'హిందూ మతానంతర భారతదేశం' అనే విషయమై కంచ ఐలయ్య రాస్తూ మనదేశంలో అంతర్యుద్ధం వస్తుందని సెలవిచ్చారు. అసలు అంతర్యుద్ధాన్ని ప్రారంభించి, పోషించకపోతే, హిందూ మతం అంతమవదు. విదేశీ దండయాత్రలను కొన్ని శతాబ్దాల పాటు తట్టుకుని తిప్పికొట్టి, బతికిన హిందూ ధర్మ వినాశనానికి అంతర్యుద్ధమే సమాధానం అని విదేశీయుల అభిప్రాయం.
అటువంటి అంతర్యుద్ధానికి సైనికులుగా భారతదేశంలో హిందూ ధర్మంలోని దళితులనబడేవారిని, తయారు చేయటం విదేశీ మతాలు, రాజకీయ సిద్ధాంతాలు పుచ్చుకున్నవారు, అనల్పమైన విదేశీ ధన సహాయంతో మొదలుపెట్టారు. ఈ విషయం సమగ్రంగా గ్రహించక హిందూ ధర్మపీఠాధిపతులు అన్ని మతాలు ఒకే విషయం ఉపదేశిస్తాయని, సనాతన ధర్మాన్ని ఎవ్వరూ అంతమొందించలేరని చెబుతూ, పొంచి వున్న ముప్పు నుంచి హిందూ భారతీయులను జాగృతులను చేయడం లేదు.
కె. అరవిందరావుగారు 'ఆత్మవిమర్శా? అంతర్యుద్ధమా?' అనే వ్యాసం (జనవరి 17, ఆంధ్రజ్యోతి) అంద రి కళ్ళు తెరవాలి. కంచ ఐలయ్య గారు హిందూ ధర్మంపై యుద్ధం చేసే వర్గాల వారి మేధోసైనికులు (Intellectual Warrior). వీరికి అమెరికాలో ఆశ్రయం వుంది. అమెరికాలోని క్రైస్తవ మత సంస్థల అనుగ్రహం ప్రోద్బలం వుండడం మూలానే ఆ దేశానికి వెళ్ళి, అక్కడి కొన్ని శక్తులతో భారతదేశంలో అంతర్యుద్ధానికి సానుభూతిని, సహకారాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఐలయ్య 'నేను హిందువును ఎందుకు కాను?' అనే పుస్తకం రాశారు. గొప్ప మేధావి, తాత్వికులు, గణిత శాస్త్రజ్ఞులు, నోబెల్ పురస్కార గ్రహీత బెట్రండ్ రస్సెల్ తాను ఎందుకు క్రైస్తవాన్ని త్యజించాననే పుస్తకాన్ని రాశారు. మరొక తత్వవేత్త, జన్మతః క్రైస్తవులైన డేవిడ్ ఫ్రాలే తానెందుకు క్రైస్తవాన్ని త్యజించి, హిందూ ధర్మాన్ని స్వీకరించిందీ తెలుపుతూ మరో గ్రంథం వ్రాశారు.
'ప్రాణం తీసిన బొట్టు సమస్య' (జనవరి 17, ఆంధ్రజ్యోతి) అనే శీర్షికతో కాబోయే వరుడు బొట్టు పెట్టుకోవాలనే నిబంధనను చేస్తే, తండ్రి దాన్ని సమర్థిస్తే, తల్లితో కలిసి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి, ప్రార్థనలు చేసే ఒక యువతి తను పుచ్చుకున్న మతం ప్రకారం బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడక, తండ్రితో విభేదించి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇటువంటి ఉదంతాలు, ఒక కుటుంబంలో కొంత మంది మతం మార్చుకోవడం మూలాన, కలహాలు తలెత్తి, సమాజంలో అలజడి పెరగడం, ఒక మత వ్యాప్తి వల్ల జరిగిందని చారిత్రక ఆధారాలున్నాయి.
నా బోధనల వలన ఇలా జరుగుతుందనే సువార్త ఉండడం ఆశ్చర్యకరమైన అక్షర సత్యం. క్రైస్తవులకు పవిత్రమైన మతగ్రంథం "New Testament of the Bible" ఇందులో ల్యూక్ సువార్తలోని 51, 52, 53 వచనాలు చూడండి. '(51) నేనీ భూమిపై శాంతి నెలకొల్పుటకు వచ్చితినని తలచుచున్నారా? అందుకు కానేకాదు, విను, విభజించడం కోసం వచ్చాను. (52) ఇప్పటి నుండి ఇంటిలోని ఐదుగురూ విభజింపబడుదురు. ముగ్గురు ఇద్దరికి వ్యతిరేకంగా, ఇద్దరు ముగ్గురికి వ్యతిరేకంగా. (53) తండ్రి కొడుకుకు, కొడుకు తండ్రికి వ్యతిరేకంగా తల్లి కూతురికి, కూతురు తల్లికి వ్యతిరేకంగా, అత్త కోడలితో, కోడలు అత్తతో విభేదిస్తారు'
మత మార్పిళ్ల వల్ల లక్షల గృహాలలో ఈ విభేదాల కలహాలు చిచ్చురేగుతున్నాయి. ఛార్లెస్ ఫ్రీమాన్ అనే రచయిత "AD381 Heritics peagons and Christian State' అనే గ్రంథంలో రోమన్ సామ్రాజ్యాధిపతి కాన్‌స్టాంటైన్ క్రైస్తవ మతం పుచ్చుకోవడం ఎలా జరిగిందో, తత్పూర్వం రోమన్ సామ్రాజ్యంలో ఎన్ని ప్రాంతాలలో, ఎన్ని కుటుంబాలలో కలహాలు రేకెత్తించబడినవో, ఏ విధంగా క్రైస్తవ మత వ్యాప్తి ప్రచారం అంతర్యుద్ధాలకు దారితీసిందో, సమాజాలు ఎలా అతలాకుతలం అయిపోయాయో, క్రైస్తవానికి పూర్వం వున్న దేవాలయాలు ఎలా కూల్చివేయబడ్డాయో, మతం మార్చుకోని వారిమీద ఎటువంటి హింసా కార్యక్రమాలు చేపట్టబడ్డాయో, చివరకు క్రైస్తవమే ప్రభుత్వ మతం అయిందో విశదంగా రాశారు.
