Sunday, January 29, 2012

ప్రాసంగికతే ప్రమాణం


- ఎమెస్కో విజయకుమార్

ట్రావెన్‌కోర్ సంస్థానంలో హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలని మహాత్మాగాంధీ సంస్థానాధిపతికి సూచించారు. ఈ విషయమై సంస్థానాధిపతి మహాత్మాగాంధీ సమక్షంలో అక్కడ పండిత పరిషత్ ఏర్పాటు చేశారు. సుదీర్ఘమైన చ ర్చ జరిగింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. పండితుల్ని మహాత్మాగాంధీ ఒక ప్రశ్న అడిగారు.

"మీ రాజు ఆజ్ఞాపిస్తే మీరు హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పిస్తారా?''అని. దానికి పండితులు రాజాజ్ఞను పాటిస్తామని సమాధానం చెప్పారు. మహాత్ముడు సంస్థానాధిపతితో "అయ్యా! ఈ విషయంలో మీరు వెంటనే ఉత్తర్వులు జారీ చేయండి'' అని కోరారు. ఆనాటినుంచి అక్కడ హరిజనులకు ఆలయ ప్రవేశం దక్కింది. ఇది సుమారు ఏడు దశాబ్దాల క్రితం మాట. స్థూలంగా కనపడేదేమంటే మహాత్మునిపై గౌరవంతో రాజు అలాంటి ఆదేశాలు ఇచ్చారనేది. కానీ కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే ఇక్కడ స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది.

రాజుకు మహాత్మునితో రాజకీయమైన అవసరం ఉంది. ఆ అవసరమే ఉత్తర్వులను జారీచేయడానికి ఉపయోగపడింది. ఇది వాస్తవ సంఘటన. కులానికి సంబంధించిన విషయంలో అత్యంత పట్టింపుతో ఉండే కేరళ వంటి రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన నా వ్యాసానికి తగిన నేపథ్యాన్ని సమకూరుస్తుందని భావిస్తున్నాను. మన దేశం అనేక సంస్కృతుల జీవన విధానాల సమ్మేళనం. వందల వేల తెగలు, భాషలు, యాసలతో ఎప్పుడూ క్రియాశీలంగా ఉండడం మన సంస్కృతికి ఉన్న ప్రధానమైన లక్షణం.

ఇంత వైవిధ్యం ఉన్న దేశం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ ప్రాంతం అంతా ఒక దేశంగా పిలవబడటమే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత దేశమనే రాజకీయ స్వరూపం వచ్చి ఉండవచ్చు. కానీ వేల సంవత్సరాలనుంచి హిమాలయాలకి దక్షిణ ప్రాంతాన్ని భరతవర్షంగా పిలుస్తూనే ఉన్నారు. అంటే ఈ దేశాన్ని ఏకం చేస్తున్నది ఓ అంతర్గతమైన సాంస్కృతికధార తప్ప రాజ్యం కాదు అనేది మనకి స్పష్టమవుతుంది.

మన దేశంలో విద్య ప్రధానంగా మౌఖిక సాంప్రదాయంతో ఒకరినుంచి ఒకరికి సంక్రమించేది. ఆ సందర్భం లో అన్ని రకాల వృత్తులకు సంబంధించిన జ్ఞానం అనువంశికంగా ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తూ తరాలు మారుతూ ఉండటం మనం గమనించాలి. ఆ విధానంలో భాగంగానే కుల వ్యవస్థ ఏర్పడిందని మనం భావించవచ్చు. ఏ వ్యవస్థ అయినా సదాశయంతోనే ఏర్పడుతుంది. అయితే ఆ వ్యవస్థను స్వప్రయోజనాలకు ఉపయోగించుకునేవారు ఎప్పుడూ ఉంటారు.

కులం అనే ఒక సమూ హం ఏర్పడిన తర్వాత వ్యక్తితో సంభాషించడం కన్నా సమూహంతో సంభాషించడం పాలనావ్యవస్థకు (రాజ్యానికి) ఉన్న సౌలభ్యం కులవ్యవస్థ పటిష్టం కావడానికి ప్రధానమైన కారణం. మనిషి సమూహంగా ఏర్పడడానికి కులం అవసరమైన సందర్భంలో సమూహాలు రాజ్యానికి అవసరమైనాయి. ఈ నేపథ్యంలో మనం ఆలోచిస్తే ఈ అసమానతలకు ప్రధానమైన కారణం రాజ్యం మాత్రమే.

