Thursday, January 19, 2012

హక్కుల ఉద్యమాలపై అసహనం



- రాజ్యం చట్ట ఉల్లంఘనలు మానుకోవాలి
- రాజ్యాంగం బేఖాతరు
- మౌనం వహిస్తున్న మానవ హక్కుల కమిషన్లు
- ప్రైవేట్‌ హింసనూ ఖండించాల్సిందే
- చర్చల ద్వారానే హింసకు స్వస్తి 
- శిక్షలకు అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం 

మానవ హక్కుల ఉద్యమ కారులకు కోర్టులు విధిస్తున్న శిక్షలు పలు మౌలిక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ప్రయోగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాల (నివారణ) చట్టం- 1967 న్యాయబద్ధత పైన కూడా వివాదం తలెత్తుతున్నది.నేడు మావోయిస్టుల వంటి తీవ్ర వాద వర్గాలు లేవనెత్తిన సమస్యలు, అంశాలపై దేశంలో అనేక మంది సానుభూతి తెలుపు తున్నారు. అయితే వారంతా వారి మద్దతుదారులు కాదు. వారు ఉపయోగిస్తున్న హింసాయుత పద్ధతు లను, విచక్షణా రహితంగా సామాన్య ప్రజలను వారు హతమార్చడాన్ని ఖండిస్తున్నారు కూడా. మన రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను, వారి మద్దతుదారులను హతమార్చే పోలీసు, ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించిన కన్నబీరన్‌, బాల గోపాల్‌ వంటి పౌర హక్కుల నాయకులు కూడా వారి హింసాయుత పద్ధతులను, విధ్వంసాలను, హత్యలను ఖండించిన వారు కావడం గమనార్హం. 

మానవ హక్కుల ఉద్యమాలు- ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, సాయుధ దళాలు చట్ట వ్యతిరేకంగా ప్రజలపై దాడులు, హింస జరిపించడాన్ని, చట్ట వ్యతిరేకంగా హత్యలకు పాల్పడడాన్ని ఖండిస్తూ వస్తున్నాయి. అయితే రాజకీయ సిద్ధాంతాలు, ప్రజల తిరుగు బాట్ల పేరుతో ప్రైవేటు గ్రూపులు పాల్పడే హింసాయుత పద్ధతులను ఖండించే విషయంలో తొలి రోజులలో భిన్నాభిప్రాయాలు ఉండేవి. అమ్నెస్టీ ఇంటర్‌ నేషనల్‌ వంటి సంస్థలలో సైతం పెద్ద ఎతున చర్చలు జరిగాయి. కేవలం రెండు దశాబ్దాల క్రితంనుంచే ప్రైవేటు గ్రూపులు పాల్పడే హక్కుల ఉల్లంఘనలను సైతం ఖండించడం ప్రారంభించాయి. 

మన దేశంలో ప్రముఖ పౌర హక్కుల ఉద్యమమైన- పౌర హక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్‌)లో కూడా ఈ విషయమై సుదీర్ఘ చర్చలు జరిగాయి. 1982 లో చెన్నైలో జరిగిన జాతీయ సదస్సులో ఈ విషయమై రెండు రోజుల పాటు అగ్రహావేశాలతో చర్చలు జరిగాయి. ప్రజాస్వామ్యానికి హింస వ్యతిరేకమని, దానికి ఎవరు పాల్పడినా ఖండిస్తామని నాటి తమిళనాడు శాఖ అధ్యక్షుడు, ప్రముఖ పాత్రికేయుడు చో రామస్వామి ప్రతిపాదించిన తీర్మానంపై ఈ చర్చలు జరిగాయి. న్యాయమూర్తి రాజేంద్ర సచార్‌, జార్జ్‌ ఫెర్నాండెజ్‌, రామ్‌ జెత్మలాని, అరుణ్‌ శౌరి, సురేంద్ర మోహన్‌, కన్నబీరన్‌ వంటి ప్రముఖలు ఆందరూ ఆ తీర్మానాన్ని వ్యతిరే కించారు. 