మన రాష్ట్రంలోనూ, ఇతర దక్షిణాది రాష్ట్రాలలోనూ, క్రైస్తవం ఏ వర్గాలలో, ఏ ప్రసంగాల ద్వారా, ఏ ప్రచారాల ద్వారా జరుగుతున్నాయో ఆ తీరుకు రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ వ్యాప్తికి సామ్యం వుంది. మనదేశంలో అధినేత్రిని అనుసరించి మన రాష్ట్రంలో ప్రప్రథమ క్రైస్తవ ముఖ్యమంత్రిగారి పాలన నుంచి క్రైస్తవ ప్రచారం, మతమార్పిడిలు ఉధృతంగా జరుగుతున్నాయి. మతమార్పిడికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నవారిపై దౌర్జన్యం మొదలయింది. మతం మార్చుకున్న దళితులు ఆ సత్యాన్ని వెల్లడించకుండా, మత మార్పిడిని ఎదుర్కొనే వారిపై, నిరశించే వారిపై Prevention of Attracities agianst SCs and STs అనే చట్టం కింద కేసులు పెట్టి, వారిని భయభ్రాంతులను చేస్తున్నారు.
మతం మార్చుకునే వ్యక్తులు అన్ని విషయాలను కూలంకషంగా అర్థం చేసుకుని, ఇది తప్పు, అది ఒప్పు, ఇందులోని లోపాలు, దుష్కృత్యాలు, దురాచారాలు, వివక్షలు, అసమానతలు, అంటరాని తనాలు, అందులో లేవని తన అధ్యయనం ద్వారా తెలుసుకుని మతం మార్చుకోవడం లేదు. మతమార్పిడుల ఉద్యమం ఒక వ్యాపార సరళిలో, బహుళజాతి సంస్థల ద్వారా అపార ధన వ్యయంతో, నాటకీయంగా జరుగుతోంది. ఇది ఒక మతస్థులు, వేరే మతాల మీద చేసే దాడి. అందులోనూ, ఈ మత ప్రచారకులు హిందువులలో కొన్ని వర్గాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముస్లింల జోలికి వెడితే వారిలో ప్రచారం చేస్తే ముప్పు అని తెలుసు.
ఉదా. కాశ్మీర్‌లో పాస్టర్ ఖన్నా అనే అతడు ముస్లింలను మతం మార్పిస్తున్నాడని తేల్చి, షరియా ప్రకారం అతడు నేరస్థుడని, ప్రభుత్వం చేత నిర్భంధింపజేశారు. అక్కడి ముస్లింల షరియా కోర్టు ఆ పాస్టర్‌కు శిక్ష విధించింది. అటువంటి పనిని మన రాష్ట్రంలో ఏ హిందూ సంస్థ అయినా చేస్తే, ఈ పాటికి సెక్యులరిస్టులు, వామపక్షీయులు, మతమార్పిడి సంస్థలు వారిపై దండెత్తి వారిని జైళ్ళలో పెట్టించేవారు. చివరిగా ఐలయ్యగారన్నట్లు, హిందూ మతానంతరం కాదు, హిందూ మతాంతం కోసం అంతర్యుద్ధం చేపట్టబడుతోంది. శాంతి కాముక ప్రజలు, భారతదేశ స్వాతంత్య్రం సుస్థిరంగా వుండాలని కోరుకునే వారు ఈ అంతర్యుద్ధ కాముకులను గుర్తించి, వారి ఎత్తుగడలను వమ్ము చేయాలి.
డా. అంబేద్కర్ ' నేను వైదిక హిందూ ధర్మాన్ని త్యజిస్తున్నాను, కాని ఇస్లాంను గాని, క్రైస్తవాన్ని గాని స్వీకరించను' అన్నారు. ఈ దేశంలో పుట్టిన జాతి, వర్ణ విభేదాలు లేని, సర్వమానవ సమానత్వాన్ని చాటిన బౌద్ధాన్ని స్వీకరించి తన అనుయాయులందర్నీ బౌద్ధాన్ని స్వీకరించమని చెప్పి భారతీయతను కాపాడారు. మహాత్మాగాంధీ కొన్ని క్రిస్టియన్ మిషనరీల ప్రశ్నలకు సమాధానమిస్తూ, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నాకు పలుకుబడి (్కౌఠ్ఛీట) వున్నట్లయితే, నేను మత మార్పిడులు చేసే, మిషనరీ కార్యకలాపాలను నిషేధిస్తాను అని చెప్పారు. మత మార్పిడి ప్రచారాలు శాంతి విదారకాలు. విభాజకతను, విద్వేషాలను, గృహ కలహాలను ప్రేరేపిస్తున్నాయి.
- త్రిపురనేని హనుమాన్ చౌదరి
Andhra Jyothi News Paper Dated 24/1/2012
No comments:
Post a Comment