విద్య సమాజంలో అనేక మార్పులను తీసుకు వచ్చింది. ప్రతికులంలో అగ్రస్థానంలో ఉన్నవారి సహకారంతో రాజ్యం సమూహాలపై అధిపత్యం సంపాదించింది. 'హిందూ మతానంతర భారత దేశం' రచయిత అయిన ఐలయ్య ప్రకారం సమాజంలో విజ్ఞాన శాస్త్రం మొత్తం బహుజన కులాల వల్లే అభివృద్ధి చెందింది. బహుజన కులాలను దూరం చేసుకుంటే వారిపట్ల వివక్ష పాటించే ధోరణి కొనసాగిస్తే హిందూమతం అంతమవుతుంది. ఇక్కడ కొన్ని ప్రధానమైన ప్రశ్నలున్నాయి. అసలు అగ్రకులం ఎవరు? నిమ్న కులం ఎవరు?

సమాజంలో రాజ్యానికి దగ్గరగా ఉండేవాళ్ళు అగ్రకులస్తులు. వారికి రాజును మార్చే శక్తి కూడా ఉంటుంది. వారికి కావలసిందల్లా రాజ్యవ్యవస్థ కొనసాగటం మాత్రమే. ఏ వర్గం నుంచయినా విద్యవల్లగాని, జ్ఞాన సముపార్జనవల్లగానీ సమకూరిన తాత్త్విక జ్ఞానంతో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమయితే ఆ వర్గం తన అస్తిత్వాన్ని స్పష్టంగా ప్రకటించుకోగలిగితే రాజ్యం వారిని దగ్గరకు తీస్తుంది. అధికారంలో భాగం ఇస్తుంది.

సమాజాన్ని విద్యావంతుల్ని చేయటం, చైతన్యవంతుల్ని చేయటం రాజ్యం బాధ్యత. కానీ, ఇప్పటివరకు ఏ రాజ్యమూ తమ ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరుకున్న దాఖలాలు లేవు. అలాగే మా పిల్లలకు మంచి విద్య కావాలి అని ఉద్యమాలు జరిగిన దాఖలాలు లేవు. అందుకు కారణం కూడా రాజ్యమే. విద్యపై పెట్టే పెట్టుబడికి ఫలితాలు వెంటనే కనబడవు. రాజ్యం విద్యపై పెట్టే పెట్టుబడికి ఫలితం 20 సంవత్సరాల తరువాత కనిపిస్తుంది. అందుకే రాజ్యం తాలూకు ఆశయాల్లో మాత్రమే విద్య మిగిలి ఉంది. ఆచరణలో లేదు. కొందరు చైతన్యవంతులైన వ్యక్తులు, సమూహాలను విద్యావంతుల్ని, చైతన్యవంతుల్ని చేశారు. రాజ్యానికి యథాతథ స్థితి ఇష్టం. ఇది వాస్తవ పరిస్థితి.

ఐలయ్య ప్రకారం హిందూ మతంలో సమూలమైన మార్పులు రాకపోతే ఆ మతం అంతమైపోయే ప్రమాదం ఉంది. హిందూ మతం అంతరించిపోయినంత మాత్రాన ప్రపంచం తలకిందులైపోదు. ఏ దేశానికైనా దాని సంస్కృతి జీవగర్ర. ఇక్కడి ప్రజల అస్తిత్వం దేశీయ తాత్త్విక భావనల్లోనే ఉంది. జాతి తాలూకు తాత్త్విక పునాదుల్లో వ్యక్తి తననితాను ప్రకటించుకుంటారు. ఎప్పుడైతే అస్తిత్వాన్ని కోల్పోతాడో అప్పుడు అతనిలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. సమాజం బలహీనపడుతుంది. అందుకే భారతీయ భావనల స్థానే విదేశీతత్త్వ భావనలు ఇక్కడ ఆక్రమిస్తే మాత్రం అది ప్రమాదకరమే. అందుకే హిందూమతంలో సమూలమైన మార్పులు రావలసిన అవసరం ఉంది.

హిందూమతంలో మార్పులు వేగవంతం కావలసి ఉంది. దీనికి భారతీయులైన వారందరూ ప్రయత్నించాలి. అసలు హిందూమతానికి క్రైస్తవమూ, ఇస్లాము తదితర మతాలు ప్రత్యామ్నాయాలా అనేది మరో ప్రశ్న. ఐలయ్య తన గ్రంథంలో హిందూమతం హింసను బోధించే మతం అనే భావన కలగజేశారు. మతం అనేది మనిషిని పూర్తి స్థాయిలో నియంత్రించగలిగితే క్రైస్తవాన్ని పాటిస్తున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇరాన్‌పై ఎందుకు యుద్ధం చేశాయి?