పౌర హక్కుల ఉద్యమాలు ప్రధానంగా ప్రభుత్వ హింసను ఖండించడానికి పరిమితం కావాలని, ప్రభుత్వ అణచి వేత వల్లనే ప్రైవేటు గ్రూపులు హింసకు పాల్పడుతున్నాయని వారంతా వాదించారు. ఆ తీర్మానం వీగిపోవడంతో రామస్వామి పీయూసీఎల్‌ నుంచే నిష్ర్కమించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో సైతం ఎం.వి. రామమూర్తి వంటి ప్రముఖులు పీయూసీఎల్‌లో ప్రైవేటు హింసను కూడా ఖండించే వారు. ఆ విషయమై పీయూసీఎల్‌లో భిన్నాభి ప్రాయాలు వ్యక్తం కావడంతో కన్నబీరన్‌ వంటి వారు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా ఉన్నా రాష్ట్ర శాఖ విషయంలో ఆసక్తి చూపే వారు కాదు. 

తరువాత కాలంలో పరిస్థితులు మారాయి. ఆందరూ ప్రైవేటు గ్రూపుల హింసను ఖండించడం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, శాంతియుత చర్చల ద్వారానే, ప్రజాస్వామ్య పక్రియ ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటూ వచ్చారు. మావోయిస్టు గ్రూపులు కూడా హింసాయుత పద్ధతులను విడనాడి చర్చల ద్వారా, ప్రజా స్వామ్య పక్రియ ద్వారా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.

అయితే తీవ్రవాదుల హింసను ఖండించడం అంటే ప్రభుత్వ హింసాయుత పద్ధతులను సమర్ధించడంగా భావించరాదు. రాజ్యంగంపైై ప్రమాణం చేసి బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం- చట్ట ప్రకారం నడచుకోవడం తమ కర్తవ్యంగా భావించాలి. ఎట్టి పరిస్థితులలో చట్ట ఉల్లంఘనకు పాల్పడటం తగదు. అయితే తీవ్రవాదులు, నక్సల్‌ గ్రూపుల పేరుతో ప్రభుత్వ యంత్రాంగం చట్టాలను ఉల్లంఘించి వ్యవహరిస్తుండడాన్ని చూస్తున్నాం. అటు సాయుధ దళాల దాడులలో, ఇటు నక్సల్‌ గ్రూపుల దాడులలో ఎక్కువగా నష్ట పోతున్నది సామాన్య ప్రజలే కావడం గమనార్హం. 

హింసాయుత పోరాటాల పట్ల ప్రజలలో చెలరేగుతున్న వ్యతిరేకతను నక్సల్‌ గ్రూపులు కూడా గుర్తించాయి. అందుచేతనే దేశ చరిత్రలో మొదటి సరిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలకు ముందుకు వచ్చారు. తొలి దశ చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ విషయంలో ఇరుపక్షాలు నిజాయితీతో వ్యవహరించకుండా ఒక ఎత్తుగడ వలె చర్చలకు రావడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో తిరిగి హింసాయుత వాతావరణం నెలకొన్నది. ఈ హింసాయుత వాతావరణం ఇంకా అనేక రాష్ట్రాలకు సైతం వ్యాప్తి చెందడంతో- జాతీయ స్థాయిలో చర్చల కోసం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు జాతీయ స్థాయి మావోయిస్టు నాయ కులూ ముందుకు వచ్చారు. స్వామి అగ్నివేష్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ చర్చల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, ఈ విషయంలో కీలక పాత్ర వహిస్తున్న నక్సల్‌ నేత ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌కు బలి కావడంతో మళ్ళీ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 

మరో తాజా ఉదంతం, డా బినాయక్‌ సేన్‌కు కోర్టు విధించిన శిక్ష. అటవీ ప్రాంతాలలో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సేన్‌కు సహజంగానే మావోయిస్టు వర్గాలతో పరిచయం ఏర్పడి ఉండవచ్చు. ఒక వైద్యుడిగా వారి వైద్య అవసరాలు తీర్చడానికి అయన వారిని జైలులో కలసి ఉండవచ్చు. ఈ కేసులో అయన బయట వారికి, జైల్లో వారికి సమాచారం అందచేయడానికి సంధానకర్తగా వ్యవహరించారని ఆరోపించారు. ఇటువంటి ఆరోపణపై ఇప్పటి వరకూ దేశంలో ఎవరికీ శిక్షలు పడలేదు. దానినే దేశద్రోహంగా పేర్కొనడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. సేన్‌ సంధానకర్తగా వ్యవహరించా రనడానికి సరైన సాక్ష్యాలు లేవని, పోలీసులే తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని ఈ సందర్భంగా పౌర హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. 

