- జవాబుదారీతనంలేని ప్రభుత్వ సేవలు
- ప్రతిబంధకంగా మారిన గోప్యత, విధి విధానాలు
- సాకారం కాని సాధికారతలు
- సేవల్ని సులభసాధ్యం చేసే హక్కులు
- పౌరహక్కులపై ప్రజల్లో అవగాహనారాహిత్యం
- అమలు జరిగితే అంతా సౌలభ్యమే
నిత్యజీవితంలో ప్రజలకు అవసరమయ్యే అనేక సేవలను నేటికీ ప్రభుత్వ సంస్థలు, విభాగాలే అందిస్తున్నాయన్నది యథార్ధం. కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు, విభాగాలు అందించే వివిధ సేవల్లో నాణ్యత, మర్యాద, మన్నన, జవాబుదారీతనం, పారదర్శకత కొరవడడం ప్రజల పాలిట శాపంగా పరిణమించిందంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు ప్రభుత్వ విభాగాల్లో గూడుకట్టుకున్న గోప్యత, విధివిధానాలు- ఆయా సంస్థలందించే సేవలను పౌరులు పొందేందుకు ప్రతిబంధకంగా మారాయి.
ఇందుకు విరుగుడుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, వాటికి సంబంధించిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ‘పౌరహక్కుల పత్రం’ (సిటిజన్స్ చార్టర్) అనే పథకాన్ని రూపొందించుకొని అమలు పరుస్తున్నాయి. గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు తదితర స్థానిక సంస్థలు కూడా వీటిని అమలు పరచడం హర్షించదగిన పరిణామమే. అయినప్పటికీ, ప్రజల్లో ఇప్పటికీ వీటిపై అవగాహన లేదన్నది చేదు నిజం.
2000 సంవత్సరం నుండి మొదలైన ఈ మహత్తర పథకం- ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను ప్రజలు సులభంగా పొందేలా దోహదపడుతుంది. అన్నా హజారే ఉద్యమ ఫలితంగా ప్రముఖ చర్చనీయాంశంగా మారిన జనలోక్‌పాల్ బిల్లులో కూడా పౌర హక్కుల పత్రాల గురించిన ప్రస్తావన ఉన్నది. ప్రస్తుతం చాల ప్రభుత్వ విభాగాల్లో పౌరహక్కుల పత్రాలను రూపొందించి, నామమాత్రంగా అమలు పరచుతున్నప్పటికీ, వాస్తవంగా చెప్పాలంటే వాటికి ఏమాత్రం చట్ట బద్ధత లేదు. కేవలం ఆయా పౌరహక్కుల పత్రాల్లో పౌరులకు కల్పించిన సాధికారతలు ఆచరణయోగ్యంకాని నీతి వాక్యాలుగా మిగిలిపోయావన్నది అక్షర సత్యం. తత్ఫలితంగా పౌరహక్కుల పత్రాలు కనుమరుగైపోయా యన్నది యథార్ధం.
ప్రతి ప్రభుత్వ సంస్థ లేదా విభాగం రూపొందించుకున్న పౌరహక్కుల పత్రాలు తప్పనిసరిగా 6 విషయాలను తెలియజేస్తాయి. 1. ప్రమాణాలు: సంస్థ ప్రజలకు అందించే వివిధ సేవలు, వాటికి సంబంధించిన ఖచ్చితమైన ప్రమాణాల వివరణ. వీటిని వినియోగదారులందరికీ సంబంధిత సంస్థ కార్యాలయాలలో స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. ఉదాహరణకు- ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం ప్రచురించిన పౌరహక్కుల పత్రం ప్రకారం- జనన మరణాలను రిజిస్ట్రేషన్ చేయటానికి 3 రోజులు, ఆస్తి పన్ను మదింపు, ఇంటినెంబరు కేటాయించటానికి 15 రోజులు, గృహనిర్మాణాల దరఖాస్తులపై చర్యలకు 30 రోజుల గడువు అవసరమని సూచిస్తోంది.
2. పారదర్శకత, సమాచారం: ప్రభుత్వ విభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటికి సంబంధించిన నియమనిబంధనలేమిటి, వివిధ సేవలను ప్రజలు పొందేందుకు అనుసరించవలసిన పద్దతులేమిటి, వాటిని పొందేందుకు ఎంత ఖర్చు అవుతుంది- వీటన్నిటికీ సంబంధించిన సమగ్రమైన వివరాలను ఏ విధమైన రహస్యమూ లేకుండా వెల్లడించాలనీ, ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉండే ప్రతి అధికారి తమ పేరు, హోదా కలిగి ఉన్న బ్యాడ్జీలను ధరించాలని కూడా నిర్దేశిస్తోంది.3. ఎంపిక, ప్రజల నుండి సలహాలు, సూచనలు: సంబంధిత ప్రభుత్వ విభాగం అందించే సేవలను పౌరులు ఎంపిక చేసుకునే మార్గాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రజలకున్న అవకాశాల గురించి తెలియజేస్తుంది.
