Monday, January 2, 2012

తెలంగాణ అంటే వాళ్లేనా?


ఐలయ్య లాంటివారు తెలంగాణ కోసం ఏమి చేయకున్నా పరవాలేదు కాని బురద జల్లడం ఆపేస్తే మంచిది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి. కెసిఆర్‌ని తిట్టడం గొప్ప కాదు, ఇక్కడ ప్రజల భాగస్వామ్యం గురించి కూడా చెప్పగలగాలి. ఆ నాయకత్వం సరిగ్గా పనిచేయడానికి మన రచనలు ఏమన్నా పనికివస్తాయో చూడాలి. నాయకులని సరైన తొవ్వలో పెట్టుకోవాల్సిన బరువు మనదే, బాధ్యత మనదే. లేకపోతే అది ఉద్యమ వైఫల్యం అవుతుంది. 

ప్రొ.కంచ ఐలయ్య 'విష కన్యలు-ఉద్యమ వైఫల్యాలు' వ్యాస రచన చదివినంక మేధావులు అనుకునేవారు కూడా విశ్లేషణ చేసేటప్పుడు ఒకవైపు మాత్రమే ఆలోచిస్తారనే అనుమానం కలుగుతోంది. కంచ ఐలయ్య సామాజిక విశ్లేషకులు, కులం, దాని పుట్టు పూర్వోత్తరాలు, చుట్టూ ఉన్న సంబంధాలు, దానిపై ఆధారపడ్డ వ్యవస్థలను సమూలంగా వివరించగలిగిన సత్తా కలవాడు. అదే సమయంలో వాల్ మార్టులు, ఎఫ్.డి.ఐ.లు దళితులను, బలహీన వర్గాలను ఉద్దరిస్తాయనే వాదన కూడా వినిపించగల మేధావి. నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో, ఆ తోవలో నడిచే సెజ్‌ల వంటి చట్టాలు, పథకాలు వల్ల నష్టపోయేది ఈ కులాలే, వీరి భూములే, వీరి జీవన విధానాలే అన్న విషయం ఆయనకి తెలుసో తెలియదో. 

ఆయన వ్యాసంలో తెలంగాణ ఉద్యమ వైఫల్యాలను వివరించిన తీరు, ఉన్న ఒకే ఒక పార్టీ, అది కూడా అగ్రకుల పార్టీ, బూర్జువా సంస్కృతిలో నుంచి వచ్చిన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుందని ఆయన చెప్పిన దానిలో వాస్తవం లేకపోలేదు. ఈ తెలంగాణ ఉద్యమంలోపడి అమాయకులు ప్రాణాలు పోగొట్టుకోవడంలో ఇప్పటి నాయకత్వం పాత్ర ఉంది అని చెప్పడం కూడా వాస్తవమే. 

అయితే ఈ రకమైన విశ్లేషణలో కోట్లాది ప్రజల ఆకాంక్షలను అధఃపాతాళానికి తొక్కి రాజకీయ కుట్రలను మాత్రమే ఎత్తి చూపించడం తెలంగాణ ఉద్యమానికి అద్దం పట్టేదిగా కాకుండా అడ్డం పడేదిగా ఉన్నట్టుంది. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం మొత్తం కెసిఆర్, జాక్‌ల చుట్టూ మాత్రమే తిప్పి చూపించడం మాత్రం బాధాకరంగా ఉంది. నిజమే వాళ్లే గెలిచారు అని చెపితే ప్రజలు ఓడిపోయారు అని అర్థం చేసుకోవాలా? 

తెలంగాణ చెన్నారెడ్డి కాలం నుంచి మోసపోతూనే ఉన్నది, కారణాలు అనేకం, ఇక్కడి ప్రజల అమాయకత్వం ఒకవైపు, ప్రజల ఆకాంక్షలను బలమైన ఉద్యమంగా మలచగల శక్తి గల పార్టీ కాని, సంఘం కాని, నాయకత్వం కాని లేకపోవడం, బలమైన సీమ, ఆంధ్ర, తెలంగాణ అగ్రకుల లాబీ మరొకవైపు, ఇక్కడ ఉన్న వనరులపై వ్యామోహం, ఇక్కడ స్థిరపడ్డ ప్రజల ఆస్తిపాస్తులు, వారి భద్రత గురించిన ఆందోళనలు, నీళ్ల పంపకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు. నిజమే కెసిఆర్ తెలంగాణ ఉద్యమం అడ్డుపెట్టుకొని తన పార్టీని, తన కుటుంబాన్ని పోషించుకోవడం నిజానికి పెద్ద విషయం కాదు. 