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎటువంటి అభిప్రాయం అయినా కలిగి ఉండ వచ్చు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. హింసను ప్రేరేపించ నంతవరకు, హింసాయుత కార్యక్రమాలలో పాల్గొననంత వరకు వారి స్వేచ్ఛను హరించడానికి ఆస్కారం లేదు. సల్వా జుడుం పేరుతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులపై పోరుకు అమాయక గిరిజనులను ప్రేరేపిస్తూ, మనవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నట్టు బినాయక్‌ సేన్‌ ఆరోపించడం, ఆ విషయమై ప్రభుత్వం పై పోరాడుతూ ఉండడం వల్లనే ఈ విధమైన ఆరోపణలతో జైలు శిక్ష విధింప చేశారని కూడా పౌర హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి.

అధికారంలో ఉన్నవారు, పోలీసు అధికారులు, మంత్రుల వంటి వారు సైతం మావోయిస్టు గ్రూపులకు సహకారం అందించిన అనేక సంఘటనలు వెలుగు చూశాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో నక్సల్‌ అగ్ర నాయకుడు కొండపల్లి సీతారామయ్య ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఒక పోలీసును హతమార్చి తప్పించుకు పోయినప్పుడు నాటి ఒక మంత్రి అధికార వాహనంలో హైదరబాద్‌ నగరం విడిచి వెళ్ళారనే విషయం చర్చనీయాంశమయింది.

ఆ మంత్రిని నక్సల్‌ సానుభూతిపరుడిగా భావిస్తుండేవారు. అయితే ఎవరూ ఆయనను విచారించిన ఉదంతం లేదు. భయం వల్లనో, మరెందుకనో దాదాపు అన్ని రాజకీయ పార్టీలలో నక్సల్‌కు ఏదో విధమైన సహకారం అందిస్తున్న నాయకులూ ఉన్నారు. ఈ విషయాలు ప్రభుత్వానికి, పోలీసులకు తెలిసినా ఎప్పుడూ వారు ఎవరినీ విచారించను కూడా లేదు. బినాయక్‌ సేన్‌ పై దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణ చేయడానికి- అయన పోలీసు అణచి వేతను, హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించడమే కారణమా?

మానవ హక్కులను ప్రస్తావించిన వారి పట్ల పాలకులలో అసహనం కనిపిస్తు న్నది. అందు చేత మనవ హక్కుల ప్రశ్నలు లేవనెత్తిన వారిపై వివిధ రూపాలలో దాడులు జరుగుతున్నాయి. ఈ పరిణామం మన దేశానికే పరిమితం కాదు, ప్రపంచ వ్యాప్తంగా కనుపిస్తున్నది. అందుకనే మానవ హక్కుల కార్యకర్తల హక్కుల పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి పలు ప్రయత్నాలను ప్రారంభించినది. ఇటువంటి కీలక అంశంపై దేశంలోని మనవ హక్కుల కమిషన్లు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండటం విచారకరం. 

మానవ హక్కుల కార్యకర్తలు అయినా, మరెవరైనా చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు. అయితే విచారణ అంతర్జాతీయ ప్రమాణాలకు అను గుణంగా ఉండాలి. ఎవ్వరికైనా జీవిత ఖైదు విధించడం అసాధారణమైన అంశమే. ఇది, ఇంతకు ముందెన్నడూ ఎటువంటి నేరారోపణను ఎదుర్కొనని వ్యక్తి, పేరు పొందిన మానవ హక్కుల కార్యకర్త విషయంలో మరింత అన్యాయం. ఈ శిక్షను స్పష్టత లేని, అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలకు నిలబడని నిబంధలను అనుసరించి విధించడంతో రాజకీయ ప్రేరితమైనదిగా భావించవలసి వస్తున్నది. ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతియుత పరిష్కారాలు అవసరమని భావించే వారందరికీ ఈ శిక్ష ఆందోళన కలిగించే విషయం. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు వివేకంతో వ్యవహరించడం అవసరం. 

- రేణుక
Surya news paper dated 20/1/2012
Sr

No comments:

Post a Comment