదా లక్షల ఉద్యోగాలను ఆశించడం ప్రారంభమయింది. డాలర్లను రూపాయలలోకి మార్చి కొత్త కలలు కనడం కూడా ప్రారంభమయింది. వీలైన వాళ్లు విదేశాలకు వెళ్లారు. వెళ్లలేని వాళ్లు జీవితమంతా తాము వ్యర్థులమనే మానసిక రుగ్మతకు గురయ్యారు. దీని వల్ల కూడా ఆత్మహత్యలు పెరిగాయి. స్వాతంవూత్యోద్యమ కాలంలో విదేశీ విద్య బహిష్కరణతో ప్రారంభమై, ఒక వంద సంవత్సరాలలో చరిత్ర తిరిగి తిరిగి విదేశీ విద్య మోజు లో ఇరుక్కుపోయింది. ఈ వంద సంవత్సరాల చరిత్ర ముందుకు పోయిందా వెనక్కిపోయిందా అనే అనుమానం కలుగుతున్నది.



ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని పరిశోధనలు మేధో వికాసం, సృజనాత్మకత, అస్తి త్వం చారివూతక, సాంస్కృతిక స్పృహ, ఆర్థిక ఉత్పత్తి భాష మీద ఆధారపడి ఉంటాయని తెలియజేస్తున్నాయి. ఇంగ్లిషు భాష ఉంటే తప్ప మన దేశం పురోభివృద్ధి సాధించలేదు అని చాలా దబాయించి మాట్లాడే వాళ్ల సంఖ్య పెరుగుతున్నది. ఇది ఉన్నత కులాల, వర్గాల వాళ్లు తమ ప్రయోజనాల కోసం చేస్తుంటారు. కానీ పేద కుటుంబాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి తమ భాషలో చదువుకుని, ఆ భాషలో సమాజాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించి బడుగు ప్రజలలో పలుకుబడి పొందిన వారు కూడా, ఆ గ్రామీణ ప్రజల జీవనంతో వాళ్ల భవిష్యత్తుతో సంబంధంలేని భాషకు మద్ద తుదారులు కావడం విషాదం. చదువుకున్న వాళ్ళమెవరమైనా, వాళ్ల సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఇలా మాట్లాడడం ప్రజల నుంచి ప్రజా జీవనం నుంచి మనం ఎంత విడిపోయామో ఊహిస్తేనే భయం వేస్తుంది. 



విద్య, విజ్ఞానం అంతిమ ప్రయోజనం ఏమిటని ప్రశ్నించకుండా బోధనా భాషమీద చర్చ పూర్తికాదు. సమాజ జీవనం కొనసాగడానికి ఉత్పత్తి, సామాజిక సహకా రం, సాంస్కృతిక సంపన్నత అవసరం. ఉత్పత్తిలో పాల్గొంటున్నది శ్రామిక ప్రజలు. భాష అవసరం మనిషికి ఉత్పత్తి వల్లే అవసరమై ఉంటుంది. అందుకే భాషలో భౌగోళిక, వాతావరణ, సమష్టి జ్ఞాపకాల ప్రభావాలుంటాయి. భూస్వామ్య సమాజంలో పొగడ్తల కోసం, రాచరిక వ్యవస్థల ‘సాధికారత’ కోసం, లేదా ఆధిపత్య అహంకారం నుంచి కూడా అందరికి అవసరం లేని భాష పుట్టింది. పాలకులకొక భాష, ప్రజలకొక భాష రూపొందడంతో అందరికీ అర్థమయ్యే సార్వజనీన భాష లేకుండాపోయింది. ప్రాంత పరంగా భిన్నయాసలు, భిన్న ప్రయోగాలు, ఒకే వస్తువుకు లేదా అనుభవానికి భిన్న పదాలు ఉండడం వలన డిక్షనరీ వచ్చింది. ఒక రకంగా డిక్షనరీ భాషను ప్రామాణికంగా మార్చడానికి ప్రయత్నించింది.