టెలిఫోన్, ఈమెయిల్ ద్వారా కూడా కోరిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.4. మర్యాద, సమ యబద్దత, సహాయ వైఖరి: సంబంధిత సంస్థ ఉద్యోగులు ప్రజలతో మర్యాదగా ప్రవర్తించి, వారి మన్నన పొందేటట్లు నడుచుకోవాలని నిర్దేశిస్తోంది. ప్రభుత్వ కార్యాలయానికి ఏదేని సహాయార్ధం ప్రజలు వచ్చినప్పుడు ఉద్యోగులు సహాయ వైఖరి ప్రదర్శించాలని కూడా సూచిస్తోంది.5. ఫిర్యాదులు పరిష్కారం, పరిహారాలు: ఫిర్యాధుల పరిష్కారానికి పాటించే విధానాల గురించి స్పష్టంగా తెలియజేస్తోంది. సేవాలోపం వల్ల తీవ్రమైన సమస్య తలెత్తినప్పుడు బాధిత పౌరుడు దానిని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో తెలియజేస్తోంది.
ఫిర్యాదులను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు, బాధిత పౌరుడికి అందించే పరిహార వివరాలు కూడా చెబుతుంది.ఉదా: ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ అమలుపరుస్తున్న పౌరహక్కుల పత్రం ప్రకారం- ఏదైనా సేవను ప్రకటించిన కాలపరిమితిలో అందజేయనప్పుడు తత్ఫలితంగా జరిగిన ఆలస్యానికి జరిమానాగా ప్రతిరోజుకు రూ. 50 చొప్పున దరఖాస్తుదారునికి గ్రామపంచాయితీ చెల్లించాలి. ఆ విధంగా చెల్లించిన జరిమానాను సంబంధిత ఉద్యోగి వేతనం నుంచి మినహాయించాలి. ఇదే విషయాన్ని మన అత్యున్నత న్యాయస్థానం ‘లక్నో డెవెలప్‌మెంట్ అథారిటీ వర్సెస్ యమ్.కె. గుప్తా అనే కేసులో స్పష్టీకరించింది.6. డబ్బుకు తగ్గ విలువ: ప్రజల అవసరాల మేరకు నాణ్యమైన సేవలను సరసమైన ఖర్చు/ ధరకు అందించే నిరంతర ప్రయత్నం చేయాలని సూచిస్తోంది.
ఉద్యోగులపై, పరిపాలనా యంత్రాంగంపై ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నది, ఆయా ఉద్యోగులందిస్తున్న సేవలేమిటనే సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలియజేస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, సంస్థలన్నిటికీ పౌరహక్కుల పత్రాలున్నప్పటికీ వీటిపై ప్రజా బాహుళ్యంలో అవగాహన కొరవడడం విచారకరం. ప్రభుత్వ పథకాల వెనుక దాగున్న లక్ష్యాలు నెరవేరాలంటే ప్రజలకు వాటిపై అవగాహన కల్పించడం అత్యంత ఆవశ్యం. ఈ దిశగా అడుగులు కదిపినప్పుడు మాత్రమే పౌరహక్కుల పత్రం అంతిమ లక్ష్యం ‘సుపరిపాలన’ కు నాంది పలుకుతుంది. అప్పుడు మాత్రమే మన రాజ్యాంగ నిర్యాతలు కలలుగన్న శ్రేయోభిరాజ్యం సిద్ధిస్తుంది.
పౌరహక్కుల పత్రాలకు అన్నాహజారే డిమాండ్ చేస్తున్నట్లు చట్టబద్ధత కల్పించి సమర్ధవంతంగా అమలు పరచినప్పుడే వాటి లక్ష్యాలు నెరవేరతాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో పౌరహక్కుల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం హర్షించదగ్గ పరిణామం. ఈ బిల్లు త్వరలో చట్టంగా రూపాంతం చెంది అమలుకు నోచుకుంటుందని ఆశిద్దాం. పౌర హక్కుల పత్రాలు త్రికరణ శుద్ధిగా అమలు జరిగినప్పుడు పౌరులకు వివిధ ప్రభుత్వ సేవలు సులభంగా, నాణ్యతతో, మర్యాద పూర్వకంగా, బాధ్యతాయుత జవాబుదారీ పద్ధతిలో లభ్యమవుతాయి.
- డా సి.హెచ్. దివాకర్ బా
Surya T elugu News Paper Date 03/01/2012
No comments:
Post a Comment