అది ఆధిపత్య భావన కాదా? ఏ ఇస్లాం చెప్పిందని ఒసామాబిన్‌లాడెన్ అమెరికాపై దాడి చేశాడు. మతం ఎవర్నీ నియంత్రించదు. ప్రతివాళ్లు మతాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. బలహీనులపై బలవంతులు దాడి చేయడానికి కావలసిన లెజిటమసీని మతం నుంచి స్వీకరిస్తారు. ప్రపంచంలోని ఏ మతం ప్రజాస్వామికం కాదు. అన్ని మతాలు నాశనమైన క్షణాన హిందూమతం సమూలంగా నాశనం అవటానికి ఎవరికీ అభ్యతరం ఉండవలసిన అవసరం లేదు.

ఈ సందర్భంలో ఇంకో విషయాన్ని ప్రస్తావించాలి. ఈ దేశంలో నాలుగు వేల సంవత్సరాలుగా సాహిత్యసృష్టి జరుగుతుంది. మొదటితరం సాహిత్య గ్రంథమైన ఋగ్వేదం నుంచి అనంతమైన సాహితీ సృజన జరిగింది. సాహిత్యం, అది సృజించిననాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. అప్పటి సమాజానికి మంచిదైనదాన్ని ప్రబోధిస్తుంది. భారతీయ మత గ్రంథాలుగా భావించబడే సాహిత్యమంతా ఆనాటి సాంస్కృతిక సామాజిక పరిస్థితుల్ని మనముందుంచే సాధనాలుగానే భావించాలి.

ప్రాచీనత ఏ వస్తువుకూ పవిత్రతను ఆపాదించదు. ఆచరణీయత, నిరంతర ప్రాసంగికత మాత్రమే ఏ సాహిత్య వస్తువుకైనా పవిత్రతను తెచ్చిపెడుతుంది. భారతీయ మౌఖిక సాహిత్యంలో అనేకానేక ప్రక్షిప్తాలు ఉండే అవకాశం ఉంది. వాటిని వేదవాక్కులుగా భావించేవారు ఎంత మూర్ఖులో వాటి ప్రమాణంలో భారతీయతను కొలవాలనుకునేవారు కూడా అంతే మూర్ఖులుగా భావించాలి.

అందుకే భారతీయ సాహిత్యం మొత్తాన్ని మతగ్రంథాలుగా భావించటం వాటి ద్వారా భారతీయ మతవ్యవస్థను గణించటం అభిలషణీయం కాదు. విషయం తాలూకు వర్తమాన ప్రాసంగికతను మాత్రమే ప్రమాణంగా తీసుకునే లక్షణం మనం అలవర్చుకోవాలి. మంచిని ఆహ్వానించే గుణం, చెడును తిరస్కరించే ధైర్యం భారతీయ సమాజానికి ఉంది. ఆ ఒక్క లక్షణమే అనేకానేక తాత్త్విక ధారల్ని ఈ గడ్డకి ఆహ్వానించేటట్లు చేసింది.

భారతీయ రాజ్యవ్యవస్థ తన అస్తిత్వాన్ని పటిష్టపరచుకోవడానికి ఉపయోగించిన మరొక ఆయుధం ధర్మం. ఆ ధర్మం బ్రాహ్మణుల ఆధీనం. ధర్మం ఆధారంగా జీవించవలసిన బ్రాహ్మణ వ్యవస్థ తాము చెప్పిందే ధర్మమనే అహంకారాన్ని ప్రదర్శించడానికి రాజ్యం ఉపయోగపడింది. సమాజంలో పొరలుపొరలుగా ఏర్పడ్డ కులవ్యవస్థ కరుడుకట్టుకుపోవడానికి ఇది దోహదపడింది. అయితే ఆలోచనాపరులు, చైతన్యవంతులు ఈ విషయాన్ని గమనించకపోలేదు, ప్రశ్నించకపోలేదు, మార్చడానికి ప్రయత్నించకపోలేదు.

మార్పు జరుగుతూనే వుంది. కాకుంటే అనుకున్నంత వేగంగా జరుగుతుందా అనేదే ప్రశ్న. ఈ విషయాన్నే అరవిందరావు 'ఆత్మవిమర్శా? అంతర్యుద్ధమా?' (ఆంధ్ర జ్యోతి, జనవరి 17) తన వ్యాసంలో వివరించారు. దాన్ని నేను పునశ్చరణ చేయదల్చుకోలేదు. సమాజంలో మనుషుల మధ్య ఏరకమైన వివక్ష క్షంతవ్యం కాదు. చైతన్యవంతమైన సమాజం నిరంతరం మార్పు చెందుతూనే వుంటుంది. గతాన్ని ఇవాళ సమీక్షించగలంగాని, బోనులో నిలబెట్టలేం. అది ఆచరణసాధ్యం కాదు.

- ఎమెస్కో విజయకుమార్
ప్రచురణకర్త 
Andhra Jyothi News Paper Dated 30/1/2012 

No comments:

Post a Comment