కొత్త ఫిలాసఫీ కాదు, డిస్కవరీ అంతకన్నా కాదు, రాజకీయ చదరంగంలో ఉన్నప్పుడు ఎన్నికల రాజకీయాలే ఆడాలి కాని ఫుట్‌బాల్, కబడ్డీలు ఆడకూడదు. అదే పని ఎన్టీఆర్, వైఎస్సార్, బాబు అందరూ చేస్తున్నారు, చేస్తారు. అది కూడా వాళ్లను వాళ్లు కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేస్తారు. ఇపుడు రాజకీయ పార్టీలన్నీ కూడా చేస్తున్నది అదే, దాంట్లోంచి కొత్తగా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏది లేదు. అయితే తెలంగాణ ఉద్యమాన్ని తమ స్వార్థాలకు ఎట్లా వాడుకుంటున్నారో కూడా అందరూ తెలుసుకోవడం అవసరమే కాదు అనివార్యం కూడా. 

ఇక్కడ వచ్చిన చిక్కల్లా తెలంగాణ అంటే కెసిఆర్ మాత్రమేనా? ఇదే విషయం సీమాం«ద్రులు, కేంద్రం అనుకుంటుంది కదా, మనమూ అనుకోవాలా? అనుకొనేటట్టు సిద్ధాంతాలను బలంగా వినిపిస్తున్నామా? 'అన్న' మాట్లాడకపోతే తెలంగాణ నిద్రపోతున్నట్టు, మాట్లాడితే లేచి పరుగులు పెడుతున్నట్టు మీడియా సృష్టిస్తుంది. మనం రాస్తాం, కేంద్రం వింటుంది, సమైక్యాంధ్ర నవ్వుతుంది, ఇదే పని అన్నా హజారే విషయంలో కూడా కనపడుతుంది, కరప్షన్ అంటే అన్న, అన్న అంటే కరప్షన్, అది మీడియా చెపుతుంది. మనం శ్రద్ధగా వింటాం. ఏండ్లకొద్ది కొట్లాడుతున్న షర్మిల పోరాటం కనపడదు, కనీసం ఆమె పేరు కూడా ఎవరికీ తెలవదు, నెలరోజులకిపైగా గంగని కాపాడండి అని దీక్ష చేసిన స్వామి నిగమానంద ఉన్న హాస్పిటల్ ఏ మీడియాకి కనపడదు. కాని అదే హాస్పిటల్‌కి రాందేవ్ బాబా వస్తే అక్కడ రాజకీయ నాయకుల తీర్థ యాత్ర లాగుంటుంది, ఇంక ప్రపంచంలో మరో సమస్య లేనట్టు మీడియా ఫోకస్ చేస్తుంది.

రాందేవ్ బాబా కనపడతాడు కాని పర్యావరణం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న నిగమానంద గురించి చాలామందికి తెలిసే అవకాశం లేదు. ఇప్పటి వ్యాసం ఊడా అంతే, కంచ ఐలయ్య రాస్తే, అది కూడా తెలంగాణ ఇంక లేదు అని రాస్తే ఒక విస్ఫోటనం, ఆపైన కెసిఆర్ మీద, కుల స్వభావం మీద, రాజకీయ కుతంత్రాల మీద, దాని చుట్టూ తెలంగాణ రాజకీయాలు పులిమి రాస్తే తిరుగులేని వాస్తవం అవుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, త్యాగాలు, ఇక్కడ ఉన్న నిస్వార్థ వ్యక్తులు, పరిస్థితులు, కులాల సమీకరణలు శక్తికి మించి తెలంగాణ కొరకు పోరాడుతున్నాయి అని రాస్తే అది వార్త కాదు, అది మీడియాకి రుచించదు, ఎందుకంటే మార్కెట్ అంత గొప్పగా ఉండదు, ప్రజల గొప్పతనం పెద్ద చెప్పుకోదగ్గ విషయం కానేకాదు. తీరొక్క తీరు నడిచిన ఉద్యమం మూటగట్టి కెసిఆర్ భవన్‌లో పడేయాలి. ఖేల్ ఖతం. దుకాణం బంద్. ఇలాంటి రాతలు కూడా ఆత్మహత్యలను ప్రేరేపించేవిగానే ఉండొచ్చు అని కూడా ఆలోచించాలి. 