అయితే భాషలో ఒక సమాజం సమష్టి అనుభవం ఉంటుంది. అందుకే దానికంటూ ఒక అస్తి త్వం ఉంటుంది. మనిషికి తన భాష తెలియకపోతే తాను పుట్టిన సమష్టి అనుభవం నుంచి, చారివూతక అవగాహన నుంచి, ప్రతి మనిషి ఒక సుదీర్ఘ సామాజిక ప్రయాణంలో ఒక వంతెనవంటి వాదననే అనుభూతే రద్దవుతుంది. నా కోసం నేను బతుకుతాను, నా జీవితం నాది, నేను పుట్టిపెరిగిన సమాజానికి నాకు సంబంధం లేదు, నేను ‘విశ్వమానవుణ్ణి’, ఇతర భాషలోనే మాట్లాడతాను, చదువుకుంటాను, అందరూ అలాగే చదువుకోవాలిఅనే వారిని వదిపూయ్యాలి. తన చుట్టూ ఉండే మనుషులతో తనకొక అవినాభావ సంబంధమున్నదని అంగీకరించిన వారితోనే భాషమీద అర్థవంత చర్చ సాధ్యం. 



ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అన్ని నేర్చుకోవాలి. ఇంగ్లిషు తప్పక నేర్చుకోవాలి.కాని మాతృభాషలో చదువుకుంటే అది విజ్ఞానమే కాదని, మేధస్సు వికాసమే కాదని, మనిషి చాలా వెనకబడిపోతాడని, వాళ్ళకు భవిష్యత్తే లేదంటేనే సమస్య. నేను తెలుగు మీడియంలోనే హైస్కూలు విద్య పూర్తి చేశాను. అది నాకు ప్రయోజనమైందే కాని అడ్డంకి కాలేదు. హైదరాబాద్‌లోని సిసిఎంబి డైరెక్టర్ బిఎస్‌సి కూడా తెలుగు మీడియంలోనే పూర్తిచేశానని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అయితే ఇంగ్లిషులో ప్రకృతి శాస్త్రాల విజ్ఞానం చాలా ఉంది. అది నేర్చుకోవడం ప్రయోజనకరం కావచ్చు. అలాగే భిన్నమైన యూరప్ భాషలలో కూడా ఇలాంటి విజ్ఞానం చాలా ఉంది. జపాన్ దేశస్తులకు ఇంగ్లిషు అసలు రాదు. కాని వాళ్లు అభివృద్ధిలో ప్రపంచంలోనే అత్యన్నత స్థానంలో ఉన్నారు. ఇదెలా సాధ్యమైందో ఆలోచించాలి.



అన్నిటికి మించి జ్ఞానమనేది- తెలిసిన దాని నుంచి తెలియనిదానికి, దృశ్యం నుంచి కనిపించని కారణాలకు, రూపం నుంచి సారంలోకి వెళ్లే ప్రస్థానం. ఒక గ్రామీణ అమ్మాయికి ‘అ’ అంటే అమ్మ అని నేర్పడానికి ‘ఎ’ అంటే ‘ఆపిల్’ అని నేర్పడానికి చాలా తేడా ఉంది. అమ్మతో ప్రారంభమయ్యేది తెలిసిన దాని నుంచి విజ్ఞాన విహార యాత్ర ప్రారంభం. ఆపిల్ అంటే తెలియని దానినుంచి మరో తెలియనిదానికి పడే అనవసర ప్రయాస. మన రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలలో స్కూలు విద్యలో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాక చాలామంది బాలబాలికలు విద్యను ఆపేశారు. ప్రయాసపడుతూ చదివే పిల్లల మీదమనం ఎంత అదనపు భారం వేశామో అంచనా వేయడం కష్టం. నేటి భాషా వివాదం ఒక సహజ ప్రజా సంస్కృతికి, మానవుని అసక్తికి, ప్రశ్నించే తత్వానికి ఒకవైపు ఒక సామ్రాజ్యవాద అహంకారపూరిత పెట్టుబడిదారీ ఆధిపత్యానికి మరోవైపు జరుగుతున్న సంగ్రామంలో, మన గ్రామం ఎటువైపో తేలేది భాషను బట్టే. భాష మీద మనకుండే దృక్పథమే ప్రజాస్వామ్య విలువలకు, విశ్వాసాలకు అత్యున్నత ప్రమాణం.

-పొఫెసర్ హరగోపా
Namasete Telangana News Paper Dated 19/1/2012 

No comments:

Post a Comment