మాల మాదిగలు, బడుగు బలహీన వర్గాలు చనిపోయినారు. నిజమే, ఎందుకు? ఎవరికి ఇవాళ తెలంగాణ కావాలి? ఎవడు పోరాడుతున్నాడు? ఎవరు కూటికోసం, కూలికోసం పొట్ట చేత పట్టుకొని దేశాలు పట్టుకొని పోతున్నారు? ఉన్న చిన్న చిన్న జాగాలను కూడా ప్రభుత్వంవారు సెజ్జుల పేరుతోని, మైనింగ్ పేరుతోని గుంజుకుంటుంటే, ఉద్యోగాలు వేరే ప్రాంతంవారు కొల్లకొడుతుంటే ఎందుకు పట్టనట్టు ఉంటాం? ఎందుకు ఈ కులాల నుండి ఒక నాయకత్వాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు? ఈ ప్రశ్నలు మళ్లీ మళ్లీ వేసుకొని, ఎవరైతే ప్రజల్ని ఉద్యమాలని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నామో వారిని ఎదుర్కొనే శక్తిని ఈ శ్రేణులు కల్పించుకోలేకపోతున్న వాస్తవాన్ని బయటపెట్టలేకపోతున్నాం. 

బలహీనతల గురించి మాట్లాడలేకపోతున్నాం, చిన్న కులాల ఉద్యమం, పెద్ద కులాల విచ్ఛిన్నం, ఇక్కడే ఆగిపోతే, మనం ఎక్కడికి ప్రయాణిస్తామో, గమ్యం ఎక్కడో తేల్చుకోలేకపోతాం. తెలంగాణకు పర్యాయపదం కెసిఆర్ ఒక్కడేనా? మొన్నటికి మొన్న డిఎస్సి పదవిని వొదులుకొని ఢిల్లీలో దీక్ష చేసిన నళినీ ఎక్కడన్నా కనపడుతుందా? వందేళ్ల కురువృద్ధుడు కొండా బాపూజీ చేయని ప్రయత్నం ఏదైనా ఉందా? చెరుకు సుధాకర్‌పై కేసులు తీసేయాలని కృష్ణ మాదిగ చేసిన దీక్షలు, ప్రయత్నాలు.. అన్ని కూడా బూటకాలేనా? 

విద్యార్థుల ఐక్యతతో, సాహసంతో, తెలంగాణపై ప్రేమతో ప్రారంభమైన ఉద్యమం, కాలక్రమేణా రాజకీయ నాయకుల చేతిలో పడి చితికిపోయినట్టు పైకి కనపడుతుంది కాని ఇంకా ప్రతి గుండెలో తెలంగాణ రగులుతుంది అన్నది వాస్తవం. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ముక్కలు చెక్కలుగా చేసినాయి, అది వాటి నైజం. ఎప్పుడూ అదిగో అయిపొయింది, ఇదిగో అయిపొయింది అనుకుంటుండగానే, విజయవంతంగా మిలియన్ మార్చ్ జరిగింది. ఉద్యోగుల సమ్మె జరిగింది. తిరుగులేని అస్త్రంగా సకల జనుల సమ్మె దక్షిణాది రాష్ట్రాలని గజగజలాడించింది. ఇవన్ని రాజకీయ ఉద్దేశంతోనే మొదలుపెట్టి ఉండొచ్చు కాని దానికి ప్రజల చైతన్యం తోడు కాకపోతే ఒక్క రాజకీయ పార్టీలతోని అయ్యేనా? ఇపుడు కూడా ఉద్యమం చల్లబడ్డది, 'అన్న' ఫాంహౌస్‌కి పోయిండు, భాషా, ఆక్రోశం బూతు అయింది అని రాస్తే సరిపోతుందా? నిజానికి జాక్ నాయకులు అందరూ స్వార్థపరులు అని చెప్పడం సాహసమే అవుతుంది. 

ఇపుడున్న నాయకులు పాఠాలు వదిలేసి ఉండొచ్చు, తెలంగాణ పాఠాలు ఎప్పుడూ విడనాడలేదు, ఉద్యమ పాఠాలు ఎప్పుడూ రంగరించిపోస్తూనే ఉన్నారు, ఉద్యమ సమీకరణాలను ఆపలేదు అన్నది వాస్తవం. మేధావులందరిని ఒకే గాటన కట్టలేము. ఫలానావారు డబ్బులు, పదవులు దండుకున్నరు అని చెప్పగానే ఉద్యమం ఆగిపోయింది అనే అభిప్రాయానికి వస్తామా? తెలంగాణలో మొత్తం దండుకొనేవారు తప్పితే పోరాటం చేసేవారే లేరా? రేపు ఒక్క పిలుపు ఇచ్చి చూస్తే తెలవదా ఉద్యమం ఎంత బలంగా ఉందో! ఐలయ్య లాంటివారు తెలంగాణ కోసం ఏమి చేయకున్నా పరవాలేదు కాని బురద జల్లడం ఆపేస్తే మంచిది. 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి. కెసిఆర్‌ని తిట్టడం గొప్ప కాదు, ఇక్కడ ప్రజల భాగస్వామ్యం గురించి కూడా చెప్పగలగాలి. ఆ నాయకత్వం సరిగ్గా పనిచేయడానికి మన రచనలు ఏమన్నా పనికివస్తాయో చూడాలి. నాయకులని సరైన తొవ్వలో పెట్టుకోవాల్సిన బరువు మనదే, బాధ్యత మనదే. లేకపోతే అది ఉద్యమ వైఫల్యం అవుతుంది. 

ఎప్పుడైతే నాయకులకి పెద్ద పీట వేస్తామో అపుడు అక్కడ ప్రజల గురించిన ఆలోచించేవాళ్లు తక్కువవుతారు. ఇవాళ దళిత బహుజనుల గురించి మాట్లాడేవాళ్లు, తెలంగాణ విముక్తితో కింది కులాలకు కూడా మేలు జరుగుతుందని గుర్తించాలి. దీనిని ప్రాంతీయవాదంగా మాత్రమే చూడడం తగదు. ఈ కులాలను కాపాడేవాడు ఇందులోంచే రావాలి, నాయకుడుగా ఎదగాలి. జాక్‌లు, పార్టీలు మొత్తంగా కాకపోయినా, ప్రజల భయానికి వత్తిడికి తప్పకుండా తలవంచుతున్నాయి. నిరంతరం మోసం చేసే, కుట్రలు పన్నే నాయకత్వం ఉంటే రేపు ప్రజాగ్రహానికి బలి కాకతప్పదు, ఇది చరిత్ర చెప్పిన నిజం. 

ఇప్పుడు కావాల్సింది మంచి నాయకత్వం, ప్రజల పోరాటాలతో మమేకమయ్యే వ్యక్తి/సంఘం/పార్టీ, ఉద్యమాలను అద్భుతంగా మలిచే నైపుణ్యం కలవారు, ప్రజలను మరింత చైతన్య పరిచే మాటలు, చేతలు. తెలంగాణే ప్రాణంగా ఉద్యమిస్తున్నవారిని నిరాశ పర్చడం క్షమించరాని నేరం. వాళ్ల పోరాటాలను గుర్తించకపోగా, వారిని ఒక పార్టీకి, ఒక కులానికి చెందినవారిగా మాత్రమే చిత్రీకరించడం మోసమే. 

సీమాం«ద్రుల కుట్రలకు తెలంగాణను బలిచేయడమే. ప్రజల ఉద్యమాలు ఎప్పుడూ వృధా కాలేదు, నాయకుల కుట్రలు ఎప్పుడూ విజయం సాధించలేవు. తాత్కాలిక విరామాలు, విజయాలు చూస్తారేమో కాని అంతిమ విజయం నిస్వార్థ పోరాటాలదే. ఎవరు అడ్డొచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా తెలంగాణ తథ్యం. అనివార్యం. లేదంటే ఎలా తెచ్చుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసు.
- సుజాత సూరేపల్లి

No comments:

Post a Comment